ఎక్కడపడితే అక్కడ బుల్డోజర్ల చప్పుళ్లు | BJP leader Yeleti Maheshwar Reddy allegations against the government | Sakshi
Sakshi News home page

ఎక్కడపడితే అక్కడ బుల్డోజర్ల చప్పుళ్లు

Mar 19 2026 2:13 AM | Updated on Mar 19 2026 2:13 AM

BJP leader Yeleti Maheshwar Reddy allegations against the government

సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి 

పొన్నంకు ప్రాధాన్యత లేని బీసీ శాఖ ఇచ్చారని ఏలేటి అనడంపై వివాదం 

ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఏలేటి, మంత్రుల మధ్య వాగ్యుద్ధం

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో గెలిస్తే 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇష్టానుసారంగా ఇళ్లను కూల్చే దందాకు ప్రభుత్వం తెరలేపిందని..ఎక్కడపడితే అక్కడ బుల్డోజర్ల చప్పుళ్లు వినపడుతున్నాయని బీజేపీపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. పట్టా భూములనూ నిషేధిత జాబితాలో చేర్చారని తప్పుబట్టారు. జాబితాలో ఒకప్పుడు 64 లక్షల ఎకరాల భూములుండగా, ఇప్పుడు కోటి ఎకరాలకు పెంచి దందాలకు తెరలేపారని సర్కారును విమర్శించారు. 

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఎన్ని భూములను నిషేధిత జాబితాలో చేర్చారు? ఎన్ని భూములను తొలగించారు? అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు కోసం ముఖ్యమంత్రి చెపితేనే నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) జారీ చేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం శాసనసభలో రెండో రోజు జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. యాచారం భూములపై విచారణ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు.

రూ.2.5 లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్‌భూములు అన్యాక్రాంతమైనట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలో మీడియాకు వెల్లడించారని గుర్తు చేస్తూ వాటిని తిరిగి స్వా«దీనం ఎందుకు చేసుకోలేదని నిలదీశారు. ఆర్‌ఆర్‌ (రేవంత్‌రెడ్డి) ట్యాక్స్‌తో స్థిరాస్తి రంగం కుప్పకూలిందని, జీఎస్టీ ఆదాయం 5 శాతం తగ్గిందని, వృద్ధి తిరోగమనం పాలైందని విమర్శించారు.  

317 జీవో సమస్యను పరిష్కరించాం.. పొన్నం  
నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు సంబంధించిన ఆధారాలుంటే సభ ముందు ఉంచాలని, లేకుంటే ఫిర్యాదు చేయాలని ఏలేటికి మంత్రి పొన్నం సూచించారు. జీవో 317 బాధిత ఉద్యోగుల సమస్యలను వీలైనంతగా పరిష్కరించామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. స్థానికత, రాష్ట్రపతి ఉత్తర్వులు అడ్డంకిగా మారడంతో కొందరి సమస్య పరిష్కారం కాలేదన్నారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఏలేటి చేసిన ఆరోపణలను పొన్నం తోసిపుచ్చారు. 

రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తెచ్చారా? గాడిద గుడ్డు తెచ్చారా? అనే అంశంపై సభలో మాట్లాడాలని ఆ పార్టీ సభ్యులకు పొన్నం సూచించారు. 12 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.12–13 లక్షల కోట్ల వరకు నిధులిచి్చందని, దీనిపై సభలో చర్చ పెడితే మాట్లాడడానికి సిద్ధమని ఏలేటి బదులిచ్చారు.  

బీసీలకి ఏలేటి క్షమాపణ చెప్పాలి: మంత్రి శ్రీధర్‌  
కోళ్ల పెంపకాన్ని పర్యవేక్షించే ప్రాధాన్యత లేని బీసీ శాఖను మంత్రి పొన్నంకు ఇచ్చారని, ఆయనకు విద్య, హోం వంటి ప్రధాన శాఖలు ఇవ్వాలని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సభలో పేర్కొనగా, మంత్రి డి.శ్రీధర్‌బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పొన్నంతోపాటు లక్షలాది మంది బీసీలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

శ్రీధర్‌బాబు చర్చను తప్పుదోవ పట్టించడానికి తనపై ఆరోపణలు చేశారని, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా తనకు కేటాయించిన శాఖతో ఏం చేసుకోవాలో అని ప్రశ్నించారని గుర్తు చేశారు. దీంతో వాకిటి అభ్యంతరం తెలిపారు. తాను చిన్నప్పుడు ఏం కష్టం చేశానో దానికి సంబంధించిన శాఖను తనకు కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నట్టు గతంలో తాను పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.  

వెలుగుమట్లపై చర్చకు సిద్ధం: తుమ్మల 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతల అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై మాట్లాడితే కోర్టు ధిక్కరణ అవుతుందని ఏలేటికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బదులిచ్చారు. దీనిపై చర్చకు సిద్ధమన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement