నియామక పత్రాలు అందుకున్నాక కొలువులో చేరిన, చేరని వారెందరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా ‘కొలువుల జాతర’ద్వారా చేపట్టిన నియామక పత్రాల పంపిణీ అనంతర పరిస్థితులపై సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) పరిశీలన చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండేళ్ల కాలంలో పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్–1 నుంచి గ్రూప్–4 వరకు, టీచర్లు, లెక్చరర్లు, పోలీస్ విభాగాల్లో కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్ వరకు, మెడికల్ ఆఫీసర్, నర్సు లు, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్... ఇలా దాదాపు 70 వేల ఉద్యోగ ఖాళీలకు పరీక్షలు నిర్వహించి అర్హులకు నియామకపత్రాలను జారీ చేసి నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందులో మెజార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామకపత్రాలు పంపిణీ చేశారు. పత్రాలు అందుకున్న వారిలో ఎంతమంది ఉద్యోగాల్లో చేరారు? ఎంతమంది ఉద్యోగాలను వద్దనుకున్నారు? అందుకు ప్రధాన కారణాలను గుర్తించేందుకు జీఏడీ పరిశీలన ముమ్మరం చేసింది.
ఇలా ఇవ్వండి...
ఉద్యోగ ఖాళీల భర్తీకి వివిధ నియామక సంస్థలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. ప్రధానంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు, తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు, తెలంగాణ వైద్య, ఆరోగ్య సర్వీసుల నియామకాల బోర్డు ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టారు. అర్హత పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు అర్హుల జాబితాలను సమర్పించడంతో నియామక పత్రాలను ప్రభుత్వం జారీ చేసింది. గడువులోగా రిపోర్టు చేయకుంటే సదరు ఉద్యోగావకాశాన్ని రద్దు చేయనున్నట్లు ఆయా అభ్యర్థులకు స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించిన జీఏడీ... ప్రత్యేక ఫార్మాట్ రూపొందించి ఉద్యోగాల్లో చేరిన, చేరని వారి వివరాలను ఆయా శాఖల నుంచి సేకరిస్తోంది.
ఉద్యోగ కేటగిరీ, అర్హత సాధించిన అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్, పేరు, జిల్లా/జోన్/మల్టీజోన్ కేటగిరీ, ఉద్యోగంలో చేరిన తేదీ, డిలీటెడ్ వేకెన్సీ తదితర వివరాలున్నాయి. ఉద్యోగంలో చేరకుంటే అందుకు గల కారణాన్నీ వివరించాలని సూచించింది. కొందరు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు అర్హత సాధించడంతో వారంతా మెరుగైన పోస్టును ఎంచుకున్నారు. ఇలాంటి వారి వివరాలను కూడా స్పష్టంగా ఇవ్వాలని చెప్పింది. ఈ సమాచారాన్ని అందించేందుకు ఆయా శాఖలు తర్జనభర్జన పడుతున్నాయి.
ఖాళీలపై స్పష్టత
ఎంతమంది కొలువుల్లో చేరారో తెలుసుకునేందుకు జీఏడీ ఒకవైపు చర్యలు చేపట్టగా... మరోవైపు శాఖల వారీగా ఖాళీల వివరాలను సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. దీంతో రెండు అంశాలకు వేర్వేరుగా సమాచారాన్ని ఆయా శాఖలు సిద్ధం చేశాయి. ఇటీవల జీఏడీ ఆధ్వర్యంలో ఉద్యోగాల్లో చేరికలకు సంబంధించి సమీక్షలు కూడా జరిగాయి. నియామకపత్రాలు అందించిన వాటిలో అన్ని కేటగిరీల్లో రిపోర్టింగ్ గడువు ముగిసింది. వచ్చే సోమవారం కల్లా ఆయా శాఖలు వివరాలను అందించాల్సి ఉంటుంది.
గ్రూప్–1 కోసం
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ గతేడాది పూర్తయింది. ప్రభుత్వం పలు ఆటంకాలను అధిగమించి ఒకేసారి 563 ఉద్యోగాలను భర్తీ చేసింది. తొలి నోటిఫికేషన్ కావడం... అందులోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడం టీజీపీఎస్సీ పరపతికి గీటురాయిగా నిలిచింది. ప్రతిష్టాత్మకంగా భర్తీ చేసిన గ్రూప్–1 ఉద్యోగాల్లో ఎంతమంది అభ్యర్థులు చేరారనే అంశంపై కమిషన్ కూడా ఆయా శాఖలకు ప్రత్యేక ఫార్మాట్ పంపి సమాచారాన్ని సేకరిస్తోంది.


