బీఏసీ సమావేశంలో ప్రభుత్వ ప్రతిపాదనలు
నేడు, రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ
20న అసెంబ్లీ ఉభయ సభల్లో బడ్జెట్
23 నుంచి 30వ తేదీ వరకు పద్దులపై చర్చ
మూడు పండుగలు, రెండు ఆదివారాల్లో సభకు సెలవులు?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నెల 20న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి ఆయా ప్రాతిపాదనలపై చర్చిస్తారు. అలాగే ఈ నెల 30న ద్రవ్య వినిమియ బిల్లుపై చర్చించి ఆమోదించాలని సర్కారు ప్రతిపాదించింది. సోమవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత సభ వాయిదా పడింది. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ఆయన చాంబర్‌లో శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది.
ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. బీఆర్‌ఎస్ నుంచి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, విప్ కేపీ వివేకానంద్, బీజేపీ నుంచి మహేశ్వర్‌రెడ్డి, ఎంఐఎం నుంచి కౌసర్ అలీ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. శాసనసభ కార్యదర్శి ఆర్.తిరుపతిరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ భేటీలో సర్కారు సమావేశాల ఎజెండాను ప్రతిపాదించింది.
షెడ్యూల్ ఇలా..
మంగళ, బుధవారాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు. ఈ నెల 19న ఉగాది పర్వదినం నేపథ్యంలో విరామం ప్రకటించి 20న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. రంజాన్ పండుగ నేపథ్యంలో 21, 22 తేదీల్లో సభకు విరామం ప్రకటించి 23 నుంచి బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చిస్తారు.
26న శ్రీరామనవమి పండుగ సందర్భంగా సభకు విరామం ఉంటుంది. 27 నుంచి 30వ తేదీ వరకు సమావేశాలు కొనసాగించి బడ్జెట్ పద్దులతో పాటు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదిస్తారు. అనంతరం బడ్జెట్ సమావేశాలను వాయిదా వేసేలా ప్రభుత్వం షెడ్యూలును ప్రతిపాదించింది. ఈ మేరకు బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు.
31 వరకు నిర్వహించాలి: హరీశ్‌రావు
‘ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని బీఏసీలో ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే రెండు ఆదివారాలు, మూడు పండుగలు ఉండటంతో 31వ తేదీ వరకు సమావేశాలు జరపడంతో పాటు ఉదయం 9 గంటలకే సభ ప్రారంభించాలని కోరాం. ఆదివారాలు కూడా సభ నడిపి పనిదినాలు పెంచాలని అడిగాం’అని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు.
హౌస్ కమిటీల ఏర్పాటులో ఆలస్యం, ప్రశ్నోత్తరాలు లేకపోవడం, జీరో అవర్ తదితర అంశాలను స్పీకర్ వద్ద ప్రస్తావించాం. ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి ప్రైవేటు మెంబర్ బిల్లుకు అవకాశం ఇవ్వాలని కోరాం. బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ తరఫున ప్రసంగించేందుకు ఇద్దరు సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరాం. మేము ప్రసంగిస్తున్న సమయంలో సంబంధిత శాఖ మంత్రి మినహా సీఎం, శాసనసభ వ్యవహారాల మంత్రి, ఇతరులకు అవకాశం ఇవ్వకూడదని చెప్పాం.
డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉండటంతో సభ్యులు ఇచ్చే ప్రివిలేజ్ మోషన్లను స్పీకర్ పరిశీలించాలని కోరాం. అసెంబ్లీలో గ్రంథాలయం నిర్వహణ దారుణంగా ఉందని తెలియజేశాం. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుంటే వచ్చే బీఏసీ సమావేశాలకు హాజరు కాబోమని స్పష్టం చేశాం..’అని హరీశ్‌రావు తెలిపారు.
ఆ తర్వాత రెండు వారాలు కొనసాగించాలి: ఏలేటి
‘బడ్జెట్ ప్రతిపాదనలు, పద్దులపై చర్చకు తక్కువ సమయం ఉన్నందున ఈ నెల 31వ తేదీలోగా బడ్జెట్‌ను ఆమోదించాలి. అనేక అంశాలపై చర్చించాల్సి ఉన్నందున ఆ తర్వాత కూడా మరో రెండు వారాలు సభ కొనసాగించాలి. ప్రభుత్వ బిల్లులను కూడా బడ్జెట్ భేటీలోనే చర్చించడం సరికాదు.
జీహెచ్‌ఎంసీ విభజన, పంచాయతీరాజ్ బిల్లులపై బడ్జెట్ ఆమోదం తర్వాత చర్చించాలి. హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి. హామీల అమలు కమిటీ ఏర్పాటు చేయాలి..’అని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీఏసీ భేటీలో కోరారు. తాము ప్రతిపాదించిన 20 అంశాలపై చర్చించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని కోరారు.


