పన్నీరు, పచ్చళ్లు తెగ లాగించేస్తున్నారా?.. అయితే బిగ్‌ అలర్ట్‌! | Massive Seizure Of Adulterated Paneer Milk Products In Secunderabad | Sakshi
Sakshi News home page

పన్నీరు, పచ్చళ్లు తెగ లాగించేస్తున్నారా?.. అయితే బిగ్‌ అలర్ట్‌!

Mar 18 2026 9:40 PM | Updated on Mar 18 2026 9:54 PM

Massive Seizure Of Adulterated Paneer Milk Products In Secunderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిన్న(మంగళవారం) కుళ్లిన చికెన్, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వ్యవహారం వెలుగులోకి రాగా.. తాజాగా కల్తీ పన్నీర్, పచ్చళ్లు కూడా బయటపడ్డాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ.. కల్తీ పన్నీర్, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్) బృందం రట్టు చేసింది. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బి. సాహితితో కలిసి సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజ్ బజార్ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ దాడుల్లో ఆరు హోల్‌సేల్, రిటైల్ దుకాణాలపై దాడులు చేసి, నిబంధనలకు విరుద్ధంగా కల్తీ ఉత్పత్తులను విక్రయిస్తున్న జైపాల్ సింగ్ రాజ్‌పురోహిత్, కొలారియా వైభవ్, నరేష్ కొలారియా, ప్రేమ్ అనిల్ వ్యాస్, రామ్ కిషోర్ కొలారియా, లక్ష్మీనారాయణ కొలారియాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు గుర్తు తెలియని ప్రాంతాల నుండి కల్తీ, అపరిశుభ్రమైన పనీర్, ఇతర పాల ఉత్పత్తులను భారీ మొత్తంలో సేకరించి, వాటిని నాణ్యమైన ఉత్పత్తులుగా నమ్మిస్తూ కిలో రూ. 280 చొప్పున హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులు, సామాన్య ప్రజలకు విక్రయిస్తున్నారు. తనిఖీ సమయంలో ఈ ఉత్పత్తులను ప్లాస్టిక్ కవర్లలో ఉంచి, దుమ్ము, ఈగలు వాలే అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఉత్పత్తులపై ఎటువంటి బ్రాండ్ పేరు, తయారీ తేదీ, గడువు తేదీ (Expiry Date) లేకపోవడమే కాకుండా, కనీస పేస్ట్ కంట్రోల్ రికార్డులు కూడా లేవని తేలింది.

ఈ దాడుల్లో పోలీసులు మొత్తం 3,892 కేజీల కల్తీ పాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు, వీటి విలువ సుమారు రూ.11,11,600 ఉంటుంది. స్వాధీనం చేసుకున్న సొత్తులో 2,572 కేజీల పనీర్, 927 కేజీల కోవా, 249 కేజీల వైట్ క్రీమ్, 132 కేజీల అజ్మీరా కలకండ్ మరియు 12 కేజీల నెయ్యి ఉన్నాయి. ఈ అక్రమ వ్యాపారంలో ప్రధానంగా శంకర్లాల్ మిల్క్ ప్రొడక్ట్స్, విజయ మిల్క్ షాప్, వైభవ్ మిల్క్ డెయిరీ, శ్రీ బాలాజీ డెయిరీ ప్రొడక్ట్స్, జగదాంబ మిల్క్ మర్చెంట్ మరియు తులసి గిరిరాజ్ డెయిరీ ప్రొడక్ట్స్ అనే సంస్థలు పాల్గొన్నట్లు గుర్తించారు.

కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై దాడి
కుల్సుంపురాలో కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కుల్సుంపురా సబ్-ఇన్స్పెక్టర్ ఎం. నరసింహ తన సిబ్బందితో కలిసి జియాగూడ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా, వెంకటేశ్వర నగర్‌లోని ఒక గోదాములో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించారు. అక్కడ సోదాలు నిర్వహించగా, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు (License) లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో పచ్చళ్లను తయారు చేస్తున్నట్లు తేలింది. నిందితులు కుళ్ళిపోయిన కూరగాయలు, నాణ్యత లేని ముడి పదార్థాలను ఉపయోగిస్తూ పచ్చళ్లను తయారు చేసి, స్థానిక దుకాణాలకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

72 డ్రమ్ముల వివిధ రకాల పచ్చళ్లు (నిమ్మకాయ, పండు మిర్చి, చింతకాయ, ఉసిరి, మరియు గోంగూర), 6 డ్రమ్ములు టమోటా, చింతపండు పేస్ట్. 1 చిన్న డ్రమ్ము అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 ఎలక్ట్రానిక్ బరువు తూచే యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎన్. నరసింహ, ఎన్. నరేష్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement