కన్న తల్లి కర్కశత్వం | Mother attacked her daughter and son | Sakshi
Sakshi News home page

కన్న తల్లి కర్కశత్వం

Mar 16 2026 3:57 AM | Updated on Mar 16 2026 3:57 AM

Mother attacked her daughter and son

కుమార్తె, కుమారుడిపై కత్తితో దాడి 

కుమార్తె మృతి.. తప్పించుకున్న కుమారుడు 

తల్లి కూడా ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం 

భువనగిరి: కన్న తల్లి తన కుమార్తె, కుమారుడిపై కత్తితో దాడి చేయగా.. కుమార్తె మృతిచెందింది. కుమారుడు తప్పించుకున్నాడు. అనంతరం ఆమె కూడా ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. తుక్కాపురం గ్రామానికి చెందిన నోముల నారాయణరెడ్డి, అమృత దంపతుల కుమార్తె రత్నకళ (నీలిమ)ను 15 ఏళ్ల క్రితం బీబీనగర్‌ మండలం జైనపల్లికి చెందిన బెజ్జంకి నరేందర్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమార్తె కృతిరెడ్డి (14), అక్షిత్‌ రెడ్డి సంతానం. 

కృతిరెడ్డి 8వ తరగతి, అక్షిత్‌రెడ్డి 6వ తరగతి చదువుతున్నారు. తన తల్లిగారి ఊరిలో గృహ ప్రవేశం ఉందని, పిల్లలకు కొత్త దుస్తులు తీసుకోవడానికి తమను తుక్కాపురం తీసుకెళ్లాలని శనివారం రత్నకళ తన భర్తను కోరింది. దీంతో నరేందర్‌రెడ్డి భార్యతోపాటు ఇద్దరు పిల్లలను తుక్కాపురంలో వదిలి వెళ్లాడు. కృతిరెడ్డి రాను అని వాదించినా.. ఆమెనూ వెంట తీసుకెళ్లారు. శనివారం రాత్రి రత్నకళ, ఆమె పిల్లలు తన తల్లిగారింట్లో ఓ గదిలో నిద్రించగా.. రత్నకళ తల్లిదండ్రులు హాల్‌లో నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రత్నకళ కత్తితో కృతిరెడ్డి మెడపై పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. 

అనంతరం కుమారుడు అక్షిత్‌రెడ్డిపై కూడా కత్తితో దాడికి యత్నించగా.. అతడు వెంటనే మేల్కొని గాయాలతో కేకలు వేస్తూ తలుపులు తీసి హాల్‌లోకి పరిగెత్తాడు. హాల్‌లో నిద్రిస్తున్న రత్నకళ తల్లిదండ్రులు గమనించి చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వగా.. వారు వచ్చేసరికి రత్నకళ తలుపులు వేసుకుని గదిలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు తలుపులు తీసి రత్నకళతో పాటు గాయపడిన ఆమె కుమారుడిని భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. పోలీసులు గ్రామానికి చేరుకుని కృతిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆదివారం కృతిరెడ్డికి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. రత్నకళ సోదరుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు.  

తండ్రికి దగ్గరవ్వడంతో.. 
రెండేళ్ల నుంచి రత్నకళ మానసికస్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తరచూ యూట్యూబ్‌లో రీల్స్‌ చేస్తూ ఉంటుందని, ఈ క్రమంలో పిల్లలను సరిగా పట్టించుకోవట్లేదని, అంతేకాకుండా పిల్లలు సహజమైన ఆహారం మాత్రమే తీసుకోవాలని వారిపై ఒత్తిడి చేసేదని పేర్కొన్నారు. దీంతో పిల్లలిద్దరూ తండ్రితో ప్రేమగా ఉంటూ ఆయనకు దగ్గరయ్యారని, ఇది తట్టుకోలేని రత్నకళ మానసిక క్షోభకు గురై ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement