త్రిముఖ కోణం! | Budget estimates are being finalized from a three-pronged perspective | Sakshi
Sakshi News home page

త్రిముఖ కోణం!

Mar 19 2026 5:34 AM | Updated on Mar 19 2026 5:34 AM

Budget estimates are being finalized from a three-pronged perspective

మూడో ఏడాది సంక్షేమం, అభివృద్ధితో పాటు లక్ష్య సాధన  

2026–27 బడ్జెట్‌ ప్రతిపాదనలు ఖరారు చేస్తున్న సర్కారు

ప్రభుత్వ ఆలోచనలు, ప్రణాళికల అమలుకు తగినట్టుగా అంచనాలు 

విద్యార్థుల కోసం యంగ్‌ ఇండియా కిట్స్, విద్యార్థినులకు ఈవీ స్కూటర్లు 

మొత్తం 6 కొత్త పథకాలు ప్రకటించాలని నిర్ణయం 

తుది అంచనాలపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం కసరత్తు 

ముఖ్యమంత్రితోనూ చర్చలు.. పలు సూచనలు చేసిన సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయి మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ అంచనాలు త్రిముఖ కోణంలో ఖరారవుతున్నాయి. ఎప్పటిలాగే అభివృద్ధి, సంక్షేమంతో పాటు విజన్‌–2034 (ఒక ట్రిలియన్‌ ఎకానమీ) లక్ష్య సాధన దిశగా 2026–27 రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలకు సర్కారు తుదిరూపు ఇస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ ఆలోచనలు, ప్రణాళికలను విశదీకరిస్తూ ఆయా ప్రణాళికల అమలుకు తగినట్టుగా అంచనాలను రూపొందించినట్లు సమాచారం. బడ్జెట్‌ను శుక్రవారం సభలో ప్రవేశపెట్టనుండగా.. బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ లాబీల్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 

దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్‌ ప్రతిపాదనలు, శాఖల వారీగా కేటాయింపులు, కొత్త పథకాల ప్రకటన, తుది అంచనాల ఖరారుపై కసరత్తు జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీలోని ఆయన చాంబర్‌లో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ అధికారులు ఆయనతో సమావేశమయ్యారు. బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు, పథకాలు, కేటాయింపులను ఆయన దృష్టికి తీసుకెళ్లగా పలుసూచనలు చేసినట్టు సమాచారం. ఈ సూచనల మేరకు 2026–27 బడ్జెట్‌ ప్రతిపాదనలకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఆర్థిక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.  

పాత వాటితో పాటు కొత్తగా.. 
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తూనే కొత్తగా ఆరు పథకాలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యంగ్‌ ఇండియా కిట్స్‌ పేరుతో సంక్షేమ హాస్టళ్ల నుంచి ఇంటిగ్రేటెడ్‌ గురుకులాల వరకు అన్ని స్థాయిల్లో చదువుకునే విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వారికి అవసరమయ్యే అన్ని వస్తువులతో కూడిన కిట్‌లను అందజేసే పథకాన్ని ఈ బడ్జెట్‌లో ప్రతిపాదిస్తారని సమాచారం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా విద్యార్థినులకు ఈవీ స్కూటర్ల పంపిణీ, పాడి రైతుకు సబ్సిడీపై పశువుల పంపిణీ ఆరు పథకాల్లో భాగంగా ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తం  మీద మహిళలు, రైతులు, యువత, చిన్నారుల సంక్షేమం, వైద్యరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, జీవన ప్రమాణాలు, ఆర్థిక సాధికారత ప్రధాన ఎజెండాగా ఈసారి బడ్జెట్‌ రూపుదిద్దుకుంటోందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement