హైదరాబాద్: చీటీ తీసుకువచ్చావా.. రూ.1090 ఇచ్చి సిలిండర్ తీసుకో.. గ్యాస్ గోడౌన్‌లో తనిఖీలకు వెళ్లిన హైదరాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి ఎదురైన ప్రశ్న ఇది. శ్రీనగర్‌కాలనీలోని బంజారా గ్యాస్ ఏజెన్సీ గోడౌన్‌ను, కార్యాలయాన్ని మంగళవారం డీఎస్‌వో శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. లోపలికి వెళ్లిన ఆయనకు అక్కడ సిబ్బంది ఒక్కో సిలిండర్‌కు రూ.1090 ఇవ్వాలని, చీటీ రాయించుకుని రావాలని చెప్పారు. దీంతో ఆయన అవాక్కయ్యారు.
సిలిండర్ ధర రూ.965 కదా.. అధిక మొత్తం ఎందుకు వసూలు చేస్తున్నారని సిబ్బందిని ప్రశి్నస్తే మాకు తెలవదు.. రెండు వారాల నుంచి ఇలాగే వసూలు చేస్తున్నామని చెప్పారు. అక్కడి నుంచి బంజారా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి ఖైరతాబాద్ సర్కిల్–7 జ్యోతితో కలిసి వెళ్లి తనిఖీలు చేశారు. గత వారం రోజుల నుంచి రికార్డులు నిర్వహించడం లేదని, గ్యాస్ సరఫరా అప్‌డేట్ కూడా లేదని గుర్తించారు. మేనేజర్ కూడా లేకపోగా, లెక్కాపత్రాలు అసలే నిర్వహించడం లేదని తేలింది.
సరైన సమాచారం కూడా ఇవ్వడం లేదని గుర్తించారు. సిలిండర్లు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని సరఫరా అవుతున్నాయి తదితర అంశాలపై సరైన లెక్కలు లేవని కూడా తేల్చారు. దీంతో ఈ గ్యాస్ ఏజెన్సీపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇండేన్ అయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ గ్యాస్ ఏజెన్సీపై కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.


