నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు | 10th Class Exams in Telangana | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

Mar 14 2026 7:36 AM | Updated on Mar 14 2026 7:36 AM

 10th Class Exams in Telangana

సాక్షి, హైదరాబాద్‌: పదవ తరగతి పరీక్షలు శనివారం నుంచి మొదలుకానున్నాయి. ఇవి ఏప్రిల్‌ 16 వరకూ కొనసాగుతాయి. పరీక్షలకు మొత్తంగా 5,28,239 మంది హాజరవుతున్నారు.వీరిలో రెగ్యులర్‌గా రాసే విద్యార్థుల సంఖ్య 5,17,727. కాగా 5,329 ప్రభుత్వ స్కూల్స్‌ నుంచి 2,07,573 మంది, 1057 గురుకులాల నుంచి 60,139 మంది, 5,288 ప్రైవేటు, ఎయిడెడ్‌ స్కూల్స్‌ నుంచి 2,50,015 మంది పరీక్షలకు హాజరవుతున్నారు.ఉదయం 9.30 నుంచి మొదలయ్యే పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను తేలికగా తెలుసుకునేందుకు హాల్‌ టికెట్లపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు.

 ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలని పాఠశాల విద్యా డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ కోరారు. పరీక్షల నేపథ్యంలో ఆయన శుక్రవారం జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలను తెరవాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు ముందే చేరుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. 

ప్రతీ కేంద్రానికి సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ నిఘా సిబ్బంది, పరీక్షల సిబ్బంది విద్యార్థులను ఆందోళనకు గురిచేసేలా వ్యవహరించవద్దన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, పోలీసుల సహకారం తీసుకోవాలని సిబ్బందిని కోరారు. మరో వారం రోజుల్లో ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మూల్యాంకన కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement