breaking news
Tenth grade student
-
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షలు శనివారం నుంచి మొదలుకానున్నాయి. ఇవి ఏప్రిల్ 16 వరకూ కొనసాగుతాయి. పరీక్షలకు మొత్తంగా 5,28,239 మంది హాజరవుతున్నారు.వీరిలో రెగ్యులర్‌గా రాసే విద్యార్థుల సంఖ్య 5,17,727. కాగా 5,329 ప్రభుత్వ స్కూల్స్ నుంచి 2,07,573 మంది, 1057 గురుకులాల నుంచి 60,139 మంది, 5,288 ప్రైవేటు, ఎయిడెడ్ స్కూల్స్ నుంచి 2,50,015 మంది పరీక్షలకు హాజరవుతున్నారు.ఉదయం 9.30 నుంచి మొదలయ్యే పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను తేలికగా తెలుసుకునేందుకు హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ కోరారు. పరీక్షల నేపథ్యంలో ఆయన శుక్రవారం జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలను తెరవాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు ముందే చేరుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతీ కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ నిఘా సిబ్బంది, పరీక్షల సిబ్బంది విద్యార్థులను ఆందోళనకు గురిచేసేలా వ్యవహరించవద్దన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, పోలీసుల సహకారం తీసుకోవాలని సిబ్బందిని కోరారు. మరో వారం రోజుల్లో ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మూల్యాంకన కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. -
టెన్త్ విద్యార్థినికి తాళి కట్టిన ఉపాధ్యాయుడు
నిజామాబాద్ జిల్లా: అన్నోజిగూడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థిని మెడలో అదే స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు తాళి కట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నోజిగూడలోని ఓ స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి అదే స్కూల్లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తున్న పర్రే మైటీస్ మాయమాటలు చెప్పి రహస్యంగా పెళ్లి చేసు కున్నాడు. విద్యార్థిని మెడలో పసుపు తాడు చూసిన తల్లి ప్రశ్నించగా..తమ ఉపాధ్యా యుడు మైటీస్ తనను పెళ్లి చేసుకున్నట్లు కూతురు చెప్పింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిని పిలిపించి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం బయటకు వస్తే స్కూలు పరువు పోతుందని భావించిన యాజమాన్యం ఉపాధ్యాయుడిని ఉద్యోగం నుంచి తొలగించి, పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. మై నర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్ప డిన ఉపాధ్యాయుడితో పాటు స్కూల్ యాజ మాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యార్థిని వింత ప్రవర్తన.. నాకు సారా, బీడీ ఇవ్వండి..!
ఒడిశా: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి చంద్రపొడ గ్రామం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు పాఠ్యం బోధిస్తున్న సమయంలో హటాత్తుగా 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనూహ్యంగా, వింతగా ప్రవర్తించింది. నాకు సారా ఇవ్వండి, బీడీ ఇవ్వండి అని పట్టుబట్టింది. తాను ఇక్కడ నుంచి వెళ్లను, నేను వారిని చంపుతాను అని పిచ్చిగా మాట్లాడుతూ వింతగా ప్రవర్తించింది. ఆ సమయంలో రాష్ట్ర విద్యావిభాగ డైరెక్టర్, జిల్లా విద్యాధికారులు పాఠశాలకు వచ్చారు. వింతగా ప్రవర్తిస్తున్న బాలికను చూసిన అధికారులు వెంటనే హాస్పిటల్‌కు తీసుకుళ్లాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆ సమయంలో విషయం తెలిసిన బాలిక సోదరుడు వచ్చి తన చెల్లెను హాస్పిటల్‌కు కాకుండా నేరుగా ఇంటికి తీసుకువెళ్లాడు. బాలిక పరిస్థితిని చూసిన తోటి విద్యార్థులు ఆమెకు దెయ్యమో, భూతమో ఆవహించిందని భయంతో వణికిపోయారు. బాలికను ఆదివాసీ వైద్యుడు దిశారీ వద్దకు తీసుకువెళ్లినట్లు తెలిసింది. మారుమూల ఆదివాసీ గ్రామీణ ప్రజలలో మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయని, వారిని చైతన్యవంతులను చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయురాలు రాజలక్ష్మీ మిశ్ర అభిప్రాయపడ్డారు. బాలికకు భూతం పట్టిందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఇటువంటి సంఘటనలకు మానసిక వ్యాధులే కారణమని, హాస్పిటల్లో వైద్యం చేయించటం మంచిదని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. -
నిమిషమాగితే ఇంటికి..
ఇంటికి సమీపంలోనే దుర్మరణం పాలైన పదో తరగతి విద్యార్థి మోపెడ్‌ను లారీ ఢీకొనడంతో దుర్ఘటన ఇద్దరు యువకులను బలిగొన్న మృత్యుశకటం ఒక్క నిమిషం ఆగితే ఆ విద్యార్థి ఇంటికి వెళ్లిపోతాడు. ఈలోగానే మృత్యువు లారీ రూపంలో వచ్చి అతనితో పాటు, అతనకు లిప్ట్ ఇచ్చిన యువకుడిని కబళించింది. పదో తరగతి పరీక్ష రాసి ఇంటికి వస్తాడని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు తీరాన్ని శోకాన్ని మిగిల్చింది. ఔరంగబాద్ సమీపంలోని వెదుళ్లమ్మ ఆలయ సమీపంలో టీవీఎస్ మోపెడ్‌ను లారీ ఢీకొట్టిన దుర్ఘటనలో గురువారం ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఔరంగబాద్ కి చెందిన మట్టా దుర్గాప్రసాద్(17) అనే యువకుడు వాడపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రంలో భౌతికశాస్త్రం పరీక్ష రాసి తిరుగు ప్రయాణంలో పెనకనమెట్టకి చెందిన తాడి రమేష్(22) టీవీఎస్ మోపెడ్‌పై లిప్టు అడిగి ఎక్కాడు. ఔరంగబాద్ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడడంతో మోటారు సైకిల్ నడుపుతున్న రమేష్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనుక కూర్చున్న దుర్గాప్రసాద్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆటోలో రాజమండ్రి ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే మృతుడు ప్రసాద్ స్వగృహం ఉంది. మరో నిమిషంలోనే ఇంటి చే రతాడనుకున్న సమయంలో ప్రమాదానికి గురికావడంతో కుటుంబ సభ్యుల దుఃఖం కట్టలు తెచ్చుకుంది. ప్రసాద్‌కి సోదరుడు ఉన్నాడు. ఇక తాపీ పనిచేసుకుంటూ జీవనం సాగించే రమేష్ వాడపల్లిలో పని ముగించుకుని స్వగ్రామైమైన పెనకనమెట్ట బయల్దేరాడు. మార్గ మధ్యలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. పట్టణ ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్‌కుమార్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
మరో దారుణం
- కేజీబీవీలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని వంచించిన కానిస్టేబుల్ - ఓ ఉద్యోగిని సహకారం - గోప్యంగా ఉంచిన సిబ్బంది అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో మరో దారుణం వెలుగుచూసింది. మొన్న ఓ కేజీబీవీలో పదో తరగతి విద్యార్థిని ప్రసవించిన ఘటన మరువకముందే.. మరోచోట తొమ్మిదో తరగతి విద్యార్థిని వంచనకు గురైంది. కళ్యాణదుర్గం ప్రాంతంలో సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) పరిధిలో నడుస్తున్న ఓ కేజీబీవీలో చదువుతున్న సదరు విద్యార్థినిని ఓ పోలీస్ కానిస్టేబుల్ లోబర్చుకుని వాంఛ తీర్చుకున్నాడు. అతనికి ఓ ఉద్యోగిని సహకరించింది. కానిస్టేబుల్‌కు సదరు ఉద్యోగినితో ఉన్న చనువుతో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై కన్నేశాడు. ఆర్థిక, ఇతర అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగిని ద్వారా విద్యార్థినిని లోబర్చుకున్నాడు. ఉద్యోగిని కూడా విద్యార్థినికి మాయమాటలు చెప్పి ట్రాప్‌లో పడేలా చేసింది. ఏది మంచో, ఏది చెడో గ్రహించలేని వయసులో ఉన్న ఆ విద్యార్థినితో కానిస్టేబుల్ పలుమార్లు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. రెండు మూడు సార్లు నేరుగా కేజీబీవీకి వెళ్లి విద్యార్థినిని బైకులో ఎక్కించుకెళ్లి తిరిగి వదిలిపెట్టినట్లు తెలిసింది. పోలీస్ కావడంతో కేజీబీవీ సిబ్బంది కూడా గట్టిగా చెప్పలేకపోయారనే ప్రచారముంది. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడితే తమకు ఇక్కట్లు తప్పవని భావించిన నిర్వాహకులు సదరు విద్యార్థిని బంధువులను పిలిపించి పంచాయితీ పెట్టారు. తమ అమ్మాయిదే తప్పు అని, మరోసారి ఇలా జరిగితే తామే బాధ్యులమని వారితో రాయించుకున్నట్లు సమాచారం. దీనిపై కలెక్టర్ కోన శిశధర్ పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశముంది. తమకు సంబంధం లేదన్నట్టు నివేదిక? ఇటీవల జిల్లాలోని ఓ కేజీబీవీలో పదో తరగతి విద్యార్థిని ప్రసవం కేసును సీరియస్‌గా పరిగణించిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించింది. వివిధ శాఖల అధికారులు విచారణ చేసి నివేదికలు ఇచ్చారు. ఎస్ఎస్ఏ అధికారులు మాత్రం సదరు కేజీబీవీ పర్యవేక్షణను ఏపీఆర్ఐఈ సొసైటీ చూస్తుందని, తమకు ఎంతమాత్రమూ సంబంధం లేదని ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. జిల్లాలో మొత్తం 62 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో 36 ఏపీ సర్వశిక్ష అభియాన్,18 ఏపీఆర్ఐఈ సొసైటీ, 5 గిరిజన సంక్షేమశాఖ, 3 సాంఘిక సంక్షేమశాఖ పర్యవేక్షణలో నడుస్తున్నాయి. బిల్లులు, సిబ్బంది వేతనాలు ఆయా పర్యవేక్షణ సంస్థలు చెల్లించినా.. సిబ్బంది రిక్రూట్మెంట్, బదిలీలు ఇలా పలు బాధ్యతలను ఎస్ఎస్ఏ అధికారులే చూస్తున్నారు. -
ప....ప....పాము
భామినికి చెందిన వివాహిత బాడితమాను కల్పన గత ఏడాది ఆగస్టు 23వ తేదీన పాముకాటుతో మృతి చెందింది. భామిని మండలం ఘనసర గ్రామానికి చెందిన దాసరి యుగంధర్ అనే పదో తరగతి విద్యార్థి గత ఏడాది ఆగస్టు 18వ తేదీన విషనాగు కాటుకు బలయ్యాడు. వీరిద్దరికీ సకాలంలో వైద్యసేవలంది ఉంటే బతికి ఉండేవారేమో... ఇలా వీరే కాదు. ఎంతోమంది పాముకాటుకు బలై కేవలం మూఢనమ్మకాల వల్లనో... సకాలంలో వైద్యం అందకనో మృత్యువాత పడుతున్నారు. రాబోయేది వర్షాకాలం. పాముకాటు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాక్షి కథనం. - భామిని వరద కాలువలు... లోతట్టు పొలాల్లో సర్పాలు పెరుగుతూ అవి కాస్తా బయటకు వచ్చి ఎదురుపడినవారిని కాటేస్తున్నాయి. ఇటీవలి కాలంలో విషనాగుల సంచారం ఎక్కువైంది. వీటి బారినపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు అదృష్టవశాత్తూ సకాలంలో వైద్యం పొంది బతికి బట్టకడుతున్నారు. ఇంకా గ్రామాల్లో మంత్రాలు... పసరమందులు పేరుతో నాటువైద్యంపై గుడ్డినమ్మకంతో కాలయాపన చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అవగాహన కలిగినవారు మాత్రం వెంటనే ప్రథమ చికిత్స చేసి, ఆసుపత్రిలో వైద్యం పొందడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయట పడుతున్నారు. పెరుగుతున్న పాముకాటు మృతులు... ఇంకా వర్షాకాలం మొదలు కాకుండానే పాముకాట్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. గత ఏడాది ప్రధానంగా భామిని మండలంలోనే అత్యధికంగా పాముకాటువల్ల మృత్యువాత పడ్డారు. భామిని మండలం ఇసుకగూడకు చెందిన నాలుగేళ్ళ ఆదివాసీ బాలుడు కొండగొర్రి నవీన్ ఈతపళ్ళు ఏరుతుండగా విషనాగు కాటుకు గురై నాటు వైద్యం పొందుతూ కొద్దిసేపటికే మరణించాడు. బాలేరుకు చెందిన 11ఏళ్ళ విద్యార్థి పైల ప్రకాశ్ ఇంటిపెరటిలో బంతితో ఆడుతుండగా విషనాగు కాటుకు గురైనాడు. 2012 ఆగస్టు 15న భామిని మండలం చిన్నదిమిలికి చెందిన నాగళ్ల రామస్వామి(50) పెద్దదిమిలిలో పశువులను మేపిస్తుండగా పాముకాటుకు గురై మృతి చెందాడు. జూలై 24న ఘనసరకు చెందిన కూరాకుల రైతు బొల్లు మిన్నారావు(45) పొలంలో పాముకాటుకు గురై రిమ్స్‌లో మృతిచెందాడు. బొమ్మిక కు చెందిన గిరిజనుడు పసుపురెడ్డి జగన్నాయుకులు(50)నిద్రలోనే పాముకాటు గురై చనిపోయాడు. లాహొరజోలకి చెందిన డప్పువాయిద్య కళాకారుడు, రేడియో ఆర్టిస్టు నిమ్మల చిన్నారావు(30) పాముకాటుకు బలయ్యాడు. బిల్లుమడకు చెందిన గృహిణి కొనపరెడ్డి శశిమ్మ(50) ఇంటి పెరటిలో పిడకలు తీస్తూ పాముకాటుకు గురై కొత్తూరు ఆసుపత్రిలో మృతి చెందింది. 2011 సెప్టెంబర్ 25న సొలికిరికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు కొత్తకోట గజపతి రావు పాము కాటుకు గురై మృత్యువాత పడ్డారు. ఇవన్నీ అధికారికంగా గుర్తించినవి. ఇవిగాకుండా మనకు తెలియని మరణాలెన్నో ఉన్నాయి. పాము కాటు గుర్తించడం ఎలా... విష సర్పం కాటు వేస్తే శరీరంపై ఇంజిక్షన్ సూదితో గుచ్చితే చుక్కగా రక్తం వచ్చినట్లు రెండు చోట్ల మాత్రమే కోరల కాట్లు, రక్తం చుక్కలు కనిపిస్తాయి. సాధారణ పాము కరిస్తే కాట్లు సంఖ్య ఎక్కువగా ఉంటుంది. భయంతోనే ప్రాణ నష్టం.... పాము కాటేసిన వెంటనే కేవలం భయంవల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలా కాకుండా పాము కాటేసిందని గుర్తించిన వెంటనే దాని విషం శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకట్టవేసేలా కట్టుకట్టాలి. కాటుకు గురైన వ్యక్తికి ధైర్యం చెప్పాలి. విష సర్పాలు రకాలు... మన చుట్టూ తిరుగుతున్న పాముల్లో అత్యధికంగా విషంలేని సర్పాలే ఉన్నాయి. ప్రమాదకరమైనవి కొద్దిగానే ఉంటున్నాయి. ఈ ప్రాంతంలో అత్యధికంగా త్రాచుపాము, రక్తపింజర, కట్లపాములే ఉంటాయి. వాడుక భాషలో నాగుపాము, పొడపాములు అతి ప్రమాదకరమైనవి. అందుబాటులో యాంటీస్నేక్ వీనమ్ పాముల విషాన్ని నివారించే యాంటీస్నేక్ వీనమ్(ఏఎస్వి) మందులు అందుబాటులో ఉన్నాయి. అన్ని పీహెచ్సీలలో ఈ ఇంజిక్షన్లు సిద్ధంగా ఉంచారు. పాము కాటేసిన వెంటనే ఏమాత్రం ఆందోళన చెందకుండా వెంటనే ఆస్పత్రికి తరలించాలి. పాముకాటు పడిన తరువాత ఏర్పడిన గాయాన్ని కడగవద్దు. గాయాన్ని గుర్తించి పాము ప్రభావం లెక్కించి ఏఎస్‌వీలు వేస్తాం. బాధితుడిని అనవసరంగా ఒత్తిడికలిగించకుండాప్రశాంతంగా ఆస్పత్రులకు తరలించాలి. సకాలంలో వారు రాగలిగితే వెంటనే మందు ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు అవకాశం ఉంటుంది. - డాక్టర్ కే.విజయ పార్వతి, వైద్యాదికారిణి బాలేరు,బత్తిలి


