మరో దారుణం | Sakshi
Sakshi News home page

మరో దారుణం

Published Sat, Sep 5 2015 3:45 AM

మరో దారుణం - Sakshi

- కేజీబీవీలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని వంచించిన కానిస్టేబుల్
- ఓ ఉద్యోగిని సహకారం
- గోప్యంగా ఉంచిన సిబ్బంది
అనంతపురం ఎడ్యుకేషన్
: జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో మరో దారుణం వెలుగుచూసింది. మొన్న ఓ కేజీబీవీలో పదో తరగతి విద్యార్థిని ప్రసవించిన ఘటన మరువకముందే.. మరోచోట తొమ్మిదో తరగతి విద్యార్థిని వంచనకు గురైంది. కళ్యాణదుర్గం ప్రాంతంలో సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) పరిధిలో నడుస్తున్న ఓ కేజీబీవీలో చదువుతున్న సదరు విద్యార్థినిని ఓ పోలీస్ కానిస్టేబుల్  లోబర్చుకుని వాంఛ తీర్చుకున్నాడు. అతనికి ఓ ఉద్యోగిని సహకరించింది.  కానిస్టేబుల్‌కు సదరు ఉద్యోగినితో ఉన్న చనువుతో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై కన్నేశాడు. ఆర్థిక, ఇతర అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగిని ద్వారా విద్యార్థినిని లోబర్చుకున్నాడు.

ఉద్యోగిని కూడా విద్యార్థినికి మాయమాటలు చెప్పి ట్రాప్‌లో పడేలా చేసింది. ఏది మంచో, ఏది చెడో గ్రహించలేని వయసులో ఉన్న ఆ విద్యార్థినితో కానిస్టేబుల్ పలుమార్లు లైంగిక  వాంఛ తీర్చుకున్నాడు.  రెండు మూడు సార్లు నేరుగా కేజీబీవీకి వెళ్లి విద్యార్థినిని బైకులో ఎక్కించుకెళ్లి తిరిగి వదిలిపెట్టినట్లు తెలిసింది. పోలీస్ కావడంతో కేజీబీవీ సిబ్బంది కూడా గట్టిగా చెప్పలేకపోయారనే ప్రచారముంది. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడితే తమకు ఇక్కట్లు తప్పవని భావించిన నిర్వాహకులు సదరు విద్యార్థిని బంధువులను పిలిపించి పంచాయితీ పెట్టారు. తమ అమ్మాయిదే తప్పు అని, మరోసారి ఇలా జరిగితే తామే  బాధ్యులమని వారితో రాయించుకున్నట్లు సమాచారం.  దీనిపై కలెక్టర్ కోన శిశధర్ పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశముంది.
 
తమకు సంబంధం లేదన్నట్టు నివేదిక?
ఇటీవల జిల్లాలోని ఓ కేజీబీవీలో పదో తరగతి విద్యార్థిని ప్రసవం కేసును సీరియస్‌గా పరిగణించిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించింది. వివిధ శాఖల అధికారులు విచారణ చేసి నివేదికలు ఇచ్చారు. ఎస్‌ఎస్‌ఏ అధికారులు మాత్రం సదరు కేజీబీవీ పర్యవేక్షణను ఏపీఆర్‌ఐఈ సొసైటీ చూస్తుందని, తమకు ఎంతమాత్రమూ సంబంధం లేదని ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది.  జిల్లాలో మొత్తం 62 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో 36 ఏపీ సర్వశిక్ష అభియాన్,18 ఏపీఆర్‌ఐఈ సొసైటీ, 5 గిరిజన సంక్షేమశాఖ, 3 సాంఘిక సంక్షేమశాఖ పర్యవేక్షణలో నడుస్తున్నాయి. బిల్లులు, సిబ్బంది వేతనాలు ఆయా పర్యవేక్షణ సంస్థలు చెల్లించినా.. సిబ్బంది రిక్రూట్‌మెంట్, బదిలీలు ఇలా పలు బాధ్యతలను ఎస్‌ఎస్‌ఏ అధికారులే చూస్తున్నారు.

Advertisement
 
Advertisement