
ఒడిశా: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి చంద్రపొడ గ్రామం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు పాఠ్యం బోధిస్తున్న సమయంలో హటాత్తుగా 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనూహ్యంగా, వింతగా ప్రవర్తించింది. నాకు సారా ఇవ్వండి, బీడీ ఇవ్వండి అని పట్టుబట్టింది. తాను ఇక్కడ నుంచి వెళ్లను, నేను వారిని చంపుతాను అని పిచ్చిగా మాట్లాడుతూ వింతగా ప్రవర్తించింది. ఆ సమయంలో రాష్ట్ర విద్యావిభాగ డైరెక్టర్, జిల్లా విద్యాధికారులు పాఠశాలకు వచ్చారు. వింతగా ప్రవర్తిస్తున్న బాలికను చూసిన అధికారులు వెంటనే హాస్పిటల్‌కు తీసుకుళ్లాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
ఆ సమయంలో విషయం తెలిసిన బాలిక సోదరుడు వచ్చి తన చెల్లెను హాస్పిటల్‌కు కాకుండా నేరుగా ఇంటికి తీసుకువెళ్లాడు. బాలిక పరిస్థితిని చూసిన తోటి విద్యార్థులు ఆమెకు దెయ్యమో, భూతమో ఆవహించిందని భయంతో వణికిపోయారు. బాలికను ఆదివాసీ వైద్యుడు దిశారీ వద్దకు తీసుకువెళ్లినట్లు తెలిసింది.
మారుమూల ఆదివాసీ గ్రామీణ ప్రజలలో మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయని, వారిని చైతన్యవంతులను చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయురాలు రాజలక్ష్మీ మిశ్ర అభిప్రాయపడ్డారు. బాలికకు భూతం పట్టిందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఇటువంటి సంఘటనలకు మానసిక వ్యాధులే కారణమని, హాస్పిటల్‌లో వైద్యం చేయించటం మంచిదని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు.