ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌పై సిట్‌ | SIT on Moinabad farmhouse drugs Issue | Sakshi
Sakshi News home page

ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌పై సిట్‌

Mar 18 2026 5:20 AM | Updated on Mar 18 2026 5:20 AM

SIT on Moinabad farmhouse drugs Issue

చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం నియామకం

షాద్‌నగర్‌ డీసీపీ సహా మొత్తం 9 మంది సభ్యులు 

ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ శివధర్‌రెడ్డి  

మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశం 

స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చిన 8 మందికి నోటీసులు 

విచారణకు హాజరుకాని ఎంపీ పుట్టా మహేశ్‌

సాక్షి, హైదరాబాద్‌/మొయినాబాద్‌/శంషాబాద్‌ రూరల్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా పలువురు హైప్రొఫైల్‌ వ్యక్తులు డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడటంతో ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 9 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేస్తూ డీజీపీ బి.శివధర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ సుదీర్‌బాబు పర్యవేక్షణలో ఈ బృందం పనిచేయనుంది. చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ గౌతం నేతృత్వంలో దర్యాప్తు చేయనుంది. మూడు నెలల్లో చార్జిషీట్‌ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశించారు. సిట్‌ దర్యాప్తు సమయంలో కేసు మూలాలను పరిశీలించడంతోపాటు, నేరం జరగడానికి సంబంధించిన అన్ని అంశాలనూ విచారించాలని డీజీపీ పేర్కొన్నారు.   

పుట్టా మహేశ్, రోహిత్‌రెడ్డి ఈ పార్టీ ఎందుకు పెట్టారు?  
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో ఒక భారీ డీల్‌ గురించే మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఏపీలోని ఏలూరుకు చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్, వారి మిత్రులు కలిసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుబాయ్‌లో రియల్‌ఎస్టేట్‌ లావాదేవీలపైనా డ్రగ్‌పార్టీ మీటింగ్‌లో చర్చించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో పలు రాష్ట్రాల వ్యాపారులు, రాజకీయ నాయకులు ఉండటం.. ఏకంగా పోలీసులను బెదిరించేందుకు కాల్పులకు తెగబడటంతో వారంతా ఏదో పెద్ద డీల్‌ గురించే చర్చలు చేస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. 

రియల్‌ఎస్టేట్, ఆర్థిక లావాదేవీలు వీరి మధ్య ఉన్నాయని, సెటిల్‌మెంట్లలోనూ కలిసి పనిచేస్తున్నారని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఫామ్‌హౌస్‌లో కొంతకాలంగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై సిట్‌ దర్యాప్తు చేయనుంది. ప్రధానంగా ఫామ్‌హౌస్‌ కేంద్రంగా రోహిత్‌ రెడ్డి నిర్వహిస్తున్న వీకెండ్‌ పార్టీలు, వాటికి హాజరవుతున్న హైప్రొఫైల్‌ వ్యక్తులు సహా రోహిత్‌ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌పై వివరాలు సేకరించనుంది. కేసు విచారణలో రాబట్టాల్సిన కీలక విషయాలపై సిట్‌ అధికారులు శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో సమావేశమయ్యారు. 

ఈ కేసు మూలాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి.. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి తెచ్చారు.. డ్రగ్స్‌ పార్టీ ఎందుకు నిర్వహించారు.. పార్టీ తరువాత వీరంతా ఏం చేయాలనుకున్నారు.. వంటి కీలక విషయాలను విచారణలో రాబట్టాలని చర్చించినట్లు తెలిసింది. దీంతోపాటు పోలీసులపై కాల్పులకు దిగిన ఢిల్లీకి చెందిన నమిత్‌ శర్మపై సిట్‌ ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. ఆయన చేసే వ్యాపారాలు ఏంటి? రోహిత్‌ రెడ్డితో ఆయనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి. గతంలో వీరంతా ఎప్పుడైనా కలిశారా..? వీరి మధ్య ఇప్పటివరకు ఏమైనా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జరిగిందా? ఇలా పలు కోణాల్లో సిట్‌ వివరాలు రాబట్టే అవకాశం ఉంది.  

ఫాంహౌస్‌ సీజ్‌! 
పోలీసులు ఇప్పటికే చంచల్‌గూడ జైలు రిమాండ్‌లో ఉన్న రోహిత్‌రెడ్డి, రితేష్‌ రెడ్డి, నమిత్‌ శర్మ మినహా మిగతా 8 మంది నిందితులను మంగళవారం శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారించారు. అయితే ఈ విచారణకు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ యాదవ్‌తోపాటు మరో నలుగురు నిందితులు హాజరు కాలేదు. పుట్టా మహేశ్‌ తరఫున న్యాయవాది విచారణకు హాజరైనట్లు తెలిసింది.  

నమిత్‌శర్మకు సంబంధించిన వివరాలతోపాటు పార్టీలో డ్రగ్స్‌ వినియోగం, కాల్పులకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ వివరాలతో సిట్‌ బృందం బుధవారం నుంచి దర్యాప్తు ప్రారంభించనుంది. ఏపీకి చెందిన పుట్టా మహేశ్, ఢిల్లీకి చెందిన నమిత్‌శర్మ సహా పలు రాష్ట్రాలతో లింకులు ఉండటంతో ఆయా రాష్ట్రాల్లోనూ సిట్‌ దర్యాప్తు చేయనుంది. కాగా, రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్‌ శర్మలను ఏడు రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేశారు. పోలీసులపై కాల్పులు జరిపిన గన్‌ లైసెన్స్‌ను రద్దు చేయాలని సిట్‌ అధికారులు ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ సు«దీర్‌బాబుకు లేఖ రాశారు. మరోవైపు అసైన్డ్‌ భూమిలో ఉన్న రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ను సీజ్‌ చేయాలని సిట్‌ అధికారులు రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement