అసెంబ్లీలో పాడి వేడి! | MLA Padi Koushik Reddy Fire on Karimnagar CP Gaush Alam | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో పాడి వేడి!

Mar 19 2026 8:42 AM | Updated on Mar 19 2026 8:42 AM

MLA Padi Koushik Reddy Fire on Karimnagar CP Gaush Alam

సీపీ గౌస్‌ ఆలంపై మరోసారి విమర్శనాస్త్రాలు

ఫైరింగ్‌ రేంజ్‌ ఘటనపై విచారణకు డిమాండ్‌

సీపీ సెలవు విషయంలోనూ ఎంక్వైరీకి పట్టు 

ఈనెల 30న మరిన్ని విషయాలు  బయటపెడతానన్న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

చర్యల విషయంలో మంత్రి శ్రీధర్‌బాబు హామీ

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: సీపీ గౌస్‌ ఆలం, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య వార్‌ ముదురుతోంది. ఇంతకాలం జిల్లాకు పరిమితమైన ఈ గొడవకు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మారింది. సీపీ గౌస్‌ ఆలంపై ఎమ్మెల్యే పాడి ఆరోపణల డోసు పెంచారు. ఎలగందుల ఫైరింగ్‌ రేంజ్‌లో సీపీ ఆయన మిత్రులతో కలిసి ఫైరింగ్‌ సాధన చేయడంతోనే బోనాలపల్లెలో అమృతమ్మ అనే వృద్ధురాలికి తూటా గాయమైందని ఆరోపించారు. కరీంనగర్‌ కమిషనరేట్‌కు చెందిన పలువురు కానిస్టేబుళ్లు, వాహనాలను హైదరాబాద్‌లో సీపీ ఇతర పనులకు మోహరిస్తున్నారని సభలో పేర్కొన్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరు ఫోన్‌ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. దీనిపై స్పందించాలని మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు, మంత్రులు పొన్నం, అడ్లూరికి విజ్ఞప్తి చేశారు. పాడి ఆరోపణలపై స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

దొంగ ఆఫీసర్లు..  డ్రగ్స్‌ తీసుకున్నారా? అంటూ..
సభ అనంతరం పాడి కౌశిక్‌ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలగందుల ఫైరింగ్‌ రేంజ్‌లో కాల్పులు జరిగిన సమయంలో సీపీ గౌస్‌ ఆలం లీవ్‌లో ఉన్నట్లుగా పోలీసులు విడుదల చేసిన ప్రకటనను తప్పుబట్టారు. అదంతా డీటీపీ చేశారంటూ కొట్టిపారేశారు. ముందే రాసుకున్న లీవ్‌ లెటర్‌పై పెన్నుతో డేటు వేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి దొంగ పోలీసాఫీసర్లకు మద్దతుగా నిలవడమేంటని ఐపీఎస్‌ ఆఫీసర్లను ప్రశ్నించారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జమ్మికుంట రూరల్‌ సీఐ, హుజురాబాద్‌ ఏసీపీలపైనా చర్యలు తీసుకోవాలన్నారు. తన ఆరోపణలపై విచారణ జరిపించి తప్పు మాట్లాడితే.. ముక్కు భూమికి రాస్తానంటూ పునరుద్ఘాటించారు. కరీంనగర్‌ పోలీసు డిపార్ట్‌మెంట్‌ అంతా ఆలంకు వ్యతిరేకంగా ఉన్నారని, అందువల్లే తనకు సీపీ గురించిన సమాచారం అంతా అందుతోందని వెల్లడించారు. తన మీద సీఐడీ కేసులు పెట్టడం కాదని, చేతనైతే సీపీ మీద విచారణకు సిట్‌ వేయాలని కోరారు.

ఈనెల 30వ తేదీ వరకే డెడ్‌లైన్‌
సీపీ పవిత్ర రంజాన్‌మాసంలో జల్సాలు చేసుకున్నారని, ఆ పార్టీలో పోలీసులు ఎగిరిన తీరు చూస్తుంటే.. పీకల్లోతు మందు తాగారా, డ్రగ్స్, గంజాయి ఉన్నాయా అని ప్రశ్నించారు. కరీంనగర్‌ యువతకు పోలీసులు ఏం సందేశం ఇస్తున్నారు అని నిలదీశారు. వెంటనే డీజీపీ, మంత్రి శ్రీధర్‌బాబు చర్యలు తీసుకోవాలని, 30వ తేదీలోగా చర్యలు తీసుకోవాలని లేకపోతే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని తెలిపారు. ఇటీవల ప్రెస్‌మీట్‌లో సీపీకి సంబంధించిన ఆధారాలు బయటపెడతానని చెప్పిన పాడి అన్నంత పనిచేశారు. 30వ తేదీలోగా సీపీపై చర్యలు లేకపోతే మరిన్ని  విషయాలు వెల్లడిస్తానని చెబుతుండటంతో.. పాడి ఆరోపణలపై ఇటు డిపార్ట్‌మెంట్, అటు రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement