లేడీ కాదు.. మహా కిలాడీ.. వైద్యురాలిగా నటిస్తూ! | Fake Doctor And Her Husband Arrested In Hyderabad | Sakshi
Sakshi News home page

లేడీ కాదు.. మహా కిలాడీ.. వైద్యురాలిగా నటిస్తూ!

Mar 17 2026 5:36 PM | Updated on Mar 17 2026 5:52 PM

Fake Doctor And Her Husband Arrested In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: వైద్యురాలిగా నటిస్తూ రోగులను మత్తులో ముంచి దోచుకుంటున్న కిలేడీ, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలానికి చెందిన గౌండ్ల శిరీష.. వివిధ ఆసుపత్రులలో వైద్యరాలిగా నటిస్తూ రోగులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుంటోంది. ఆమెకు సహకరిస్తున్న భర్త ఎడులపల్లి సాయి కుమార్‌ను కూడా సికిందరాబాద్ జోన్ టాస్క్‌ఫోర్, మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితురాలు శిరీష ప్రస్తుతం డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (Pharm.D) చదువుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల సులభంగా డబ్బు సంపాదించేందుకు తన భర్తతో కలిసి ఆసుపత్రులలో దొంగతనాలకు ప్లాన్ చేసింది. తన వైద్య పరిజ్ఞానంతో వృద్ధ మహిళా రోగులను లక్ష్యంగా చేసుకునేది. డాక్టర్ ఆప్రాన్ (Apron) ధరించి ఆసుపత్రిలోకి ప్రవేశించి, తన వెంట తెచ్చుకున్న 'డయాజెపామ్' (Diazepam) అనే మత్తు ఇంజక్షన్‌ను బాధితులకు ఇచ్చేది. వారు స్పృహ కోల్పోయిన తర్వాత వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పరారయ్యేది.

గత మార్చి 11న సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో, అలాగే చందానగర్‌లోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వీరు ఇదే తరహాలో చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన సొమ్మును విలాసాలకు, షాపింగ్‌కు ఖర్చు చేసేవారు. వీరి నుంచి సుమారు 11 తులాల బంగారం, మారుతీ సుజుకీ బాలెనో కారు, రెండు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం  చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement