జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో మీటర్ లోతుల్లోకి దిగజారిన రాష్ట్ర సగటు భూగర్భ జలాలు
10 జిల్లాల్లో ఆందోళనకర స్థాయిలో..
వేసవి తీవ్రతతోపాటు సాగుకి యథేచ్ఛగా వినియోగించడమే కారణం
పలు జిల్లాల్లో ఎండిపోతున్న పంటలు.. పశువులకు మేతగా వినియోగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు వేగంగా పాతాళానికి జారుకుంటున్నాయి. ఓ వైపు వేసవి తీవ్రత పెరుగుతుండటం.. మరోవైపు బోరుబావుల కింద యాసంగి పంటల సాగుకి యథేచ్ఛగా తోడేస్తుండటంతో గత జనవరితో పోల్చితే ఫిబ్రవరి నెలాఖరు నాటికి రాష్ట్ర భూగర్భ జలాల సగటు నీటిమట్టం ఏకంగా ఒక మీటర్ మేర పడిపోయింది. జనవరిలో సగటున రాష్ట్రంలో 6.28 మీటర్ల లోతులో లభ్యమైన జలాలు ఫిబ్రవరి నాటికి 7.25 మీటర్ల లోతుల్లోకి దిగజారాయి.
వాస్తవానికి గత వర్షాకాలంలో సాధారణానికి మించి 37 శాతం వర్షపాతం నమోదు కావడంతో ప్రస్తుత నీటి సంవత్సరం 2025–26లో రికార్డు స్థాయిలో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. గత సెపె్టంబర్ నాటికి రాష్ట్ర భూగర్భ జలాల సగటు మట్టం 4.41 మీటర్లకు ఉబికి వచ్చాయి. వేసవి ప్రారంభం కావడంతో ఫిబ్రవరి నాటికి 7.25 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయి.
రాష్ట్ర భూగర్భ జల శాఖ ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి రూపొందించిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 1,771 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ప్రతి నెలా సమీక్షించి, నివేదికను విడుదల చేస్తూ ఉంటుంది.
వికారాబాద్‌లో ఆందోళనకరం
ఖమ్మం జిల్లాలో 4.08 మీటర్ల లోతుల్లోనే భూగర్భ జలాల లభ్యత ఉండగా, వికారాబాద్ జిల్లాలో మాత్రం 12.87 మీటర్ల లోతుల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలుండగా, కేవలం 6 జిల్లాల్లో 0–5 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు లభిస్తున్నాయి. 21 జిల్లాల్లో 5–10 మీటర్ల లోతుల్లో, 10 జిల్లాల్లో 10 మీటర్లకి మించిన లోతుల్లో జలాలున్నట్టు తేలింది.
10 మీటర్లకన్నా లోతుకు పడిపోతే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు భావిస్తారు. అంటే, వేసవి ప్రారంభంలోనే 10 జిల్లాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయినట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో 12.87, కామారెడ్డి జిల్లాలో 10.69 మీటర్లు, మెదక్ జిల్లాలో 10.67 మీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 10.64 మీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 10.36 మీటర్లు, భూపాలపల్లి జిల్లాలో 10.28 మీటర్ల లోతుల్లోకి భూగర్భ జలాలు పడిపోయాయి.
77 మండలాల్లో సగటు కంటే తక్కువే..
రాష్ట్రంలో 621 మండలాలుండగా, 544 మండలాల్లో (88శాతం) భూగర్భ జలాల మట్టం గత దశాబ్ద కాల సగటు కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఈ మండలాల్లో 0.01–18.97 మీటర్ల మేర దశాబ్ద కాల వృద్ధి నమోదైంది. మిగిలిన 77 మండలాల్లో (12శాతం) దశాబ్ద కాల సగటు కంటే 0.01 నుంచి 11.22 మీటర్ల మేరకు లోతుల్లో భూగర్భ జలాలు పడిపోయాయి.
ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, నల్లగొండ, నారాయణపేట, మేడ్చడల్, భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాల్లో భూగర్భ జలాల పతనం కనిపించింది. కొన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో బోరుబావుల కింద సాగుచేస్తున్న యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో ట్యాంకర్లతో నీళ్లను సరఫరా చేసేందుకు రైతన్నలు తంటాలు పడుతున్నారు. ఎండిపోయిన పంటలను పశువులకు మేత కోసం వదిలేస్తున్నారు.


