నగరం చుట్టూ ఔటర్‌పై ఆర్టీసీ టెర్మినళ్లు | RTC terminals on the outer ring road around the city | Sakshi
Sakshi News home page

నగరం చుట్టూ ఔటర్‌పై ఆర్టీసీ టెర్మినళ్లు

Mar 16 2026 4:00 AM | Updated on Mar 16 2026 4:00 AM

RTC terminals on the outer ring road around the city

జిల్లా సర్వీసులు వాటికే పరిమితం 

అక్కడి నుంచి ఎలక్ట్రిక్‌ సిటీ బస్సుల్లో నగరంలోకి ప్రయాణికులు 

నగరంలో డీజిల్‌ బస్సుల నియంత్రణ చర్యల్లో భాగంగా సర్కారు యోచన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని నగరంలో కేవలం ఎలక్ట్రిక్‌ బస్సులే ఆర్టీసీ సిటీ సర్వీసులుగా తిరిగేలా వేగంగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం, జిల్లాల నుంచి వచ్చే డీజిల్‌ బస్సులు కూడా నగరంలోకి ప్రవేశించకుండా కట్టడి చేయబోతోంది. తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డీజిల్‌ ఆర్టీసీ బస్సులను ఔటర్‌ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్‌) ఆవలికే పరిమితం చేయబోతోంది. ఇందుకోసం ప్రధాన రూట్లు ఔటర్‌ రింగురోడ్డుతో అనుసంధానమయ్యే ప్రాంతాల్లో ఆర్టీసీ టెర్మినల్స్‌ నిర్మించే యోచనలో ఉంది.  

నగరంలో వాహనాల సంఖ్య కోటికి చేరుతున్న నేపథ్యంలో వాతావారణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు పెట్రోలు/డీజిల్‌ వాహనాలను కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఓఆర్‌ఆర్‌ లోపల సిటీ సర్వీసులుగా కేవలం ఎలక్ట్రిక్‌ బస్సులు మాత్రమే తిరిగేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కేంద్రప్రభుత్వ పథకం పీఎం ఈ–డ్రైవ్‌ కింద 2,800 ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం దరఖాస్తు చేసుకుంది. మొదటి విడతలో కేంద్రం రెండువేల బస్సులు మంజూరు చేసింది. 

మరో వైపు 200 డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా రెట్రోఫిట్‌మెంట్‌ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఫేమ్‌–2 పథకం కింద మంజూరైన 500 ఎలక్ట్రిక్‌ బస్సులు దశలవారీగా వచ్చి చేరుతున్నాయి. ఇక్కడ నడిచే డీజిల్‌ బస్సులను విడతలవారీగా జిల్లాలకు తరలించనున్నారు. ఆ తర్వాత సిటీ రోడ్లపై ఆర్టీసీకి సంబంధించి ఎలక్ట్రిక్‌ బస్సులు మాత్రమే కనిపించాలన్నది ప్రభు త్వ కసరత్తు. కానీ, జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులు డీజిల్‌తో నడిచేవే ఉండటంతో ఇప్పుడు వాటిని కూ డా నగరంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభు త్వం భావిస్తోంది. 

ఇప్పటికే శంషాబాద్‌ విమానాశ్రయం చేరువలో భారీ టెర్మినల్‌కు ప్లాన్‌ చేసింది. నగరానికి మంజూరైన హైస్పీడ్‌ రైళ్లకు సంబంధించి శంషాబాద్‌లో భారీ టెరి్మనల్‌ నిర్మించనున్నారు. దీన్ని మెట్రో రైలుతో అనుసంధానిస్తారు. అక్కడే ఆర్టీసీ టెర్మినల్‌ కూడా నిర్మించాలని నిర్ణయించారు. బెంగళూరు రోడ్డు మీదుగా వచ్చే ఆర్టీసీ జిల్లా సర్వీసులు అక్కడికే పరిమితమవుతాయి. వాటిల్లో వచ్చి నగరానికి చేరుకోవా ల్సిన ప్రయాణికులు అక్కడి నుంచి ఎలక్ట్రిక్‌ బస్సుల్లో గమ్యం చేరాల్సి ఉంటుంది. ఇదే తరహాలో హైదరాబాద్‌ చుట్టూ ఓఆర్‌ఆర్‌ ప్రధాన రోడ్డు మార్గాలతో అనుసంధానమయ్యే ప్రాంతాల్లో కూడా టెరి్మనళ్లు నిర్మించాలని ఆర్టీసీ భావిస్తోంది. 

ఆర్టీసీ బస్సులపై ప్రభావం ఉండదా? 
నగరంలో తిరిగే బస్సుల్లో ఆర్టీసీ సర్వీసులు మాత్రమే ఎలక్ట్రిక్‌ బస్సులు ఉండేలా ప్లాన్‌ జరుగుతోంది. కానీ, ప్రైవేటు బస్సులు మాత్రం ఎప్పటిలాగే తిరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారు ప్రైవేటు బస్సుల్లో అయితే నేరుగా గమ్యస్థానం వరకు వచ్చే వీలుంటుంది. అదే ఆర్టీసీ బస్సుల్లో వస్తే, శివారులో దిగి మళ్లీ సిటీ బస్సు ఎక్కి రావాల్సి ఉంటుంది. దీన్ని చికాకుగా భావించి ప్రయాణికులు ప్రైవేటు బస్సుల వైపు మళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. ఫలితంగా ఆర్టీసీపై ప్రభావం ఉండనుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి పరిష్కార నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.  

ఆరాంఘర్‌లో స్థలం ఏమైనట్టో... 
ప్రస్తుతం ఆరాంఘర్‌ కూడలిలో జిల్లా సర్వీసులు, సిటీ సర్వీసులు మారే ప్రయాణికులతో నిత్యం రద్దీ ఉంటోంది. దీంతో ట్రాఫిక్‌ సమస్య నెలకొంటోంది. దీనికి పరిష్కారంగా, ఆరాంఘర్‌ కూడలిలోనే ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయిస్తే టెర్మినల్‌ నిర్మిస్తామని ఆర్టీసీ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. కానీ, ఆ భూమిని ప్రభుత్వం ఇప్పటికే పోలీసు శాఖకు కేటాయించింది. 

దీంతో, సమీపంలోనే ఉన్న రాజేంద్రనగర్‌ ఆర్టీసీ డిపో స్థలాన్ని పోలీసు శాఖకు కేటాయించి, ఆరాంఘర్‌ స్థలాన్ని ఆర్టీసీకి ఇవ్వాలన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు శంషాబాద్‌లో ఆర్టీసీ టెరి్మనల్‌ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని ఇటీవల సీఎం స్వయంగా వెల్లడించటంతో, ఆరాంఘర్‌ స్థలం ఆర్టీసీకి ఇస్తారా లేదా అన్న విషయంలో సందిగ్ధత వీడలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement