అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని
మహిళా జర్నలిస్టుల కోసం #OnlineButUnafraid థీమ్‌తో టీజీసీఎస్‌బీ వర్క్‌షాప్
విజ్ఞానదాయకంగా సెషన్
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) #OnlineButUnafraid థీమ్‌తో మహిళా జర్నలిస్టుల కోసం సైబర్ హైజీన్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఈ వర్క్‌షాప్ ద్వారా మీడియా వృత్తి నిపుణులకు డిజిటల్ ప్రపంచంలో భద్రతగా ఉండెందుకు అవసరమైన అవగాహన , ప్రాయోగిక జ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు టీజీసీఎస్‌బీ తెలిపింది.
తెలంగాణా డీజీపీ బి. శివధర్ రెడ్డి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, శిఖా గోయల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ మీడియా సంస్థల నుంచి మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ, పెరుగుతున్న సైబర్ నేరాల తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరాలను సాధ్యమైనంత త్వరగా రిపోర్ట్ చేయడం అత్యంత అవసర మని సూచించారు. మీడియా వృత్తి నిపుణులు తమను తాము రక్షించుకోవడమే కాకుండా, తమ వేదికల ద్వారా ప్రజలకు సైబర్ భద్రత, బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తనపై అవగాహన కల్పించాలని సూచించారు.

డిజిటల్ ప్రపంచం ఎన్నో అవకాశాలను అందిస్తున్నప్పటికీ, ముఖ్యంగా ప్రజల ముందుకు వచ్చే వృత్తుల్లో ఉన్న మహిళలకు కొత్త రకాల ముప్పులను కూడా తెస్తుందని TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ పేర్కొన్నారు. సైబర్ భద్రతలో అవగాహన సైబర్ హైజీన్ మొదటి రక్షణ రేఖలని, అవగాహన ఉన్న వ్యక్తులు సైబర్ నేరాలకు తక్కువగా గురవుతారని తెలిపారు. అలాగే జర్నలిస్టులు సమాజంలో సైబర్ నేరాలపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు.

#OnlineButUnafraid కార్యక్రమం కింద చేపట్టిన ఈ కార్యక్రమం డిజిటల్ నమ్మకాన్ని పెంపొందించడంతో పాటు, ఆన్‌లైన్లో బాధ్యతాయుతంగా ఉండేలా చూడటం, సైబర్ భద్రతా చర్యలను అలవాటు చేయించడం లక్ష్యంగా కొనసాగిస్తున్న ప్రయత్నంలో భాగమన్నారు. సైబర్ ముప్పు ఉన్నప్పటికీ, అవగాహన, అప్రమత్తత, సమయానుకూల చర్యల ద్వారా వాటిని సమర్థంగా తగ్గించవచ్చన్నారు. వీటిపైస్పష్టమైన అవగాహన ఉన్నపుడు డిజిటల్ ప్లాట్‌ఫారంలను భయపడకుండా, అవగాహనతో, అప్రమత్తంగా భద్రంగా వినియోగించు కోవచ్చని ఆమె సూచించారు.

ఈ వర్క్‌షాప్‌లో వేటిన్స్ (Vatins) సీఈవో ఎన్‌వీ సన్నీ ఎన్‌వీ సైబర్ హైజీన్, అభివృద్ధి చెందుతున్న సైబర్ ముప్పు,ఆన్‌లైన్ భద్రతపై వివరణాత్మక ప్రజెంటేషన్ అందించారు. సైబర్ నేరాల ధోరణులు, జర్నలిస్టులు ఎదుర్కొనే డిజిటల్ ముప్పులు, మహిళలను లక్ష్యంగా చేసుకునే సాధారణ సైబర్ నేరాలు వంటి అంశాలు చర్చించారు. ముఖ్యంగా సైబర్ స్టాకింగ్, ఆన్‌లైన్ వేధింపులు, లైంగిక బెదిరింపులు, వేధింపులు నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఫోటో మోర్ఫింగ్ , మ్యాట్రిమోనియల్ మోసాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే సైబర్ నేరాల్లో నమ్మకం, వ్యక్తిత్వం మరియు డిజిటల్ ప్రవర్తనను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో వివరించేందుకు వాస్తవ సంఘటనల ఆధారంగా కేస్ స్టడీస్‌ను కూడా వివరించారు.పాల్గొన్న వారికి సైబర్ నేరాలకు సంబంధించిన సందేహాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించడం, వ్యక్తిగత, వృత్తిపరమైన డిజిటల్ భద్రతను కాపాడుకోవడం, ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కోవడం మరియు సైబర్ ఘటనలకు సమర్థంగా స్పందించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్, ఆన్‌లైన్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయడంప్రాముఖ్యతను కూడా వివరించారు.


