బాసర ట్రిపుల్‌ ఐటీలో ఉద్రిక్తత | Student Dies: Tension at Basara IIIT | Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్‌ ఐటీలో ఉద్రిక్తత

Mar 17 2026 10:54 PM | Updated on Mar 17 2026 11:44 PM

Student Dies: Tension at Basara IIIT

నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT)లో మరో విషాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామచంద్రపురానికి చెందిన పీయూసీ రెండో సంవత్సరం విద్యార్థిని తేజస్విని(17) అనారోగ్యంతో మృతి చెందారు. లుకేమియాతో బాధపడుతున్న ఆమె.. క్యాంపస్‌లో అనారోగ్యానికి గురై.. ఇంటికి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచినట్లు విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు.

అట్టుడికిన పరిపాలన భవనం
తేజస్విని మృతి వార్త తెలిసిన వెంటనే క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ వందలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి వరకు విద్యార్థులు పరిపాలనా భవనాన్ని (అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్) ముట్టడించారు. 'వీసీ రావాలి.. మాకు న్యాయం చేయాలి' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. సుమారు 4 వేల మంది విద్యార్థులు అర్ధరాత్రి దాటాక కూడా ఆందోళన చేశారు.

ప్రాణాల మీదకు తెస్తున్న సదుపాయాల లేమి!
ధర్నాలో పాల్గొన్న విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్యాంపస్ ఆసుపత్రిలో కనీస వైద్య పరికరాలు, నిపుణులైన వైద్య సిబ్బంది లేరని విద్యార్థులు మండిపడ్డారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సైతం గుర్తించడంలో అధికారులు విఫలమవుతున్నారని, పరిస్థితి విషమించిన తర్వాతే ఇంటికి పంపిస్తున్నారని ఆరోపించారు.సకాలంలో సరైన చికిత్స అందకపోవడం వల్లే విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యాలయం వద్దే భోజనాలు
రాత్రి వరకు ఆందోళన కొనసాగడంతో విద్యార్థులు హాస్టళ్లకు వెళ్లడానికి నిరాకరించారు. దీంతో అధికారులు దిగివచ్చి, పరిపాలనా భవనం వద్దనే విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేశారు. విద్యార్థిని మృతి పట్ల అధికారులు సంతాపం ప్రకటించినప్పటికీ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఉద్రిక్తత.. పోలీసుల అప్రమత్తత
బాసర ట్రిపుల్‌ ఐటీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. సుమారు 9000 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ విద్యాసంస్థలో, కేవలం కొందరు విద్యార్థులు నాయకులుగా ముందుకు వచ్చి ఆందోళనలు చేపట్టడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చినట్లు పోలీసులు ఆరోపించారు.

విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలనే ఉద్దేశంతో చేపట్టిన ఆందోళనలు, కొన్నిసార్లు నియంత్రణ దాటే ప్రమాదముండడంతో పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. శాంతి భద్రతలను కాపాడటం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం తమ ప్రధాన బాధ్యత అని నిర్మల్ జిల్లా SP జానకి షర్మిల తెలిపారు. తాను స్వయంగా విశ్వవిద్యాలయాన్ని చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులతో మాట్లాడుతున్నట్లు ‘సాక్షి వెబ్‌డెస్క్‌’తో చెప్పారు.

“ప్రతి విద్యార్థికి తన అభిప్రాయాన్ని వ్యక్తపరచే హక్కు ఉంది. అయితే అది చట్టబద్ధంగా, శాంతియుతంగా ఉండాలి. కొందరి చర్యల వల్ల మిగతా విద్యార్థులకు, సంస్థ ప్రతిష్టకు ఇబ్బంది కలగకూడదు” అని ఆమె పేర్కొన్నారు. కొందరి ఆందోళనల కారణంగా సంస్థ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత విద్యార్థిని ముందు నుంచే అనారోగ్యంతో బాధపడ్డారని, మెరుగైన వైద్యం కోసం ఇంటికి వెళ్లారని చెప్పారు.

ఆర్‌జీయూకేటీ సంతాపం
తేజస్విని మరణం పట్ల విశ్వవిద్యాలయ యంత్రాంగం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ‘మెదక్ జిల్లా రామచంద్రాపురం నివాసి అయిన తేజస్విని (తండ్రి: నారాయణ), గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం నిమిత్తం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. గత కొన్ని నెలల నుంచి తేజస్విని ఇంటిదగ్గరే చికిత్స తీసుకుంటున్నారు’ అని వివరించింది. తేజస్విని మృతి పట్ల విశ్వవిద్యాలయం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు మీడియాకు వాట్సాప్ ద్వారా ప్రకటనలను విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement