5 జోన్లు, 55 కిలోమీటర్లు.. తొలిదశలో మూసీ అభివృద్ధి లక్ష్యమిదే
రూ. 6,500 కోట్ల నుంచి రూ. 7,000 కోట్ల వ్యయం అంచనా
123 అడుగుల గాంధీ విగ్రహం.. 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ అభివృద్ధి
నిజాం నగరంలో సరికొత్త ప్రపంచం ఆవిష్కృతం కానుంది. కుతుబ్ షాహీ కాలంలో అభివృద్ధి చెందిన భాగ్యనగరంలో మూసీ నది నీటిని తాగునీటితోపాటు వ్యవసాయం, వర్తకానికి వినియోగించేవారు. 300 ఏళ్లకుపైగా చరిత్రగల మూసీ భాగ్యనగరికి వెన్నెముకగా నిలిచింది. కానీ కాలక్రమేణా పట్టణీకరణ, ఆక్రమణలు, మురుగు, వ్యర్థాల పారబోత, నిర్లక్ష్యం తదితర కారణాలతో జీవం కోల్పోయిన మూసీ నదికి పునరుజ్జీవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత తరుణంలో మూసీ పునరుద్దరణ ఒక ఎంపిక కాదు ఆవశ్యకతగా మారింది. ప్రభుత్వం మూసీని ఆర్థిక, సాంస్కృతిక, విద్య, పర్యాటక, వినోద రంగంగా అభివృద్ధి చేయనుంది. మాస్టర్ ప్లాన్, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లను సిద్ధం చేసింది. మూసీ ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై ఈ మేరకు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్‌డీసీఎల్) ఎండీ నర్సింహారెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
– సాక్షి, హైదరాబాద్
ఐదు జోన్ల అద్భుతం..
తొలిదశలో ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మొత్తం 21 కి.మీ. మేర మూసీని అభివృద్ధి చేయనున్నారు. దశలవారీగా గండిపేట నుంచి గౌరెల్లి వరకు మొత్తం 55 కి.మీ. మేర మూసీ అభివృద్ధి జరుగుతుంది. ఎకోలాజికల్, హెరిటేజ్, ఫ్యూచర్ జోన్ వర్గాలవారీగా వాటిని అభివృద్ధి చేస్తారు. నది ప్రక్షాళనలో భాగంగా మూసీలో పేరుకుపోయిన పూడికతీత, చెత్త తొలగించి హైడ్రాలజీ అధ్యయనంతో నదీ గర్భానికి రూపకల్పన చేసి పరిధులను నిర్ణయిస్తారు. వరదల నివారణ, నదీ తీర వాలు స్థిరీకరణ చేస్తారు. అలాగే నదీ తీరం ఇరువైపులా రహదారుల నిర్మాణం, ప్రధాన మురుగునీటి పైప్‌లు, ఇరువైపులా వర్షపు నీటి కాలువలు, నాలాల నిర్మాణంతోపాటు రిజర్వాయర్లు, బ్యారేజీల వంటి నీటి నిల్వ నిర్మాణాలతో నదీ తీరాన్ని అభివృద్ధి చేస్తారు. తొలిదశ అభివృద్ధి పనులకు రూ. 6,500 కోట్ల నుంచి రూ. 7,000 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.
ఈస్ట్–వెస్ట్ కారిడార్..
మూసీ నది నగరంలో పశ్చిమం నుంచి తూర్పునకు ప్రవహిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ ప్రాంతంలోని గండిపేట నుంచి గౌరెల్లికి ప్రయాణించాలంటే.. ఔటర్ నార్త్ మీదుగా 91 కి.మీ., లేదా ఔటర్ సౌత్ మీదుగా అయితే 69 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. అలా కాకుండా వెస్ట్ టు ఈస్ట్ మార్గంలో హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే ప్రయాణ దూరం 43 కి.మీ.కి తగ్గిపోనుంది. దీంతో ప్రధాన నగరంలో ట్రాఫిక్ తగ్గడంతోపాటు ప్రయాణ సమయం 50 శాతం తగ్గుతుంది. ఈ కారిడార్ బుద్వేల్ వద్ద మొదలవుతుంది. నెల రోజుల్లో డీపీఆర్ తయారు కానుంది. మూసీని సాంస్కృతిక వారధిగా అభివృద్ధి చేస్తారు. మంచిరేవుల వద్ద హిందూ దేవాలయం, పురానాపూల్ వద్ద మసీదు, గౌలిగూడ వద్ద గురుద్వారా, నాగోల్ వద్ద చర్చిని నిర్మించనున్నారు.
200 ఎకరాల్లో గాంధీ సరోవర్..
మూసీ, ఈసా నదుల సంగమమైన బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్‌ను అభివృద్ధి చేస్తారు. ఇది మొత్తం 200 ఎకరాల్లో ఉంటుంది. అందులో 123 అడుగుల ఎత్తయిన ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’గాంధీ విగ్రహంతోపాటు చేనేత శిక్షణాæ కేంద్రం, విద్య, జ్ఞాన కేంద్రం, మెడిటేషన్, వెల్‌నెస్ విలేజ్, నేషనల్ మ్యూజియం, కల్చరల్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ల వంటివి ఉంటాయి.
మూసీ చుట్టూ ఎస్టీపీలు..
ప్రస్తుతం బాపూఘాట్, పురానాపూల్, అఫ్జల్‌గంజ్, గోల్నాకా వంటి మూసీ పరీవాహక ప్రాంతాల చుట్టూ 25 మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)ఉన్నాయి. ఇవి 772 ఎంఎల్‌డీ నీటిని శుద్ధి చేస్తున్నాయి. మరో 27 ఎస్టీపీలు ప్రారంభానికి సిద్ధమవుతుండగా.. ఇవి 1,106 ఎంఎల్‌డీల నీటిని శుద్ధి చేస్తాయి. ఇక అమృత్ స్కీమ్ కింద మరో 39 ఎస్టీపీలను నిర్మించనున్నారు. వాటితో 972 ఎంఎల్‌డీ మురుగునీరు శుద్ధి అవుతుంది. ఈ ప్రతిపాదిత ఎస్టీపీలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు నిర్మితమవుతాయి. ఉస్మాన్‌సాగర్ మార్గంలో నార్సింగి, తారామతి, హైదర్‌షాకోట వద్ద, అలాగే హిమాయత్‌సాగర్ మార్గంలో అత్తాపూర్ వద్ద భూగర్భ ఎస్టీపీని ఏర్పాటు చేయనున్నారు.
అలాగే అత్తాపూర్, అంబర్‌పేట, నాగోల్‌లలో మూసీ బఫర్ జోన్‌లోని ప్రధాన ఎస్టీపీ స్థానాలలో మూడు బ్యాలెన్సింగ్ గ్రే వాటర్ రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి ఉత్పత్తి అయ్యే శుద్ధి చేసిన నీటిని నిర్మాణ రంగం, డేటా సెంటర్ల వంటి పరిశ్రమ అవసరాలకు తక్కువ ధరకు అంటే సుమారు కిలోలీటర్ నీటిని రూ. 70–80 చొప్పున సరఫరా చేస్తారు. అలాగే నగరంలోని పార్క్‌లు, ల్యాండ్ స్కేపింగ్ ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తారు. మరోవైపు మూసీపై 14 వంతెనలను నిర్మిస్తారు. అందులో 9 కొత్తవి కాగా.. 5 అప్‌గ్రేడెడ్ బ్రిడ్జీలు. నీటి నిల్వ కోసం మూడు బరాజ్‌లు కడతారు.
బఫర్‌లో ఏముంటాయంటే..
నదికి ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఇందులో విహార ప్రదేశాలు, నడక మార్గాలు, సైక్లింగ్ ట్రాక్‌లు, పార్క్‌లు, సీటింగ్ ప్రాంతాలు, వీక్షణ డెక్‌లు, యాంఫీ థియేటర్లు, ప్లాజాల వంటివి ఉంటాయి. అలాగే వాహనాల పార్కింగ్ స్థలాలు, అనుసంధాన రోడ్లతోపాటు ఇంటర్‌సెప్టర్ మురుగు కాలువలు, వరదనీటి కాలువలు, భూగర్భ డ్రైనేజీలను అభివృద్ధి చేస్తారు. ఇందులో నివాసాల వంటి ఎలాంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టకూడదు. ఇక మూసీలో 24/7 మంచినీరు ప్రవహించేలా 2.5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవం కోసం కేటాయించారు. ఔటర్ రింగ్‌రోడ్ వెంబడి అనుసంధానం కానున్న గోదావరి నదీ అనుసంధాన ప్రాజెక్టు నుంచి ఈ నీటిని సేకరిస్తారు.
విదేశాల్లోని నదీ తీర ప్రాంతాలిలా..
ప్రపంచ దేశాల్లోని నదీ తీర ప్రాంతాలన్నీ పునరుజ్జీవంతో కొత్త ఆర్థిక రూపును సంతరించుకున్నాయి. గుజరాత్‌లోని సబర్మతి సహా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని చెయోంగ్యెచియోన్, లండన్‌లోని థేమ్స్, ఫ్రాన్స్‌లోని సీన్, టోక్యోలోని సుమిదా, సింగపూర్ రివర్‌ఫ్రంట్ తదితర నదీ తీర నగరాలన్నీ ఇలా అభివృద్ధి చెందినవే. దీంతో ఆయా దేశాల్లోని అభివృద్ధి ప్రణాళికలను అధికారులు ఏడాదిన్నరపాటు అధ్యయనం చేసి మూసీ పునరుజ్జీవానికి సంకల్పించారు.
వివిధ దేశాల్లో నదీ తీరాల అభివృద్ధి ఇలా..
⇒ సియోల్‌లోని చెయోంగ్యెచియోన్ నదీ తీరం మీదుగా సాగే 5.8 కి.మీ. ప్రవాహ మార్గాన్ని అభివృద్ధి చేయగా రోజుకు 50 వేల మంది సందర్శకులు వస్తున్నారు. నదీ తీర అభివృద్ధితో 9 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. గత పదేళ్లలో 190 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారు.
⇒ లండన్‌లోని థేమ్స్ నది 39 కి.మీ. పునరుద్ధరించగా.. రోజుకు 27 వేలకుపైగా సందర్శకులు వస్తున్నారు. 2.98 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. సుమారు లక్షకుపైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి.
⇒ టోక్యోలో 23.5 కి.మీ. మేర సుమిధ నదీ తీర అభివృద్ధితో 67.14 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. రోజుకు 1.5 లక్షల మంది సందర్శకులతో ఏటా సుమారు 300 మిలియన్లకుపైగా పర్యాటకుల కేంద్రంగా మారింది.
⇒ 3.2 కి.మీ. మేర విస్తరించిన సింగపూర్ రివర్‌ఫ్రంట్ అభివృద్ధితో ఏటా 23.9 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుంది. రోజుకు 40 వేలకుపైగా సందర్శకులతో ఏటా 16.9 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు.
⇒ ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 29 కి.మీ. మేర ప్రవహించే సీన్ నదీ అభివృద్ధితో పారిస్ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం ద్వారా 30 శాతం ఆదాయం సమకూరుతోంది. ఏటా 40 మిలియన్ల మంది సందర్శిస్తున్నారు. అలాగే 7.4 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాల కేంద్రంగా మారింది.
⇒ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తొలిదశ కింద సబర్మతి నదిని 11.5 కి.మీ. మేర సుందరీకరించారు. ఫలితంగా నిత్యం 7 వేల మందికిపైగా సందర్శకులు వస్తున్నారు. అలాగే 85 వేల మందికిపైగా ఉద్యోగ అవకాశాల కేంద్రంగా మారింది. రెండో దశ కింద మరో 13 కి.మీ. మేర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.


