రాళ్ల వాన, ఈదురు గాలులు | The hailstorms that occurred in various districts of the state | Sakshi
Sakshi News home page

రాళ్ల వాన, ఈదురు గాలులు

Mar 19 2026 1:58 AM | Updated on Mar 19 2026 1:58 AM

The hailstorms that occurred in various districts of the state

నిజామాబాద్‌ జిల్లాలో 1,520 ఎకరాల్లో పంటనష్టం 

వికారాబాద్‌ జిల్లాలో పదికిపైగా పాడి ఆవులు, 217మేకలు మృత్యువాత 

రంగారెడ్డి జిల్లాలో మొక్కజొన్న, కూరగాయల తోటలు ధ్వంసం 

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌)/ కొందుర్గు/వికారాబాద్‌: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కురిసిన వడగళ్ల వానకు పలు జిల్లాల్లో పంటనష్టం వాటిల్లింది. నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానకు 1,520 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఇందులో వరి 1,110 ఎకరాలు, మొక్కజొన్న 110 ఎకరాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపింది. అయితే జరిగిన పంట నష్టమంతా బోధన్‌ డివిజన్‌లోనే ఉంది. సాలూరాలో 360, రుద్రూర్‌లో 980, వర్నిలో 130, పొతంగల్‌లో 50 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 

నాలుగు మండలాలు కలిపి 891 మంది రైతులు పంటనష్టం బాధితులుగా ఉన్నారు. వికారాబాద్‌జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన అకాల వర్షానికి వందలాది ఎకరాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వడగళ్లు, పిడుగుపాట్లతో పదికి పైగా పాడి ఆవులు మృత్యువాత పడ్డాయి. పూడూరు మండలం నిజాంపేట్‌ మేడిపల్లి వద్ద మంద పెట్టిన 217 మేకలు మృత్యువాత పడ్డాయి. చెట్లు నేలకొరిగి, ప్రధాన రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. పోలేపల్లిలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. 

దోమ మండలం కొండాయపల్లిలో రైతు చిన్న పిరంగికి చెందిన రెండు ఆవులు, శివారెడ్డిపల్లిలో రాంరెడ్డికి చెందిన ఓ ఆవు, కుల్కచర్ల మండలం చిన్నరామయ్య తండాకు చెందిన రైతు రాజుకు చెందిన ఓ ఆవు, యాలాల మండలం అక్కంపల్లిలో ఓ కాడెద్దు మృతి చెందాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లా కొందుర్గు, జిల్లేడ్‌ చౌదరిగూడ మండలాల్లోని వివిధ గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. 

ఈ వానతో పంటలు దెబ్బతిని నేలకొరిగాయి. వరి, మొక్కజొన్న, కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఏఓ రాజేందర్‌రెడ్డి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement