అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచన
సాక్షి, హైదరాబాద్: యాసంగి పంటలు, వేసవి ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నందున, 19 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని, ఈ నేపథ్యంలో అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు, సిబ్బందికి సూచించారు. వేసవికాలం, యాసంగి సాగు సీజన్ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అసెంబ్లీ ఆవరణలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గత సంవత్సరం మార్చి 20న నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లు కాగా, ఈ సంవత్సరం మార్చి 2న 17,606 మెగావాట్ల డిమాండ్‌ను చేరుకుని గత రికార్డును దాటిందని చెప్పారు. మార్చి 13న 18,228 మెగావాట్లకు చేరి, 341.08 మిలియన్ యూనిట్ల వినియోగంతో కొత్త రికార్డును సృష్టించిందని వివరించారు. డిమాండ్ భారీగా పెరిగినా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా, ఓవర్‌లోడింగ్ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ సంస్థలు సమర్థంగా వ్యవహరించాయని పేర్కొన్నారు.
ఈ కృషికి విద్యుత్ సిబ్బందిని అభినందించారు. అలాగే, విద్యుత్ డిమాండ్ 19 వేల మెగావాట్లకు మించినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త సబ్‌స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, తెలంగాణ డిస్కమ్‌ల సీఎండీలు ముషారఫ్ ఫరూఖీ, జితేష్ పాటిల్, వరుణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


