మెట్ల దారిన.. దేవుని చెంతకు! | Minister Ponguleti visits Srinivasagiri | Sakshi
Sakshi News home page

మెట్ల దారిన.. దేవుని చెంతకు!

Mar 16 2026 3:49 AM | Updated on Mar 16 2026 3:49 AM

Minister Ponguleti visits Srinivasagiri

శ్రీనివాసగిరిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీనివాసగిరి భక్తుల కోలాహలంతో నిండిపోయింది. శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన తిరుకల్యాణ మహోత్సవం కనులపండువగా సాగింది. రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన భార్య మాధురితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. 

పొంగులేటి దంపతులు 1,600 మెట్లను కాలినడకన ఎక్కి గిరి శిఖరానికి చేరుకున్నారు. దారి పొడవునా గోవింద నామస్మరణ చేస్తూ, తనను పలకరించిన భక్తులకు చిరునవ్వుతో సమాధానమిస్తూ ముందుకు సాగారు. ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ కమిటీ వారు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి పట్టువ్రస్తాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వారికి వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. 

పర్యాటక ప్రాంతంగా శ్రీనివాసగిరి.. 
‘ప్రకృతి ఒడిలో ఉన్న శ్రీనివాసగిరిని దర్శించుకోవడం నా అదృష్టం. సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో అటవీ శాఖ అధికారుల సహకారంతో ఈ క్షేత్రాన్ని గొప్ప ఎకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతాం. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’అని మంత్రి పొంగులేటి చెప్పారు. స్వామివారి కల్యాణ వేడుకలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు కూడా పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement