వికారాబాదు జిల్లా: తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఏదో ఒక అంశంపై మీడియాలో కేంద్ర బిందువుగా నిలుస్తూ వచ్చారు. 2016 నుంచి మొదలైన కేసుల పరంపర ఏటా పెరుగుతూ వస్తున్నాయి. మూడేళ్ల క్రితం బెంగళూరు ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం.. 2022లో మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేల ఎర.. మున్సిపల్ ఎన్నికల సమయంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు అధికారులతో గొడవ వంటి అనేక కేసులు ఆయనపై ఉన్నాయి.
తాజాగా మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో పలు రాష్ట్రాలకు చెందిన తాజా, మాజీ ప్రజా ప్రతినిధులతో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ ఈగల్ టీమ్‌కు పట్టుబటడం రోహిత్‌రెడ్డి వ్యవహారం మరోసారి చర్చకు దారి తీసింది. ఇందర్‌చెడ్ గ్రామానికి చెందిన రోహిత్‌రెడ్డి 2008లో క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో మన పార్టీ నుంచి తాండూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి 270 ఓట్లతో ఘోరపరాజయం పొందారు. తర్వాత 2011లో టీఆర్‌ఎస్ పారీ్టలో చేరారు. నాటి నుంచి అందులోనే కొనసాగుతూ వచ్చారు. 2014లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పట్లో నాటి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి, రోహిత్‌రెడ్డికి అనేక వివాదాలు ఉండేవి. ఈ క్రమంలో ఆయన్ను పారీ్టలో నుంచి బహిష్కరించారు. 2018లో కాంగ్రెస్ టికెట్ సాధించి పట్నం మహేందర్‌రెడ్డిపై స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించారు. గెలిచిన రోహిత్‌రెడ్డి ఆరు నెలలకే బీఆర్‌ఎస్ గూటికి చేరారు.
వివాదాలతో హైలెట్
2018లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాటి నుంచి రోహిత్‌రెడ్డి వివాదాలతో హైలెట్‌గా నిలుస్తూ వచ్చారు.. బెంగుళూరు కేంద్రంగా సాగిన డ్రగ్స్ కేసులో.. సోదరుడు రితీష్‌రెడ్డి పబ్‌లో చేసిన గొడవతో.. పట్టభద్రుల ఎన్నికల సమయంలో దొంగ ఓట్ల వివాదం.. 2023లో తాండూరులో నిర్వహించిన రాజశ్యామల యాగం సమయంలో పోలీసు సిబ్బందితో రీల్స్ చేయడంపై విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోలీసు అధికారులతో గొడవ పడ్డారు. ఇలా ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వారం రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి కోర్టు నుంచి బెయిల్ పొందన తర్వాత బయటకు వచ్చారు. ప్రతి సోమవారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్‌కు వచ్చి నగరంలో ఉంటున్నారు. రోహిత్‌రెడ్డి ఇలా ప్రతిసారీ ఏదో ఒక అంశంలో కేంద్ర బిందువుగా నిలుస్తూ వార్తల్లో ఉంటున్నారు.


