breaking news
NTR district Latest News
-
జనసేన రౌడీల దుశ్చర్య
మచిలీపట్నంటౌన్: జనసేన రౌడీలు గురువారం రాత్రి వైఎస్సార్ సీపీ కార్యకర్త మద్దాల సతీష్ బాబుకు చెందిన దుకాణాన్ని ఇష్టానుసారంగా ధ్వంసం చేశారు. బందరు మండలం సత్రంపాలెంలో గిరిధర్‌పై దాడి చేసిన అనంతరం.. అదే గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఉన్న సతీష్ బాబు బడ్డీ కొట్టును ధ్వంసం చేశారు. దుకాణంలో ఉన్న ఫ్రిడ్జ్‌ని పగలగొట్టారు. తన దుకాణాన్ని సతీష్ బాబు మూసివేసి తాళాలు వేసి వెళ్లిన అనంతరం జనసేన గూండాలు అక్కడికి చేరుకుని వేసి ఉన్న తాళాలు పగలగొట్టి దుకాణంలోకి వెళ్లి విధ్వంసం సృష్టించారు. అక్కడ సతీష్ బాబు ఉంటే హత్య చేయాలనే తలంపుతో వెళ్లిన వారు అక్కడ సతీష్ బాబు లేకపోవడంతో అతని దుకాణాన్ని ఇష్టానుసారంగా పగలగొట్టారు. అందుకే కక్షకట్టారు.. ఈనెల తొమ్మిదో తేదీ మంగళవారం మచిలీపట్నంలోని ధర్నా చౌక్ వద్ద జరిగిన అన్నదాత పోరు కార్యక్రమంలో సత్రంపాలెంకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గిరిధర్, సతీష్ బాబు తదితర వైఎస్సార్ సీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థకు గిరిధర్ వాయిస్ ఇచ్చారు. డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు పదవి రాకముందు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు ఎలా మౌనంగా ఉంటున్నారో వివరించారు. ఈ వాయిస్ వీడియోలో సతీష్ బాబు కూడా కనిపించారు. దీంతో సతీష్ బాబుపై కూడా అక్కసు పెంచుకున్న జనసేన నాయకులు కొరియర్ శ్రీను, శాయన శివయ్యలతో కలిసి జనసేన గూండాలు అతనిపై కూడా దాడి చేసేందుకు గురువారం రాత్రి గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో సతీష్ బాబు తన షాపునకు తాళాలు వేసి వెళ్లడంతో దుకాణం తాళాలు పగలగొట్టి మరీ ధ్వంస రచన చేశారు. ఈ ఘటనను పలు దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దళితుడి బడ్డీ దుకాణాన్ని ధ్వంసం చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. -
డబ్బులు దండుకునేందుకే ‘విజయవాడ ఉత్సవ్’
లబ్బీపేట(విజయవాడతూర్పు): దేవీ శరన్నవరాత్రుల సమయంలో నగరంలో ఆధ్మాతిక శోభ వెల్లివిరుస్తుంది.. అలాంటి సమయంలో ఈ వేడుకలకు పోటీగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించడం అంటే దసరా ప్రాధాన్యతను తగ్గించడం కాదా అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రశ్నించారు. విజయవాడలో పార్టీ జిల్లా కార్యాలయంలో దేవినేని అవినాష్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. డబ్బులు దండుకునేందుకే స్థానిక ఎంపీ విజయవాడ ఉత్సవ్‌ను తెరపైకి తెచ్చారని అవినాష్ ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు దీనిని ఖండించాలన్నారు. అమ్మవారి ఉత్సవాల నిర్వహణపై శ్రద్ధ చూపడం మానేసి.. విజయవాడ ఉత్సవ్ మీద దృష్టి పెట్టారని మండిపడ్డారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కలుగజేసుకోవాలన్నారు. లేని పక్షంలో ఎన్టీఆర్ జిల్లాలోని పెద్దలందరినీ కలుపుకుని వాటిని అడ్డుకుని తీరుతామన్నారు. దసరా ఉత్సవాలకు పోటీగా మరొకటి నిర్వహించే ప్రయత్నాన్ని ప్రజల సహకారంతో నిరోధిస్తామని హెచ్చరించారు. 40 ఎకరాలు కబ్జా.. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో జిల్లాలో ఎప్పుడూ జరగని సంఘటనలు జరిగాయని అవినాష్ ఆరోపించారు. మంత్రుల దగ్గర నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. గొల్లపూడిలోని దేవాలయాలకు చెందిన 40 ఎకరాల భూమిని కబ్జా చేశారన్నారు. ఎంతోమంది గొప్పవారు మంత్రులు, ఎంపీలుగా పనిచేశారు గానీ దేవాలయాల భూములు దోచుకోలేదన్నారు. విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశినేని చిన్ని తాను ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మట్టి, కాంట్రాక్టులు, భూములు అన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. గోల్ఫ్ కోర్టులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్లు దేవాలయాల భూముల్లో కట్టడం ఏమి టని దేవినేని అవినాష్ ప్రశ్నించారు. రూ.450 కోట్లు విలువ చేసే భూమిని దోచుకోవాలని ప్లాన్ చేశారన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా తమ విధులకు ద్రోహం చేస్తున్నారని, కూటమి నేతలు ఏమి చెబితే అది సిగ్గు లేకుండా ఆచరిస్తున్నారన్నారు. -
అంతుచిక్కని అతిసార
లబ్బీపేట/అజిత్‌సింగ్‌నగర్: న్యూరాజరాజేశ్వరి పేటలో అతిసార వ్యాధి అదుపులోకి రాలేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండగా, మృతుల సంఖ్య కూడా మూడుకు చేరింది. ప్రజలు అతిసార బారినపడటానికి ఖచ్చితమైన కారణాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు గుర్తించలేకపోయింది. పూటపూటకీ రోగుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా మారగా, అధికారులు మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకొస్తుండటం గమనార్హం. మంగళవారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ దాదాపు 194 మంది డయేరియా బారిన పడినట్లు అధికారికంగా ప్రకటించారు. అధికారుల దృష్టికి రానివారు మరో 20 మంది వరకూ ఉండొచ్చునని అంచనా. ఇప్పటికే అతిసారతో ఇద్దరు మృతిచెందగా, వాంతులు విరచేనాలతో బాధపడుతూ తాజాగా శుక్రవారం రాత్రి మరో వ్యక్తి మృతిచెందారు. జీజీహెచ్‌లో 106మంది రోగులు.. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి డయేరియా రోగులు పెరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం 106మంది అతిసార బాధితులు చికిత్స పొందుతుండగా, 88మంది డిశార్జి అయ్యారు. బాధితులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తదితరులు పరామర్శించి నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. కారణాన్ని గుర్తించని వైనం.. అతిసారకు గల కారణాన్ని అధికారులు సైతం ఇప్పటివరకూ ప్రకటించలేదు. వినాయకుని వేడుకల్లో భోజనాలు చేశారని కొందరు, వంకాయ కూరలో రొయ్యలు వేసుకుంటే వాంతులు అయ్యాయని మరికొందరు చెబుతున్నారు. మంత్రులు సైతం ఇదే విషయాలను చెప్పుకొస్తున్నారు. భారీసంఖ్యలో ప్రజలు అతిసార బారిన పడ్డారంటే నీటి కలుషితమే కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రాంతంలో కార్పొరేషన్ సరఫరా చేసే నీటితోపాటు భూగర్భజలాలు సైతం పూర్తిగా కలుషితమైనట్లు సమాచారం. నీటికి సంబంధించి ప్రాథమిక పరీక్షలో నెగటివ్ వచ్చిందని, మరో రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరపాలక సంస్థ నీటిసరఫరాను సైతం పూర్తిగా నిలిపివేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరాను కూడా నిలిపివేసి, ప్రతి ఇంటికి మినరల్ వాటర్ క్యాన్లను అందిస్తున్నారు. బ్లీచింగ్‌తో కంటితుడుపు చర్యలు.. న్యూరాజరాజేశ్వరీపేటలో ప్రజలు ప్రాణాలు పోతున్నా... ప్రభుత్వ పెద్దలు.. ఉన్నతాధికారుల తీరు మాడరం లేదు. కేవలం ప్రజల కళ్లకు కనబడేలా ప్రధాన రహదారులపై బ్లీచింగ్ చల్లి.. ౖపైపెన కంటితుడుపు చర్యలు చేపడుతున్నారే తప్ప.. వాస్తవంగా నివాస ప్రాంతాల మధ్యలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టిసారించడం లేదు. అధ్వానంగా పారిశుద్ధ్య పరిస్థితి.. డయేరియా వెలుగు చూసి 72 గంటల సమయం గడిచినా కూడా నేటికి న్యూరాజరాజేశ్వరీపేట అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలు అత్యంత అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడ నడిరోడ్లపైనే పదుల సంఖ్యలో పందులు సంచరిస్తూ ఉన్నాయి. కాలువలన్నీ చెత్తతో నిండిపోగా.. అపార్ట్మెంట్ల మధ్య స్థలాలు మురుగునీటితో తీవ్ర దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. ఇక అపార్ట్మెంట్ల డ్రెయినేజీ పైపులన్నీ గతేడాది బుడమేరు వరదలో పగిలిపోగా నేటికి వాటి పరిస్థితి అలానే ఉండడంతో ఆ మురుగు, వ్యర్థాలన్నీ రోడ్లపైకి చేరి నివాసాల ముందు పారుతుండటం గమనార్హం. ఇక మంచినీటి పైపులైన్లు కూడా పగిలిపోవడంతో పక్కనే ఉన్న మురుగునీరు పైపుల్లో చేరుతూ కలుషితనీరే సరఫరా అవుతోందంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మాది 17వ నంబర్ బ్లాకు.. ఈ ఇళ్ల మధ్య మురుగు, చెత్త తొలగించకపోతుండటంతో దుర్వాసనకు ఇళ్లల్లో అస్సలు ఉండలేకపోతున్నాము. తరచూ జ్వరాలు, వాంతులు, విరేచనాల సమస్యలతో అల్లాడిపోతున్నాం. శశిరేఖ, 17వ బ్లాకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో న్యూరాజరాజేశ్వరపేటలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి. డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో దాదాపు నగరంలోని వైద్యసిబ్బంది అంతా అక్కడే పనిచేస్తున్నారు. అంతేకాకుండా నగర సమీపంలోని పీహెచ్‌సీలు, వెల్నెస్ సెంటర్ల నుంచి సీహెచ్ఓలకు కూడా డ్యూటీలు వేశారు. ఇప్పటివరకూ న్యూరాజరాజేశ్వరిపేటలో ప్రతి ఇంటిని రెండు, మూడుసార్లు సర్వేచేసి జల్లెడ పట్టారు. అయినప్పటికీ అతిసారకు కారణం మాత్రం కనుగొనలేకపోవడం గమనార్హం. వాంతులు, విరోచనాలు అవుతున్న వారికి మాత్రం సకాలంలో వైద్యం అందించగలుగుతున్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): నగర పరిధిలో ప్రైవేట్ ఆర్వో వాటర్ సప్లయ్ దుకాణాలను నగరపాలక సంస్థ అధికారులు సీజ్ చేశారు. కొత్త రాజరాజేశ్వరిపేటలో అతిసార వ్యాధితో కొందరు బాధపడుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది శుక్రవారం ఆర్వో వాటర్ సప్లయ్ దుకాణాలను తనిఖీ చేశారు. నగర పరిధిలో మొత్తం 216 ప్రైవేట్ ఆర్వో వాటర్ సప్లయ్ దుకాణాలు ఉండగా, వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించారు. ట్రేడ్ లైసెన్స్ లేకపోయినా, తాజాగా వాటర్ టెస్టింగ్ ల్యాబ్ రిపోర్ట్లేని 51 దుకాణాలను సీజ్ చేశారు. 57వ డివిజన్ కొత్త రాజరాజేశ్వరిపేట పరిధిలోని తొమ్మిది చికెన్ షాపులు, ఒక బీఫ్ షాపును వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సోమశేఖర్‌రెడ్డి మూసి వేయించారు. అదే ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ, నగరపాలక సంస్థ అధికారుల సంయుక్తంగా తనిఖీలు చేసి 24 ఆహార దుకాణాలను సైతం మూసివేయించారు. -
సర్కారు బడుల సత్తా
కృష్ణా జిల్లాలో ఐదు స్కూళ్లకు బెస్ట్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్సీ అవార్డులుకంకిపాడు: విద్యార్థుల వికాసానికి చదువుతో పాటుగా క్రీడలూ ముఖ్యమే. మారుతున్న పరిస్థితులతో ఎక్కువ మంది చదువు, తద్వారా వచ్చే మార్కులు, ర్యాంకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో విద్యార్థుల జీవితం తరగతి గదుల్లోనే మగ్గుతోంది. రానురాను విద్యార్థులు శారీరక వికాసానికి దూరం అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పలు పాఠశాలలు విద్యార్థులను చదువుతో పాటుగా క్రీడల్లోనూ తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న క్రీడలు, అథ్లెటిక్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. దీంతో జిల్లా, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో పోటీల్లో తలపడుతూ పతకాలు పొందుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలలు తమ విద్యార్థుల అభ్యున్నతికి తీసుకుంటున్న చొరవతో ఎక్స్‌లెన్స్ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఇటీవల జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో కృష్ణాజిల్లాకు చెందిన ఐదు ప్రభుత్వ పాఠశాలలు ఎక్స్‌లెన్స్ అవార్డులను అందుకుని ఆదర్శంగా నిలిచాయి. సత్తా చాటుతున్న విద్యార్థులు.. క్రీడల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారు. పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆట స్థలంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఉపాధ్యాయులు, శిక్షకులు అందించే ప్రోత్సాహం, తర్ఫీదుతో మెరికల్లా మారుతున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో సత్తా చాటి పతకాలు పొందుతున్నారు. జాతీయ స్థాయిలో పోటీల్లో ప్రవేశించి తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే 2024–25 విద్యాసంవత్సరానికి గానూ బెస్ట్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డులను జిల్లాలోని ఐదు ప్రభుత్వ పాఠశాలలు తమ సొంతం చేసుకున్నాయి. జెడ్పీ పమిడిముక్కల, జెడ్పీ గూడూరు, సీపీఎంహెచ్ఎస్ మచిలీపట్నం, జెడ్పీ (బాలికలు) గన్నవరం, జెడ్పీ గొడవర్రు పాఠశాలలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన ఎక్స్‌లెన్స్ అవార్డులను దక్కించుకున్నాయి. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ.. ప్రధానంగా హాకీ, ఆర్చరీ, అథ్లెటిక్స్ విభాగాల్లో విద్యార్థులు రాణిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు అందిస్తున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నారు. వారికి అవసరమైన పోషకాహారాన్ని అదనంగా అందజేస్తూ శారీరకంగా దృఢంగా ఉండేలా తమ వంతు బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్త్తున్నారు. దీంతో ఆయా పాఠశాలల్లో రాష్ట్రస్థాయిలో 25 నుంచి 40 మంది విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటుతూ పాఠశాలలకు గుర్తింపు తెస్తున్నారు. పాఠశాల పేరు లభించిన లభించిన పాయింట్లు స్థానం జెడ్పీ పమిడిముక్కల 192 ప్రథమస్థానం జెడ్పీ గూడూరు 107 ద్వితీయ స్థానం సీపీఎంహెచ్ఎస్ మచిలీపట్నం 100 తృతీయ స్థానం జెడ్పీ (బాలికలు) గన్నవరం 93 నాలుగో స్థానం జెడ్పీ గొడవర్రు 44 ఐదో స్థానం విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించటంతో పాటుగా జాతీయ స్థాయిలోనూ ప్రవేశించి ప్రతిభ చాటుతున్నారు. పాఠశాలకు ప్రత్యేకంగా గుర్తింపు లభిస్తోంది. విద్యార్థుల పట్ల వ్యాయామ ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధ, బాధ్యతతో వ్యవహరిస్తూ తర్ఫీదు ఇస్తూ వారికి మెలకువలు నేర్పుతున్నారు. ఏటా వివిధ స్థాయి లో విద్యార్థులు పతకాలు దక్కించుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నారు. – కొండిశెట్టి సుబ్రహ్మణ్యం, హెచ్ఎం, జెడ్పీ గొడవర్రు మైదానాన్ని సిద్ధం చేసుకోవటం, విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం కీలకమైన అంశం. ఇందుకు కొందరు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న చేయూత కూడా మరువలేనిది. విద్యార్థుల వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో శిక్షణ ఇస్తున్నాం. ప్రతిభ చాటేలా మెలకువలు నేర్పుతున్నాం. – కె.టాన్యాగిరి, పీడీ, జెడ్పీ గన్నవరం(బాలికలు) -
సుస్వరాల కోయిలకు కీర్తి కిరీటం
విజయవాడ కల్చరల్: ఆమె గాత్రంలోని మాధుర్యం శ్రోతలను కట్టిపడేస్తుంది.. వయోలిన్‌పై ఆమె చేసే స్వర విన్యాసం సంగీత ప్రియులకు పరవశించేలా చేస్తుంది. ఆమె వేదికపై ఉందంటే సంగీత అభిమానులకు పండుగే. ఆమే విజయ వాడకు చెందిన వయోలిన్ విద్వాంసురాలు బీవీ దుర్గాభవాని. విఖ్యాత హరికథా భాగవతార్ కుమార్తెగా ఆమె సంగీత రంగంలో విశేషమైన ప్రతిభ కనబరుస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానానికి ఇప్పుడు కీర్తి కిరీటం దక్కింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం వరించింది. సంగీత ప్రస్థానం సాగిందిలా.. బీవీ దుర్గాభవాని బహుముఖ ప్రతిభాశాలి. అటువాయిలీనం, ఇటు గాత్రం.. రెంటినీ సమర్థంగా పోషించగల సంగీత సవ్యసాచి. ఆమె 1965లో విజయవాడలో జన్మించారు. తండ్రి విశ్వనాథ భాగవతార్ వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. అటు గాత్రంలోనూ ఇటు వయోలిన్లోను ప్రతిభతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. సుదీర్ఘకాలం ఆకాశవాణి కేంద్రంలో వయోలిన్ విద్వాంసురాలిగా పనిచేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆరేళ్లపాటు వయోలిన్ అధ్యాపకురాలిగా పనిచేశారు. ప్రముఖ వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి శిష్యరికంలో సంగీత విద్యను సార్థకం చేసుకున్నారు. ప్రముఖుల సరసన.. ప్రముఖ సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నూకల చిన సత్యనారాయణ, టీఎన్ శేషగోపాలన్, ప్రపంచం సీతారాం, టీఎం కృష్ణ, బోంబే సిస్టర్స్, హైదరాబాద్ బ్రదర్స్‌తోపాటు పలువురు విద్వాంసులకు వాద్య సహకారమందించారు. అందుకున్న అవార్డులు.. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్, మద్రాస్ మ్యూజికల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, రసిక రంజని, ఆంధ్ర మ్యూజిక్ అకాడమీలు ఆమెకు పురస్కారాలను అందజేశాయి. కాగా ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఏటా వివిధ రంగా ల్లోని ప్రతిభావంతులకు అందించే కీర్తి పురస్కారానికి దుర్గా భవానీ ఎంపికై ంది. ఈ నెల 23, 24 తేదీలలో జరిగే సభల్లో రూ.5,116 నగదుతోపాటు జ్ఞాపికలు అందజేయనుంది. వయోలిన్ విద్వాంసురాలు దుర్గాభవానీకి తెలుగు వర్సిటీ పురస్కారం -
యూపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈనెల 14వ తేదీన జరగనున్న యూపీఎస్సీ– నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (2), కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ (2) పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. అభ్యర్థులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్డీఏ అండ్ ఎన్ఏ, సీడీఎస్ పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ అబ్జర్వర్ హరీష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి లైజన్ ఆఫీసర్లు, పరీక్షా కేంద్రాల పర్యవేక్షకులు, వైద్య ఆరోగ్యం, విద్యుత్, రెవెన్యూ, రవాణా, పోస్టల్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈనెల 14న విజయవాడలో ఆరు కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. సీడీఎస్‌కు 672 మంది, ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్షకు 718 అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. సీడీఎస్ పరీక్ష మూడు షిఫ్ట్‌ల్లో, ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్ష రెండు షిఫ్ట్‌ల్లో ఉంటుందని వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఆశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేయాలన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ నుంచి బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన నిబంధనలను తూ.చ.తప్పకుండా పాటించాలన్నారు. పరీక్ష సజావుగా జరిగేలా పోలీసుశాఖ తగిన భద్రత కల్పించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
ఇది పత్రికాస్వేచ్ఛపై ప్రభుత్వదాడి..
పత్రిక ఎడిటర్‌కి రాజకీయ దురుద్దేశాలను ఆపాదించి వార్తలను సాకుగా చూపి క్రిమినల్ కేసులు పెట్టడం దారుణమైన విషయం.ఇటువంటి చర్యలు పత్రికాస్వేచ్ఛపై ప్రభుత్వ ప్రత్యక్ష దాడి తప్పించి మరొకటి కాదు. మీడియాపై ప్రభుత్వం చేసే ఇటువంటి దాడులను ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది.‘సాక్షి’పత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని స్టేట్స్ స్మాల్ అండ్ మీడియం న్యూస్‌పేపర్స్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి మీడియాపై కక్ష సాధింపు ధోరణి తగదు. సీహెచ్ రమణారెడ్డి, ప్రధానకార్యదర్శి, సామ్నా -
అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని కలెక్టర్ దంపతులు దర్శించుకున్నారు. నూతనంగా నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా, పల్నాడు జిల్లా కలెక్టర్‌గా కృతికశుక్లా నియమితులైన నేపథ్యంలో శుక్రవారం వారు కుటుంబసభ్యులతో కలిసి శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానానికి విచ్చేశారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శీనానాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారి కుటుంబానికి అమ్మవారి దర్శనం కల్పించి, వేద పండితులతో వేదాశీర్వచనం చేయించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఆస్పత్రి నిర్మాణ పనులకు భూమిపూజ నందిగామటౌన్: వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందిస్తామని వైద్యారోగ్య శాఖా మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నందిగామలోని డీవీఆర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేపడుతున్న వంద పడకల ఆస్పత్రి విస్తరణ పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్లతో కలిసి శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలందించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగానే నందిగామ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, నాయకులు మండవ కృష్ణకుమారి, కోట వీరబాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025ప్రభుత్వ పాఠశాలలు తమ విద్యార్థుల అభ్యున్నతికి తీసుకుంటున్న చొరవతో ఐదు ప్రభుత్వ పాఠశాలలు ఎక్సలెన్స్ అవార్డులను సొంతం చేసుకున్నాయి. విజయవాడ కల్చరల్: సంగీత విద్యాంసురాలు బీవీ దుర్గాభవానిని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం వరించింది. 7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 68,340 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 89,306 క్యూసెక్కులు వదులుతున్నారు. -
లాఠీలతో కలాన్ని అణచలేరు..
లాఠీలతో కలాన్ని అణచలేరు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు పిలవగలరేమోగాని, పత్రికను నిజాలు రాయకుండా ఆపటం ఎవరివల్లా కాదు. అది ప్రపంచ నియంతల వల్లే కాలేదు. మూడు సంవత్సరాల్లో కూలిపోయే ఈ ప్రభుత్వం నిజాలు వార్తగా రాసే కలాన్ని అదిరించలేదు, బెదిరించలేదు. పత్రికా స్వేచ్ఛ, వాక్స్వాతంత్రపు హక్కు ఈ రాష్ట్రంలో ఉన్నాయా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. – పేర్ని వెంకట్రామయ్య(నాని), మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు -
సకాలంలో పనులన్నీ పూర్తి చేయండి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించే దసరా ఉత్సవాల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఏడీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు, దుర్గగుడి ఈవో శీనానాయక్‌లతో కలిసి కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద ప్రారంభమయ్యే క్యూలైన్లు, సీతమ్మ వారి పాదాల వద్ద హోల్డింగ్ పాయింట్లు, కేశఖండనశాలను పరిశీలించారు. హోల్డింగ్ పాయింట్లు పెంచాలి.. ఈ ఏడాది భక్తులను హోల్డింగ్ పాయింట్ ద్వారా క్యూలైన్లోకి అనుమతించాలని, అదే విధంగా రద్దీకి అనుగుణంగా పాయింట్లను పెంచాలని నిర్ణయించారు. క్యూలైన్లలో భక్తులకు అత్యవసర పరిస్థితులు ఎదురైతే వారు ఏ విధంగా బయటకు రావాలనే అంశాల గురించి ఇంజినీరింగ్ అధికారులను ఆరా తీశారు. మరుగుదోడ్లు, వైద్య సహాయ కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఎక్కడ ఉన్నాయనే దానిపై భక్తులకు సమాచారం తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పర్యటనలో దుర్గగుడి ఈఈలు కేవీఎస్ కోటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
కన్న తండ్రే కడతేర్చాడు!
మైలవరం: కన్న తండ్రే కాలయముడయ్యాడు. తనను గంజాయి కేసులో పట్టించిందని కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలవగానే కూతురును కొట్టి చంపాడు. శవాన్ని మూటగట్టి కాల్వలో పడేసి పరారయ్యాడు. ఈ విషాదకర ఘటన మైలవరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మైలవరానికి చెందిన చిందే బాజీకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాగమ్మకు ఐదుగురు కూతుళ్లు. రెండో భార్య నాగేంద్రమ్మకు ఒక కూతురు, కుమారుడు. అయితే ఇద్దరి భార్యలను మైలవరంలో వేరు వేరు ఇళ్లలో ఉంచి కాపురం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య నాగేంద్రమ్మతో కలిసి గంజాయి విక్రయిస్తున్న బాజీ గత మే నెలలో పోలీసులకు పట్టుబడ్డాడు. వీరిద్దరికీ కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో రెండో భార్య నాగేంద్రమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న తన కూతురు గాయత్రి(13), కుమారుడిని జి.కొండూరు మండల పరిధిలోని విద్యానగరంలో ఉంటున్న తన అక్క స్వప్న వద్ద వదిలి వెళ్లింది. బాజీ మొదటి భార్య నాగమ్మ తన భర్త ఒక్కడినే బెయిల్‌పై విడిపించడంతో గత జూలైలో జైలు నుంచి బాజీ విడుదలయ్యాడు. ఆ కోపంతోనే.. గాయత్రి గతంలో జి.కొండూరు మండలం కుంటముక్కలకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయమై బాజీ అతని రెండో భార్య నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆచూకీ గుర్తించి వారిద్దరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన గాయత్రి తన తండ్రి బాజీ నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించి ప్రేమించిన యువకుడితో కలిసి గంజాయి విక్రయ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించింది. కూతురు వల్లే తాను, తన భార్య జైలు కెళ్లామని బాజీ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో జైలు నుంచి రాగానే తన రెండో భార్య అక్క వద్ద ఉన్న గాయత్రిని రెండు నెలల క్రితం తన ఇంటికి తీసుకొచ్చి హింసించసాగాడు. చంపేసి.. విసిరి పారేసి.. ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీ సాయంత్రం ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టడంతో గాయత్రి మృతి చెందింది. ఆ తర్వాత శవాన్ని మూటకట్టి అద్దెకు తీసుకున్న ట్రక్కు ఆటోలో వేసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా కళ్లారా చూసిన మొదటి భార్య నాగమ్మ, ఆమె కూతుళ్లు శవాన్ని తీసుకెళ్లిన తర్వాత రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లి, ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం బయటకు పొక్కడంతో మైలవరం పోలీసులు గాయత్రి పెద్దమ్మ స్వప్నని పిలిపించి ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాజీ పోలీసులకు భద్రాచలం ఏరియాలో రెండు రోజుల క్రితం పట్టుబడ్డాడు. విచారణలో తన కూతురు గాయత్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలు స్తోంది. శవాన్ని ఖమ్మం జిల్లా మధిర శివారులో కాల్వలో పడేసినట్లు చెప్పడంతో పోలీసులు డ్రోన్ల సాయంతో ఆ దిశగా గాలింపు చేపట్టారు. అయితే గాయత్రి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. -
సర్కారు తమాషా
ఎరువుల గోస..14 నెలలుగా ‘గౌరవం’ లేదుమచిలీపట్నంటౌన్: జిల్లాలో యూరియా కొరతపై జెడ్పీ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. జిల్లా వ్యాప్తంగా సరిపడినంత యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై సభ్యులు అధికారులను నిలదీశారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన గురువారం జెడ్పీ కన్వెన్షన్ హాలులో జెడ్పీ సర్వ సభ్య సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలకు పైగా యూరియా కొరత అంశంపై చర్చ సాగింది. వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పోడియంను ముట్టడించారు. ఈ చర్చ జరిగే సమయంలో సభలో సభ్యుల వద్దకు పోలీసులు రావటాన్ని సభ్యులు తప్పుపట్టారు. కొరతే లేదంటూ వితండవాదం.. ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి జిల్లాలో యూరియా కొరత లేదంటూ పేర్కొనటంతో పెదపారుపూడి ఎంపీపీ గోదం సురేష్‌తో పాటు జెడ్పీ వైస్‌చైర్మన్ గుదిమళ్ల కృష్ణంరాజు, గన్నవరం, కృత్తివెన్ను, కంచికచర్ల జెడ్పీటీసీలు అన్నవరపు ఎలిజిబెత్ రాణి, మైలా రత్నకుమారి, వేల్పుల ప్రశాంతి, పెనుగంచిప్రోలు ఎంపీపీ మార్కపూడి గాంధీ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత లేదని పేర్కొనడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీలు పోడియం వద్దకు చేరుకుని ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎంత మేర వరి సాగవుతోంది? దీనికి ఎంత మేర యూరియా అవసరమవుతుందో లెక్కకట్టి, ప్రణాళికాబద్ధంగా అధికారులు వ్యవహరించలేదన్నారు. పీఏసీఎస్‌లకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయటంతో చైర్మన్ కనుసన్నల్లో యూరియా వారి పార్టీకి చెందిన వారికి, పెద్ద రైతులకు దొడ్డిదారిన ఇస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం పంట పొట్టదశకు చేరిందని ఇప్పటికీ యూరియా పూర్తిస్థాయిలో అందకపోవటం విచారకరమని పేర్కొన్నారు. దీనికి కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బదులిస్తూ ఏటా మాదిరిగానే ఈ ఏడాది యూరియా సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేశామని, అయితే తొలి పంట వర్షాలకు దెబ్బతినటంతో మళ్లీ నాట్లు వేశారని, ముంపు బారిన పడిన పొలాలు మళ్లీ ఊడ్చారని దీంతో యూరియా మళ్లీ అవసరం కావటంతో కొరత ఏర్పడినట్లు క్షేత్రస్థాయి పర్యటనలో తన దృష్టికి వచ్చిందన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా యూరియాను రప్పించే ప్రయత్నం చేస్తున్నామని, ఇప్పటికే కొంత చేరిందని, మరికొంత రానున్న రోజుల్లో చేరుతుందన్నారు. ● 2024 ఆగస్టులో తువ్వకాలువకు వత్సవాయి నుంచి పెనుగంచిప్రోలు వరకు 20 గండ్లు పడి దాదాపు 2 వేల ఎకరాలకు పైగా భూమి సాగు కావటం లేదని పెనుగంచిప్రోలు ఎంపీపీ మార్కపూడి గాంధీతో పాటు పలువురు జెడ్పీటీసీలు పేర్కొ న్నారు. ఈ గండ్లు పూడ్చేందుకు రూ.1.60 కోట్లను మంజూరు చేసినా, పనులు చేపట్టకపోవటంతో ఇప్పటికీ మూడు పంటలను రైతులు కోల్పోవాల్సి వస్తోందని వివరించారు. గండ్లకు సంబంధించిన ఫొటోలతో మేట వేసిన పొలాల ఫొటోలను వారు సభ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిష్కరిస్తామని ఎన్టీఆర్ జిల్లా జేసీ ఇలక్కియ వారికి హామీ ఇచ్చారు. ● జెడ్పీటీసీ, ఎంపీపీలకు కూటమి ప్రభుత్వ పాలనలో అధికారులు ప్రొటోకాల్ ప్రాధాన్యం ఇవ్వటం లేదని సభ్యులు కలెక్టర్ బాలాజీ దృష్టికి తీసుకువచ్చారు. శిలాఫలకాలపై వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ, ఎంపీపీల పేర్లు ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పలు ఫొటోలను జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, కలెక్టర్ బాలాజీలకు చూపించారు. ఇకపై నిబంధనలకు అనుగుణంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ● భోజన విరామం జరిగిన అనంతరం సభలో పంచాయతీరాజ్ డీఈ నగేష్ తాము జిల్లా కలెక్టర్‌కు శిలాఫలకం ప్రొటోకాల్‌ను పంపుతామని ఆయన అప్రూవల్ ఇచ్చిన తర్వాతే వాటిని పెడుతున్నామని పేర్కొన్నారు. జేసీ గీతాంజలిశర్మ కలుగజేసుకుని ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని ఇకపై ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ● రెండు నెలల కిందట గుడివాడలో జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడికి పాల్పడిన టీడీపీ గూండాలను అరెస్ట్ చేయాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ప్రథమ మహిళకే ఇలా జరిగితే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని కలెక్టర్ బాలాజీని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ బాలాజీ.. ఎస్పీ గంగాధరరావుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసును తాను కూడా పర్సనల్‌గా తీసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సభ్యులకు హామీ ఇచ్చారు.జిల్లాలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ సమస్యలను లేవనెత్తేందుకు నిర్వహించే ప్రధాన సమావేశమైన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి అధికార పక్షానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాకపోవటం పట్ల తాము అధికారులకు మాత్రమే చెప్పుకోవాల్సి వస్తోందని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతతో రైతులు సతమతమవుతున్న నేపథ్యంలో జరుగుతున్న జెడ్పీ సమావేశానికి ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు హాజరుకాకపోవటం గమనార్హం.14 నెలలుగా గౌరవవేతనం రావటం లేదని, ఇది త్వరితగతిన ఇప్పించాలని జెడ్పీటీసీ, ఎంపీపీలు కలెక్టర్‌ను కోరారు. గౌరవవేతనం రాకపోవటంతో మండల పరిషత్ సమావేశాలకు ఎంపీటీసీ సభ్యులు హాజరుకామని చెబుతున్నారని, ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జెడ్పీటీసీలకు జెడ్పీ నిధుల నుంచి గౌరవ వేతనం చెల్లించేలా సమావేశంలో తీర్మానించారు. నందిగామ మండలం రాఘవాపురంలో అక్రమ మట్టి తోలే క్రమంలో ఆపరేటర్, లారీ డ్రైవర్ మట్టి కింద పడి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేయించాలని కంచికచర్ల, నందిగామ జెడ్పీటీసీలు వేల్పుల ప్రశాంతి, జి. వెంకటేశ్వరరావు తదితరులు అధికారులను కోరారు. విద్యపై జరిగిన చర్చలో తల్లికి వందనం పథకం ద్వారా చాలా మండలాల్లో తల్లులకు రూ. 6వేలు, 7వేలు మాత్రమే పడ్డాయని కొంత మందికి అసలు పడలేదని దీనిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీలు డీఈవో రామారావును కోరారు. సమావేశంలో నూజివీడు సబ్‌కలెక్టర్ బి. వినూత్న, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల ఆరోగ్య సంరక్షణకు ‘హెల్త్ ఫస్ట్–1991’
లబ్బీపేట(విజయవాడతూర్పు): నిరంతరం ప్రజాసేవలో మమేకమవుతున్న పోలీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ‘హెల్త్ ఫస్ట్ 1991’ యాప్‌ను గురువారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ యాప్‌లో 14 వేల మందికిపైగా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు, వారిపై ఆధారపడిన సభ్యులు అనుసంధానమై ఉంటారని ఆయన తెలిపారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ పోలీసుల వైద్య సేవల కోసం ఆరోగ్య భద్రత ఉన్నప్పటికీ, అన్ని రకాల సేవలు దానిలో కవర్ కావడం లేదని, దీంతో చాలా మంది సిబ్బంది ఇబ్బంది పడుతున్నట్లు గ్రహించి, 1991 బ్యాచ్ పోలీసు అధికారులు చొరవ చూపినట్లు తెలిపారు. 29 ప్రత్యేక విభాగాల్లో.. జిల్లాలోని 26 ప్రముఖ హాస్పిటల్స్‌తో మాట్లాడి ఉచిత కన్సల్టేషన్తో పాటు, వైద్య ఖర్చులో 20 నుంచి 30 శాతం రాయితీ ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నట్లు సీపీ తెలిపారు. అందులో భాగంగా 29 ప్రత్యేక విభాగాల్లో 106 మంది డాక్టర్లు స్పందించి పోలీసులకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. డీసీపీ కేజీవీ సరిత, 1991 అధికారులు పాల్గొన్నారు. పెడన: మండలంలోని బలిపర్రు గ్రామంలో ఉన్న లిల్లి స్వయం సహాయక సంఘం(ఎస్‌హెచ్‌జీ) సభ్యురాలు కొణతం వినీత కలంకారి యూనిట్‌ను గురువారం సెర్ప్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా మోర్డ్, ఎన్ఆర్ఎల్ఎం జాతీయ స్థాయి మేనేజరు లక్ష్మీకాంత్ పరసర్, జిల్లా ఏడీ శ్రీధరరావు కలంకారీ తయారీదారులతో మాట్లాడి ఎంటర్‌ప్రెన్యూర్‌గా వ్యాపారం ఎలా అభివృద్ధి చేసుకోవాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో సెర్ప్ బృందం సభ్యులు వాల్మీకి, సత్యభామ, శోభారాణి పాల్గొన్నారు.యాప్‌ను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు -
ఏఎన్‌యూ నిర్వాకం.. బాధ్యతారాహిత్యం
గుంటూరు: ఏపీ పీజీ సెట్ నిర్వహణలో ఆది నుంచి జాప్యం చేస్తూ వచ్చిన ఉన్నత విద్యాశాఖ అధికారులు చివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లోనూ విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జూలైలో ఏపీ పీజీ సెట్ నిర్వహించారు. వారం పది రోజుల్లోపే ర్యాంక్ కార్డులను విడుదల చేశారు. ఆ తర్వాత రెండు నెలల పాటు అడ్మిషన్లపై ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు నిరీక్షణ తప్పలేదు. ఎట్టకేలకు ఈనెల 8న విడుదల చేశారు. 8 నుంచి 15 వరకు వెబ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 9 నుంచి 16 వరకు ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు. దీంతోపాటు స్పెషల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 11న గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. దీని ఆధారంగా ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ (క్యాప్), దివ్యాంగులు తదితర కేటగిరీలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురువారం నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని వాయిదా వేశామని, ఆ విషయం బుధవారం సాయంత్రం తమ వెబ్ సైట్ ద్వారా తెలియపరచామని యూనివర్సిటీ అధికారులు చెప్పారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి అక్కడికి చేరుకున్న విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికారులతో వాదనకు దిగిన విద్యార్థులు యూనివర్సిటీ అధికారులు వెబ్సైట్లో ప్రకటించిన విషయాన్ని గుర్తించలేదని, ఇప్పుడు ఉన్న పళంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి వెనక్కు పంపడం తగదని విద్యార్థులు అధికారులతో వాదనకు దిగారు. దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం జీజీహెచ్ వైద్యాధికారులు అందుబాటులో లేరని, అందువల్ల వాయిదా వేస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రమే వాయిదా వేయాలి గానీ, మిగిలిన వారివి యథావిధిగా నిర్వహించకపోవడంలోని ఆంతర్యం ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు. అన్ని ఒకేసారి నిర్వహించడం వల్ల తమకు సులువుగా ఉంటుందని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని అధికారులు చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. దూర ప్రాంతం నుంచి వచ్చిన తమను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని, మళ్లీ రావాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని, సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించాలని విద్యార్థులు చేసిన విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోలేదు. హాజరైన విద్యార్థుల నుంచి అధికారులు మొక్కుబడిగా వారి పేర్లు, హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేసుకున్నారు. దాదాపు 100 మంది వరకు విద్యార్థులు అక్కడ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా వేశారనే విషయం తెలుసుకుని ఆలస్యంగా వచ్చిన చాలామంది విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. మొత్తానికి యూనివర్సిటీ అధికారుల వైఖరి కారణంగా పీజీ సెట్ విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
దూసుకొస్తున్న మృత్యువాహనాలు
జి.కొండూరు: అక్రమ మైనింగ్ క్వారీల నుంచి మెటల్, కంకర, గ్రావెల్, బూడిద చెరువు నుంచి బూడిద రవాణా చేసే వెయ్యికి పైగా టిప్పర్ లారీలు ఇటు మైలవరం, అటు నందిగామ నియోజకవర్గాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. లారీలు బోల్తా పడడం, ఓవర్టేక్ చేస్తూ ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు క్షతగాత్రులుగా మారి జీవనోపాధిని కోల్పోతున్నారు. అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న టిప్పర్ల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఓవర్ లోడింగ్‌తో ప్రమాదం ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, కంచికచర్ల మండలాల పరిధిలో నిర్వహిస్తున్న రాతి క్వారీలలో కంకర, భారీ బండరాళ్లు, గ్రావెల్‌ను తరలించేందుకు రోజుకి 500 టిప్పర్ లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ బూడిద చెరువు నుంచి బూడిదను తరలించేందుకు రోజూ 400 లారీల వరకు తిరుగుతుంటాయి. ఈ క్వారీలు, బూడిద చెరువు నుంచి విజయవాడ పరిసర ప్రాంతాలలో నిర్మిస్తున్న భవనాలు, రహదారులకు నిత్యం వందలాది లారీలతో మెటల్, గ్రావెల్, బూడిద తరలిస్తుంటారు. టిప్పర్ లారీకి సైజును బట్టి 25 నుంచి 30 టన్నులకు మించి రవాణా చేయడానికి వీలు లేకపోయినప్పటికీ ఎక్కువ కిరాయి కోసం 40 టన్నుల నుంచి 50 టన్నుల వరకు కూడా లోడు చేసి రవాణా చేస్తున్నారు. డ్రైవర్లు గ్రామాల్లో చిన్న రోడ్లలో సైతం మితిమీరిన వేగంతో టిప్పర్ లారీలను నడపడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 2న మునగపాడు చెరువు వద్ద కంకర లోడుతో వెళ్తూ బోల్తాపడి దగ్ధమైన టిప్పర్ లారీ జూన్ 6న ఇబ్రహీంపట్నం ట్రక్కు టర్మినల్ వద్ద బోల్తాపడిన బూడిద లోడుతో ఉన్న టిప్పర్ లారీ టిప్పర్ మే సవాల్ గ్రావెల్ లారీ ఢీకొని వృద్ధుడు మృతి టిప్పర్ లారీలను చూస్తే భయమేస్తోంది గ్రావెల్, కంకర లోడుతో వేగంగా వస్తున్న టిప్పర్ లారీలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. ఎక్కువ ట్రక్కులు రవాణా చేస్తే కమీషన్ ఎక్కువ వస్తుందని డ్రైవర్లు వేగంగా నడపడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయి. –పెయ్యల ప్రతాప్, గ్రామస్తుడు, వెలగలేరు జి.కొండూరు: ద్విచక్ర వాహనాన్ని గ్రావెల్ లారీ ఢీకొట్టిన ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలలోకి వెళ్తే... జి.కొండూరు మండలం వెల్లటూరుకు చెందిన తొర్లికొండ శివయ్య(60) రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శివయ్య గురువారం ఉదయం గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై పని కోసం కవులూరు వెళ్తున్నాడు. కవులూరు గ్రామ శివారులోకి రాగానే వెనక నుంచి గ్రావెల్ లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న సుధాకర్ రోడ్డు మార్జిన్ వైపు పడిపోగా వెనక కూర్చున్న శివయ్య లారీ కింద పడిపోయాడు. శివయ్యపైకి లారీ టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జి.కొండూరు ఎస్ఐ సతీష్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య శివమ్మ అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందగా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్‌కుమార్ తెలిపారు. -
అతిసార పాపం ఎవరి పుణ్యం?
అధికారిక లెక్కలు ఇలా... లబ్బీపేట(విజయవాడతూర్పు): అతిసారకు కారణం ఏమిటంటే.. ఉత్సవాల్లో వడ్డించిన భోజనాలే అని అధికారులు చెబుతున్నారు. వినాయక నిమజ్జనం రోజు పగలు వండిన వంటకాలు రాత్రి తిన్నారని అందుకే ఇలా...అని అంటున్నారు. కానీ ఆ ప్రాంత ప్రజలు మాత్రం పైప్లైన్ల నుంచి రంగు మారిన నీరు, దుర్వాసన వస్తున్నాయని చెబుతున్నా అధికారులు పట్టించుకోలేదంటున్నారు. పెరుగుతున్న బాధితులు అతిసార బాధితులు గురువారం సాయంత్రం వరకూ ఆస్పత్రులకు పరుగులు పెడుతూనే ఉన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన బాధితులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వారిని ప్రత్యేక వార్డుల్లో అడ్మిట్ చేసి జనరల్ మెడిసిన్ నిపుణుల పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. వాంతులు, విరోచనాలు అవడానికి కలుషిత ఆహారం కారణమని అధికారులు చెబుతున్నారు. వంద మందికి పైగా ఎఫెక్ట్ కావడంతో నీరు కూడా కారణమై ఉండవచ్చునని భావిస్తూ ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు. వైద్య సేవల పర్యవేక్షణ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అతిసార బాధితులను గురువారం రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండ్యన్ పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ కూడా ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అతిపెద్ద ఎపిడమిక్ సమస్య కావడంతో న్యూ రాజరాజేశ్వరిపేట పరిసర ప్రాంతాల్లో గ్రామీణ వైద్యుల క్లినిక్స్(ఆర్ఎంపీ)లను మూసివేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశాలు జారీ చేశారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో 122 మంది డయేరియా బారిన పడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వారిలో 61 మంది ఇప్పటికే కోలుకుని డిశ్చార్జి అయ్యారని, ఇంకా 61 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాస్పత్రిలో 61 మంది చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. వారిలో పెద్దవాళ్లు కొత్తాస్పత్రిలో, చిన్నారులు పాత ఆస్పత్రిలోని పిడియాట్రిక్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆయన చెప్పారు. -
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు
బీజేపీ తీరుతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం కృష్ణలంక (విజయవాడతూర్పు): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విదేశాంగ విధానం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం ప్రమాదంలో పడ్డాయని, ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం సీపీఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా వర్తమాన పరిస్థితులు–సీపీఎం వైఖరిపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాఘవులు తొలుత ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బీజేపీ ఫాసిస్టు, మతోన్మాద ధోరణి నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సి ఉందన్నారు. ఆ విషయంలో తెలుగు రాష్ట్రాల వామపక్ష ఉద్యమానికి గురుతర బాధ్యత ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఉన్న పార్టీలు బీజేపీకి సాగిలపడుతున్నాయని తెలిపారు. ఇదే పద్ధతి కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విస్తరణకు అవకాశం ఇచ్చిన వారవుతారని అన్నారు. ఈ ఏడాది కాలంలో భారత రాజకీయాల్లో వస్తున్న పెనుమార్పులు, అభ్యుదయ, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు వారి పాత్రను ముందుకు తీసుకెళ్లడంలో ఏచూరి లేని లోటు కనిపిస్తోందన్నారు. ఎన్ని భిన్నత్వాలు ఉన్నా ప్రతిపక్షాలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఒక తాటిపైకి వచ్చాయంటే వామపక్షాలు, అందులోనూ సీతారాం ఏచూరి కీలకపాత్ర పోషించడం వలనే సాధ్యమైందన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి మాట్లాడుతూ ప్రస్తుత పాలకులకు ప్రజాస్వామ్యం పట్టడం లేదన్నారు. భూములు యథేచ్ఛగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సదస్సులో సీపీఎం నాయకులు సీహెచ్ బాబూరావు, డి.వి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ తీరు సరికాదు..
మీడియా గొంతునొక్కే కుట్రలు చేయటం సరికాదు. మీడియా వల్లే సమాజంలో ఉన్న అనేక సమస్యలు వెలుగుచూస్తున్నాయి. సమాజ గతిని నిర్ణయిస్తున్నాయి. పాలకుల వైఫల్యాలను బహిర్గతం చేయటం తప్పు అనేట్లుగా ప్రస్తుత విధానాలు కనిపిస్తున్నాయి. మీడియా ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాల్లో వాస్తవాలు లేకపోతే ఖండించాలి. అంతే తప్ప కేసులు నమోదుచేయటం, ఇబ్బందులకు గురిచేయటం సరైంది కాదు. దేశ ప్రగతిలో ముఖ్యభూమిక పోషిస్తున్న మీడియా పట్ల అనుచితంగా వ్యవహరించటం మానుకోవాలి. కచ్చితంగా మూల్యం చెల్లించుకునేందుకు పాలకపక్షాలు సిద్ధంగా ఉండాలి. – నక్కా శ్రీనివాసరావు, సగర సంఘం రాష్ట్ర నాయకుడు, కోలవెన్ను -
ప్రగతి సూచికలపై ప్రత్యేక దృష్టి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా వివిధ విభాగాల కీలక ప్రగతి సూచికల (కేపీఐ) పురోగతిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని.. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నాలుగు సూచికలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బంది, ఉద్యాన శాఖ అధికారులు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద పని దినాల కల్పన, సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించడానికి సంబంధించిన అంశాల్లో నిర్దేశించిన నెలవారీ, త్రైమాసిక, వార్షిక లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు. సగటు వేతనం రూ. 307 ఉపాధి హామీ శ్రామికులకు అందేలా ప్రణాళిక ప్రకారం కృషి చేయాలన్నారు. ఉద్యాన పంటలను ప్రోత్సహించాలి.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతికి మార్గం వేసే ఉద్యాన పంటల దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఈ ఏడాదికి జిల్లా మొత్తంమీద 4వేల ఎకరాలను, ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం 20 ఎకరాలను లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఇప్పటివరకు 3,741 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. అదే విధంగా మునగ సాగుకు 894 ఎకరాలను గుర్తించినట్లు వివరించారు. మండలాల వారీగా లేబర్ మొబిలైజేషన్, సీసీ రహదారుల నిర్మాణం, పశువుల షెడ్లు, జీవాల షెడ్ల నిర్మాణం, మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం తదితరాలపైనా సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో డ్వామా పీడీ ఎ.రాము తదితరులు పాల్గొన్నారు. -
విశ్వనాథ సాహిత్యం అజరామరం
విజయవాడ కల్చరల్: విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం అజరామరమని వేముల చారిటబుల్ సంస్థ వ్యవస్థాపకుడు వేముల హజరత్తయ్య గుప్తా అన్నారు. కవి సామ్రాట్ విశ్వనాథ 131వ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని సంస్థ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వం విశ్వనాథ పేరుతో ఏటా సాహితీ సదస్సులు నిర్వహించాలని సూచించారు. వేముల చారిటీస్ కన్వీనర్ ఎంవీ చలమయ్య, వాయిద్య కళాకారులు పాల్గొన్నారు. ● సంస్కార భారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో విశ్వనాథమార్గ్లోని విశ్వనాథ సత్యనారాయణ విగ్రహంవద్ద జయంతి వేడుకలను నిర్వహించారు. విశ్వనాథ శిష్యుడు డాక్టర్ శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, సంస్కారభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ● బీజేపీ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో విశ్వనాథమార్గ్లోని విశ్వనాథ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం ఆధ్వర్యంలో పుష్పాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వనాథ సత్యనారాయణ మనుమడు విశ్వనాథ సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. -
రైళ్లలో స్నాచింగ్‌లు.. పాత నేరస్తుడు అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లలో వరుస దొంగతనాలు, మహిళల మెడలోని బంగారు ఆభరణాల స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్పీ) అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం విజయవాడ రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతే ఆలీబేగ్తో కలసి జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి రమణ వివరాలు వెల్లడించారు. పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో.. తిరుపతికి చెందిన బండి రాజ్యలక్ష్మి ఆగస్టు 23న తిరుపతి నుంచి వరంగల్లుకు పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణం చేస్తోంది. రైలు విజయవాడలో ఆగి బయలుదేరే సమయంలో గుర్తు తెలియని ఆగంతకుడు ఆమె మెడలోని బంగారు నానుతాడును తెంచుకుని కదులుతున్న రైలు నుంచి దూకి పరారయ్యాడు. అనంతరం ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించి రెండు రోజుల తరువాత విజయవాడ చేరుకుని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విజయవాడ ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నేరస్తుడి కోసం గాలింపు చేపట్టారు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలను పర్యవేక్షించడం, పాత నేరస్తులను విచారించడం ద్వారా చోరీకి పాల్పడింది తెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్‌కు చెందిన తండ్రికంటి రమేష్‌గా గుర్తించారు. ఇతనిపై గతేడాది విజయవాడ స్టేషన్లో స్నాచింగ్ కేసులోనే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ముమ్మర గాలింపు.. పోలీసులకు అందిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం హైదరాబాద్, వరంగల్లు, ఖమ్మంలో గాలింపు చేపట్టినా పోలీసులకు దొరక్కుండా చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం నిందితుడు విజయవాడలోని జైహింద్ కాంప్లెక్స్ వద్ద బంగారు ఆభరణాలను విక్రయించేందుకు తిరుగుతుండగా.. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి స్నాచింగ్‌కు పాల్పడిన లక్షరూపాయల విలువ చేసే 25 గ్రాముల బంగారు నానుతాడుతో పాటుగా గతంలో చోరీ చేసిన నాలుగు లక్షల విలువైన రెండు సూత్రాలతో కూడిన 40 గ్రాముల బంగారు నానుతాడును కూడా పోలీసులు రికవరీ చేశారు. రూ. 5లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం -
దేవుని మాన్యంలో ఆగిన మట్టి తోలకాలు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మచిలీపట్నంలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి విజయవాడకు కూత వేటు దూరంలోని గొల్లపూడిలో ఉన్న 39.99 ఎకరాల దేవుని మాన్యం ఉంది. ఈ మాన్యం భూముల్లో అనుమతులు లేకుండా విజయవాడ ఉత్సవ్ పేరుతో మట్టి తోలి చదును చేసే పనులు నిలిచిపోయాయి. ఇక్కడ జరుగుతున్న పనులపై ప్రభుత్వ పెద్దలు ఆరా తీసి, దేవదాయ శాఖ పొలాల్లో ఎగ్జిబిషన్ ఎలా ఏర్పాటు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టీడీపీలోని వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. విజయవాడ ఉత్సవాలకు వేరే ప్రైవేటు స్థలాన్ని చూసుకోవాలని చెప్పినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దేవుడి మాన్యం చదునుపై అనుమానాలు దేవుడి మాన్యం భూమిని చదును చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ ఉత్సవ్ అనేది ప్రభుత్వ కార్యక్రమమా? ప్రైవేటు కార్యక్రమమా? అనే స్పష్టత ఇప్పటికీ లేదని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. వీటి నిర్వహణకయ్యే ఖర్చును ఏవిధంగా సమకూర్చుతున్నారనే అంశంపైనా చర్చ సాగుతోంది. ప్రముఖులు, వ్యాపార సంస్థల నుంచి చందాల వసూళ్లకు ప్రణాళిక రచించారనే ఆరోపణలపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. విజయవాడ ఉత్సవ్ వెనుక భారీ, దీర్ఘకాలిక ప్రణాళిక ఉందని టీడీపీ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థలంలో గుంటూరుకు చెందిన ఓ మీడియా సంస్థ మల్టీ కాంప్లెక్స్‌లు, మల్టీ థియేటర్లు నిర్మిస్తుందని, ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న మరో నేత రిక్రియేషన్ క్లబ్, ఓ ప్రముఖ హోటల్ సంస్థ యజ మాని స్టార్ హోటల్ నిర్మాణం చేపడుతారని, మరో టీడీపీ నాయకుడు క్యాంటీన్లు, చిన్న హోటళ్లు ఏర్పాటు చేసుకునేలా ఒప్పందం జరిగిందని కూటమి నాయకులు పేర్కొంటున్నారు. ఆ స్థలంపై కన్నేసిన వారిలో కొంత మంది ప్రస్తుతం చేస్తున్న ఏర్పాట్ల కోసం పెట్టుబడులు పెట్టడంతోపాటు, పెద్ద ఎత్తున చందాలు వసూలు చేసేందుకు రూప కల్పన జరిగిందని సమాచారం. అయితే ఈ విషయాలు ప్రభుత్వ పెద్దల దృష్టికి చేరాయని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. పెద్దలకు విన్నపాలు విజయవాడ ఉత్సవ్ జరుపుతామని ప్రచారం చేశామని, ఎలాగైనా అక్కడే ఉత్సవాలు జరపా లని టీడీపీ నేతలు గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తాత్కాలికంగా అయినా ఉత్సవాలకు అనుమతి ఇప్పించాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నారు. ఇప్పటికే లీజు ఉండటంతో, వారి నుంచి సబ్ లీజుకు తీసుకొనే అవకాశం లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఆ లీజుదారులను ఒప్పించి వారి లీజు రద్దు చేసి, గుడికి ఆదాయం ఎక్కువగా వస్తుందని చూపి, తాత్కాలికంగా ఈ ఉత్సవాల వరికై నా అనుమతి పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పంటలు పండే పొలంలో కోట్ల రూపా యల మట్టిని ఆ ప్రదేశంలో నింపారు. ఈ మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులూ తీసుకో లేదు. ప్రభుత్వం ఈ భూమి కేటాయింపులు నిలిపి వేసినా మూడు అడుగుల మేర నింపిన మట్టి తొలగింపు ఎలా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. మొత్తం మీద గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూమికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొంటుందనే విషయం చర్చనీ యాంశంగా మారింది. ఇప్పటికే గుడి కమిటీ, విశ్వ హిందు పరిషత్ సంస్థ సభ్యులు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడిలో సమావేశమై ఆ భూమిని ఏ విధంగా కాపాడుకోవాలి అనే దానిపై కార్యాచరణ రూపొందించారు. దేవుడి మాన్యంపై కూటమి నేతల కన్ను గొల్లపూడిలో ఉన్న 39.99 ఎకరాల దేవుని మాన్యంపై విజయవాడ పార్లమెంట్ ముఖ్యనేతతో పాటు, మరికొంత మంది టీడీపీ నేతల కన్ను పడింది. విజయవాడ ఉత్సవ్ ముసుగులో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఎత్తుగడ వేశారు. రూ.400 కోట్ల విలువైన ఈ 39.99 ఎకరాల్లో వరల్డ్ క్లాస్ గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పేరుతో ఐదు ఎకరాలు, ఏటా విజయవాడ ఉత్సవాల పేరుతో ట్రేడ్ ఎక్స్పో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్‌హెచ్‌జీ మేళా, అగ్రిటెక్ షో, టూరిజం ప్రమోషన్ ఈవెంట్లతో ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు శాశ్వత వేదిక నిర్మాణం పేరుతో మరో 34.99 ఎకరాల భూమి లీజు కోసం జిల్లా యంత్రాంగం నుంచి దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రతిపాదనలు వెళ్లాయి. ఆ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి పనులూ మాన్యం భూమిలో చేపట్టరాదని దేవదాయశాఖ అధికారులు జిల్లా యంత్రాంగానికి అధికారికంగా తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. -
బెజవాడలో మృత్యుఘోష
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో డయేరియా పడగవిప్పింది. న్యూ రాజరాజేశ్వరి పేటలో ఇప్పటికే ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు. వంద మందికి పైగా బాధితులు ఆస్పత్రులు, ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్నారని సమాచారం. న్యూ రాజరాజేశ్వరి పేటలో వారం రోజులుగా కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీటి నుంచి దుర్వాసన వస్తోంది. అయినా నగర పాలక సంస్థ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఈ నెల ఏడో తేదీ నుంచి ఆ ప్రాంతంలో అతిసార కేసులు నమోదవుతున్నాయి. అధికారులు మాత్రం మంగళవారం రాత్రి తీసుకున్న కలుషిత ఆహారం కారణమని చెప్పుకొస్తున్నారు. బుధవారం మరికొందరు స్థానికులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. కొందరు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లగా, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అతిసారతో ఎంత మంది బాధపడతున్నారనేది అధికారులకు కూడా అంతుచిక్కని పరిస్థితి. వంద మంది వరకూ వేర్వేరు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నట్లు అంచనా వేస్తున్నారు. వారిలో చిన్నారులు, వృద్ధులు ఉండగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.ఉరుకులు పరుగులున్యూ రాజరాజేశ్వరిపేట నుంచి అతిసారతో బాధితులు ఆస్పత్రుల దారి పట్టారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి సైతం బాధితులు రాగా ప్రాథమిక వైద్యం అందించి పంపించేశారు. అదే సమయంలో పలువురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. బుధవారం ఉదయానికి పరిస్థితి తీవ్రమైంది. వాంతులు, విరేచనాలతో బాధపడే బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో వైద్య శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని బాధితులను గుర్తించే ప్రయత్నాలు చేపట్టారు. కొందరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, మరి కొందరికి సింగ్‌నగర్ యూపీహెచ్‌సీలో వైద్యం అందించారు. అయితే ఎంత మంది అతిసారకు గురయ్యారనే విషయం లెక్కతేలడం లేదు. మరో వైపు అతిసారకు తాగునీరు కారణమా అనే విషయం తేల్చేందుకు గురువారం వాటర్ ఎనలిస్ట్స్ ఆ ప్రాంతంలో పర్యటించి శాంపి ల్స్‌ను పరీక్షించనున్నారు.జీజీహెచ్‌లో 25 మందిఅతిసార బాధితులు ప్రస్తుతం 25 మంది జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. మరొక చిన్నారి పాత ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారికంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు ప్రకటించారు. మరో ముగ్గురు మంగళవారం రాత్రి చికిత్స కోసం రాగా వారి పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు నిర్ధారించి పంపించివేసినట్లు తెలిపారు. బాధితుల నుంచి రక్త, మల, మూత్ర నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ జి.లక్ష్మీశ పరామర్శించారు. బాధితులకు మెరుగైన, వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.28 మందిని నిర్ధారించాంఅతిసారకు గురైన వారు 28 మంది వేర్వేరు ప్రాంతాల్లో చికిత్స పొందినట్లు నిర్ధారించామని డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. మరో ఆరుగురు ఓపీలో పరీక్షలు చేసుకుని వెళ్లారని పేర్కొన్నారు. ఇప్పటికే 735 గృహాలను సర్వేచేశామని, గురువారం మరిన్ని గృహాలను సర్వే చేస్తా మని పేర్కొన్నారు. ఎక్కువ మంది సమీపంలోని ఆర్ఎంపీల వద్దకు వెళ్లారని, వారి వివరాలు తీసు కున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఎంత మంది వెళ్లారనే సమాచారం సర్వేలో రాలేదన్నారు. తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపామని, వాటి ఫలితాలు వచ్చేందుకు మూడు రోజుల సమయం పడుతుందన్నారు.బాధితులకు మల్లాది విష్ణు పరామర్శప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదని, పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లాది విష్ణు విమర్శించారు. న్యూఆర్ ఆర్పేటలో కలుషిత నీరు తాగి ప్రజలు చనిపో వడం, డయేరియా బారిన పడ్డారని తెలుసుకున్న ఆయన పార్టీ నాయకులతో కలిసి బుధవారం సాయంత్రం ఆ ప్రాంతంలో పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు పక్కనే ఉన్న తురకపాలెంలో నాలుగు నెలల వ్యవధిలో 40 మంది చనిపోయారని, ఇప్పుడు న్యూరాజరాజేశ్వరీపేటలో ఇద్దరు మృతిచెందగా, అనేక మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలయ్యా రని ఆందోళన వ్యక్తంచేశారు. కుళాయిల్లో వచ్చే నీటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఈ ప్రాంతానికి కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, ఉన్నతాధికారులను పంపి వ్యాధికి కారణాలను తెలుసుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్ ఇసరపు దేవి, వైఎస్సార్ సీపీ నాయకులు ఇసరపు రాజు, ఆదినారాయణ, పఠాన్ నజీర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
స్పెషల్ డ్రైవ్ చేపట్టండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా అప్రమత్తంగా ఉండా లని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా డెంగీ, మలేరియా, డయేరియా కేసులు నమోదైతే పరిసర ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటికి క్రమంతప్పకుండా పరీక్షలు నిర్వహించి, నివేదికల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. నిలిచిన నీటి నమూనాలకు కూడా బ్యాక్టీరియలాజికల్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌లు చేపట్టాలని, ఓవర్‌హెడ్ రిజర్వాయర్ల క్లీనింగ్, క్లోరినైజేషన్ సక్రమంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. డ్రెయిన్లలో డీ సిల్టేషన్‌కు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. డీపీఓ పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు. -
గ్రంథాలయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని రకాల గ్రంథాలయ పోస్టులను వెంటనే భర్తీ చేసి రెండు లక్షలమంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ అసోసియే షన్ కార్యదర్శి డాక్టర్ రావి శారద, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ – ఏపీ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద బుధవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల పరిధిలో సీఎల్ఐఎస్సీ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, నెట్, సెట్, పీహెచ్డీ కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగుల సంఖ్య రెండు లక్షలకు చేరిందని తెలిపారు. ఖాళీగా ఉన్న లైబ్రరీయన్ పోస్టుల భర్తీకి తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గతంలో ఏపీపీఎస్సీ దగ్గర నిలిచిపోయిన జూనియర్, డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కార్యదర్శి లక్ష్మయ్య, ఏపీ లెబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ కె.జగదీశ్, డీవైఎఫ్ఐ నాయకులు పి.కృష్ణ, పిచ్చయ్య, కృష్ణ కాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మెదడులో మాంసం తినే పరాన్నజీవి
లబ్బీపేట(విజయవాడతూర్పు): రోగి మెదడులో మాంసం తింటున్న అరుదైన పరాన్నజీవిని విజయవాడ జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్యులు శస్త్ర చికిత్సతో తొలగించారు. అనంతరం దానిని నిర్ధారించేందుకు విశాఖపట్నం, గుంటూరు, కోల్‌కత్తాలోని జీవశాస్త్ర నిపుణులకు పంపించారు. మాంసం తినే స్క్రూవార్మ్ పరాన్నజీవిగా వారు నిర్ధారించినట్లు జీజీహెచ్ న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఐ.బాబ్జి శ్యామ్‌కుమార్ తెలిపారు. ఈ పరాన్నజీవిని తొలిసారిగా అమెరికాలో ఈ ఏడాది ఆగస్టు నాలుగో తేదీన గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. కేసు వివరాలు ఇలా... తీవ్రమైన తలనొప్పితో అపస్మారక స్థితిలో ఉన్న 50 ఏళ్ల మహిళను కుటుంబ సభ్యులు విజయవాడ జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఆస్పత్రి వైద్యులు ఆమెను పరీక్షించి, తలనుంచి చీము కారుతోందని గుర్తించారు. స్కాన్ చేసి ఆమె మెదడులో చీము గడ్డ ఉన్నట్టు నిర్ధారించారు. మానని లోతైన గాయంలో కదులుతున్న క్రిములను మాగ్గోట్‌లుగా గుర్తించారు. ఆ మహిళకు శస్త్ర చికిత్స చేసేందుకు నిర్ణయించి తొలుత తలలోని పుండు నుంచి మాగ్గోట్లను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం తలపై గాయాన్ని తొలగించి శుభ్రపరచడంతో పాటు, శస్త్ర చికిత్స చేసి మెదడులోని చీము గడ్డను తొలగించారు. అనంతరం ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఎ.ఆర్.సి.హెచ్.మోహన్ సారథ్యంలో ఫ్లాప్ సర్జరీ చేసి తలపై ఉన్న గాయాన్ని కప్పేశారు. ప్రస్తుతం రోగి కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. నిర్ధారణ ఇలా... మెదడు నుంచి తొలగించిన మాగ్గోట్లను, క్రిమి గురించి ఆంధ్రా యూనివర్సిటీ జీవశాస్త్ర నిపుణులు డాక్టర్ జ్ఞాణమణి, గుంటూరు లామ్ నిపుణులు రత్నంను సంప్రదించగా వారు స్క్రూ వార్మ్లుగా గుర్తించారు. అనంతరం కోల్‌కత్తాలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారిని కూడా సంప్రదించి స్క్రూవార్మ్లుగా నిర్ధారణ చేశారు. సాధారణంగా ఈగల నుంచి జనించే మాగ్గోట్లు జంతువులు, మనుషుల శరీరంలో చెడిపోయిన, కుళ్లిన నిర్జీవ కణజాలాలపై మాత్రమే ఆధారపడి జీవిస్తాయి. కానీ స్క్రూవార్మ్ సజీవ కణజాతాలను సైతం తినే పరాన్నజీవులుగా జీవిస్తాయని వైద్యులు తెలిపారు. అరుదైన సర్జరీచేసిన న్యూరోసర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు అభినందించారు. రోగి మెదడులో నుంచి తీసిన అరుదైన పరాన్నజీవి స్క్రూవార్మ్ -
కదనభేరి!
కర్షకుడి పక్షాన వైఎస్సార్ సీపీ పోరు బాటనందిగామ టౌన్: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో మంగళవారం నిర్వహించిన అన్నదాత పోరు విజయవంతం అయ్యింది. నందిగామలోని పార్టీ కార్యాలయం నుంచి సీఎం రోడ్డు, మునిసిపల్ కార్యాలయం గాంధీ సెంటర్ మీదుగా వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ డాక్టర్ మొండి తోక అరుణకుమార్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, నల్లగట్ల స్వామిదాసు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ శైలజారెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ నల్లగట్ల సుధారాణి, జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావుతో కలిసి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఆర్డీవో కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవటంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నందిగామ ఏసీపీ తిలక్ అక్కడకు చేరుకుని ముఖ్య నాయకులను మాత్రమే అనుమతిస్తామని రైతులు, నాయకులు, కార్యకర్తలను అనుమతించేది లేదని, సహకరించాలని సూచించారు. దీంతో ప్రధాన నాయకులు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆర్డీవో బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. జిల్లా లోని రైతులు పడుతున్న యూరియా సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. వివరాలిస్తామన్నా స్పందించటం లేదు.. యూరియా ఎక్కడెక్కడ బ్లాక్ మార్కెట్లో ఉంది.. ఎక్కడ అమ్ముతున్నారు.. రైతులు ఎలా నష్టపోతున్నారు అనే వివరాలను ఇస్తామన్నా అధికారులు స్పందించలేని దుస్థితిలో ఉన్నారని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ దుయ్యబట్టారు. ఆర్డీవోను కలిసి అన్ని వివరాలు అందించామని యూరియా డిమాండ్ ఎంత ఉంది? ఎంత సరఫరా చేస్తున్నారని అడిగినా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. బఫర్ స్టాకు లేదు.. వచ్చే పంటకు మళ్లీ తీసుకువస్తాం అంటూనే.. మళ్లీ కొరత లేదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అంతా మధ్యవర్తుల పాత్ర ఉందని అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రాయితీపై వచ్చే యూరియా మధ్యవర్తులకే వెళ్తోందన్నారు. రైతులు సొమ్మసిల్లే పరిస్థితులు.. యూరియా, ఎరువుల కోసం రైతులు సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితులను కూటమి ప్రభుత్వం సృష్టిస్తోందని వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. రూ. 270కు విక్రయించాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్లో రూ.350 నుంచి రూ.400 వరకు విక్రయిస్తూ రూ. 300కోట్లకు పైగా కూటమి ప్రభుత్వం లూటీ చేసిందన్నారు. కళ్లుండీ చూడలేని గుడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో కళ్లుండి చూడలేని.. చెవులుండి వినలేని అసమర్థ కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని పార్టీ తిరువూరు ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు మండిపడ్డారు. రైతులు యూరియా కొరతతో పాటు అన్ని రకాలుగా అవస్థలు పడుతున్నారన్నారు. అన్నపూర్ణగా పేరున్న ఆంధ్రప్రదేశ్‌లో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారంటే కూటమి ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఇంటూరి రాజగోపాల్ (చిన్నా), అవుతు శ్రీనివాసరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిరుమామిళ్ల శ్రీనివాసరావు, నంబూరి రవి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, జెడ్పీటీసీ సభ్యులు గాదెల వెంకటేశ్వరరావు, వేల్పుల ప్రశాంతి, ముక్కపాటి నరసింహారావు, కంచికచర్ల ఎంపీపీ మలక్ బషీర్, మండల కన్వీనర్లు మహ్మద్ మస్తాన్, మంచాల చంద్రశేఖర్, వేమా సురేష్‌బాబు, బండి మల్లికార్జునరావు, కందుల నాగేశ్వరరావు, ఆవుల రమేష్‌బాబు, కోటేరు ముత్తారెడ్డి, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మార్కపూడి గాంధీ పాల్గొన్నారు. కాగా కృష్ణాజిల్లా పరిధి ఉయ్యూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద పామర్రు, పెనమలూరు నియోజకవర్గాలు, గుడివాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొన్నారు. గడిచిన ఏడాదిన్నరగా రాష్ట్రంలో గూండా రాజ్యం సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. యూరియా గురించి మాట్లాడితే బొక్కలో వేయండంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం బాధాకరమన్నారు. శాంతియుతంగా రైతులతో కలిసి నిరసన ర్యాలీ చేస్తున్నా.. పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల నుంచి రైతులు, నాయకులు వస్తున్నా రాకుండా అడ్డుకున్నారని ఆటోలు, ద్విచక్ర వాహనాలు, బస్సులను సైతం తనిఖీ చేసి నిర్ధాక్షిణ్యంగా దించి వెనక్కు పంపారని మండిపడ్డారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు ఉప్పెనలా తరలి వచ్చారని తెలిపారు. -
రోగులకు మెరుగైన వైద్య సహాయం అందాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా మెరుగైన వైద్య సహాయం అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం వైద్యాధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి శుక్రవారం జిల్లాలోని అన్ని చోట్ల ఉదయం 6 గంటలకే ఫ్రైడే డ్రైడే నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ అనుమానితుల నుంచి శ్యాంపిల్స్ తీసి రక్త పరీక్షలు నిర్వహించాలన్నారు. తాగునీటి శ్యాంపిల్స్ ఎప్పటి కప్పుడు పరీక్షించాలన్నారు. చర్యలు తప్పవు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జనన మరణ నివేదికలు, అదేవిధంగా ప్రసవాల నివేదిక ముఖ్యంగా నార్మల్, సిజేరియన్ నమోదు వివరాలు ప్రతిరోజు అందజేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని అత్యవసర మందుల నిల్వలు అందుబాటులో ఉండాలని, మందుల కొరత సమస్య ఉండరాదన్నారు. ఏఎన్ఎం నుంచి మెడికల్ ఆఫీసర్ వరకు అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తత అవసరమని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాచర్ల సుహాసిని, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జె. ఇందుమతి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ జె.సుమన్, డీఐఓ శరత్ కుమార్, డీసీహెచ్ఎస్ మాధవి దేవి పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల ఎగుమతితో అధిక లాభాలు
హనుమాన్‌జంక్షన్ రూరల్: నాణ్యమైన ఉద్యాన పంటల ఉత్పత్తుల ఎగుమతి ద్వారా రైతులు అధిక లాభాలను ఆర్జించొచ్చని ఏపీఈడీఏ రీజనల్ బిజిసెస్ డెవలప్మెంట్ మేనేజర్ బి.అశోక్‌కుమార్ సూచించారు. బాపులపాడు మండలం మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్‌లోని అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ), ఉద్యాన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తాజా పండ్లు, కూరగాయల ఎగుమతి అవకాశాలపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అధికంగా పండే మామిడి, కూర గాయలు, ఆకుకూరలను ఎగుమతి చేసే అవకాశాలను ఏపీఈడీఏ కల్పిస్తోందని అశోక్‌కుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా ఉద్యాన అధికారి జె. జ్యోతి మాట్లాడుతూ.. పంటల ఎగుమతి కోసం ఎఫ్ఈఓలు, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలు, రాయితీలను వివరించారు. మామిడి పరిశోధన కేంద్రం (నూజివీడు) సినీయర్ శాస్త్రవేత్త బి.కనకమహాలక్ష్మి మాట్లా డుతూ.. మామిడిలో తరుచుగా కనిపించే చీడ పీడల నివారణ చర్యలు, నాణ్యమైన దిగుబడికి పాటించాల్సిన సన్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ‘సూక్ష్మ గామా’ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ సీఈఓ వివేక్ మాట్లాడుతూ.. ఐక్యూఎఫ్ పద్ధతి ద్వారా తాజా కూరగాయలను ఫ్రోజెన్ కూరగాయలుగా మార్చి ఎగుమతి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బాపులపాడు, అవనిగడ్డ, ఉయ్యూరు, కంకిపాడు మండలాల ఉద్యాన శాఖ అధికారులు, ఉద్యాన రైతులు పాల్గొన్నారు. -
డ్రోన్లతో నానో యూరియా పిచికారీ
జి.కొండూరు: డ్రోన్లతో నానో యూరియా పిచికారీ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జి.కొండూరు మన గ్రోమోర్ సెంటర్లో యూరియా పంపిణీని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. యూరియా స్టాకు, పంపిణీ వంటి అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ శివారులో డ్రోన్‌తో నానో యూరియా పిచికారీని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 32 డ్రోన్లతో నానో యూరియా పిచికారీపై డెమో నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులు వ్యవసాయాధికారుల సూచనలతో అవసరం మేరకే యూరియాని వినియోగించాలన్నారు. కొరత లేకుండా ఉండేలా ఎరువుల పంపిణీపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రామకృష్ణనాయక్, ఏఓ సూరిబాబు, పలువురు రైతులు పాల్గొన్నారు. -
ఆర్జిత సేవ భాగ్యం దక్కేనా?
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): స్థానిక శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవల టికెట్ల కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. దసరా ఉత్సవాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్నాయి. మరో 12 రోజుల్లో ఉత్సవాలు ప్రారంభమవుతున్నా ఇంత వరకు సేవా టికెట్ల ఊసే లేకుండా పోయింది. దసరా ఉత్సవాల్లో ప్రత్యేక లక్ష కుంకుమార్చన, ప్రత్యేక శ్రీచక్ర నవార్చన, ప్రత్యేక చండీహోమం, ప్రత్యేక ఖడ్గమాలార్చన నిర్వహిస్తారు. గతంలో సేవా టికెట్లను దేవస్థాన కౌంటర్ల విక్రయించడంతోపాటు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచేవారు. అయితే ఈ ఏడాది ఆర్జిత సేవలపై మొదటి నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది రోజుల కిందటే ఆర్జిత సేవల టికెట్లను పరిమిత సంఖ్యలోనే విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. అన్ని సేవలకు కలిపి రోజుకు 300 చొప్పున 11 రోజులకు 3,300 టికెట్లు విక్రయించేలా దేవస్థానం చర్యలు తీసుకుంది. దీంతో ఆర్జిత సేవా టికెట్లు తమ వరకు వస్తాయో రావోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక లక్ష కుంకుమార్చన, ప్రత్యేక చండీహోమానికి అధిక డిమాండ్ ఉంటుంది. ఈ ఆర్జిత సేవలకు షిఫ్టునకు 75 టికెట్లు చొప్పున విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. దీంతో ప్రముఖులు, వీఐపీలు, సిఫార్సు ఉన్న వారికే ఈ సేవ టికెట్లు దక్కుతాయనే భావనను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు దేవస్థాన టోల్‌ఫ్రీ నంబర్‌కు రోజూ వస్తున్న ఫోన్ కాల్స్‌లో అత్యధికంగా సేవా టికెట్ల విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే అంశంపైనే కావడం గమనార్హం. రెండు విడతలుగా ఆర్జిత సేవలు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆర్జిత సేవా టికెట్ల రుసుమును దేవస్థాన అధికారులు ఖరారు చేశారు. ఉత్సవాల్లో ప్రత్యేక ఖడ్గమాలార్చనకు రూ.5,116, ప్రత్యేక కుంకుమార్చనకు రూ.3 వేలు, మూలా నక్షత్రం రోజు రూ.5 వేలుగా నిర్ణయించారు. ప్రత్యేక శ్రీచక్ర నవార్చనకు రూ.3 వేలు, ప్రత్యేక చండీహోమానికి రూ.4 వేలుగా టికెట్ల ధరలు ఖరారు చేశారు. ఉత్సవాల్లో నిర్వహించే ప్రత్యేక ఖడ్గమాలార్చన తెల్లవారుజాము ఐదు నుంచి ఆరు గంటల వరకు, ప్రత్యేక కుంకుమార్చన మహామండపం ఆరో అంతస్తులో మొదటి విడత ఉదయం ఏడు నుంచి 9 గంటల వరకు, రెండో విడత ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక ప్రత్యేక శ్రీచక్రనవార్చన ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చండీహోమం యాగశాల నిర్వహిస్తారు. ఉత్సవాలు ప్రారంభమయ్యే తొలి రోజు ప్రత్యేక కుంకుమార్చన ఉదయం పది నుంచి 12 గంటల వరకు ఒక విడత మాత్రమే నిర్వహిస్తారు. ఇక ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో పొందే అవకాశం ఉందన్నారు. పరోక్ష సేవకు రూ.1,500 ఉత్సవాల్లో నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమాలను పరోక్షంగా జరిపించుకునే అవకాశాన్ని దేవస్థానం భక్తులకు కల్పిస్తోంది. ఒక రోజు పరోక్ష సేవ టికెట్ ధరను రూ.1,500గా, 11 రోజుల పాటు సేవకు రూ.11,116గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. పరోక్ష సేవలో పాల్గొన్న ఉభయదాతలు, భక్తులకు ఉత్సవాల అనంతరం అమ్మవారి ప్రసాదాలను పోస్టల్ ద్వారా భక్తులు తెలిపిన చిరునామాకు పంపిస్తామని ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని రౌండ్‌టేబుల్ సమావే శంలో వక్తలు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించా లని డిమాండ్ చేశారు. రాఘవయ్య పార్కు సమీపం లోని బాలోత్సవ భవన్లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మో హన్‌రావు అధ్యక్షతన మంగళవారం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరమైతే విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయితే 300 బెడ్ల సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నడపాలని కేంద్ర వైద్య శాఖ చేసిన విధానం వల్ల ఎంతో మంది పేదలకు మేలు జరుగుతుందన్నారు. ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్లోకి మారితే ఈ ఫలాలు పేదలకు అందవన్నారు. ప్రైవేటుపరం చేయాలనుకున్న పది మెడికల్ కాలేజీలు ఉన్న పది జిల్లాలు అత్యంత వెనుకబడిన ప్రాంతాలని పేర్కొన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాయిదా తీర్మానం ప్రవేశపెడతానన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. పీపీపీ విధానంతో ఆ ప్రాంతాల అభివృద్ధి కుంటుపడడమే కాకుండా పేద ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. విద్యార్థి సంఘాలన్నీ ఐక్య కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలని సూచించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయకూడదని, ప్రభుత్వంలోనే నడవా లని, అందుకు ఐక్యంగా ఉద్యమిస్తామని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జన చైతన్య వేదిక నాయకుడు లక్ష్మణరెడ్డి, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, వైఎస్సార్ ఎస్‌యూ రాష్ట్ర నాయకుడు చైతన్యబాబు, టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకుడు ఎం.వి. ఆంజనేయులు, పీటీఎల్పీ నాయకుడు ఎం.సూర్యా రావు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు -
15 నాటికి అన్ని పనులు పూర్తి కావాలి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలకు సంబంధించి చేపట్టిన అన్ని పనులు ఈనెల 15వ తేదీ నాటికి పూర్తి కావాలని, మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపట్టిన పనులు వేగవంతం కావాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో చేపట్టిన దసరా ఉత్సవాల ఏర్పాట్లను సోమవారం ఆయన ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత కనకదుర్గనగర్ నుంచి మహామండపం వరకు నిర్మించిన బీటీరోడ్డును పరిశీలించారు. క్యూకాంప్లెక్స్‌ను పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. మహా మండపం పక్కనే నిర్మాణంలో ఉన్న లడ్డూ పోటును పరిశీలించి భవన డ్రైనేజీ వ్యవస్థ గురించి ఆరా తీశారు. డ్రైనేజీ నిర్మాణంలో ఎటువంటి అలసత్వం వద్దని, భవష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రాజగోపురం ఎదుట నిర్మాణంలో ఉన్న అన్నదాన భవనాన్ని పరిశీలించారు. కొండపై నూతనంగా నిర్మించిన పూజా మండపాన్ని, యాగశాలను పరిశీలించి మిగిలిన పనులు ఉత్సవాలకు వారం రోజుల ముందుగానే పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్, దేవదాయ శాఖ ఇంజినీర్ శేఖర్, ఈఈ కోటేశ్వరరావు, రాంబాబు, ఇతర ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. -
రూ.1350 కోట్ల టర్నోవర్ లక్ష్యం
కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని చిట్టినగర్(విజయవాడపశ్చిమ): రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.1350 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ తన కార్యకలాపాలను సాగిస్తుందని చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ బోర్డు డైరెక్టర్ల సమావేశం సోమవారం బోర్డు మీటింగ్ హాల్లో నిర్వహించారు. చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. అనంతరం చలసాని మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన హనుమాన్ జంక్షన్లో యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని తీర్మానించినట్లు చెప్పారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1210 కోట్లు టర్నోవర్ సాధించామని, 29 కోట్ల నికర లాభాన్ని ఆర్జించామన్నారు. కృష్ణామిల్క్ యూనియన్‌లో రూ.230 కోట్లు రిజర్వ్ నిధులు ఉన్నాయన్నారు. బుడమేరు ముంపు యూనియన్ను తీవ్రంగా నష్టపరిచినా పాడి రైతులకు రూ.46 కోట్లు బోనస్‌గా చెల్లించామని, అదే సమయంలో రూ.16 కోట్ల సంక్షేమ పథకాలను కూడా అమలు చేశామన్నారు. గడిచిన ఆరేళ్లలో పాల దిగుబడిని పెంచేలా యూనియన్ నాణ్యమైన పశుదాణాను సబ్సిడీపై అందిస్తోందన్నారు. విజయ పార్లర్ ద్వారా డ్వాక్రా సంఘాలు నాణ్యమైన ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సమావేశంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, డైరెక్టర్లు చలసాని చక్రపాణి, నెలకుదిటి నాగేశ్వరరావు, వేమూరి వెంకట సాయిలతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
జిల్లాలో యూరియా కొరత లేదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని, రైతుల అవసరాలకు తగ్గట్లు ఎరువులు సరఫరా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సమీపంలోని సొసైటీలో అందుబాటులో ఉన్న ఎరువులు, వచ్చే వారం రోజుల్లో కొత్తగా వచ్చే ఎరువులు, పంట దశను బట్టి ఎరువుల మోతాదు తదితర అంశాలతో పాటు నానో యూరియా ప్రయోజనాలను కూడా ఇంటింటికీ వెళ్లి అధికారులు, సిబ్బంది వివరించినట్లు తెలిపారు. గతేడాది ఖరీఫ్‌తో పోల్చితే ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం పెరిగిందని, దీనికి తగ్గట్లు యూరియాకు కూడా డిమాండ్ పెరిగిందని, ఇటీవల వర్షాలు కూడా బాగా పడటం వల్ల ఒక్కసారిగా డిమాండ్ అధికమైందని వివరించారు. ఎక్కువ మంది ఒకేసారి వచ్చిన సందర్భంలో రైతులు లైన్లలో ఉండి క్రమశిక్షణతో యూరియా తీసుకుంటున్నారని, అయితే ఆ ఫొటోల ఆధారంగా యూరియా లేదంటూ కొందరు వదంతులు సృష్టిస్తున్నారని, ఇది సరికాదన్నారు. ఎరువులకు సంబంధించి వాస్తవ సమాచారం కోసం రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే), పీఏసీఎస్‌లను సంప్రదించాలని, లేదంటే కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454) నంబరులో సంప్రదించాలన్నారు. ఒకవేళ ఎరువులు మార్గమధ్యంలో ఉంటే టోకెన్లు ఇచ్చి ఎరువులు చేరుకోగానే అందిస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రకృతి సేద్యం ఉత్పత్తులు, సేంద్రియ ఎరువుల స్టాళ్లను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. రైతులతో ముచ్చటించి సాగు విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే ప్రకృతి సేద్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ జి.లక్ష్మీశ -
ఏడాదైనా ఎత్తిపోతలపై వీడని నిర్లక్ష్యం
జి.కొండూరు: గత ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలకు పులివాగుపై ఉన్న చెర్వుమాధవరం ఎత్తిపోతల పథకం పూర్తిగా ధ్వంసమైంది. ఎత్తిపోతల పథకం కోసం నిర్మించిన షెడ్డు కూలిపోయి శిథిలాల కిందనే మోటార్లు ఉన్నాయి. ఏడాది గడిచినా ఈ ఎత్తిపోతల పథకాన్ని మరమ్మతులు చేసేందుకు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. కనీసం ఈ ఎత్తిపోతల పథకంలో ఉన్న విలువైన మోటార్లు, స్టార్టర్ బోర్డులు, పైపులను అక్కడి నుంచి తొలగించి భద్రపరచలేదు. రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఎత్తిపోతల పథకాన్ని చూస్తే అర్ధమైపోతుంది. నిర్మాణం ఇలా... వర్షాకాలంలో పులివాగులో ప్రవహించే వరద ప్రవాహం బుడమేరులో కలిసి వృథాగా పోతుంది. ఈ క్రమంలో ఎటువంటి నీటి వనరులేని చెర్వుమాధవరం గ్రంథివాని చెరువుకు నీటిని సరఫరా చేసేందుకు గడ్డమణుగు గ్రామ శివారులో పులివాగుపై ఈ ఎత్తిపోతల పథకాన్ని రూ.1.30 కోట్లతో 2014–19 మధ్య కాలంలో నిర్మించారు. ఈ పథకం నిర్మించిన ప్రదేశంలో చెక్ డ్యామ్ కూడా ఉండడంతో వర్షపు నీరు నిల్వ ఉండి ఎత్తి పోసేందుకు వీలుంటుందని భావించి నిర్మించారు. అయితే వర్షాలు వచ్చినప్పుడు మినహా మిగతా సమయంలో నీటి సదుపాయం ఉండని పులివాగు మీద ఈ ఎత్తిపోతల పథకం నిర్మించడంపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ ఎత్తిపోతల పథకం చెరువును నింపకపోయినప్పటికీ పులివాగులో నీరున్న సమయంలో నీళ్లను చెరువులోకి సరఫరా చేయడం ద్వారా ఆయకట్టు భూముల్లోని బోర్లలో నీటి మట్టం పెరిగి రైతులకు ప్రయోజనం కలిగేది. ఏడాదిగా నిర్లక్ష్యం ఈ ఎత్తిపోతల పథకం గత ఏడాది ఆగస్టులో పులివాగుకు వచ్చిన వరద ప్రవాహానికి పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ తర్వాత అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో నేటికీ అలాగే దర్శనమిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.1.30 కోట్ల ప్రజా ధనం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి శిథిలాలను తొలగించి, మోటార్లను మరమ్మతులు చేసి, ఎత్తిపోతల పథకాన్ని పునఃనిర్మిస్తే రైతులకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం వర్షాలు పడుతున్న క్రమంలో ఎత్తిపోతల పథకం వద్ద వర్షం నీరు నిల్వ ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇలా చేస్తే ప్రయోజనం చెర్వుమాధవరం పక్కనే ఉన్న గడ్డమణుగు గ్రామ శివారు వరకు ఉన్న తారకరామా ఎత్తిపోతల పథకంలోని నాల్గవ పంపు హౌస్ నుంచి నీటిని పులివాగులోకి తరలించాలి. పులివాగు వద్ద ధ్వంసమైన ఎత్తిపోతల పథకాన్ని వాడుకలోకి తీసుకొస్తే గ్రంథివాని చెరువుకు పుష్కలంగా నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుంది. దీనితో పాటు ఈ చెరువు కింద ఉన్న కాల్వలు సైతం ఇప్పటికే ఆక్రమణలకు గురైన నేపథ్యంలో కాల్వలను ఏర్పాటు చేస్తే రైతులకు సాగునీటి సమస్య తీరిపోతుంది. ఈ చెరువుకు నీటి వసతి కల్పించి రిజర్వాయర్‌గా మార్చగలిగితే చెరువుకింద ఆయకట్టుగా ఉన్న 160 ఎకరాలకు సాగునీరు సమృద్ధిగా అందుతుంది. అంతే కాకుండా సమీప గ్రామాలైన సున్నంపాడు, మునగపాడు, గడ్డమణుగు, జి.కొండూరు గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు పెరిగి బెట్ట సమయంలో బోర్లలో నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. -
రోడ్డు ప్రమాదంలో విజయవాడ వాసి మృతి
శావల్యాపురం (పల్నాడు జిల్లా): రోడ్డు ప్రమాదంలో విజయవాడ వాసి మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. శావల్యాపురం ఎస్ఐ లేళ్ళ లోకేశ్వరరావు కథనం ప్రకారం... విజయవాడ చిట్టినగర్‌కు చెందిన తమ్మిన ప్రసాదు, కొలుసు అశోక్ స్కూటీపై శ్రీశైలంలో స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం గంటావారిపాలెం స్పీడు బ్రేకరు వద్ద అదుపు తప్పి పడిపోయింది. వాహనం నడుపుతున్న ప్రసాదు (33) రోడ్డుపై పడిపోవడం.. ఈ క్రమంలో పక్కనే టిప్పర్ రావడంతో ఘటనా స్థలంలో మృతి చెందాడు. స్కూటీపై వస్తున్న మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా వైద్యశాలకు తరలించారు. ఇద్దరూ స్నేహితులు. కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
దుర్గగుడిలో ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చంద్రగ్రహణం అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని ఆలయ అర్చకులు శుద్ధిచేశారు. సోమవారం తెల్లవారుజాము మూడు గంటలకు పవిత్ర కృష్ణానది నుంచి జలాలను తీసుకొచ్చి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయం, ఉప ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలను శాస్త్రో క్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు ఈఓ శీనానాయక్, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం సర్వ దర్శనం, రూ.100, రూ.300, రూ.500 టికెట్ల క్యూలైన్ లలో వేచి ఉన్న భక్తులను కనక దుర్గమ్మ అమ్మవారి దర్శనానికి అనుమతించారు. గ్రహణం నేపథ్యంలో తెల్లవారుజామున జరగాల్సిన సుప్రభాత, వస్త్రాలంకరణ, ఖడ్గమాలార్చన, గణపతి హోమం వంటి ఆర్జిత సేవలను రద్దు చేశారు.తిరుపతమ్మ ఆలయంలో..పెనుగంచిప్రోలు: చంద్ర గ్రహణం అనంతరం పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారి ఆలయం సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు తెరుచుకుంది. గ్రహణం సందర్భంగా 15 గంటల పాటు ఆలయాన్ని కవాట బంధనం చేశారు. గ్రహణం విడిచిన అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసి అర్చకులు సంప్రోక్షణ చేసిన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిచ్చారు.పీహెచ్సీలో తనిఖీలు పెనమలూరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటున్నారా లేదా అని ప్రశ్నించారు. వైద్యులు అందిస్తున్న వైద్య సేవల వివరాలు కలెక్టర్ పరిశీలించారు. ఆస్పత్రిలో అన్ని రకాల మందులు ఉన్నాయి అని ఆరా తీశారు. అనంతరం రిజిస్టర్లను తనిఖీ చేశారు. జ్వరాలు ఉన్నందున ఫీల్డ్ లెవ ల్లో స్టాఫ్ సర్వే చేస్తున్నారా అని అడిగారు. ఆస్పత్రిలో డెలివరీ కేసుల వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయాలని సూచించారు. ఆర్డీవో హేలాషారోన్, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీ డీవో డాక్టర్ బండి ప్రణవి, మండల వైద్యాధికారి సాయిలలిత, సిబ్బంది పాల్గొన్నారు.ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు : కలెక్టర్గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎరువులు అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. కలెక్టరేట్లో ఎరువుల డీలర్లతో సోమవారం ఆయన సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు ఎరువుల విక్రయాలు సాగాలని స్పష్టం చేశారు. ఎరువుల విక్రయాలు, నిల్వల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు తెలపాలని డీలర్లకు సూచించారు. జిల్లాలో ఎరువుల పంపిణీ వ్యవస్థను కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈ కేంద్రానికి రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎరువుల దుకాణాలకు వచ్చే రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక, వివిధ కంపెనీల డీలర్లు పాల్గొన్నారు. -
బార్లు బార్లా.. వైద్యం బోర్లా
జి.కొండూరు : కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యానికి పచ్చజెండా ఊపి, పేదలకు అవసరమైన వైద్యాన్ని నిర్వీర్యం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామగ్రామానా మద్యం షాపులు, వాటికి అనుబంధంగా బెల్టు షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది. బార్లు పనివేళలను సైతం పెంచిన ప్రభుత్వం అర్ధరాత్రి వరకూ మద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాల్సిన ఆయుర్వేద, హోమియో వైద్యశాలల్లో సిబ్బంది లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం ఈ ఆస్పత్రులపై నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామీణ ప్రజలు ఆరోపిస్తున్నారు.మూతబడిన రెండు వైద్యశాలలువైద్యాధికారులు లేక ఎన్టీఆర్ జిల్లాలో ఒక హోమియో వైద్యశాల, ఒక యునాని ఆస్పత్రి మూతబడ్డాయి. మైలవరం మండలం పుల్లూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలలో నాలుగు నెలల పైబడి వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇక్కడ పని చేస్తున్న డాక్టర్ బదిలీపై వెళ్లగా మరో డాక్టరును ప్రభుత్వం నియమించలేదు. సిబ్బంది కూడా లేకపోవడంతో ఆస్పత్రి మూతబడింది. ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆస్పత్రిని వెంటనే తెరిచి వైద్య సేవలు కొనసాగించాలని సీపీఎం నాయకులు స్థానికులతో కలిసి సోమవారం ధర్నా చేశారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో నిర్వహిస్తున్న యునాని ఆస్పత్రిలో వైద్యాధికారి లేక కొన్నేళ్లుగా వైద్య సేవలు నిలిచిపోయాయి.సిబ్బందిలేక వెలవెలనందిగామ, గంపలగూడెం, మైలవరం మండలాల పరిధిలో మూడు హోమియో వైద్యశాలలు ఉన్నాయి. విజయవాడ రూరల్ మండలంలోని గూడవల్లి, జగ్గయ్యపేట మండలంలో వేదాద్రి, పెనుగంచిప్రోలు మండలంలో అనింగండ్లపాడు, కొణకంచి, నందిగామ మండలలో నందిగామ, పెద్దవరం, వీరులపాడు మండలంలో అల్లూరు, కంచికచర్ల మండలంలో పరిటాల, ఇబ్రహీంపట్నం మండలంలో కొండపల్లి, జి.కొండూరు మండలంలో వెల్లటూరులో పది ఆయుర్వేద వైద్య శాలలు ఉన్నాయి. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద కంచి కచర్ల మండలం పెండ్యాలలో యునాని ఆస్పత్రి, కంచికచర్లలో యోగా నేచరోపతి ఆస్పత్రి, మైలవరంలో ఆయుర్వేద ఆస్పత్రి ఉన్నాయి. ఈ పదహారు ఆస్పత్రుల్లో ఒక్కొక్క ఆస్పత్రిలో వైద్యాధికారితో పాటు ముగ్గురు సహాయక సిబ్బంది ఉండాలి. గూడవల్లి, పెద్దవరం, నందిగామ, కొండపల్లి ఆస్పత్రుల్లో మాత్రమే వైద్యాధికారితో పాటు ఒక్కొక్కరు చొప్పున సిబ్బంది ఉన్నారు. మిగిలిన 12 వైద్య శాలల్లో సిబ్బందే లేరు. ఆయుష్ శాఖ కింద నడుస్తున్న విజయవాడలోని డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద వైద్యశాల, డాక్టర్ నోరి రామశాస్త్రి ఆయుర్వేద వైద్య కళాశాలలో కూడా సరిపడా సిబ్బంది లేక ఇక్కట్లు తప్పడం లేదు.డాక్టర్‌ను నియమించాలిఏడేళ్లుగా దగ్గు, జలుబు, నొప్పులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో మందులు వాడుతున్నాను. డాక్టరు లేక కొన్ని నెలలుగా పుల్లూరులో హోమియో ఆస్పత్రి మూతపడింది. ఇంగ్లిషు మందులు వాడలేక ఇబ్బంది పడుతున్నా. నాతో పాటు చాలా మంది ఆస్పత్రికి వచ్చి వెనక్కి పోతున్నారు. అధికారులు స్పందించి డాక్టర్‌ను నియమించాలి.– వజ్రాల ధనలక్ష్మి, మంగాపురం, మైలవరం మండలంఇంగ్లిషు మందులతో ఇబ్బందినేను గత 15 సంవత్సరాలుగా హోమియో మందులను వాడుతున్నాను. పుల్లూరు గ్రామంలో ఉన్న హోమియో ఆస్పత్రిని మూసేయడంతో నరకయాతన అనుభవిస్తున్నాం. ఇంగ్లిష్ మందులను వాడాలంటే ఇబ్బందిగా ఉంది. హోమియో మందులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు స్పందించి డాక్టరును కేటాయించి ఆస్పత్రిని తెరవాలి.– చిలుకూరి సుబ్బారెడ్డి, చిలుకూరివారిగూడెం, మైలవరం మండలంనిర్లక్ష్యం తగదుఆయుర్వేద, హోమియో వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి. ప్రభుత్వ పర్యవేక్షణ లేక ఆస్పత్రులు వెలవెలబోతున్నాయి. పుల్లూరు హోమియో వైద్యశాలకు ఆరు నెలలుగా తాళం తీయడం లేదు. హోమియో వైద్యానికి ఆలవాటు పడిన వారు ఇంగ్లిషు మందులు వాడలేక నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే వైద్యులను, సిబ్బందిని కేటాయించాలి.– చాట్ల సుధాకర్, సీపీఎం మండల కార్యదర్శి, మైలవరం -
ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం
రైతులకు యూరియా కూడా అందించలేని అసమర్థ పాలనను ఇప్పుడే చూస్తున్నాం. యూరియా కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్ దందాతో కూటమి నేతలు రూ.కోట్లు దండుకొంటున్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి, రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాడుతుంది. రైతుల సమస్యల విషయంలో అన్నదాత పోరుతో ప్రభుత్వం కళ్లు తెరి పిద్దాం. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా అందజేయా లని డిమాండ్ చేస్తున్నాం. అన్నదాత పోరులో రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి. – దేవినేని అవినాష్, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు -
ఇమామ్, మౌజన్లకు ‘గౌరవం’ ఇవ్వండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా ఇమామ్‌లు, మౌజన్లకు పెండింగ్ గౌరవ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖాదర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. గౌరవ వేతనాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మైనార్టీ విభాగం ఆధ్యర్యంలో మైనార్టీలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఖాదర్‌బాషా, హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. ఎనిమిది నెలలుగా గౌరవ వేతనాలు అందక ఇమామ్‌లు, మౌజన్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం నెలకు ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం నిరంతరాయంగా చెల్లిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి గౌరవ వేతనం చెల్లింపులు నిలిచిపోయాయన్నారు. గతేడాది ఎన్నికల సమయంలో ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల వేతన బకాయి ఉందన్నారు. అత్యంత పేదరికంలో ఉన్న ఇమామ్‌లు, మౌజన్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. మసీదు కమిటీలు కూడా చెల్లింపులు చేయలేని స్థితిలో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో వారికి క్రమం తప్పక గౌరవ వేతనాలు అందాయని గుర్తుచేశారు. బకాయిలు తక్షణమే ఇవ్వడంతోపాటు భవిష్యత్తులో ప్రతి నెలా గౌరవ వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మస్తాన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తోందన్నారు. అత్యంత పేదరికంలో ఉన్న ఇమామ్‌లు, మౌజన్ లకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను కలిసి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్, కార్పొరేటర్ ఎండీ ఇర్ఫాన్, రఫీ, మైనార్టీ నాయకులు, పలువురు ఇమామ్‌లు, మౌజన్లు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన -
కట్టకటపై ఆగ్రహ జ్వాల
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఖరీఫ్ పంటలు సాగుచేస్తున్న రైతులను యూరియా కొరత వేధిస్తోంది. అదనుకొచ్చిన పంటకు బలం ఇవ్వకుంటే దిగుబడులు దిగజారుతాయన్న ఆందోళన అన్నదాతలను వేధిస్తోంది. మార్కెట్లో యూరియా దొరకడంలేదు. వచ్చిన కొద్ది సరుకును కొన్ని ప్రాంతాల్లో కూటమి పెద్దలు పక్కదారిపట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్ బోర్డు’లు దర్శనం ఇస్తున్నాయి. రైతులు తిండీతిప్పలు మానుకుని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద బారులు తీరుతున్నారు. యూరియా కట్ట కోసం రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. అన్నదాత పోరు పేరుతో మంగళవారం ఆర్డీఓ కేంద్రాల వద్ద రైతులు, రైతుసంఘాల నాయకులతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేయనుంది. యూరియా కోసం రైతుల అవస్థలు పైర్లను రక్షించుకునేందుకు అవసరమైన ఎరువుల కోసం రైతులు పీఏసీఎస్‌ల వద్ద బారులు తీరులు తీరి కనిసిస్తున్నారు. రాత్రిళ్లు సైతం నిద్రమానుకుని మరీ ప్రాథమిక సహకార సంఘాల వద్దే కాపు కాస్తున్నారు. యూరియా తీవ్రంగా కొరత ఉండటంతో రైతులు అర్ధరాత్రి రోడ్డెక్కి యూరియా లారీలను అడ్డుకొని, అందులో ఉన్న సరుకును తమకు పంచా లని ఆందోళనకు దిగుతున్నారు. గంపలగూడెం మండలంలో రైతులు గంటల తరబడి క్యూలో నిలబడలేక లైన్లలో చెప్పులు పెట్టి సమీపంలోని చెట్ల కింద తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. ఆదివారం కొత్తమాజేరు గ్రామంలో రైతులు క్యూలో నిలబడలేక సొమ్మసిల్లిపోయారు. అయినా ‘కట్ట’ యూరియా దొరకడం కష్టంగా మారింది. ఇప్పుడు వరి పంటకు యూరియా వేయకపోతే పిలకలు రావని, దిగుబడులు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు. యూరియాను అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నా కూటమి పెద్దల తీరులో మార్పు రావడంలేదు. యూరియాను పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్తలు రైతులకు అండగా నిలిచారు. అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలిసి యూరియా కొరతపై అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. అయినప్పటికీ ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు లేదు. పంటలకు యూరియా, పురుగు మందులు ఎక్కువగా వినియోగించొద్దని, అవి వాడిన పంటలు తింటే క్యాన్సర్ వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
దేవాలయాల ద్వారాలు మూసివేత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని జిల్లాలోని దేవాలయాల తలుపులను ఆయా ఆలయాల అధికారులు, అర్చకులు ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు, ఇతర వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, ఈవో శీనానాయక్ సమక్షంలో ఆలయ తలుపులు మూసివేశారు. అమ్మవారి ప్రధాన నివేదన శాలతో పాటు అన్నదానం, లడ్డూ పోటులోని ఆహార పదార్థాలు, సరుకులపై దర్భలను ఉంచామని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయం, నటరాజ స్వామి వారి ఆలయం, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం, కామథేను అమ్మవారి ఆలయ ద్వారాలను మూసివేశారు. ఘాట్‌రోడ్డులోని ప్రధాన ద్వారాలను కూడా సెక్యూరిటీ సిబ్బంది మూసివేసి భక్తులెవరినీ కొండపైకి అనుమతించలేదు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఇంద్రకీలాద్రి పరిసరాలు గ్రహణం నేపథ్యంలో వెలవెలబోయాయి. సంప్రోక్షణతో.. గ్రహణ అనంతరం సోమవారంతెల్లవారుజామున నదీ తీరం నుంచి జలాలను తీసుకువచ్చి సంప్రోక్షణ అనంతరం అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. సుబ్బారాయుడి ఆలయంలో.. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేసేన సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం మద్యాహ్నం 12.30 గంటల నుంచి మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం 10 గంటలకు మహా సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించబడుతుందని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తిరుపతమ్మ ఆలయం.. పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారి ఆలయ తలుపులను ఆదివారం ఉదయం 11 గంటలకు కవాటుబంధనం చేసి మూసివేశారు. తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం ఎనిమిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం నేపథ్యంలో అర్చకుల చర్యలు -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా(పార్లమెంట్) జిల్లాకు చెందిన పలువురిని నియమించారు. విజయవాడ నగరానికి చెందిన అవుతు శ్రీనివాసరెడ్డికి నందిగామ, పెనమలూరు నియోజకవర్గాలను కేటాయిస్తూ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. అలాగే తిరువూరు, మైలవరం నియోజకవర్గాలను తంగిరాల రామిరెడ్డికి, విజయవాడ వెస్ట్, జగ్గయ్యపేట నియోజకవర్గాలను ఆళ్ల చెల్లారావుకు, విజయవాడ ఈస్ట్, సెంట్రల్ నియోజకవర్గాలను సర్నాల తిరుపతిరావుకు కేటాయించారు. అలాగే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకు షేక్ సలార్‌దాదా, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాలకు మాదు శివరామకృష్ణ, పెడన, పామర్రు నియోజకవర్గాలకు అన్నే వేణుగోపాలకృష్ణమూర్తి (చిట్టిబాబు)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన గిరిప్రదక్షిణలో పెద్ద ఎత్తున భక్తులు, అమ్మవారి సేవకులు పాల్గొన్నారు. ఆలయ ఘాట్‌రోడ్డు ప్రారంభంలోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. తొలుత ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఈవో శీనానాయక్ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించగా, మేళతాళాలు, మంగళవాయి ద్యాల నడుమ భక్తజనుల అమ్మవారి నామస్మరణ మధ్య ఊరేగింపు వైభవంగా ముందుకు సాగింది. ఘాట్‌రోడ్డు నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్ రావు నగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరింది. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకుడు ఆర్. శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షించారు. కోడూరు: ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండలంలోని ఎరువుల, పురుగు మందుల షాపుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయ అధికారులు శనివారం రాత్రి ఈ తనిఖీలు జరిపారు. ఓ దుకాణంలో భారీ మొత్తంలో అక్రమంగా నిల్వ చేసిన ఎరువులను అధికారులు గుర్తించారు. బిల్లు బుక్స్, స్టాక్ రిజిస్టర్, ఈ–పోస్ మిషన్లను పరిశీలించారు. రికార్డుల్లో ఉన్న స్టాక్‌కు దుకాణంలో ఉన్న ఎరువుల మధ్య వ్యత్యాసం ఉన్నట్లు నిర్ధారించారు. దుకాణంలో రూ.2లక్షల విలువైన 13 టన్నుల ఎరువులకు ఏ విధమైన పత్రాలు లేనట్లు గుర్తించి, వాటిని సీజ్ చేసినట్లు విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒమర్ తెలిపారు. కాగా కోడూరు మండలంలో విజిలెన్స్ అధికారులు నెల వ్యవధిలో మూడు సార్లు ఎరువులు దుకాణాలపై దాడులు జరపడం గమనార్హం. కోడూరు: హంసలదీవి సాగర తీరంలో పాలకాయతిప్ప మైరెన్ పోలీసులు ప్రత్యేక గస్తీ నిర్వహించారు. బీచ్ వద్ద సముద్రంలో గుంతలు ఏర్పడడంతో పర్యాటకులను అప్రమత్తం చేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ సుదూర ప్రాంతాలకు చెందిన యాత్రికులు తీరానికి తరలివచ్చారు. వీరంతా సముద్ర అలల మధ్య కేరింతలు కొడుతూ సందడి చేశారు. సముద్ర పరిస్థితులు భిన్నంగా ఉండడంతో మైరెన్ పోలీసులు లౌడ్‌స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తూ పర్యాటకులకు అవగాహన కల్పించారు. బీచ్ వద్ద నుంచి సాగరసంగమం వరకు గస్తీ చేపట్టారు. ఎస్ఐలు పూర్ణమాధురి, ఉజ్వల్‌కుమార్ పర్యవేక్షించారు. -
మొండి నొప్పులకు ఫిజియోతో చెక్
భవానీపురానికి చెందిన 48 ఏళ్ల మహిళ లంబర్ డిస్క్ ప్రాబ్లమ్స్‌తో, తీవ్రమైన నొప్పితో బాధపడుతుండేది. ఆమె నాలుగైదు ఆస్పత్రులకు వెళ్లగా సర్జరీ చేయాలన్నారు. ఆమెకు సర్జరీ చేయించుకోవడం ఇష్టంలేదు. తెలిసిన వారి ద్వారా ఫిజియోథెరపిస్టు వద్దకు వెళ్లారు. అక్కడ రెండు నెలల పాటు ఫిజియోథెరపీ చేయగా సాధారణ స్థితికి వచ్చింది. వీరిద్దరే కాదు అనేక మంది ఫిజియోథెరఫీతో ఉపశమనం పొందుతున్నారు. పుట్టుకతో వచ్చిన లోపాల నుంచి వృద్ధాప్యం వచ్చే కండరాల బలహీనత, పక్షవాతం వంటి వ్యాధులకు సమర్థంగా చికిత్సలు అందిస్తున్నారు. పటమటకు చెందిన 15 ఏళ్ల బాలిక గిలియన్ బ్యారీ సిండ్రోమ్(జీబీఎస్)కు గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందినా కండరాలు సాధారణ స్థితికి రాలేదు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఫిజియోథెరపిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ థెరపీలతో ఆమె సాధారణ స్థితికి వచ్చింది. -
ముస్లింలను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం
గుణదల(విజయవాడ తూర్పు): ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనాలను ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ముస్లింలను నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆరోపించారు. గుణదలలోని ఆయన కార్యాలయంలో ఆదివారం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అర్చకులకు, ఇమామ్‌లకు, పాస్టర్లకు గౌరవ వేతనాలను ఇచ్చేవారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ యేడాది కాలంలో ముస్లింలకు గౌరవ వేతనం ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఘోరంగా మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరచి ముస్లింలకు ఇవ్వవలసిన గౌరవ వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింల తరఫున పోరాడేందుకు వైఎస్సార్ సీపీ ఎప్పుడు ముందడుగేస్తుందని భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ తేదీన వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు గౌరవ వేతనాలను విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. -
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
కంచికచర్ల: వినాయక నిమజ్జన సందర్భంగా జరిగిన ఘర్షణలో ఒక వర్గం ఫిర్యాదే తీసుకుంటారా అని దళితులు పోలీసులను ప్రశ్నించారు. తమ వర్గం ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని వారిపై కేసు నమోదు చేయాలని వారు ఆదివారం రాత్రి కంచికచర్ల పీఎస్ ఎదుట ఆందోళన చేశారు. పరిటాల దళితవాడలో శనివారం నిమజ్జన ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల యువకులు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాల్లో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ఈ విషయంపై పోలీసులు ఒక వర్గం వారిపై కేసు నమోదు చేశారు. తమ వర్గంలో ఉన్నవారికి కూడా దెబ్బలు తగిలాయని వారిపై కూడా కేసు నమోదు చేయాలని పోలీస్‌స్టేషన్ వద్ద దళితులు ఆందోళన చేశారు. ఆందోళనకారుల వద్దకు సీఐ చవాన్‌దేవ్, ఎస్ఐ విశ్వనాఽథ్ వెళ్లి గ్రామంలో జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని రెండో వర్గంపై కూడా కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో దళితులు ఆందోళన విరమించారు. -
యువత క్రీడలు, ధ్యానంపై దృష్టి పెట్టాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): యువత క్రీడలు, ధ్యానం మీద దృష్టి పెట్టి ప్రకృతితో మమేకం అవ్వాలని ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఉప సంచాలకులు ఎస్వీ రమణ సూచించారు. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న క్రీడా ఉత్సవమైన గ్రామోత్సవంలో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారం కేఎల్ యూనివర్సిటీలో జరిగాయి. ఆమె మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ఈశా ఫౌండేషన్ చేస్తున్న కృషి హర్షణీయమని కొనియాడారు. గౌరవ అతిథి కేఎల్ విశ్వవిద్యాలయం క్రీడల సంచాలకుడు డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఈశా ఫౌండేషన్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. ప్రత్యేక అతిథి ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ పరిపాలన అధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో గ్రామీణ యువకులకు నూతన ప్రోత్సాహం అందుతుందన్నారు. జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన జట్లకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. వాలీబాల్ (పురుషులు) రూ. 5 లక్షలు, త్రోబాల్ (మహిళలు) రూ. 5 లక్షలు. మొత్తంగా కోటి రూపాయలకు పైగా నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఆటల పోటీల్లో ఉత్సాహాంగా పాల్గొన్న మహిళలు -
11న ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు
కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలో ఉన్న బాల్సోత్సవ్ భవన్లో ఈ నెల 11వ తేదీన ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పేర్కొన్నారు. ఆదివారం బాలోత్సవ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంపెడా కౌంటర్ గ్యారంటీ ఇచ్చి ఆక్వా ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు మొత్తం కొనుగోలు చేస్తామని భరోసా కల్పించాలని, అమెరికాతో చర్యలు జరపాలని, తక్కువ సుంకాలున్న అవసరమైన దేశాలకు ఎగుమతులు ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా ఆంక్షలు తిప్పి కొట్టాలని, అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ఆక్వా రైతులు ఇతర పంటల రైతుల సహకారంతో ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సంఘం ఉపాధ్యక్షుడు వై.కేశవరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు పాల్గొన్నారు. -
పోలీసుల దాడి హేయం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం.. చలో విజయవాడ కార్యక్రమంపై పోలీసులతో దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్ అన్నారు. నిర్బంధాలతో ఉద్యమాలను నిలువరించలేరన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. 14 నెలల కూటమి పాలనలో విద్యార్థుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని, ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. చలో విజయవాడకు పిలుపునిచ్చామని, విద్యాశాఖమంత్రికి విన్నవించుకునేందుకు వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి దాడి చేశారన్నారు. పోలీసుల దాడిలో కావ్య అనే విద్యార్థికి చెయ్యి విరిగిందని, ముగ్గురు విద్యార్థినులు స్పృహతప్పి పడిపోయా రని, ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్‌కు అర్థం అని ప్రశ్నించారు. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సమస్యలను చర్చించి పరిష్కరించడానికి ఎమ్మెల్యేలకు వినతులు ఇస్తామని, పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలో అనేక ర్యాలీలకు అనుమతులు ఇస్తున్నారని, విద్యార్థులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. పొలిటికల్ అజెండాలకు అతీతంగా విద్యారంగ సమస్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు చర్చించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నేతలు ఉష, మాధవ్, షణ్ముఖ్ జశ్వంత్ పాల్గొన్నారు. -
అరకొరగానే యూరియా
పెనమలూరు: మండల పరిధిలో ఆదివారం యూరియాను పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు. రైతులు యూరియా పూర్తి స్థాయిలో అందుతుందని ఎదురు చూడగా అధికారులు కేవలం అరకొర యూరియా మాత్రమే రైతులకు అందజేశారు. దీంతో రైతులు అధికారుల వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వణుకూరులో వాగ్వాదం.. రైతులు చాలా కాలంగా యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆదివారం వణుకూరు గ్రామానికి కేవలం 10 టన్నుల యూరియా పంపిణీ చేశారు. ఈ గ్రామంలో దాదాపు 1200 ఎకరాల ఆయకట్టు సాగు జరుగుతుండగా కేవలం 10టున్నుల యూరియా మాత్రమే రైతులకు ఇచ్చారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి వచ్చి యూరియా పంపిణీని పరిశీలించారు. యూరియా చాలినంత ఇవ్వక పోవటంపై రైతులు ఆమెను ప్రశ్నించారు. ప్రభుత్వం త్వరలో యూరియా సరఫరా చేస్తుందని ఆమె రైతులను నచ్చ చెప్పారు. రైతులు రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కట్టల కోసం పడిగాపులు కాశారు. రైతుకు గరిష్టంగా 3 బస్తాల యూరియా మాత్రమే ఇచ్చారు. రైతులకు తాగటానికి నీరు కూడా ఇవ్వలేదు. ● పెదపులిపాక సొసైటీలో కూడా 15 టన్నుల యూరియా అధికారులు పంపిణీ చేశారు. ఇక్కడ కూడా రైతులు యూరియా కోసం రాగా రైతులకు 3 బస్తాల యూరియా సీలింగ్ పెట్టడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల వ్యవసాయాధికారి కనకమేడల శైలజ, ఎంపీడీవో డాక్టర్ బండి ప్రణవి పాల్గొన్నారు. అవసరం మేరకు సరఫరా చేయండి చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని రైతులకు మొదటి ప్రాధాన్యతగా గుర్తించి అవసరం మేరకు ఎరువులను సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ అధికారులకు సూచించారు. ఆదివారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ డీకే బాలాజీ, జేసీ గీతాంజలిశర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహీర్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకు 12 వేల టన్నుల యూరియాను సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఎన్. పద్మావతి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, వ్యవసాయశాఖ ఏడీ మణిధర్, ఆర్డీవో స్వాతి, ఏవో శాంతి పాల్గొన్నారు. పామర్రు, గూడూరు మండలాల్లో పర్యటన.. గూడూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఆదివారం కృష్ణాజిల్లా పామర్రు మండలం జుఝ్జవరం, గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామాల్లో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలసి యూరియా పరిస్థితిపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఆయా గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో రైతులతో రాజశేఖర్ ముఖాముఖీ మాట్లాడారు. పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ -
అంతర్రాష్ట్ర నేరస్తుడి అరెస్ట్
జగ్గయ్యపేట అర్బన్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నేరస్తుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆదివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్ఐ జి.రాజు మాట్లాడుతూ దొంగతనాలకు పాల్పడిన నేరస్తుడిని, దోపిడీ చేసిన బంగారు, వెండి నగలను మీడియా ముందు హాజరుపరిచారు. ఎస్ఐ రాజు మాట్లాడుతూ నందిగామ ఏసీపీ తిలక్ పర్యవేక్షణలో జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ఐ జి.రాజు, ఎన్టీఆర్ జిల్లా సీసీఎస్ పోలీసులు, నందిగామ, జగ్గయ్యపేట పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి సాంకేతికతను ఉపయోగించి విచారణ చేశారన్నారు. జగ్గయ్యపేట, నందిగామ పోలీస్ స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో అంతర్రాష్ట్ర నేరస్తుడు శీలంశెట్టి వెంకటరమణను హైదరాబాద్‌లో శనివారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తెలంగాణ జనగాం జిల్లా రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన నేరస్తుడిపై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇతని నుంచి రూ.6 లక్షల విలువైన సుమారు 85 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించామన్నారు. రూ.6 లక్షల విలువైన నగలు స్వాధీనం -
తాంబూలాలిచ్చాం...తన్నుకు చావండి!
పెనమలూరు: మద్యం వ్యాపారుల మధ్య పోటీ మందుబాబులకు మజా సంగతేమో కాని జాతీయ రహదారిపై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కూటమి ప్రభుత్వం బార్ షాపులకు అనుమతులు ఇచ్చింది. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16 బార్లకు టెండర్లు పూర్తి చేశారు. ఇప్పటికే నాలుగు వైన్ షాపులు అమలులో ఉన్నాయి. గంగూరు చేపల కుండీలు వద్ద (పోరంకి పరిధి) మద్యం ప్రియులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ గతంలో విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి పక్కనే ఒక వైన్ షాపు పెట్టి విచ్చల విడిగా మద్యం అమ్మకాలు చేశారు. వైన్ షాపులో మద్యం తాగిన వారు జాతీయ రహదారి పైకి వచ్చి వీరంగం వేస్తుండటంతో అనేక ప్రమాదాలు జరిగాయి. కొత్తగా బార్‌షాపు గతంలో బందరు రోడ్డు పక్కనే ఉన్న వైన్‌షాపునకు ఆనుకునే కొత్తగా బార్‌షాపు పెట్టారు. షామియానా వేసి రెస్టారెంట్ ఆండ్ బార్ అని బోర్డు పెట్టాడు. దీంతో పక్కనే ఉన్న వైన్‌షాపు..బార్ షాపు నిర్వాహకుల మధ్య గొడవ మొదలయింది. మద్యం ప్రియులను ఆకట్టుకోవటానికి ఒకరితో ఒకరు పోటీలు పడి రండి బాబూ..రండి అని చేపల మార్కెట్లో పిలుస్తున్నట్లు మద్యం ప్రియులను ఆహ్వానిస్తున్నారు. మద్యం అమ్మకాలపై వివాదం బార్ షాపులో లూజ్ మద్యం విక్రయాలు ఉంటాయి. వైన్ షాపులో లూజ్ మద్యం అమ్మకాలు చేయకూడదు. బార్లో ఏ ధరకై నా మద్యం అమ్ముకోవచ్చు. వైన్ షాపులో ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మాల్సి ఉంది. వైన్ షాపునకు పర్మిట్‌రూమ్ ఉంటుంది. బార్ షాపులో ఇతర సౌకర్యాలు ఉంటాయి. వైన్ షాపులో లూజ్ మద్యం అమ్మకాలు చేస్తుండడంతో వ్యాపారుల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. ఇరువురూ పరస్పరం నిఘా పెట్టుకున్నారు. ప్రమాద ఘంటికలు గంగూరు వద్ద విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి పక్కనే రెండు మద్యం షాపులు ఉండటంతో వాహనాలపై వచ్చిన వారు ఇక్కడే మద్యం తాగి ఆ తరువాత వాహనాలు నడుపుతూ వెళుతున్నారు. మద్యం ప్రియులు రాత్రి సమయాల్లో జాతీయ రహదారి పక్కనే కూర్చుని మద్యం తాగుతూ హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. రెండు మద్యం షాపుల మధ్య పోటీతో మాకు సంబంధంలేదు. నిబంధనల మేరకు అనుమతులు ఇచ్చాం. మద్యం తాగి వాహనాలు నడిపితే పోలీసులు చర్యలు తీసుకోవాలి. – శేషగిరి, సీఐ, ఎకై ్సజ్ శాఖ -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
వత్సవాయి: వేర్వేరుగా జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామానికి చెందిన ఎస్కే దస్తగిరి (24) అదే మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఒకరు అనారోగ్యంగా ఉన్నట్టు ఫోన్ రావడంతో గౌరవరం నుంచి అనుమంచిపల్లి వెళ్లే క్రమంలో రహదారి పక్కన నిలిపిఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో దస్తగిరి అక్కడికక్కడే మృతిచెందాడు. దస్తగిరికి అవివాహితుడు. తల్లి జాన్‌బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చిల్లకల్లు – వైరా రహదారిలో పెద్ద కాలువ వద్ద జరిగిన మరో ప్రమాదంలో మక్కపేట గ్రామానికి చెందిన చింతల వెంకటేశ్వరరావు(25) మరణించాడు. వెంకటేశ్వరరావు తన ద్విచక్ర వాహనంపై శుక్రవారం మక్కపేట నుంచి చిల్లకల్లు వెళ్తుండగా పెద్ద కాలువ సమీపంలో ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించి చికిత్స చేస్తుండగా శనివారం మృతిచెందాడు. మృతునికి భార్య, ఏడాది వయస్సున్న కుమార్తె ఉన్నారు. మృతుని భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
వినాయక నిమజ్జనంలో కత్తులతో నృత్యాలు
వీరులపాడు: వినాయక నిమజ్జన కార్యక్రమంలో యువత మారణాయుధాలతో హల్చల్ చేయటంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు మండలంలోని నరసింహారావుపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి వినాయకుని నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో కొంతమంది యువత అత్యుత్సాహంతో పసుపు కండువాలు వేసుకుని డీజే సౌండ్స్, సినిమా పాటల మధ్య కత్తులు చేత పట్టుకుని నృత్యాలు చేయటంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. పోలీసులు అక్కడే ఉన్నా అడ్డుకునే యత్నం చేయకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరా వృతం కాకుండా చూడాలని, భయానక వాతావరణాన్ని సృష్టించిన యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రమాదవశాత్తు నదిలో మునిగి యువకుడు మృతి చల్లపల్లి: నదిలో నడిచి వస్తూ ప్రమాదవశాత్తు గోతిలో పడి ఓ యువకుడు నీటిలో మునిగిపోయి విగత జీవుడైన ఘటన మండల పరిధిలోని నిమ్మగడ్డ వద్ద కృష్ణానదిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ పీఎస్వీ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం చల్లపల్లి మండలం పురిటిగడ్డ పంచాయతీ శివారు నిమ్మగడ్డ గ్రామానికి చెందిన మేడేపల్లి శ్రీనివాసరావు కుమారుడు మేడేపల్లి తేజబాబు(20) శనివారం ఉదయం కృష్ణానది మధ్యలో ఉన్న తమ లంక పొలాలకు నదిలో నీటిలో నడిచి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మరొక వ్యక్తితో కలిసి తిరిగి నదిలో నడుస్తూ వస్తుండగా ఒక్కసారిగా మునిగిపోయాడు. ఎంతకీ పైకి తేలకపోవటంతో పక్కనున్న వ్యక్తి ఊళ్లో వారిని పిలుచుకొచ్చాడు. తేజబాబు మునిగిన చోట నీటి లోపల పెద్ద గుంట ఉండటంతో లోపల ఇరుక్కుపోయి ఉంటాడని గమనించిన స్థానికులు వలలు వేసి బయటకు తీయగా అప్పటికే అతను మృతిచెంది ఉన్నాడు. తేజాబాబు పాలిటెక్నిక్ డిప్లొమా చదివి ఇటీవలే అప్రెంటీస్ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఎస్ఐ పీఎస్వీ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి కుటుంబంలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఏఐ ఫర్ ష్యూర్(ఏఐ–4 ఎస్‌యూఆర్‌ఈ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో గ్లోబల్ మార్కెట్లో అమ్మకాలు నిర్వహించుకుని ఆర్థిక ప్రగతి సాధించేందుకు అడుగులు ముందుకు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో శనివారం డీఆర్డీఏ, మెప్మా, యూసీడీ సంయుక్త ఆధ్వర్యంలో ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త – ఏఐ ఫర్ ష్యూర్ కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్‌కు చేరువ చేసుకునేందుకు ఆధునిక సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఏఐ నిపుణులతో 160 మంది స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. నిట్ – వరంగల్ ప్రొఫెసర్ డాక్టర్ స్ఫూర్తి మాట్లాడుతూ రెండు సెషన్లలో ఆరుగంటల పాటు స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు ఏఐతో పాటు డిజిటల్ మార్కెటింగ్ వేదికలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, యూసీడీ పీవో పి.వెంకట నారాయణ, గ్రామీణ జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ కె.కల్పన, అర్బన్ జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ కె.మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. ఏఐ ఫర్ ష్యూర్ శిక్షణ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వాహనాలు స్వాధీనం
తక్కెళ్లపాడు(జగ్గయ్యపేట): గ్రామంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్ ఏడీ వీరాస్వామి శనివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం గ్రామంలోని సర్వే నంబరు 120లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నట్లు డీడీ శ్రీనివాస్‌కు సమాచారం వచ్చిందన్నారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో ట్రాక్టర్‌ను, జేసీబీను స్వాధీనం చేసుకుని వీఆర్వో శ్రీనివాస్‌కు అప్పగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాయల్టీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
ఉత్సవ ఏర్పాట్లు, పనుల ఆకస్మిక తనిఖీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దుర్గగుడిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, దసరా ఉత్సవాల ఏర్పాట్లను శనివారం దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఉదయం మహా మండపం ఎదుట నిర్మాణంలో ఉన్న అన్నదాన భవనం, మల్లేశ్వరాలయం నుంచి కొండ దిగువకు జరుగుతున్న ర్యాంప్, మెట్ల నిర్మాణంతో పాటు ప్రసాదాల పోటు భవనాల పనులను ఆయన పరిశీలించారు. దసరా ఉత్సవాలకు ముందుగానే ఆయా భవనాల్లో అన్ని పనులు పూర్తి కావాలని, అదే సమయంలో పనుల్లో ఎక్కడా నాణ్యత లోపం లేకుండా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం కనకదుర్గనగర్, రథం సెంటర్లో జరుగుతున్న దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నూతన అన్నదానం, ప్రసాదాల పోటులో పూజలు మహా మండపం ఎదుట నూతనంగా నిర్మించిన అన్నదానం, ప్రసాదాల పోటులో శనివారం కమిషనర్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ సారథ్యంలో అర్చకులు అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం నూతన భవనాల్లో పాలు పొంగించారు. దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు నిరంతరం ప్రసాదాలను అందించేందుకు ఈ రెండు భవనాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఉత్సవాల్లో భక్తులకు అల్పాహారం, అన్న ప్రసాదం, ఉచిత లడ్డూలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో శీనానాయక్, ఏసీ రంగారావు, ఈఈలు కోటేశ్వరరావు, రాంబాబు, ఏఈవోలు ఎన్.రమేష్‌బాబు, వెంకటరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వానొచ్చెనంటే...వరదొస్తది!
శనగపాడు నుంచి నందిగామ వెళ్లేందుకు శనగపాడు వద్ద గండివాగు, అనాసాగరం వద్ద మరో వాగు ఉంది. వరదలకు మా గ్రామం వద్ద గండివాగు పొంగి వాగు చప్టా గత ఏడాది, ఈ ఏడాది కొంత భాగం కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాగుపై వంతెన నిర్మిస్తే ప్రజలకు ఇబ్బందులు తొలుగుతాయి. –కీసర లోకేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు, శనగపాడు ఏకొద్దిపాటి వర్షమొచ్చినా గండివాగు పొంగి రాకపోకలు నిలిచిపోతున్నాయి. విద్యార్థులు పాఠశాలలకు, రైతులు పొలాలకు వెళ్లలేక పోతున్నారు. వాగు చప్టా వద్ద వంతెన నిర్మించాలి. ఆగస్టు నెలలో మూడు సార్లు వాగు పొంగింది. అధికారులు ఇప్పటికై నా దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం చేయాలి. –బరిగెల నాగరాజు, లింగగూడెం పెనుగంచిప్రోలు: వాగుల వద్ద వంతెనలు లేక మండల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వాగులు ఉధృతంగా ప్రవహించటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తున్నాయి. మండలంలో వాగులపై చప్టాలు ఉన్నా వర్షాకాలం వాగులు పొంగి చప్టాలపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఏ కొద్దిపాటి వర్షం వచ్చినా వాగుల వద్ద రాకపోకలు నిలిచి పోవటంతో జనజీవనం పూర్తిగా స్తంభిస్తోంది. వాగులు పొంగటంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి. రైతులు తమ పంట పొలాలకు వెళ్లలేరు. ప్రయాణికులు ఎటూ వెళ్లలేక ఇంటికి పరిమితం అవుతున్నారు. పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు వర్షాలకు వాగులు పొంగినప్పుడల్లా ఇవతల గ్రామాల ప్రజలు అటు వెళ్లలేక..అవతల గ్రామాల ప్రజలు ఇటు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. మండల ప్రజలు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్క ఆగస్టు నెలలోనే మూడుసార్లు వర్షాలకు వాగులు పొంగి ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత నెలలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో కొందరు ప్రజాప్రతినిధులు వంతెనల గురించి, రోడ్లు గురించి ఆర్అండ్బీ అధికారులను ప్రశ్నించారు. అధికారులు అంచనాలు పంపించాం అని చెప్పి ఊరుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వాగుల వద్ద వంతెనలు నిర్మించటంతో పాటు అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. వానలకు పొంగే వాగులు ఇవే కూలే స్థితిలో కల్వర్టులు మండలంలో ఎన్నో ఏళ్ల క్రితం వాగులపై నిర్మించిన చిన్నపాటి కల్వర్టులు పూర్తిగా శిథిలమై కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అనిగండ్లపాడు ఊరు ముందు దూళ్లవాగుపై కల్వర్టుకు రెండు వైపులా రెయిలింగ్ ఊడిపోవటంతో పాటు పూర్తిగా శిథిలమైంది. గుమ్మడిదుర్రు ఊరు ముందు వాగుపై కల్వర్టు వరదలకు పూర్తిగా కుంగిపోవటంతో పాటు తాత్కాలికంగా వేసిన తూములు కూడా వరదకు బయటకు వచ్చాయి. ఈ కల్వర్టుల వద్ద ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. -
తెలుగు వెలుగును భావి తరాలకు అందించాలి
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుమొగల్రాజపురం (విజయవాడ తూర్పు): తెలుగు భాష వెలుగులను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. పీబీ సిద్ధార్థ కళాశాల తెలుగు శాఖ, చెన్నపురి తెలుగు అకాడమీ (చైన్నె) సంయుక్తంగా ఆచార్య తూమాటి దొణప్ప శత జయంతి సంవ త్సరం సందర్భంగా విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ‘విశిష్ట తెలుగు దిగ్దర్శనం’ గ్రంథావిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్యఅతిథి ముప్పవరపు వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మనిషి అవసరం రీత్యా ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరువకూడదన్నారు. ఆచార్య దోణప్ప తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ప్రాచీన తెలుగు విషయాలతో కూడిన గ్రంథాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, గిడుగు రామమూర్తిని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదని, వారి గొప్పతనాన్ని పిల్లలకు తెలపాలని కోరారు. మనదేశాన్ని భయపెట్టాలని అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించారు. మన దేశం ఆయిల్ ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తే అమెరికాకు ఎందుకని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సూరం శ్రీనివాసులు, డాక్టర్ తూమాటి సంజీవరావు, గుమ్మా సాంబశివరావు, తూమాటి ప్రేమ్‌నాథ్ పాల్గొన్నారు. ● సభ అనంతరం జరిగిన సదస్సులో తమిళ సాహిత్యంలో తెలుగు ప్రాచీనత – విశిష్టతపై డాక్టర్ గాలి గుణశేఖర్, విశిష్ట తెలుగు భాష నేపథ్యంపై గారపాటి ఉమామహేశ్వరరావు, విశిష్ట తెలుగు భాష – వ్యాకరణ ప్రాశస్త్యంపై డాక్టర్ లగడపాటి సంగయ్య, తెలుగు పాఠ్య ప్రణాళిక, పరిశోధనపై బీరం సుందరరావు, తెలుగులో వ్యాఖ్యాన విశిష్టత గురించి డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ, నేటి తెలుగు–స్థితిగతులు గురించి జాగర్లపూడి శ్యామ్‌సుందర శాస్త్రి ప్రసంగించారు. -
రైతులను మోసగించిన కూటమి ప్రభుత్వం
గుణదల(విజయవాడ తూర్పు): ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం రైతులనూ ఘోరంగా మోసం చేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. గుణదలలోని తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో అవినాష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత జన జీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలు అందక తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా అన్నం పెట్టే రైతుల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. పంట దిగుబడులు సక్రమంగా లేక, గిట్టుబాటు ధర అందక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. గత ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. రైతు భరోసా ద్వారా రైతులకు వెన్ను దన్నుగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతన్నలపై పగ సాధిస్తోందన్నారు. మద్దతు ధర ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో యూరియా కోసం రైతన్నలను రోడ్డెక్కించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. అందుకే రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ ముందుకొచ్చిందన్నారు. ఈ నెల 9వ తేదీన రైతులకు మద్దతుగా అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలను సమర్పిస్తామన్నారు. రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అన్నదాత పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరి శివాజీ, రాష్ట్ర కార్యదర్శి నంబూరి రవి, ఉపాధ్యక్షుడు శివారెడ్డి, రైతు సంఘాల నాయకులు సాయిబాబా, రమేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతులను జైల్లో పెడతారా..? యూరియా అడిగితే రైతులను జైల్లో పెడతా మంటూ ముఖ్యమంత్రి అనడం సిగ్గు చేటని దేవి నేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలవాల్సింది పోయి వారినే జైల్లో పెడతామంటూ బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. యూరియా కోసం రోడ్లపై పడిగాపులు కాస్తున్న రైతులను కించపరుస్తూ విమర్శించడం కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల విశ్వాసాన్ని కోల్పోయిన కూటమి నేతలు వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కాక తప్పదన్నారు. -
లోడింగ్‌ను అడ్డుకున్న లారీ యజమానులు
ప్రైవేట్ సంస్థతో కుదుర్చుకున్న ఎన్టీటీపీఎస్ కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని స్థానిక లారీ ఓనర్లు, డ్రైవర్లు శనివారం లోడింగ్ పనులను అడ్డుకున్నారు. బూడిదకు డిమాండ్ లేని సమయంలో ఎన్టీటీపీఎస్ అధికారుల సలహాతో ఈ ప్రాంతానికి చెందిన తాము సుమారు 400 లారీలు కొనుగోలు చేసి 30 ఏళ్లుగా బూడిద రవాణాపై ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు. దూరం బట్టి లారీ బూడిదను రూ.6 వేల నుంచి రూ.8 వేలకు విక్రయిస్తున్న తాము ఇప్పుడు లారీకి రూ.3 వేల నుంచి రూ.4 వేలు చెల్లిస్తే లాభం ఏముంటుందని ప్రశ్నించారు. డ్రైవర్లు, క్లీనర్లకు జీతాలు, డీజిల్ ఖర్చులకే వచ్చే ఆదాయం సరిపోతే తాము ఎలా బతకాలని వాపోతున్నారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థకే సుమారు 300లపైగా లారీలు ఉన్నాయని తెలుస్తోందని, తమకు అసలు బూడిద ఇస్తుందో లేదో కూడా తెలియదని స్థానిక లారీ ఓనర్లు ఆందోళన చెందుతున్నారు. -
ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పాఠశాల విద్యాశాఖలో 92 శాతానికి పైగా ఉన్న పంచాయతీరాజ్ ఉద్యోగులదే కీలక భూమిక అని డెమోక్రటిక్ పీఆ ర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి. శ్రీను అన్నారు. గత 40 ఏళ్లుగా ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు సంబంఽధించిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ అపరిష్కతంగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి తగు న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు విజ్ఞప్తి చేశారు. విజయవాడ హోటల్ ఐలాపురంలో శనివారం రాష్ట్ర బీజేపీ టీచర్స్ సెల్ కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను ఉపాధ్యాయుల సమస్యలను మాధవ్‌కు వివరించారు. అనంతరం మాధవ్‌ను శాలువాతో సత్కరించి భారతమాత జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలను కూటమి ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లి వారికి తగిన న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో. విద్యారంగంలో విశిష్టమైన కృషి చేసిన 24 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. డెమోక్రటిక్ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను -
ఫ్రీ బస్సులతో మా పొట్ట కొట్టారు!
విజయవాడ సిటీ బస్టాండ్‌లో ఆటో కార్మికుల భిక్షాటన గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకం పెట్టి తమ పొట్ట కొట్టిందంటూ ఆటో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బ కొట్టిన కూటమి ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్(ఇఫ్టూ అనుబంధం) ఆధ్వర్యంలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోని సిటీ టెర్మినల్‌లో ఆటో కార్మికులు వినూత్నంగా చేతుల్లో బొచ్చెలు పట్టుకుని ప్రయాణికుల వద్దకు వెళ్లి భిక్షాటన చేశారు. తమ గోడును ప్రయాణికులతో వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఇఫ్టూ నాయకులు కె.పోలారి, దాది శ్రీనివాసరావు, మునిశంకర్లు మాట్లాడుతూ ఆటో కార్మికులను చంద్రబాబు ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందన్నారు. ఆటో మోటార్ కార్మికుల సంఘాలతో చర్చ జరిపి హామీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరుపకుండా మంత్రుల కమిటీ పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్రీ బస్సు కారణంగా ఉపాధి నష్టపోతున్న ఆటో కార్మికులకు ఏడాదికి రూ.30వేల సహాయం ప్రకటించి ప్రత్యేకంగా ఆదుకోవాలని కోరారు. జీవో నంబర్ 21 రద్దుతో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈనెల 18వ తేదీన అన్ని ఆటో మోటారు సంఘాలతో కలిపి చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇఫ్టూ ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకులు సీహెచ్ పెద్దిరాజు, డి.శ్రీధర్ బాబు, యాదగిరి, సూరిబాబు, వై.అప్పారావు, వలి, రఫీ, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
డయల్ యువర్ కలెక్టర్‌కు రైతుల నుంచి విశేష స్పందన
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 45 కాల్స్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎరువుల సరఫరా, సమస్యలపై రైతుల సందేహాలను నివృత్తి చేసే ఉద్దేఽశంతో ఏర్పాటు చేసిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన లభించింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 45 కాల్స్ వచ్చాయి. కలెక్టర్ లక్ష్మీశ ప్రతి ఫోన్ కాల్‌ను స్వీకరించి రైతు చెప్పిన సమస్యను విని, ఆ సమస్యపై అక్కడే ఉన్న అధికారులను ఆరా తీసి, పరి ష్కారానికి ఆదేశాలిచ్చారు. యూరియా వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చిన సలహాలను రైతులకు వివరించారు. పర్యావరణ పరిరక్షణ, నేల సారాన్ని కాపాడేందుకు నానో యూరియా ఉపయోగించాలని సూచించారు. విడతల వారీగా అవసరమైన ఎరువులను పంపిణీ చేసే విషయంలో ఎక్కడా ఏ రైతుకూ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వదంతులు నమ్మవద్దని, కలెక్టరేట్లో 91549 70454 నంబరుతో కమాండ్ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉందని, రైతులు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, జిల్లా సహకార అధికారి డాక్టర్ ఎస్.శ్రీనివాసరెడ్డి, మార్క్‌ఫెడ్ అధికారి నాగ మల్లిక తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవాల ముసుగు
భారీ దోపిడీకి ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఈవెంట్లు నిర్వహించడమే తప్ప ప్రజల సాధకబాధలు గురించి పట్టించుకునే రకం కాదు. గతంలో రాష్ట్రాన్ని ఒక కంపెనీగా, తాను ఒక సీఈఓలా వ్యవహరించిన చంద్రబాబు ఈసారి ముఖ్యమంత్రి అయ్యాక ఒక ఈవెంట్ మేనేజర్లా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ ఉత్సవ్ పేరుతో మైసూరు దసరా ఉత్సవాల స్థాయిలో చేస్తామంటూ విజయవాడ పార్లమెంటు ముఖ్యనేత సన్నాహాలు చేస్తున్నారు. ఈ పేరుతో కోట్లాది రూపాయల దోపిడీకి భారీ ప్రణాళిక రచించారు. దీనిపై ఆ పార్టీ వర్గాల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.విజయవాడలో పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో ఫార్మా కాలేజి గ్రౌండులో గత రెండేళ్లుగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తులు కమిటీగా ఏర్పడి భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా అంతే ఘనంగా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అయితే వారిని పార్లమెంటు ముఖ్యనేత తన వద్దకు పిలిపించుకుని, ఈ ఏడాది అక్కడ ఉత్సవాలు జరపవద్దని, తాను విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నానని చెప్పారు. మీరు ఉత్సవాలు నిర్వహిస్తే నేను నిర్వహించే ఉత్సవాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పడంతో వారు నిర్ఘాంతపోయారు. దానిపై ఇప్పుడు టీడీపీ వర్గాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవు తోంది. పార్లమెంటు ముఖ్యనేత వ్యవహార శైలిపై భగ్గుమంటున్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చూసీ చూడనట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ పార్లమెంటు ముఖ్యనేత విజయవాడ ఉత్సవ్ ముసుగులో భారీ దోపిడీకి ప్రణాళిక రచించారు. శతాబ్దాలుగా అత్యంత ఘనంగా జరుగుతున్న విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు సమాంతరంగా విజయవాడ ఉత్సవ్ పేరుతో ఉత్సవాల నిర్వహణకు నడుం కట్టారు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలను తన అక్రమార్జనకు పార్లమెంటు ముఖ్యనేత వేదికగా చేసుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రాశస్త్యాన్ని తగ్గించేలా విజయవాడ ఉత్పవ్ నిర్వహించడానికి పార్లమెంటు ముఖ్యనేత సిద్ధమయ్యారు. మైసూరులో జరిగే ఉత్సవాల కంటే ఘనంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని గొప్పలు చెబుతున్నారు. ఆ ఉత్సవం నిర్వహించడానికి పున్నమి ఘాట్‌ను కేటాయిస్తే వాటిలో స్టాల్స్, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అధికారులు నో చెప్పడంతో.. దేవదాయ భూమిపై కన్ను విజయవాడ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తారని, భక్తుల అవసరాల దృష్ట్యా పున్నమి ఘాట్‌ను కేటాయించలేమని ముఖ్యనేతకు అధికారులు తేల్చి చెప్పారు. దాంతో గొల్లపూడిలోని మచిలీపట్నం గొడుగు పేటలోని సర్వే నంబరు 454లో ఉన్న 39.99 ఎకరాల వెంకటేశ్వర స్వామికి చెందిన భూమిపైన కన్ను పడింది. ఆ భూమిలో విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని దేవదాయ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో తన అధీనంలోకి తీసుకున్నారు. మట్టి తోలి చదును చేస్తున్నారు. ఈ భూమిలో విజయవాడ ఉత్సవ్ పేరుతో ఎగ్జిబిషన్, వినోద కార్యక్రమాలు, స్టాల్స్, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మైసూరు ఉత్సవాల కంటే ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామని చెబుతూ ఆ స్టాల్స్‌ను భారీ ధరలకు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే తరహాలో వాహనాల పార్కింగ్ ప్రదేశాన్ని లీజుకు ఇచ్చి సొమ్ము చేసుకోవడానికి తేర తీశారు. భవిషత్తులో ఈ భూమిని విజయవాడ ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో లీజుకు తీసుకొని భారీ ఎత్తున లబ్ధి పొందేందుకు పావులు కదుపుతున్నారని, టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాలిక్లినిక్ రోడ్డులో ఉత్సవాలు నిర్వహించవద్దని హుకుం... -
ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
నూతన సబ్ స్టేషన్లకు స్థలాలు పరిశీలించాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో నూతన సబ్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను పరిశీలించాలని సీఎండీ పి.పుల్లారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా సర్కిల్ కార్యాలయంలో సీఎండీ పుల్లారెడ్డి అధ్వర్యంలో సీపీడీసీఎల్ సర్కిల్ అధికారులతో సమీక్షా సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణా, సీఆర్డీఏ, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల సర్కిల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థలాలు పరిశీలించి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 33/11 కేవీ సబ్ స్టేషన్లు, సరఫరా లైన్లలో అంతరాయాలు తగ్గించాలన్నారు. ఇందు కోసం ముందుగానే నిర్వహణ పనులు, అవసరమైన సామగ్రి అందించేందుకు, అత్యవసర సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వ్యవసాయదార్లకు పగటిపూట తొమ్మిది గంటల నిరంతరంగా విద్యుత్ సరఫరా అందించాలని, నూతన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తక్షణమే మంజూరు చేయాలని ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పథకం ప్రయోజనాలను వినియోగదారులకు వివరించాలని, జాతీయ గ్రీన్ ఎనర్జీను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణయాదవ్, డైరెక్టర్ ఫైనాన్స్ ఎస్.వెంకటేశ్వర్లు, ఆరు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. -
సర్వీసు వైద్యులపై చిన్నచూపు తగదు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి జీడీఏ ఏపీ సభ్యుల వినతి లబ్బీపేట(విజయవాడతూర్పు): సర్వీసు వైద్యులపై ప్రభుత్వం కనబరుస్తున్న చిన్నచూపు తగదని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధ్రప్రదేశ్(జీడీఏ ఏపీ) ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు ఈ సంఘ ప్రతినిధులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పనిచేస్తున్న వైద్యులు 25 ఏళ్ల సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండానే ఉద్యోగ విరమణ చేస్తున్న విషయాన్ని మంత్రికి వివరించారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో మూడు, నాలుగేళ్లకే సర్వీసులో ఉద్యోగో న్నతి పొందుతున్నారని వివరించారు. వైద్యుల ఉద్యోగోన్నతుల సమస్య పరిష్కారానికి తమిళనాడు, కేరళ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న డైనమిక్ అస్యూర్డ్ కేరీర్ ప్రోగ్రామ్‌ను మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని కోరారు. జనరల్ కేటగిరీ వైద్యులందరినీ ఏకీకృత సీనియారిటీ పరిధిలోని తీసుకు రావాలని, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని ఉన్నత స్థాయి పదవుల్లో వైద్యాధికారులను మాత్రమే భర్తీ చేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో జీడీఏ ఏపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇంజేటి బాబ్జీ శ్యామ్‌కుమార్, గౌరవాద్యక్షుడు డాక్టర్ పంజాల శ్రీని వాసరావు, డాక్టర్ స్వరూప్‌కాంత్, డాక్టర్ భానుకుమార్, డాక్టర్ యావ్, డాక్టర్ సురేష్‌బాబు, డాక్టర్ గోపాల్‌నాయక్ తదితరులు ఉన్నారు. ఈ సంద ర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను అసోసియేషన్ ప్రతినిధులు శాలువాతో సత్కరించారు. -
7న ఆలయాల మూసివేత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహాన్ని పురస్కరించుకుని ఈ నెల ఏడో తేదీ ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆ రోజు రాత్రి 9.56 నుంచి అర్ధరాత్రి 1.26 గంటల వరకు గ్రహణ కాలంగా ఉంటుందని దుర్గగుడి అర్చకులు పేర్కొన్నారు. చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని ఏడో తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు దుర్గగుడి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఇంద్రకీలాద్రిపై ఇతర ఉపాలయాల తలుపులు మూసివేస్తామని వివరించారు. ఎనిమిదో తేదీ సంప్రోక్షణ అనంతరం ఉదయం 8.30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేయనున్నట్లు డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు బుధవారం తెలిపారు. దీంతోస్వామివారి నిత్య శాంతి కల్యాణం ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆలయాన్ని 8వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు మహాసంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారని పేర్కొన్నారు. పెనుగంచిప్రోలు: చంద్ర గ్రహణం సందర్భంగా గ్రామంలోని శ్రీతిరుపతమ్మ ఆలయాన్ని 7వ తేదీ మహానివేదన అనంతరం 11 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 4 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈఓ కిషోర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తేదీ ఉదయం 8 గంటలకు నిత్య పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. -
రాష్ట్రంలో వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ఏడాదిగా వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యమైందని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ ఆందోళన వ్యక్తంచేశారు. అందుకు గుంటూరు జిల్లా తురకపాలెం మరణాలే నిదర్శనమని పేర్కొన్నారు. నగరంలోని తన కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లా డారు. పాలకులు అధికార మత్తు వీడి వైద్య రంగాన్ని గాడిలో పెట్టాలని సూచించారు. తురకపాలెంలో అధికారిక లెక్కల ప్రకారం ఐదు నెలల్లో 30 మంది మృతి చెందారని, ఆరోగ్యశాఖ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెల్లారితే గత ప్రభుత్వాన్ని వివర్శించడానికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందిందో ప్రభుత్వ సర్వీసులో ఉన్న సీనియర్ వైద్యులను అడిగితే చెపుతారని డాక్టర్ మెహబూబ్ షేక్ పేర్కొన్నారు. కూటమి పాలకులు ప్రచార ఆర్బాటాలు కాకుండా, మరణాలకు కారణాలు తెలసుకుని, నివారణ చర్యలు చేపట్టా లని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న వారికి సైతం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్టు గుడివాడరూరల్: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు వన్‌టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్, ఎస్ఐ పి.గౌతమ్‌కుమార్ గురువారం దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద 1.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ సీఐ మాట్లా డుతూ.. గంజాయి అక్రమ రవాణాపై అందిన విశ్వసనీయవర్గ సమాచారం మేరకు డీఎస్పీ వి.ధీరజ్ వినీల్ పర్యవే క్షణలో స్థానిక ఎఎన్ఆర్ కళాశాల వెనుకవైపు తుప్పల ప్రాంతంలో దాడులు చేసి బేతవోలు పెదపేటకు చెందిన గొడవర్తి కిరణ్, బేతవోలుకు చెందిన పడ మట నాగస్వామి, ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఎలమర్తి నాని, కార్మికనగర్‌కు చెందిన మాదాసు రామకోటేశ్వరరావు, ఓర్స్ కిషోర్‌ను అరెస్ట్ చేశామన్నారు. వారికి సహకరించిన ఆరో వ్యక్తి బేతవోలుకు చెందిన పడమట మణికంఠ హనుమాన్ జంక్షన్లో దొంగతానికి పాల్పడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నాడని పేర్కొన్నారు. మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేశా మని, ఒకరు జైల్లో ఉండగా మిగిలిన ఐదుగురిని కోర్టులో హాజరుపర్చ న్యాయమూర్తి 14రోజులు రిమాండ్ విధించారని వివరించారు. నిందితులను నెల్లూరు సెంట్రల్ జైల్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
ఆక్వా కుయ్యో.. రొయ్యో
గుడివాడరూరల్: ఆక్వా రైతు కుదేలవుతున్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన సుంకాల భారం ఆక్వా ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. మొన్నటి వరకు మూడుశాతం ఉన్న సుంకాలను 50 శాతం మేరకు పెంచడం గుదిబండలా మారింది. రొయ్యల ధరలు పతనమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఏడాది దాటినా అమలు చేయకపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయారు. రాష్ట్రంలోనే ఆక్వా ఎగుమతుల్లో కృష్ణా జిల్లా అగ్రగామిగా ఉంది. ఇక్కడ నుంచే ఇతర రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు రొయ్యల, చేపల ఎగుమతులవుతున్నాయి. దాదాపుగా జిల్లాలో 1,03, 977 ఎకరాల్లో రొయ్యల, చేపల చెరువులు సాగవుతున్నాయి. 46,385 ఎకరాలు రొయ్యల సాగును రైతులు చేస్తున్నారు. రొయ్యల సాగు కారణంగా జిల్లాలో ఆక్వా ప్రొసెసింగ్ యూనిట్లు, హేచరీలు, కోల్డ్‌స్టోరేజ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనాలకు ఎక్కువగా రొయ్యల ఎగుమతులు చేస్తున్నారు. ఏటా 3 నుంచి 4లక్షల టన్నుల మేర ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. రైతులకు ఆశాజనకమైన ధరలు లభించేవి. ఆంక్షలతో అవస్థలు ఎగుమతులపై ట్రంప్ సుంకాలు పెంచడంతో రొయ్యల ధరలు అమాంతం పడిపోయాయి. 100 కౌంట్ ధర ప్రస్తుతం రూ.230, 90 కౌంట్ ధర రూ.240, 80 కౌంట్ ధర రూ.260, 70 కౌంట్ ధర రూ.285, 60 కౌంట్ ధర రూ.305, 50 కౌంట్ ధర రూ.325, 40 కౌంట్ ధర రూ.335కు పడిపోయాయి. ఇప్పుడు కౌంట్‌కు రూ. 100 నుంచి 135 వరకు తేడా వస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో నాడు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు, ఇతర ఉపయోగాల రూపంలో ఆక్వా రైతులకు మంచి ధర పలికేది. హామీలు విస్మరించిన కూటమి ఆక్వా రంగంతో రాష్ట్రానికి అధిక ఆదాయం వచ్చేది. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఆక్వా రైతులకు భరోసా ఇస్తూ వాగ్దానాలు చేశారు. రొయ్యల పరిశ్రమకు ఎక్కువగా మేలు చేసే విద్యుత్ ధరలను యూనిట్‌కు రూ.1.50కే ఇస్తామని హామీ ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్లను సైతం ఉచితంగా ఇస్తామని చెప్పారు. అయితే ఇచ్చిన వాటిలో ఒక్కటీ నెరవేరలేదు. ప్రస్తుతం యూనిట్ ధర రూ.3.84 ఉంది. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు రైతులకు లక్షల్లో ఖర్చు అవుతుంది. మేతల కొనుగోలుకు సైతం ధరలు తగ్గిస్తామని చెప్పిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కూటమి ఇచ్చిన హామీలను నెరవేరిస్తే కొంత మేర నష్టాల నుంచి బయటపడవచ్చని ఆశించిన ఆక్వా రైతులకు నిరాశే ఎదురవుతోంది. రొయ్యల సాగులో లాభాలకు బదులు నష్టాలు రావడం, ధరలు పడిపోవడం, విద్యుత్ బిల్లుల భారం, అధికంగా రొయ్యల మేతల ధరలు పెరగడం, తరచూ వచ్చే వ్యాధుల దెబ్బకు రొయ్యల రైతులు సాగంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేసి కనీసం విద్యుత్ బిల్లులు తగ్గిస్తారనే ఆశ.. నిరాశగా మారడంతో రైతన్నలు సాగంటేనే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. లీజులు ఎకరాకు రూ.90 వేల నుంచి రూ.లక్ష రూపాయల వరకు ఉండటం, ప్రభుత్వం నుంచి ఎటువంటి సబ్సిడీలు అందకపోవడంతో ఆక్వా రైతులు అప్పుల పాలైన ఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమస్యను ప్రధాని వరకు తీసుకెళ్లి ఆక్వా రైతుల ఇబ్బందులు తొలగించాల్సి ఉంది.చాలా కాలంగా రొయ్యల సాగు చేస్తున్నాం. విద్యుత్ భారం అధికమైంది. రొయ్యల ధరలు సైతం పతనమయ్యాయి. పెట్టుబడి ఎక్కువైంది. వచ్చే లాభాలు కన్నా నష్టాలు తీవ్రమయ్యాయి. విద్యుత్ ధరలు తగ్గిస్తారని ఆశించాం. అది జరగలేదు. ప్రస్తుతం సాగు భారంగా మారింది. రొయ్యల్లో వ్యాధులు సైతం ఎక్కువ కావడంతో సాగు చేయడం కష్టంగా మారింది. అన్నీ నష్టాలే వస్తున్నాయి. –చింతాడ పెద్దిరాజు, ఆక్వా రైతు, ఎల్‌ఎన్‌పురం, నందివాడఎన్నికల సమయంలో విద్యుత్ ధరలు తగ్గిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ప్రస్తుతం సాగులో విద్యుత్ వలన ఎక్కువగా పెట్టుబడి అవుతుంది. ట్రాన్స్ ఫార్మర్లు సైతం ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువ పెట్టుబడి కావడంతో ఆక్వా రైతులం ఇబ్బంది పడుతున్నాం. కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇస్తామన్న ట్రాన్స్ ఫార్మర్లను ఇవ్వడం లేదు. యూనిట్ ధరలను తగ్గించడం లేదు. ఆక్వా రైతులు విద్యుత్ ధరలను తక్షణమే తగ్గించి నష్టాల బారి నుంచి కాపాడాలి. –గురువెల్లి చంటి, ఆక్వా రైతు, ఎల్‌ఎన్‌పురం, నందివాడ -
8న అప్రెంటీస్ మేళా
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): తమ కళాశాల ఆవరణలో ఈ నెల ఎనిమిదో తేదీన అప్రెంటీస్ మేళా జరుగుతుందని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో వివిధ ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు పాల్గొని తమ సంస్థల్లో అప్రెంటీస్ చేసేందుకు అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ఉత్తీర్ణులైన అన్ని ట్రేడ్ల విద్యార్థులతో పాటుగా 2025 సంవత్సరంలో ఐటీఐ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా ఈ మేళాలో పాల్గొనవచ్చని సూచించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు పదో తరగతి, ఐటీఐ మార్కుల జాబితా, టీసీ, ఆధార్ కార్డు, రెండు పాస్‌ఫోర్ట్ సైజు ఫొటోలు, పాన్‌కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, కులధ్రువీకరణ పత్రం ఒరిజినల్స్‌తో పాటుగా మూడు సెట్ల జిరాక్స్ కాపీలతో ఎనిమిదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో జరిగే అప్రెంటీస్ మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి జి.కొండూరు: పొట్టకూటి కోసం ఇటుక బట్టీల్లో పని చేసేందుకు రెండు రోజుల క్రితం వచ్చిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన వెల్లటూరు గ్రామ శివారులో గురువారం సాయంత్రం జరిగింది. అల్లూరిసీతారామరాజు జిల్లా, జీకే వీధి మండల పరిధిలోని ఈకోడిసింగి గ్రామానికి చెందిన వంతల సన్యాసిరావు(38) మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామ శివారులో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలో పని చేసేందుకు ఈ నెల ఒకటో తేదీన వచ్చారు. ఇటుక బట్టీలో రెండవ తేదీ నుంచి పనిలో చేరిన ఈ ఆరుగురు కార్మికులు, గురువారం ఇటుక బట్టీలో ఉన్న పాత షెడ్డును తొలగించి మరో చోట నిర్మించే పనులను చేపట్టారు. ఈ క్రమంలో సన్యాసిరావు తొలగించిన షెడ్డు నుంచి ఇనుప రాడ్డుని పైకి తీసి తరలిస్తున్న క్రమంలో పైన ఉన్న విద్యుత్లైనుకు తాకింది. విద్యుదాఘాతానికి గురైన సన్యాసిరావు అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి కార్మికులు సన్యాసిరావుని వెంటనే మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
యువత.. చెడు నడత
లబ్బీపేట(విజయవాడతూర్పు): కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ఎక్కువ మంది యువత ఆలోచనలు ఉంటున్నాయి. ఈ తరుణంలో అనేక నేరాలు, మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిలో విలాసాలకు అలవాటు పడిన వారు కొందరైతే, దురల వాట్లకు బానిసలైన వారు మరికొందరు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాసతో మోసాలకు పాల్పడుతున్న ఇంకొందరు. మోసం ఏ రూపంలో చేసినా పోలీసులకు చిక్కి జైలు పాలవుతున్నారు. ఇలా ఇటీవల కాలంలో డబ్బు లావాదేవీల్లో మోసాలకు పాల్పడిన ఫిర్యాదులు పోలీస్ గ్రీవెన్స్‌లో ఎక్కువగా వస్తున్నాయి. నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కుతున్న వారు ఉంటున్నారు. ఇవే నిదర్శనం.. ఇవి మచ్చుక కొన్ని మాత్రమే. ఇటీవల కాలంలో మోసాలు, చోరీలు, చీటింగ్ కేసుల్లో అరెస్టు అవుతున్న వారిలో ఎక్కువ మంది ఈజీ మనీ కోసం నేరాలకు పాల్పడుతున్న వారే ఉంటున్నారు. అంతేకాదు సైబర్ నేరాలు, మాయ మాటలు చెప్పి, నమ్మబలికి డబ్బులు తీసుకుని మోసం చేయడం వంటి నేరాలు ఎక్కువగా ఉంటున్నాయి. స్నేహితులు, బంధువులనూ వదలడం లేదు.. ఈజీ మనీ కోసం తెలియని వారినే కాదు, తమ స్నేహితులు, బంధువులను సైతం మోసం చేస్తున్నారు. సత్యనారాయణపురంలోని యుపిక్స్ కేసులో ఎక్కువ మంది స్నేహితులు, బంధువులు ఉండటం గమనార్హం. కొందరు అమాయక ప్రజలు సైతం అధిక వడ్డీలు వస్తాయని అలాంటి వారి బుట్టలో పడిపోతున్నారు. ఇటీవల శిశువును ఇస్తామంటూ తెలంగాణకు చెందిన స్నేహితుడి నుంచే రూ.4 లక్షలు తీసుకుని మోసం చేసిన వైనం వెలుగు చూసింది. దీనిపై కలెక్టర్‌కు, పోలీస్ కమిషనర్‌కు సైతం ఫిర్యాదులు అందాయి. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. డ్రగ్స్, ఆల్కహాల్ వంటి దురలవాట్లకు లోనై జీవితాలను అంధకారం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్ మత్తులో నారాలకు పాల్పడితే అమలు చేసే శిక్షలు గురించి వివరిస్తున్నారు. అనవసరంగా జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఉన్నత విద్యతోనే అత్యున్నత హోదా సాధ్యమవుతుందని తెలియజేస్తున్నారు.ఎదుటి వారితో పోల్చుకోవడం ఇటీవల ఎక్కు వైంది. అలాంటి వారు అనవసర ఆడంబరాలకు పోతూ, ఆదాయానికి మించిన ఖర్చులతో అడ్డదారులు తొక్కుతున్నారు. కళాశాల పిల్లల్లో ఒకరు ఖరీదైన బైక్ వేసుకొస్తే, తమకు స్తోమత లేకున్నా అలాంటి బైక్ కొనాలని భావిస్తూ.. సులభంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో యువత డగ్ర్కు, ఆల్కాహాల్‌కు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. – డాక్టర్ గర్రే శంకరరావు, మానసిక నిపుణులు -
మీడియాకు దూరం.. దూరం!
దసరా ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న అధికారులు మీడియాకు మాత్రం దూరం దూరంగా ఉంటున్నారు. దసరా ఉత్సవాలపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన గురువారం రెండో సమీక్ష సమావేశం నిర్వహించింది. మొదటి సమీక్ష సమావేశంలోనూ మీడియాకు దూరంగా ఉన్న అధికారులు, ఇప్పుడూ అదే పంథాను అనుసరించారు. మూడు గంటల పాటు అధికారులు సమీక్ష నిర్వహించగా, మీడియాతో మాట్లాడేందుకు మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఉత్సవ ఏర్పాట్లలో క్షేత్రస్థాయిలో లోపాలను మీడియా ఎత్తి చూపుతుందనే భావనతోనే దూరంగా ఉంటున్నట్లు దుర్గగుడిలో ప్రచారం జరుగుతోంది. -
రైతులకు అందుబాటులో యూరియా
గౌరవరం(జగ్గయ్యపేట): జిల్లాలో అందుబాటులో యూరియా ఉందని రైతులు ఆందోళన చెందాల్సినవసరం లేదని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. గ్రామంలో సొసైటీలోని ఎరువుల గోడౌన్‌ను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూరియా సరఫరా సక్రమంగానే జరుగుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్, రెవెన్యూ, మార్కెటింగ్, వ్యవసాయాధికారుల పర్యవేక్షణలో జాయింట్ యాక్షన్ టీం పర్యవేక్షిస్తోందన్నారు. ఈ టీం యూరియా సరఫరా ఎలా ఉంది.. బ్లాక్ మార్కెట్‌కు తరలుతుందా లేదాని చూస్తారని తెలిపారు. జిల్లాలో మూడు వేల మెట్రిక్ టన్నుల యూరియా అందు బాటులో ఉందని మరో వారంలో పల్నాడు జిల్లా నుంచి రెండు వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని తెలిపారు. కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇప్పటికే 6ఏ కేసులు 11 నమోదు చేశామని తెలిపారు. రైతులు కూడా అవసరం మేరకే యూరియా తీసుకోవాలని ఇష్టానుసారం యూరియా వినియోగించొద్దని ఎకరాకు 90 కిలోల యూరియా సరిపోతుందని చెప్పారు. అనంతరం కార్యదర్శి నాగేశ్వరరావును స్టాకు వివరాలను, రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో బాలకృష్ణ, ఇన్చార్జ్ తహసీల్దార్ మనోహర్, ఏడీఏ భవానీ, సీఐ వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్ నరసింహారావు, ఏవో వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ లక్ష్మీశ -
జూపూడి పేలుళ్ల వెనుక అనుమానాలెన్నో..?
ఇబ్రహీంపట్నం: మండలంలోని జూపూడి భీమేశ్వర కాలనీలోని ఓ ఇంట్లో జరిగిన పేలుళ్ల వెనుక ఎన్నో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం రాత్రి పేలుడు జరిగి, ఇద్దరు వెల్లింగ్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన ఇంటితోపాటు మరో ఐదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెల్డింగ్ మిషన్‌కు విద్యుత్ వినియోగించడం వల్లే పేలుడు జరిగిందని ఇంటి యజమానులు చెబుతుండగా, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత కారణాలు వెల్లడవుతాయని పోలీసులు అంటున్నారు. బాణసంచా తయారీ వల్లే భారీ పేలుడు జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదల ఇంటిలో జరిగిన భారీ పేలుళ్ల వెనుక బలమైన వ్యక్తులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజులుగా పక్క జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు స్థానికులకు పేలుడు ముడిసరుకు ఇచ్చి బాణసంచా తయారీ చేయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బాణసంచా తయారీకి వస్తువుల లెక్కన నగదు ఇస్తున్నారని పేర్కొంటున్నారు. 3 కి.మీ. వినిపించిన పేలుడు శబ్దం జూపూడి భీమేశ్వరకాలనీలో జరిగిన పేలుడు శబ్దం సుమారు మూడు కిలోమీటర్ల దూరం వినిపించింది. పేలుడు సమయంలో దట్టమైన పొగ అలుముకుని భరించలేని దుర్వాసన వెలువడింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పేలుడు జరిగిందని భావించిన కొందరు విద్యుత్‌శాఖ లైన్మెమన్కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. ఓ వైపు భారీ శబ్దం, మరోవైపు దట్టమైన పొగ, ఇంకో వైపు భరించరాని దుర్వాసన, కరెంటు కూడా లేకపోవడంతో ప్రజలు చీకట్లో ప్రాణం అరచేతిలో పెట్టుకుని కాలం గడిపారు. కొందరు చీకట్లో బయటకు పరుగులు తీశారు. దళారుల ప్రమేయంతో బాణసంచా తయారీ పొరుగు జిల్లాకు చెందిన కొందరు పేదల కాలనీలను ఆసరాగా చేసుకుని బాణసంచా తీయారీ వృత్తిలోకి లాగుతున్నారు. వారి ఆర్థిక అవసరాలు తెలుసుకుని ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించవచ్చని నమ్మబలికి ప్రమాదకరమైన ఈ వృత్తిలోకి తీసుకొస్తున్నారు. ఉల్లిపాయ బాంబులు వంద తయారీ చేస్తే ఒక రేటు, వెయ్యికి మరో రేటు చొప్పున ఒప్పుకొని కుటీర పరిశ్రమలా బాణసంచా తయారీ చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కోతుల కోసం తీసుకొచ్చిన ఉల్లిపాయ బాంబులను మెట్ల కింద ఉంచామని పేలుడు జరిగిన ఇంటి యజమానులు చెబుతున్నారు. మెట్ల కింద ఉంచిన ఉల్లిపాయ బాంబుల వల్లే భారీ విస్పోటనం జరిగినట్లు తేటతెల్లమవుతోంది. ప్రమాదానికి కారణం కోతుల కోసం తెచ్చిన ఉల్లిపాయ బాంబులా, తయారీ చేసినవా అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పేలుడు తీవ్రతకు కుప్పకూలిన రేకుల ఇల్లు పేలుడు ధాటికి దెబ్బతిన్న భవనం పొట్టకూటికోసం వచ్చి ప్రాణాపాయ స్థితికి.. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో పేలుడు జరిగిన ఇంటి యజమానులు ఇంటి చుట్టూ ఐరన్ మెస్ ఏర్పాటు చేసేందుకు కోనాయపాలేనికి చెందిన వెల్డర్లు గోపీ, మహేష్‌ను పిలిపించారు. పొట్టకూటి కోసం వచ్చిన వారిద్దరు పేలుడులో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరారు. ఐరన్ మెస్ బిగిస్తున్న మహేష్ పేలుడు ధాటికి పక్కింటి రేకుల షెడ్డుపైకి ఎగిరిపడ్డాడు. రేకులు పగిలి నేలపై కుప్ప కూలి తీవ్ర గాయాలపాలయ్యాడు. మరో వెల్డర్ గోపీపై ప్రహరీ కూలింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోపీని స్థానికులు బయటకు తీశారు. ఇద్దరినీ 108లో విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గోపీ ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం. ఇంటి యజమానులు బయట ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాంవెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో బ్లాస్టింగ్ జరిగినట్లు ఇంటి యజమానులు చెబుతున్నారు. మేము చేపట్టిన పరిశీలనలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. క్లూస్ టీమ్ నివేదికలను బట్టి బ్లాస్టింగ్‌కు కారణాలు వెల్లడవుతాయి. పోలీస్ శాఖ కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. నివేదికల ఆధారంగా త్వరలో పేలుళ్లకు కారణాలు వెల్లడిస్తాం. – దుర్గారావు, వెస్ట్‌జోన్ ఏసీపీ రేకుల షెడ్డు ధ్వంసమైంది నా భర్త చనిపోవడంతో ఒంటిరిగా బతుకీడుస్తున్నా. మా పక్క ఇంటిలో జరిగిన పేలుడు ధాటికి మా రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వెనక గోడలు కూలిపోయాయి. రేకులు పగిలిపోయాయి. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నా. మళ్లీ ఇల్లు నిర్మించుకునే స్తోమతు లేదు. ఇంటి నిర్మాణానికి అధికారులు సహకారం అందించాలి. – మిద్దే శిరోమణి, కాలనీ వాసి -
పర్యావరణ పరిరక్షణలో విజయవాడ భేష్
పటమట(విజయవాడతూర్పు): పర్యావరణ పరిరక్షణలో విజయవాడ భేష్ అని, విజయవాడ నగరం సుందరంగా– పరిశుభ్రంగా ఉందని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ(జీఈఎఫ్) వీఎంసీకి కితాబిచ్చింది. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ధ్యానచంద్ర చాంబర్లో జీఈఎఫ్ ప్రతినిధులు బుధవారం ఆయనను కలిసి నగరంలో వారి పరిశీలను వివరించారు. వీఎంసీ–యూనిడో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రామలింగేశ్వర నగర్ 20 ఎంఎల్డీ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) పునరుద్ధరీకరణ, బయోగ్యాస్ ఎనర్జీ ప్లాంట్ ప్రాజెక్ట్ పురోగతిపై జీఈఎఫ్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ జీఈఎఫ్ ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వీఎంసీ పర్యావరణ పరిరక్షణకు వీఎంసీ తీసుకుంటున్న చర్యలను వివరించారు. విజయవాడ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చడం కోసం మరింత నిధులు అవసరమని, వారి ఆర్థిక సహాయంతో కేవలం వాడుక నీరు శుద్ధి చేయడమే కాకుండా, ఘన వ్యర్థాల నిర్వహణ, వర్షపు నీటి కాలువల డ్రెయిన్లు వంటివి నిర్మించేందుకు వారి సహకారం అవసరమని తెలిపారు. అనంతరం జీఈఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలెట్ ఇన్ ఇండియా(సీఐఏపీ) ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలో ఐదు పైలట్ నగరాలను ఎంపిక చేశామన్నారు. విజయవాడతో పాటు గుంటూరు, మైసూర్, భోపాల్, జైపూర్ నగరాల్లో ఈ ప్రాజెక్టుని అమలు చేశారని, ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమం విజయవాడలో నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అంతర్జాతీయ పరిశీలకుడు రోనాల్డ్ వంగ్, జాతీయ పరిశీలకుడు డాక్టర్ శ్రీనివాస్ ష్రాఫ్, యూనిడో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ నందపాల్ సింగ్, యూనిడో నేషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దీపిక శ్రీపాద, వీఎంసీ అడిషనల్ కమిషనర్(ప్రాజెక్ట్స్) డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ ఇంజినీర్ ఆర్.శ్రీనాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.వెంకటేశ్వరరెడ్డి, పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు. -
ముక్కు కారడం సమస్యకు సర్జరీతో విముక్తి
లబ్బీపేట(విజయవాడతూర్పు): మెదడు ద్రవం ముక్కు ద్వారా కారడం వంటి అరుదైన సమస్యతో బాధపడుతున్న 35 ఏళ్ల శేషుకుమారికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఒబెసిటీ కలిగిన పెరిమోనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుందని, ఆ సమయంలో హార్మోన్ లోపం కారణంగా ఎముకలు బలహీనమవుతాయని తెలిపారు. మెదడు పొరలు బలహీనమై, దగ్గు, బలంగా తుమ్మడం, మలబద్దకం వంటి పరిస్థితులు సమస్యను మరింతగా ప్రేరేపిస్తాయన్నారు. శేషుకుమారి పదేళ్లకు పైగా ఈ సమస్యతో బాధపడుతూ 2015లో విజయవాడ జీజీహెచ్‌లో, 2021లో గుంటూరులో ఓపెన్ క్రానియోటమీ సర్జరీలు చేయించుకున్నారని చెప్పారు. సమస్య మళ్లీ పునరావృతం కావడంతో ఆస్పత్రికి రాగా ఈఎన్టీ వైద్యులు ఆధునిక ఎండోస్కోపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స చేశారని సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని సమస్య నుంచి ఉపశమనం పొందారన్నారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ కె.రవి, ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ వినయ్, డాక్టర్ శాంతిలతను సూపరింటెండెంట్ అభినందించారు. -
అన్నదాన పథకానికి విరాళాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో నిత్యం జరిగే అన్నదాన పథకానికి భక్తులు విరాళాలు అందజేశారు. మచిలీపట్నం(ఆజాద్ రోడ్)కు చెందిన సర్వ కృష్ణమోహన్ ప్రసాద్ దంపతులు నిత్యాన్నదానానికి రూ.2 లక్షలు, విజయవాడ కానూరుకు చెందిన విశ్వశ్రీ ప్రాజెక్ట్స్, ఆరో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని చింత శివరామకృష్ణ రూ.1,00,116 అందజేశారు. దాతలకు ఆలయ సిబ్బంది అమ్మవారి దర్శనం కల్పించి వేద ఆశీర్వచనం చేయించారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన 19 మందికి న్యాయస్థానం జరిమానాలు విధించింది. నగరంలోని 4వ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 19 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని 6వ అడిషనల్ జ్యూడిషల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్డులో ప్రవేశ పెట్టగా న్యాయమూర్తి లెనిన్‌బాబు జరిమానాలు విధించారు. ఒక్కరికి రూ.15 వేలు, 18 మందికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు జరిమానా విధించారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): రెండు ఆలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు కానుకల హుండీలు దొంగతనానికి పాల్పడిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పాత పోస్టాఫీస్ రోడ్డులో ఉన్న కూర్తాళం పీఠంలో, మెట్లబజార్లోని శివాలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. పీఠంలోని హుండీని పద్మావతి ఘాట్‌లోకి తీసుకెళ్లి పగలగొట్టి అందులోని నగదు తీసుకుని హుండీని అక్కడే వదిలి వెళ్లిపోయారు. శివాలయంలోని హుండీలో నగదు ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం ఘాట్‌లోకి వాకింగ్ కోసం వెళ్లిన వాకర్స్ హుండీని చూసి పీఠం నిర్వాహకులకు సమాచారం అందించారు. శివాలయంలో పనిచేసే పని మనిషి బుధవారం ఉదయం గుడి వద్దకు వెళ్లిచూడగా హుండీ పగలగొట్టి ఉంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. ఫుటేజీల ఆధారంగా రెండు ఆలయాల్లో ఇద్దరు వ్యక్తులే దొంగతనానికి పాల్పడ్డారని, వారు పాత నేరస్తులుగా గుర్తించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. పరారీలో ఉన్న వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. -
చవితి వేడుకలు నిర్వహిస్తున్న బాషా ఆదర్శనీయం
ఘంటసాల: కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరుడైన అక్బర్ బాషా(షామియాన) ఆధ్వర్యంలో ఘంటసాలలో వినాయక చవితి వేడుకలు నిర్వహించడం ఆదర్శనీయమని కృష్ణా మిల్క్ యూనియన్, వినాయక చవితి కమిటీ రాష్ట్ర చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. ఘంటసాలలో బాషా ఆధ్వర్యంలో జరుగుతున్న చవితి వేడుకల్లో ఆంజనేయులు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన చలసాని నిర్వాహకుడు అక్బర్ బాషా(షామియాన) – షర్మిల దంపతులను సత్కరించి స్వామి వారి చిత్రపటాలను అందించి అభినందించారు. దేశాభివృద్ధికి యువత సహకరించాలి అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ చారిత్రాత్మకమైన ఘంటసాల గ్రామంలో బాషా ఆధ్వర్యంలో ఎనిమిది రోజులుగా వినాయక చవితి ఉత్సవాలతో ప్రతి రోజూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం విశేషమన్నారు. మొదటి రోజు పీటల మీద కూర్చుని వినాయకునికి పూజలు చేసిన బాషా, షర్మిల దంపతులను అభినందించారు. కుల మతాలకు అతీతంగా దేశాభివృద్ధికి యువత సహకరించాలని కోరారు. ముందుగా శ్రీ జలధీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆంజనేయులను టీడీపీ నేతలు ఘనంగా సత్కరించారు. వినాయక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన 2 వేల మందికి అన్నసమారాధన కార్యక్రమాన్ని చలసాని స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. గ్రామస్తుల సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించగలిగినట్లు అక్బర్ బాషా తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరి బాబు, డీసీ చైర్మన్ అయినపూడి భాను ప్రకాష్, మిల్క్ యూనియన్ డైరెక్టర్ వేమూరి సాయి, పీఏసీఏస్ చైర్పర్సన్ బండి పరాత్పరరావు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, పాలకేంద్రం అధ్యక్షుడు గొర్రెపాటి సురేష్, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
పోలికతో ప్రమాదమే !
● పెరుగుతున్న కంపేరిజన్ సిండ్రోమ్ ● ఇతరులతో పోల్చుకొని కుంగిపోతున్న వైనం ● నగరానికే చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధిని ఇన్‌స్టాలో తరచూ పోస్టులు పెడుతుంటుంది. తాను పెట్టిన రీల్స్ కంటే, స్నేహితుల రీల్స్‌కు ఎక్కువ లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. తనకు తక్కువగా వస్తున్నాయని నిరాశ చెందుతోంది. ● విజయవాడకు చెందిన కార్తిక్ ఓ విశ్వ విద్యాలయంలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రతి సెమిస్టర్లో 9 జీపీఏకు పైగా మార్కులు సాధిస్తున్నాడు. కానీ తనకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారితో పోల్చుకుంటూ ప్రతిసారీ తీవ్ర నిరాశకు లోనై ఆత్మనూన్యతాభావంతో ఉంటున్నాడు. దీంతో తల్లిదండ్రులు గమనించి ఓ సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించారు. -
పది గంటలు!
● యూరియా కొరత.. రైతన్న కుతకుత! ఒక్క కట్ట కోసం.. ఇంతటి దారిద్య్రం ఎప్పుడూ లేదని అన్నదాతల ఆక్రందనఅవనిగడ్డ/కంకిపాడు: ఎరువుల కొరత రోజు రోజుకీ తీవ్రతరమవుతోంది. పంటకు అవసరమైన సమయంలో యూరియా దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మార్కెట్లో యూరియా ఎప్పుడు వస్తుందా? అన్న ఆశతో ఎరువుల దుకాణాల వద్దే రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.64 లక్షల హెక్టార్లలో సాగుకు అనువైన భూమి ఉంది. ఇప్పటి వరకూ 1.34 లక్షల హెక్టార్లలో వరి నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెండు నెలల నుంచి నెల రోజుల పంట పొలాల్లో ఉంది. కొన్ని గ్రామాల్లో వరిపైర్లు దుబ్బు చేసి చిరు పొట్ట దశకు చేరువ అవుతున్నాయి. యూరియా లభ్యతపై జిల్లా వ్యవసాయశాఖ చెబుతున్న లెక్కలకు, వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదు. ఆగస్టు నాటికి 27,299టన్నులు యూరియా జిల్లాకు అవసరమని వ్యవసాయశాఖ నివేదికలు పేర్కొంటున్నాయి. ఖరీఫ్ సీజన్లో ఉన్న యూరియా నిల్వలతో కలిపి 28,743టన్నులు ఉండగా ఆగస్టు నాటికి 27,299 మెట్రిక్ టన్నులు అమ్మకాలు జరిగాయని, ఇంకా 1,443 టన్నులు యూరియా మార్కెట్లో నిల్వ ఉందని లెక్కలు చూపిస్తున్నారు. వాస్తవానికి యూరియా దొరక్క రైతులు విలవిల్లాడుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఆలస్యంగా సాగు చేసిన అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో పిండి (ఎరువులు) చల్లేందుకు సిద్ధంగా ఉన్నారు. బుధవారం కొన్ని చోట్లకు యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు తెల్లవారు జాము నుంచే పీఏసీఎస్‌లు, రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. మొత్తం 322.425 టన్నుల యూరియా లోడ్లు వచ్చాయి. వీటి కోసం లైన్లు వేసేందుకు కొన్నిచోట్ల రైతుల మధ్య తోపులాటలు, స్వల్ప ఘర్షణలు జరిగాయి. పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేశారు. వచ్చిన లోడులు తక్కువ కావడంతో చాలా మంది రైతులకు యూరియా అందలేదు. నాట్లు వేసిన వారం పదిరోజుల లోపు యూరియా, కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు. కొన్నిచోట్ల 30 నుంచి 40 రోజులు అయినా యూరియా అందకపోవడం వల్ల ఎరువులు వేయలేదు. దీంతో పిలకలు పెరగక పంట ఎదుగుదల లేకుండా పోయిందని కొంతమంది రైతులు చెప్పారు. 40 నుంచి 50 రోజులు దాటితే పిలకలు పుట్టవని, అప్పుడు ఎరువులు వేసినా ఉపయోగం లేదని రైతులు చెబుతున్నారు. ఎకరం అంతకంటే తక్కువ ఉంటే కట్ట చొప్పున యూరియా ఇచ్చారు. రెండు నుంచి ఐదు ఎకరాలు ఉంటే రెండు కట్టలు ఇచ్చారు. కానీ కూటమి పార్టీలకు అనుకూలమైన వారు వస్తే మూడు, నాలుగు కట్టలు కూడా ఇచ్చారు. ఐదు, పదెకరాలు కౌలుకు సాగుచేస్తున్న కొంతమంది రైతులకు రెండు కట్టల కంటే మించి ఇవ్వలేదు. వాళ్లిచ్చే యూరియా సగానికి కూడా చాలదని ఏమి చేయాలో తెలియడం లేదని కొంతమంది కౌలురైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఒక ఎకరం సొంత పొలం ఉండగా, మూడు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నా. యూరియా కోసం తెల్లవారుజామున 5 గంటల వచ్చాను. పది గంటలు పడిగాపులు పడితే ఒక కట్ట యూరియా ఇచ్చారు. ఇంతవరకూ ముఖం కూడా కడగలేదు. నాలుగు ఎకరాలకు కనీసం రెండు కట్టలయినా కావాలి. ఒకకట్ట ఇస్తే ఎలా సరిపెట్టాలి. ఇంత దరిద్రం ఎప్పుడూ లేదు. – బచ్చు నాగబసవయ్య, మోదుమూడి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ఖరీఫ్–2025 సీజన్‌కు సంబంధించి ఎరువుల సరఫరాపై సమస్యలు, ఫిర్యాదులతో పాటు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రతి శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో అవసరాల మేరకు సమృద్ధిగా ఎరువులు ఉన్నాయన్నారు. ఎరువుల పంపిణీ ఏర్పాట్లు, ఫిర్యాదులు, సమస్యలను 91549 70454కు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్‌కు తెలియజేయవచ్చన్నారు. -
దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాల ఏర్పాట్లను దుర్గగుడి ఈవో వీకే శీనా నాయక్ బుధవారం పరిశీలించారు. ఇంద్రకీలాద్రి దిగువన క్యూ లైన్ల వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా ఉత్సవాల సమయంలో భక్తులకు మెరుగైన దర్శనం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దసరా ఉత్సవాలకు పాత ఆర్బీ ఫ్రేమ్‌ల స్థానంలో సింహాచలం దేవస్థానం నుంచి తెప్పించిన క్యూ ఫ్రేమ్‌ల ఏర్పాటు పనులను ఆయన పర్యవేక్షించారు. నూతనంగా నిర్మిస్తున్న ప్రసాదం పోటు భవనంలో డ్రెయినేజీ తదితర పనులను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. కొండపై భాగంలో ఏర్పాటు చేస్తున్న కొత్త పూజా మండపాల పనులకు సంబంధించిన వివరాలను ఈఈ–1 కేవీఎస్ కోటేశ్వరరావు ఈఓ శీనా నాయక్‌కు వివరించారు. మిగిలిన 12 బార్లకు నోటిఫికేషన్ విడుదల చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో మిగిలిన 12 బార్లకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి. గంగాధరరావు తెలిపారు. మొత్తం 12బార్లకు గానూ గుడివాడ పట్టణంలో ఆరు, మచిలీపట్నం కార్పొరేషన్లో నాలుగు, పెడన మునిసిపాలిటీలో ఒకటి, బందరు మండలం మంగినపూడిలో ఒక టూరిజం బార్‌కు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. 14వ తేదీ సాయంత్రం 6గంటల వరకు వీటికి దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. 15వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ సమక్షంలో డ్రా తీసి షాపులు కేటాయిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు 9963604239, 8466981837లో సంప్రదించాలన్నారు. ప్రముఖ రేడియాలజిస్ట్ వేమూరికి కీలక పదవి లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడకు చెందిన ప్రముఖ రేడియాలజిస్ట్ వేమూరి నాగ వరప్రసాద్ ఏషియన్ మస్క్యూలో స్కేలేటల్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన సొసైటీ 27వ వార్షిక సమావేశంలో డాక్టర్ వి.ఎన్.వరప్రసాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సొసైటీ ఏర్పాటైన రెండున్నర దశాబ్దాల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయుడు వర ప్రసాద్ కావడం విశేషం. ఆయన ఆగస్టు 2027 వరకూ ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇటీవల కాలం వరకూ ఆయన ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్(ఐఆర్‌ఐఏ)కు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతేకాకుండా ఇండియన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్‌కు(ఐసీఆర్ఐ)కు జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. స్వామిత్వ సర్వేను వేగవంతం చేయాలి నందిగామ రూరల్: గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తున్న స్వామిత్వ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని ఐతవరంలో జరుగుతున్న స్వామిత్వ సర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. ముందుగా సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామ కంఠాలలోని ఇళ్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులను కల్పించేందుకే ప్రభుత్వం స్వామిత్వ సర్వేను నిర్వహిస్తోందన్నారు. స్వామిత్వ సర్వే పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీల ద్వారా జరుగుతున్న సర్వే పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్డీవో బాలకృష్ణ, డీఎల్పీవో రఘువరన్, తహసీల్దార్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్చరీలో రిషి కీర్తన సత్తా లబ్బీపేట(విజయవాడతూర్పు): శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థిని కె. రిషి కీర్తన ఆర్చరీలో సత్తా చాటినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ పద్మజ తెలిపారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆగస్టు 24 నుంచి 26 వరకూ తిరుపతిలో నిర్వహించిన అమరావతి చాంపియన్ షిప్ 2025లో ఆర్చరీలో కె. రిషి కీర్తన ద్వితీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ప్రతిభ చూపిన కీర్తనను ప్రిన్సిపాల్ పద్మజతో పాటు అధ్యాపకులు అభినందించారు. -
తప్పుల్లేని భూ రికార్డులే లక్ష్యం
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కంకిపాడు: ఎలాంటి తప్పులు లేకుండా నాణ్యమైన భూమి రికార్డులను అత్యంత బాధ్యతతో రూపొందించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గుడివాడ, ఉయ్యూరు డివిజన్ల అధికారులకు స్వామిత్వ సర్వేపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం కంకిపాడులోని శ్రీకృష్ణ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటిని, భూమిని సరిహద్దులతో గుర్తించి, సర్వే నంబర్ కేటాయించేలా, భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రికార్డులను రూపొందించేందుకు స్వామిత్వ సర్వే దోహద పడుతుందన్నారు. ఆర్ఎస్ఆర్ మాదిరిగా స్వామిత్వ సర్వే రికార్డులు మదర్ రికార్డు అవుతుందన్నారు. భూమి రికార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పకడ్బందీగా నాణ్యతాయుతంగా రికార్డులను తయారు చేయటంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వహించాలన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, పంచాయతీ అధికారి డాక్టర్ జె.అరుణ, సర్వే భూ రికార్డుల ఏడీ జోషిలా, డీఎల్పీఓ సంపత్‌కుమారి, డీఎల్డీఓ రాజేష్, డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, ఆయా డివిజన్ల పరిధిలోని 175 గ్రామ పంచాయతీలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యాన పంటలతో సుస్థిర ఆదాయం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చందర్లపాడు(నందిగామ టౌన్): ఉద్యాన పంటల సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం లభిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు ఎకరా విస్తీర్ణంలో సాగు చేస్తున్న తైవాన్ జామ తోటను అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది నాలుగు వేల ఎకరాలలో ఉద్యాన పంటలు సాగును లక్ష్యంగా నిర్దేశించుకోగా.. దాదాపు లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. ఎకరా విస్తీర్ణంలో 444 మొక్కలు నాటారని పథకం కింద రూ.2.51 లక్షల సాయం అందుతుందన్నారు. మొదటి ఏడాది రూ.1,26,110, రెండో ఏడాది రూ.60,707, మూడో ఏడాది రూ. 64,407 చొప్పున రైతుకు అందుతుందని తెలిపారు. ఉద్యాన పంటలతో పాటు పశుపోషణను సైతం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. బంగారు కుటుంబాలతో.. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పీ4 సర్వేను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ముప్పాళ్ల గ్రామంలోని బంగారు కుటుంబాల లబ్ధిదారులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలోని చెరువులను పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. నందిగామ పట్టణంలోని గ్రోమోర్ ఎరువులు, పురుగు మందుల దుకాణాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువులు విక్రయించాలని యూరియా, తదితర ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్వామా పీడీ రాము, ఆర్డీవో బాలకృష్ణ, చందర్లపాడు ఎంపీడీవో పద్మజ్యోతి, నందిగామ డెప్యూటీ ఎంపీడీవో నామేశ్వరరావు పాల్గొన్నారు. -
మీ పురస్కారాలు మాకొద్దు!
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎవరికై నా పురస్కారం అనగానే ఎగిరి గంతేస్తారు. ఆ పురస్కారం కోసం ప్రతిభ కలిగిన వ్యక్తులు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అటువంటి అవకాశం వచ్చినప్పుడు వెంటనే దరఖాస్తు చేసుకోవటం సహజం కనిపిస్తుంది. అలాగే దరఖాస్తు చేసుకున్న తరువాత తమకు తెలిసిన ప్రజాప్రతినిధితోనో లేక ఇతర ఉన్నతాధికారులతోనే సిఫార్సులు సైతం చేయిస్తుంటారు. ఇదంతా సహజంగా జరిగే తంతు. కానీ ఈ ఏడాది ఎన్టీఆర్ జిల్లా స్థాయిలో జరిగే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు గురువులు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. విద్యారంగంపై కూటమి ప్రభుత్వం చూపిస్తున్న తీరుపై ఆగ్రహంతో ఉన్న ఉపాధ్యాయులు వారిచ్చే పురస్కారాలకు సైతం ఆసక్తి చూపటం లేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కేవలం 28 దరఖాస్తులే.. ఎన్టీఆర్ జిల్లాలో జరిగే గురుపూజోత్సవానికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఏటా వందలాదిగా దరఖాస్తులు వస్తుంటాయి. వాటి ఎంపికకు పెద్ద కసరత్తు చేసి వారిని ఎంపిక చేస్తుంటారు. కానీ ఈ ఏడాది జిల్లా పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి బుధవారం సాయంత్రానికి కేవలం 28 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీనిపై జిల్లా అధికారులు సైతం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు పురస్కారాలు ఇస్తామని ప్రకటించినా ముందుకు రాకపోవటంపై అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5,160 మంది ఉపాధ్యాయులు ఎన్టీఆర్ జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కింద సుమారుగా 969 ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. ఆయా విద్యాసంస్థలో సుమారుగా 5,160 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వారిలో నాలుగు వేలమందికి పైగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి అర్హులవుతారు. అయితే అందుకోసం వచ్చిన దరఖాస్తుల్లో ఎంపిక చేసేందుకు చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసి 60 మందికి ఇవ్వటానికి అధికారులు సమాయత్తమయ్యారు. తీరా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య కేవలం 28 మంది మాత్రమే ఉండటంతో జిల్లా అధికారులకు ఏమి చేయాలో పాలుపోవటం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకతతోనేనా? ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలపై ఉపాధ్యాయులు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. అందువల్లే కనీసం పురస్కారాలను తీసుకోవటానికి సైతం ముందుకు రాకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయ పడుతున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొన్ని అర్థంపర్ధం లేని యాప్‌లతో సతాయిస్తున్నారని వారు చెబుతున్నారు. తాజాగా విద్యార్థులు రాసిన పరీక్షల మూల్యాంకనం భారంతో ఉపాధ్యాయులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలలోనే ఉండి ఆయా పరీక్షలు రాసిన బుక్లెట్లను దిద్దాలని నిర్ణయించటం వల్ల తరగతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటితో పాటుగా పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవటంపైనా గురువులు తమకిచ్చే పురస్కారాలకు వ్యతిరరేకంగా ఉన్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా స్థాయిలో జరిగే గురుపూజోత్సవం వేడుకల్లో ఏటా విద్యాశాఖ సుమారు 50 నుంచి 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందిస్తోంది. వివిధ కేటగిరీలతో పాటుగా ప్రతిభ ఆధారంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పురస్కారాలను వారికి ప్రదానం చేయటం పరిపాటి. కలెక్టర్ లేదా మంత్రి వంటి ముఖ్యఅతిథుల చేతుల మీదుగా ఆ ప్రదానోత్సవం నిర్వహిస్తారు. ఈ ఏడాది 60 మంది కి పురస్కారాలు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. గత ఏడాది ఈ గురుపూజోత్సవాన్ని నిర్వహించలేదు. దాంతో ఈ ఏడాది ఇంకా అధికంగా గురువులు దరఖాస్తు చేసుకుంటారని అధికాారులు భావించారు. కానీ అందుకు భిన్నంగా దరఖాస్తులే రాకపోవటంపై సర్వత్రా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
పరుగులు పెట్టి.. పడిగాపులు
యూరియా కోసం అన్నదాతల ఆక్రందననాగాయలంక: మండలంలో రైతాంగానికి మంగళవారం యూరియా అందిస్తామని వ్యవసాయశాఖ సమాచారం అందించడంతో రైతులు పెద్ద సంఖ్య లో రైతు సేవా కేంద్రాలకు పరుగులు పెట్టి.. పడిగాపులు కాశారు. నాగాయలంకలోని బస్‌స్టేషన్ సమీపంలోని సేవా కేంద్రంలో ఉదయం 8గంటలకు రైతులకు యూరియా అందిస్తామని మెసేజ్‌లు పెట్టడంతో తెల్లవారుజాము నుంచే నాగాయలంక, మర్రిపాలెం, రేమాలవారిపాలెం రైతులు ఈ కేంద్రానికి తరలివచ్చారు. అయితే 10గంటలు దాటే వరకూ సంబంధిత అధికారులు రాకపోవడంతో రైతులు సంఖ్య భారీగా పెరిగింది. పరిస్థితితో ఆందోళన చెందిన నాగాయలంక ఎస్ఐ కె.రాజేష్ సేవా కేంద్రానికి వచ్చి రైతులతో మాట్లాడారు. అందరూ క్యూలో నిలబడి అధికారులకు సహకరించాలని నచ్చజెప్పారు. 40 టన్నులే స్టాక్.. ఇదే పరిస్థితి మండలంలోని భావదేవరపల్లి, సంగమేశ్వరం, పర్రచివర సేవాకేంద్రాల్లో నెలకొంది. వాస్తవానికి ఈ నాలుగు కేంద్రాలకు కలిపి 40టన్నులు స్టాక్ మాత్రమే అందించినట్లు ఏఓ ఎ.సంజీవకుమార్ చెప్పారు. మరో ఎనిమిది కేంద్రాలకు 80టన్నుల మేరకు ఇండెంట్ పెట్టామని రెండు రోజుల్లో వస్తుందని వివరించారు. 3ఎకరాల లోపు రైతు ఒక బస్తా, ఆపై ఉన్న రైతులకు రెండు బస్తాలు ఇస్తామని, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో రైతులు రావాలని, ఏ గ్రామాల పరిధిలో స్టాక్ వచ్చిందో ఆ పరిధిలో పొలం ఉన్న రైతులు మాత్రమే యూరియా తీసుకోవాలని ఏఓ సూచించారు. కాగా సంగమేశ్వరం రైతు సేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకుడిగా పనిచేస్తున్న వెంకన్నస్వామి నిత్యం మద్యం మత్తులో జోగుతూ రైతులతో గొడవ పడతున్నాడు. ఆ వీడియోలు గ్రామస్తులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం జేడీ దృష్టిలో పెట్టామని ఏఓ సంజీవ్ కుమార్ చెప్పారు. -
గజానికో గండం.. ఈ రోడ్డుకో దండం
కంకిపాడు: ‘సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లను చూస్తారు’ ఇదీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఎంతో ఆర్భాటంగా చేసిన ప్రకటన. సంక్రాంతి దాటి కూడా నెలలు గడిచిపోతున్నాయి. మళ్లీ కొద్ది నెలల్లోనే సంక్రాంతి రాబోతోంది. కానీ రోడ్ల పరిస్థితి ఏమీ మారలేదు. ప్రాధాన్యం గల రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్న కూటమి ప్రభుత్వ మాటలు నీటి మూటలయ్యాయి. ప్రభుత్వ తీరుతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల రహదారి కష్టాలకు మద్దూరు–గోసాల రోడ్డు మార్గమే నిలువెత్తు నిదర్శనం. ప్రయాణం.. నరకప్రాయం.. విజయవాడ–దివిసీమ కరకట్ట రహదారి నుంచి విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిని కలుపుతూ ఉన్న ప్రధాన రహదారి మార్గం మద్దూరు– గోసాల రోడ్డు. ఆర్అండ్బీ శాఖ పరిధిలోని ఈ రోడ్డు మార్గంలో ప్రయాణం అంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. రోడ్డు పూర్తిగా అడుగడుగునా గోతులతో అధ్వానంగా మారింది. రోడ్డు మార్జిన్లు కోతకు గురై ప్రమాదకరంగా తయారయ్యాయి. మద్దూరు, వణుకూరు, గోసాల గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో పాటుగా కరకట్ట మీదుగా విజయవాడ, దివిసీమ ప్రాంతాలకు వెళ్లాలన్నా, ఏలూరు రోడ్డు సమీపంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లాలన్నా మద్దూరు–ఈడుపుగల్లు మీదుగా ఉప్పలూరు రోడ్డు మార్గాన్ని వినియోగిస్తుంటారు. నిత్యం అధిక సంఖ్య లో వాహనాలు రాకపోకలకు సాగుతుంటాయి. అభివృద్ధి ఊసే లేదు.. దశాబ్దకాలం పైగా రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. మద్దూరు, రొయ్యూరు ప్రాంతాల్లో ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి భారీ లోడుతో ఇసుక లారీలు ఈ మార్గం గుండానే ఇసుకను రవాణా సాగించాయి. దీంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై గోతుల మయంగా తయారైంది. చిన్న పాటి వర్షానికే గోతుల్లో నీరు చేరి ప్రయాణం అస్తవ్యస్తంగా మారుతోంది. అంతేకాకుండా వాహనాలు అదుపుతుప్పి ప్రమాదాల బారిన పడటం, తరచూ వాహనాలు మరమ్మతులకు గురవుతుండటం ఇక్కడ సర్వసాధారణమైంది. ఇంకెన్నాళ్లీ ‘దారి’ద్య్రం.. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గోసాల నుంచి మద్దూరు వైపు రోడ్డు దుస్థితి ఇది శంకుస్థాపన చేస్తే.. పనులు రద్దు చేశారు..గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సంక్షేమంతో పాటుగా అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా ఎన్నికల ముందు మద్దూరు–గోసాల–ఉప్పలూరు రోడ్డు అభివృద్ధికి రూ. 19.50 కోట్లు నిధులు కేటాయించింది. సింగిల్ లైన్‌గా ఉన్న రోడ్డును ప్రజల అవసరాల రీత్యా డబుల్ లైన్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అప్పటి మంత్రి జోగి రమేష్ చేతుల మీదుగా ఈడుపుగల్లు సెంటరులో శంకుస్థాపన కూడా చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో పనులు ప్రారంభానికి నోచలేదు. తదుపరి రాజకీయ పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజల ఇబ్బందులను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోని కూటమి ప్రభుత్వం ఈ రోడ్డు అభివృద్ధి పనులను రద్దు చేసింది. కొత్తగా మద్దూరు–గోసాల రోడ్డు అభివృద్ధికి రూ 6.50 కోట్లతో అంచనాలను నివేదించి సరిపెట్టేసింది. గోతులమయంగా మద్దూరు–గోసాల రహదారి -
బెల్టు షాపు తొలగించాలంటూ రోడ్డెక్కిన మహిళలు
షేర్‌మహ్మద్‌పేట(జగ్గయ్యపేట): మద్యం బెల్ట్ షాప్ తొలగించాలంటూ మహిళలు ఆందోళన చేసిన సంఘటన షేర్‌మహ్మద్‌పేట మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలోని గ్రామ సచివాలయానికి ఎదురుగా గత కొంతకాలంగా బెల్టు షాప్ నడుస్తోంది. మధ్యాహ్న సమయంలో షాపు వద్ద మందుబాబులు రోడ్డుపై వెళ్తున్న మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో గ్రామంలోని మహిళలు ఐద్వా ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. పలువురు మహిళలు మాట్లాడుతూ మందుబాబులు మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడంతోపాటు మద్యం సీసాలను సమీపంలోని ప్రభుత్వ భవనాలు వద్ద పగలగొడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. ఇటీవల అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోవడం లేదన్నారు. విషయం తెలుసుకున్న చిల్లకల్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన విరమించాలంటూ చెప్పినప్పటికీ వారు షాపు తొలగించే వరకు ఆందోళన చేస్తామని చెప్పడంతో కొద్దిసేపు ఉద్ధృత వాతావరణం చోటుచేసుకుంది. బుధవారం ఉదయానికి షాపును పూర్తిగా తొలగిస్తామని చెప్పడంతో మహిళలు శాంతించారు. కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు ఎస్. నాగమణి సీపీఎం నాయకులు కోట కష్ణ, గౌస్ మియా, కాకనబోయిన వెంకటేశ్వర్లు, జుజ్జవరపు వెంకటరావు, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం బారులు
ఉంగుటూరు(గన్నవరం): మండల కేంద్రమైన ఉంగుటూరులోని మన గ్రోమోర్ సెంటర్ వద్ద మంగళవారం యూరియా కోసం వందలాది మంది రైతులు బారులు తీరారు. యూరియా స్టాక్ వచ్చిన విషయం తెలుసుకున్న పరిసర గ్రామాలకు చెందిన రైతులు భారీగా ఆ సెంటర్‌కు తరలివచ్చారు. అన్నదాతల రద్దీని దృష్టిని పెట్టు కుని తోపులాట జరగకుండా పోలీసులు బందో బస్తు నిర్వహించారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో రావడం గమనార్హం. అయితే గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ యూరియా దొరక్కపోవడంతో కొంత మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఒక్కొక్క రైతుకు రెండు యూరియా బస్తాలు అందించినట్లు మండల వ్యవసా యాధికారి జి. రమేష్ తెలిపారు. తహసీల్దార్ విమలకుమారి, ఎస్ఐ యూ. గోవిందు పర్యవేక్షించారు. మొత్తం రెండు మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు వివరించారు. విజిలెన్స్ డీఎస్పీ పరిశీలన.. ఉంగుటూరులో యూరియా కోసం రైతులు భారీగా తరలిరావడంతో విజిలెన్స్ డీఎస్పీ బంగా ర్రాజు నేతృత్వంలో బృందం అక్కడికి చేరుకుని పంపిణీ వ్యవస్ధను పరిశీలించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ డీఎస్పీని కలిసిన కౌలు రైతు సంఘం నాయకులు టీవీ లక్ష్మణస్వామి, అజ్మీరా వెంకటేశ్వరరావు తదితరులు రైతుల యూరియా ఇబ్బందులను వివరించారురు. రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. -
జనసేన కార్యకర్తల అతి
ఇబ్రహీంపట్నం: ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో వైఎస్సార్ సీపీ, జనసేన కార్యకర్తల నడుమ మంగళవారం వివాదం చోటుచేసుకుంది. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మాజీ మంత్రి జోగి రమేష్ కార్యకర్తలతో వైఎస్సార్ చిత్రపటం(ఫ్లెక్సీ)కు పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఆయన వేరే కార్యక్రమానికి బయలుదేరిన మరుక్షణం వైఎస్సార్ బ్యానర్‌పై పవన్‌కల్యాణ్ బ్యానర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన జనసేక కార్యకర్తలను కొందరు వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదులాట జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ ఫణీంద్ర సిబ్బందితో చేరుకున్నారు. దగ్గరుండి వైఎస్సార్ బ్యానర్‌పై పవన్‌కల్యాణ్ బ్యానర్ ఏర్పాటు చేయించి జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు తమ పూర్తి సహకారం అందించారు. కూటమి నేతలు, పోలీసుల తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. పవన్ కార్యక్రమం ముందు జరిగి ఉంటే వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం వేరే ప్రాంతంలో పెట్టుకోవాలని పోలీసులు చెప్పేవారని చర్చించుకున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి పోలీసులు ఇచ్చే గౌరవం ఇదా అని ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. -
లారీ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోడ్డుదాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన భవానీపురం బ్యాంక్ సెంటర్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై భవానీపురం బ్యాంక్ సెంటర్ సమీపంలో ఒక వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. ఆ సమయంలో స్వాతి సెంటర్ వైపు నుంచి వస్తున్న లారీ ఆ వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో అతని చేయి నుజ్జునుజ్జు అయింది. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వయస్సు 40ఏళ్లు ఉంటుంది. అతని పూర్తి వివరాలు తెలియలేదు. దీనిపై సచివాలయ మహిళా పోలీసు వెంపటి శ్రీవల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆకాంక్షిత మండలాలకు నీతి ఆయోగ్ పట్టం
అభినందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ భవానీపురం(విజయవాడపశ్చిమ): కేంద్రం ప్రకటించిన ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు ఆకాంక్షిత మండలాలు.. ఆదర్శ మండలాలుగా నిలవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమరోహ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ రెండు మండలాలకు నీతి అయోగ్ బంగారు పతకాలను ప్రకటించగా ఈ ప్రగతిలో భాగస్వాములైన అధికారులు, సిబ్బందికి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశతో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. బంగారు పతకాలు రావడం అభినందనీయం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ జిల్లాలోని రెండు మండలాలకు నీతి ఆయోగ్ బంగారు పతకాలు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం, డీఆర్డీఎ అధికారుల కృషి కారణంగా ఈ విజయం సాధించామని తెలిపారు. సత్కారం పొందిన అధికారులు ఇవే.. సీపీఓ వై. శ్రీలత, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం. సుహాసిని, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా, జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు ఉన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు ఎంపీడీఓలు, ఏబీపీ కో ఆర్డినేటర్లు జి. మోహన్ సందీప్, పి. శ్రీనివాస్, వివిధ మండల స్థాయి అధికారులు, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి ఫ్రంట్‌లైన్ వర్కర్లు సత్కారం అందుకున్నారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, నందిగామ ఆర్డీఓ కె. బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిష్ట పెరిగేలా విజయవాడ ఉత్సవ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర రాజధాని అమరావతి పేరు, ప్రతిష్ట పెరిగేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి వీసీ హాల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై మంగళవారం సమావేశం జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్, కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాల ద్వారా సాంస్కృతిక సంప్రదాయాల వారసత్వ సంపదను భావితరా లకు అందించేందుకు వీలుంటుందన్నారు. నగ రంలో తొలిసారిగా భారీఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని విధాలా అంచనాలను సిద్ధం చేసుకొని, ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. దసరా ఉత్సవాలతో పాటు భక్తులకు ఈ ఆధ్యాత్మిక పర్యటన మధురానుభూతులు మిగిల్చేలా పర్యాటకానికి కూడా ఊపు తెచ్చేలా ఉత్సవ్ ఉంటుందన్నారు. ఉత్సవాల విజయవంతానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం, పున్నమి ఘాట్, గొల్ల పూడి ఎగ్జిబిషన్ వేదిక తదితరాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. హోల్డింగ్ ప్రాంతాల ఏర్పాటు, పటిష్ట భద్రత, నగర సుందరీకరణ, తాగునీరు, పారిశుద్ధ్యం, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా, ఫుడ్ కోర్టుల ఏర్పాటు, హెలీ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, సంప్రదాయ కళా ప్రదర్శనలు తదితరాలపై సమావేశంలో చర్చించి చేయాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఈఓ శీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ -
మహానేతా.. మనసాస్మరామి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మహానేత వైఎస్ రాజ శేఖరరెడ్డి సంక్షేమ పాలనకు సరికొత్త అర్థం చెప్పారు. జనరంజక పాలన అంటే ఏమిటో చేసి చూపించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారు. తన ఐదేళ్ల పాలనతోనే జనం మదిలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అలాంటి మహానేత ఈ లోకాన్ని విడిచి పుష్కర కాలం గడిచినా ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా జిల్లాలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, నాయకులు, అభిమానులు ఆయనను మంగళవారం మనసారా స్మరించుకున్నారు. వాడవాడలా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ మహనీయుడి సేవ లను కీర్తించారు. ఆయనకు నివాళిగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పేదలకు చీరలు, నిత్యావసర సరుకులు, రోగులకు పండ్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.●డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్సార్ కాంస్య విగ్రహానికి వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యనేతలు, అనుబంధ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు ఆయన చేసిన సేవలను కొనియా డారు. మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాస రావు, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, పార్టీ ముఖ్యనేతలు పూనూరు గౌతంరెడ్డి, అంజిరెడ్డి, పోతిన మహేష్, ఆసిఫ్, రవిచంద్ర, వేములకొండ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.● విజయవాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో స్థానిక కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, వైఎస్సార్ సీపీ నాయకులు నిర్వహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో నియోజకవర్గ ఇన్చార్జ్, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు, డివిజన్ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.● విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జ్‌ల ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి.్ల మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.● విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జన హిత సదనం, మల్లాది విష్ణు కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి ఆధ్వర్యంలో రెండు వేల మందికి అన్నదానం చేశారు.● మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీం పట్నం, కొండపల్లి పరిధిలో ఏడు చోట్ల, కేతనకొండ, దొనబండ, దాములూరు, జూపూడి, మూలపాడు, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి, జి.కొండూరు, మైలవరం మండలాల్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నియోజ కవర్గ ఇన్చార్జ్ జోగి రమేష్, రాష్ట్ర కార్యదర్శులు అప్పిడి కిరణ్‌కుమార్ రెడ్డి, వేములకొండ తిరుపతిరావు, సర్నాల తిరుపతిరావు పాల్గొన్నారు.● నందిగామ నియోజకవర్గంలో వాడవాడలా మహానేత డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. నందిగామ, కంచికచర్ల, గొట్టిముక్కల, అల్లూరు, పెద్దాపురం, చందర్లపాడు గ్రామాల్లో నిర్వహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్, పార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.● తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరులో వైఎస్సార్ సీపీ కార్యాలయం, సీఐ కార్యాలయం సెంటరు, రాజుపేట బైపాస్‌రోడ్డు, బోయ కాలనీల్లో నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ట స్వామిదాసుతో పాటు సూర్యనారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి, నవీన్‌తో పాటు పార్టీ ముఖ్యనేతలు, శ్రేణులు పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.● జగ్గయ్యపేటలోని విలియంపేట, కన్యాకుమార్ పాన్‌షాపు సెంటర్, క్రిస్టియన్‌పేట, కోదాడ రోడ్డు యాక్సిస్ బ్యాంకు ఏటీఎం సెంటర్, బస్టాండ్, విజయవాడ బైపాస్ రోడ్డు సెంటర్, దనంబోడు, తొర్రకుంటపాలెం, బొడ్రాయి సెంటర్లలో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజ గోపాల్(చిన్నా) పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు మండల పరిధిలోని శనగపాడు గ్రామం, వెంగనాయకునిపాలెం, వెంకటాపురం, పొన్నవరం గ్రామాల్లో బైకు ర్యాలీలు నిర్వహించారు. కొల్లికొళ్లలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో కలిసి తన్నీరు నాగేశ్వరరావు ఆవిష్కరించారు. -
పోలీస్ గ్రీవెన్స్‌కు 83 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 83 ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 83 ఫిర్యాదులు రాగా, వాటిలో భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 35, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి 4, కొట్లాటలపై 2, వివిధ మోసాలపై 4, మహిళా సంబంధిత నేరాలపై 20, దొంగతనాలకు సంబంధించి 3, ఇతర చిన్న వివాదాలపై 15 ఫిర్యాదులు అందాయి. కాగా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత ఎస్హెచ్ఓలకు పంపి, సత్వరమే చర్యలు తీసుకోవాలని డీసీపీ ఉదయరాణి ఆదేశించారు. ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వృద్ధులు, వికలాంగుల వద్దకే వెళ్లి అర్జీ స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యరంగంలో జీవనోపాధుల మెరుగుదలకు చర్యలు కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): తీరప్రాంతాల్లో మత్స్యరంగంలో జీవనోపాధుల మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గ్రీన్ క్లైమెట్ ఫండ్స్ పై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పీతల సాగు, సముద్రనాచు సాగు, అలంకార చేపల పెంపకం, మైరెన్ ఫిష్ కేజ్ కల్చర్, మడ అడవుల పెంపకం, సంరక్షణకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఆయన అధికారులతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో తీరప్రాంతం కలిగిన జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధి, జీవనోపాధులకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను వంటి తీరప్రాంత మండలాలు పీతల సాగుకు అవసరమైన ప్రాంతమని అందుకు అవసరమైన పీతలసీడ్ను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి ఆసుపత్రిలోకి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన గొల్లపూడిలో చోటుచేసుకుంది. రాయనపాడుకు చెందిన మందా రాకేష్ రాడ్ బెండింగ్ మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. ఆయనకు గొల్లపూడికి చెందిన లతతో వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆగస్టు 29వ తేదీ సాయంత్రం వెస్ట్ బైపాస్ ఫ్లై ఓవర్ వద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. అక్కడ నుంచి గొల్లపూడిలోని అత్తారింటికి వచ్చి తాను పురుగు మందు తాగిన విషయం తెలిపాడు. వెంటనే భవానీపురంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు
ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలను అందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు అందుకున్నారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని సమస్యలను సంబంధిత అధికారులకు అప్పగించి బాఽధితులకు వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు పోలీసుశాఖ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోలీసు వ్యవస్థ ప్రత్యక్షమవుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా మీకోసంలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. తన దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కారం చూపిస్తానని చెప్పారు. అలాగే మీకోసం ద్వారా న్యాయం జరగని బాధితులు ఎవరైనా ఉంటే తనను మరలా కలిసి జరిగిన విషయాన్ని వివరించి న్యాయం కోరవచ్చునన్నారు. మీ కోసంలో 39 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. -
పింఛన్లతో సామాజిక భద్రతకు భరోసా
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ చిల్లకల్లు(జగ్గయ్యపేట): ఎన్టీఆర్ పింఛన్లతో పేదల సామాజిక భద్రతకు భరోసా లభిస్తుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గ్రామంలో ప్రారంభమైన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్‌దారులకు ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయాలని సూచించారు. జిల్లాలో 2,30,277 పింఛన్లకు గాను దాదాపు రూ. 99.55 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సిబ్బందితో ఇంటి వద్దనే పింఛన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా ప్రతినెలా పింఛన్ల పంపిణీ చేస్తున్నామన్నారు. సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పంపిణీలో పాల్గొంటున్నట్లు తెలిపారు. గ్రామంలోని మూడు కుటుంబాల లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, నందిగామ ఆర్డీవో బాలకృష్ణ, డీఆర్డీఏ పీడీ నాంచారరావు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఎంపీడీవో నితిన్, ఇన్చార్జ్ తహసీల్దార్ మనోహర్, తదితరులు పాల్గొన్నారు. -
పీ–4 కార్యక్రమాన్ని వేగవంతం చేయండి
కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పీ–4 కార్యక్రమాన్ని నిబంధనలకు అనుగుణంగా వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తో కలిసి పీ–4 కార్యక్రమం పురోగతిపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 78,670 కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామని చెప్పారు. ఇందులో అత్యధికంగా పెడన నియోజకవర్గంలో 12,661, అత్యల్పంగా పెనమలూరు నియోజకవర్గంలో 8,813 కుటుంబాలు గుర్తించామని పేర్కొన్నారు. వీటిలో 47,876 బంగారు కుటుంబాలను 4,286 మార్గదర్శిలకు అనుసంధానం చేసి దత్తత ఇచ్చామని వెల్లడించారు. జిల్లాకు చెందిన ధనికులు, ప్రముఖులు దాతృత్వం, మానవత్వం కలిగిన వ్యక్తులు స్థానికంగా గానీ ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న వారి వివరాలను సేకరించి పీ–4 కార్యక్రమం గురించి వారికి అవగాహన కల్పించి స్వచ్ఛందంగా చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చేలా చొరవ చూపాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్‌కుమార్, మెప్మా పీడీ పి. సాయిబాబు, డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్, పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం తదితరులు పాల్గొన్నారు. -
కోరలు విప్పిన కాల్‌మనీ!
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరంలో కాల్‌మనీ వ్యాపారులు మళ్లీ కోరలు విప్పుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో విచ్చలవిడిగా వడ్డీలు వసూలు చేస్తున్నారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వనివారిపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారు. అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇదే విధంగా తండ్రీ కుమారులపై కాల్‌మనీ వ్యాపారి దాడులకు తెగబడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. 57వ డివిజన్ న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన బలసాని స్వామిదాస్ రియల్ ఎస్టేట్‌లో మధ్యవర్తిత్వం చేస్తుంటాడు, కూలీ పనులు చేసుకుంటూ ఉంటాడు. కరోనా వైరస్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో చింతా చందు అనే కాల్‌మనీ వ్యాపారి తల్లి వద్ద రూ.85 వేలు అప్పుగా తీసుకొని ఆమెకు నెల నెలా వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నాడు. ఆమె రెండేళ్ల క్రితం కాలం చేయడంతో ఆ సమయంలో కూడా అసలులో రూ.20 వేలు ఇచ్చారు. ఆ తరువాత ఆమె కొడుకు చందు తన తల్లికి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించాలని అడిగాడు. మరో రూ.40 వేలు మాత్రమే ఇవ్వాలని స్వామిదాస్ చెప్పగా అవన్నీ తన వద్ద కుదరదని, తమది కాల్ మనీ అని, లక్ష రూపాయలు కట్టాల్సిందేనని గొడవపడి భయపెట్టాడు. దీంతో చేసేది లేక లక్ష కడతామని ఒప్పుకున్నారు. గతేడాది బుడమేరు వరదల్లో అంతా నష్టపోయామని చెప్పినా కూడా వినకుండా మొత్తం రూ.3 లక్షలకు పైగా అసలు, వడ్డీల చొప్పున డబ్బులు కట్టించుకున్నారు. చికిత్స చేయించు కుంటున్న స్వామిదాస్ తలకు కుట్లు పడిన లాజర్ రూ.15 వేల కోసం తలపగలకొట్టిన వైనం... దఫదఫాలుగా అప్పు తీర్చుకుంటూ వస్తున్న స్వామి దాసు ఇంకా రూ.15 వేలు ఇవ్వాల్సి ఉండడంతో సెప్టెంబర్ ఒకటో తేదీన ఆ డబ్బులు ఇచ్చేస్తానని చెప్పారు. దానికి సరే అని చెప్పిన చందు ఆగస్టు 31వ తేదీన స్వామిదాస్‌కు ఫోను చేసి అసభ్యకరంగా తిడుతూ ఈ రోజే నాడబ్బులు ఇచ్చేయాలి లేకపోతే నిన్ను చంపేస్తా అంటూ కులం పేరుతో బూతులు తిట్టాడు. స్వామిదాసు వారి ఇంటి ముందు వేసిన వినాయకచవితి పందిరి వద్ద ఆదివారం రాత్రి కూర్చొని ఉండగా చందు ఒక్కసారిగా స్వామిదాసుపై దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న స్వామిదాసు కుమారుడు తన తండ్రిని కొట్టవద్దంటూ అడ్డురాగా రాయితో అతని తల పగలకొట్టాడు. ఈ ఘటనలో స్వామిదాసు ముఖంపై, చేతికి, ఒంటిపై గాయాలుకాగా అతని కుమారుడు లాజర్ తలపగిలి కుట్లుపడ్డాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించగా చింతా చందు అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. కాల్‌మనీ వ్యాపారులకు అండగా టీడీపీ నాయకులు రంగంలోకి దిగి కేసు రాజీ చేసేందుకు ప్రయత్నించారు. వినాయక చవితి బందోబస్తు నేపథ్యంలో దీనిపై ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పుకొచ్చారు. -
నేరస్తుల వైపే చంద్రబాబు, పవన్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): గత టీడీపీ ప్రభుత్వంలోనే గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై లైంగికదాడి, హత్య జరిగాయని.. ఆ ప్రభుత్వం న్యాయం చేయలేదని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నేరస్తుల వైపు ఉన్నారని, 2017 నుంచి 2019 వరకు కేసును తాత్సారం చేశారని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లాలోని కట్టమంచి స్కూల్లో 2017 ఆగస్టు 18వ తేదీన సుగాలి ప్రీతి ఘటన జరిగిందని గుర్తుచేశారు. ‘2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉంది. బీజేపీ అందులో భాగస్వామిగా ఉంది. పవన్‌కల్యాణ్ వాళ్లతో కలిసి పనిచేస్తున్నారు. ప్రీతి కేసును విచారించి నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాల్సిన నాటి టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. నేరస్తులకు కొమ్ము కాసింది..’ అంటూ మండిపడ్డారు. ఆనాడు ప్రీతి తల్లిదండ్రులు అడగని నాయకుడు, తొక్కని గుమ్మం లేదన్నారు. 2018లో హైదారాబాద్‌లో జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్‌కల్యాణ్‌కు ఫైల్ ఇచ్చారని చెప్పారు. 14 ఏళ్ల పసిబిడ్డ జీవితం నాశనమైపోతే ఎలా ఊరుకుంటారంటూ ఊగిపోయి మాట్లాడిన పవన్‌కల్యాణ్.. అప్పటి సీఎం చంద్రబాబును ప్రశ్నించలేదని, విచారణ చేయమని కోరలేదని చెప్పారు. నేరస్తులకు శిక్షపడే విధంగా చేయలేదని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఆ కుటుంబానికి రావాల్సిన ప్రయోజనాలు కూడా అందించలేదని విమర్శించారు. 2017 నుంచి 2019 వరకు రెండేళ్లు కేసును తాత్సారం చేశారని విమర్శించారు. రాజకీయంగా కేసును వాడుకొని.. తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పడి పోవడంతో పవన్‌కల్యాణ్ ఈ కేసును రాజకీయంగా వాడుకుని ఎన్నికల్లో లబ్ధిపొందారని విజయ్‌కుమార్ తెలిపారు. ఎన్నికలైన తర్వాత కూడా చంద్రబాబు నేరస్తులకు కొమ్ము కాశారని, అందుకే మొదటి సంతకం అన్న పవన్ కల్యాణ్ యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. డీఎన్ఏలు మ్యాచ్ కాలేదని పవన్‌కల్యాణ్‌కు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. నాడు, నేడు నేరస్తులకు కొమ్ము కాస్తున్నందునే పవన్‌కల్యాణ్ ఈ కేసులో మాట మార్చారని చెప్పారు. ఈ కేసును పునర్విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నతవిద్యను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. -
రాజీనామా బాటలో రేషన్ డీలర్లు!
పెడన: కొందరు రేషన్ డీలర్లు రాజీనామాల బాటలో పయనిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో వెట్టిచాకిరీ తాము చేయలేమని తేల్చి చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రశాంతంగా ఉన్న తాము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అష్టకష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే కమీషన్ అతి తక్కువగా ఉంటుందని... తమతో చేయించే పని ఎక్కువగా ఉంటుందని వాపోతున్నారు. కమీషన్ పెంచాలని ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం ఉండటం లేదని అంటున్నారు. ఎప్పటికి పెంచుతారో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న పని చేయడం కష్టమని, తప్పుకోవడమే మేలని వెల్లడిస్తున్నారు. పెడన పట్టణంలో జూన్ నెలలో ఎంతో ఆర్భాటంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించిన షాపు నెంబరు ఏడు డీలరు ఐవీ పద్మావతి రాజీనామా చేశారు. ఈ షాపును విజేత డ్వాక్రా గ్రూపునకు అప్పగించారు. గ్రూపు లీడరు పి.కృష్ణప్రియ బాధ్యతలు చేపట్టారు. మండల పరిధిలోని దావోజిపాలెం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కె.నాగమల్లేశ్వరరావు కూడా రాజీనామా అందజేశారు. అయితే ఈయన రాజీనామాను అధికారులు ఇంకా ఆమోదించలేదు. పట్టణంలోని మరో మహిళా డీలరు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో హాయిగా... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే హాయిగా ఉన్నామని, ఇప్పుడు ఈ చాకిరీ చేయలేకపోతున్నామనే విషయాన్ని డీలర్లు పేర్కొంటున్నారు. గతంలో క్వింటాకు రూ.100 చొప్పున ఒక డీలరుకు సుమారు రూ.7వేలు నుంచి రూ.12 వేలు వరకు కమీషన్ వచ్చేది. ప్రస్తుతం వికలాంగులకు, 60 సంవత్సరాలకు పైబడిన వృద్ధుల ఇళ్లకు తీసుకువెళ్లి రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో రేషన్ డీలర్లు ఒక హెల్పెర్ను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ హెల్పెర్కు రూ.5వేలు నుంచి రూ.6వేలు సమర్పించుకోవాల్సి వస్తుంది. ఇంటింటికి రేషన్ తీసుకువెళ్లి ఇవ్వడానికి ఒక్కొ డీలరుకు 25 నుంచి 150 ఇళ్లకు వెళ్లి ఇంటింటికి రేషన్ అందించాల్సి వస్తోంది. ద్విచక్ర వాహనంపై ఆయా ఇళ్లకు తిరగడానికి పెట్రోల్ ఖర్చులు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వెచ్చిస్తున్నారు. అదనంగా చాకిరీ చేయాల్సి రావడంతో ఇంత కష్టం ఎందుకు..రాజీనామాయే బెటర్ అంటున్నారు. -
మది మదిలో రాజర్షి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి కృష్ణా జిల్లాపై చెరగని ముద్ర వేశారు. ఇప్పటికీ ఆయన చేసిన సేవలను ప్రజలు కొనియాడుతున్నారు. మంగళవారం ఆయన వర్ధంతిని పురస్కరించుకొని జిల్లాకు ఆయన చేసిన అభివృద్ధిని జిల్లా వాసులు మరోసారి మననం చేసుకుంటున్నారు. మరోవైపు వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఆ పేరే ప్రత్యేకం.. వైఎస్సార్.. ఈ పేరు వింటేనే ఏదో ఆత్మీయత, కొండంత భరోసా, అభివృద్ధికి చిరునామాగా ప్రజలు తలుస్తారు. జలయజ్ఞంతో రైతుల పాలిట అపర భగీరథుడిగా.. ఆరోగ్యశ్రీతో పేదల గుండెల్లో ఊపిరిగా.. అభివృద్ధిని చేతల్లో చేసి చూపించిన సిసలైన నాయకుడిగా నిలిచిపోయారు. అందుకే ఆ మహానీయుడు భౌతికంగా దూరమై ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ అందరి మదిలో కొలువై ఉన్నారు. ‘నమస్తే అక్కయ్య.. నమస్తే చెల్లెమ్మ.. నమస్తే తమ్ముడూ’ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ పిలుపు అందరి చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. -
పేదరిక నిర్మూలనే పీ4 లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ నందిగామ టౌన్: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పీ4 కార్యక్రమం యజ్ఞంలా అమలవుతోందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన బంగారు కుటుంబం లబ్ధిదారు కోట వెంకటరత్నం కుటుంబానికి కేసీపీ లిమిటెడ్ ప్రతినిధులతో కలిసి సోమవారం ఆయన స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ఆటోను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దాదాపు లక్ష బంగారు కుటుంబాలుండగా 6,400 మంది మార్గదర్శులు ముందుకు వచ్చారన్నారు. బంగారు కుటుంబాల అభివృద్ధికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో చేయూతనందిస్తున్నారని అవసరమైన వారికి వైద్య, విద్య, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి మార్గాలు, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆటో ఖర్చులో 60 శాతం మొత్తాన్ని కేసీపీ అందించగా మిగిలిన 40 శాతంను బ్యాంకు రుణంగా అందించామని చెప్పారు. ఆర్డీవో బాలకృష్ణ, కేసీపీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మధుసూదనరావు పాల్గొన్నారు. పాడి పరిశ్రమలో భాగస్వాములు కావాలి చిల్లకల్లు(జగ్గయ్యపేట): రైతులు పాడి పరిశ్రమలో భాగస్వాములై విస్తరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. చిల్లకల్లు పాల శీతలీకరణ కేంద్రంలో కృష్ణామిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో పెయ్య దూడలు పెట్టే వీర్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీ4 కార్యక్రమాన్ని స్ఫూర్తిగా కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతులను ఆదుకునేందుకు అంకిత భావంతో పని చేయటం హర్షణీయమన్నారు. పాడి పరిశ్రమకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందన్నారు. పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర నాయుడు మాట్లాడుతూ రైతుకు పాడి గేదె ఉంటే ఆదాయ వనరుగా మారుతుందన్నారు. గ్రామాలలో పచ్చిగడ్డి అందుబాటులో ఉండేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ వీర్యం డోసు కేవలం రూ. 50లకే అందిస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ జేడీ హనుమంతరావు, శ్రీనివాసరావు, విజయ డెయిరీ చైర్మన్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
బుడమేరు ముంపు నివారణలో కూటమి వైఫల్యం
బుడమేరు ముంపు బాధితుల ఐక్యవేదిక ధర్నా గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బుడమేరు వరద ముంపు నివారణ చర్యల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ అర్బన్ సిటిజన్స్ ఫెడరేషన్ కన్వీనర్ సీహెచ్ బాబూరావు ధ్వజమెత్తారు. బుడమేరు వరదల సందర్భంలో హడావిడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత శాశ్వత నివారణ చర్యలను విస్మరించిందన్నారు. బుడమేరు వరద ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతూ బుడమేరు ముంపు బాధితుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. బుడమేరు వరద ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని, బాధితులందరికీ సహాయం అందించాలని నినాదాలు చేశారు. ధర్నాలో పాల్గొన్న సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ 2047 నాటికి ప్రణాళికలు రచిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, తక్షణ సమస్యగా ఉన్న బుడమేరు వరదను శాశ్వతంగా నివారించడానికి మాత్రం ప్రణాళికలు రచించడం లేదన్నారు. రూ. 80 వేల కోట్ల ఖర్చుతో బనకచర్ల ప్రాజెక్టును నిర్మించటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. బుడమేరు వరద శాశ్వత నివారణకు ఎందుకు చర్యలు చేపట్టటంలేదని ప్రశ్నించారు, ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకోని పక్షంలో ప్రజలు ఆందోళన చేయటానికి సిధ్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అనంతరం ముంపు ప్రాంతాలకు చెందిన వివిధ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ లక్ష్మీశను కలిసి వినతి మెమోరాండం అందజేశారు. మిత్రా కమిటీ సిఫార్సుల ప్రకారం వెలగలేరు రెగ్యులేటర్ కు ఎగువన రిజర్వాయర్లు నిర్మించాలని, బుడమేరు డ్రైవర్షన్ ఛానల్ వెడల్పు పెంచి కనీసం 35,000 క్యుసెక్కులకు పెంచాలని, విజయవాడ నగరానికి ముంపు లేకుండా మరొక అదనపు కాలువ నిర్మించి వరద నీరు ఎప్పటికప్పుడు పోయేవిధంగా ఏర్పాటు చేయాలని, బుడమేరు లోతు, వెడల్పు పెంచి రెండు వైపుల రిటైనింగ్ వాల్ నిర్మించాలని, బుడమేరు పూడికల తీయించి రివెటింగ్ చేయించాలని కలెక్టర్‌కు ఇచ్చిన మెమోరాండంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జె. మంగపతి, యు. వి. కృష్ణయ్య, కార్పొరేటర్ సత్తిబాబు, ఎస్.కే. సలీమ్, పిల్లి మహేష్, వాసు, మాచర్ల లింగరాజు, కే.సరోజ, షకీల, పౌర సంక్షేమసంఘం నాయకులు బి.రమణారావు, పులి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సమస్యల పరిష్కారంలో ఉదాసీనతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై సస్పెన్షన్ వేటు తప్పదని అధికారులను ఆయన హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించారు. ఎండార్స్మెంట్ ఇచ్చేసి చేతులు దులుపుకొంటే సహించేది లేదని.. తప్పనిసరిగా సమస్యకు సరైన విధంగా పరిష్కారం చూపాల్సిందేనని స్పష్టం చేశారు. కొత్త విధానంలో.. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లో కలెక్టర్ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటివరకు కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్కు అర్జీదారుడు వారి సమస్యపై నేరుగా వేదిక వద్ద ఉన్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వోలను కలిసి అర్జీలను సమర్పించి విన్నవించుకునేవారు. అర్జీదారుని సమస్యను విని పరిష్కారం కోసం సంబంధిత జిల్లా అధికారులను పిలిచి అర్జీలను అప్పగించేవారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ ఇందుకు భిన్నంగా కొనసాగింది. అర్జీదారుడు వారి అర్జీలను నమోదు చేసుకొని ముందుగా సమస్యకు సంబంధించిన జిల్లా అధికారిని కలిసే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. సమస్యకు గల కారణాలు అధికారి తెలుసుకొని, గతంలో కింది స్థాయి అధికారులు అలసత్వం లేదా ఇబ్బందులకు గురి చేయడం వంటివి ఏవైనా జరిగితే వాటిని నమోదు చేస్తారు. ఆ తర్వాత తదుపరి చర్యల నిమిత్తం అర్జీదారును కలెక్టర్ వద్దకు పంపుతారు. సమస్య పరిష్కారంలో కింది స్థాయిలో జరుగుతున్న జాప్యాన్ని, అలసత్వం, అర్జీదారుడు పడుతున్న ఇబ్బందులు వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత వరకు జిల్లా అధికారుల స్థాయిలోనే పరిష్కారం చూపాలన్నారు. ఈ విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే అర్జీలో నమోదు చేసి, తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 92 అర్జీలు అందాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్‌సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె.పోసిబాబు, ఏసీపీ కె.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సరోగసీ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): సహాయక పునరుత్పత్తి సాంకేతికతతో సరోగసి(అద్దె గర్భం) ద్వారా బిడ్డలను పొందడానికి చట్టపరంగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. దంపతులకు సంతానం లేనప్పుడు, వారి బిడ్డను మరొక మహిళ తన గర్భంలో పెంచి , తర్వాత వారికి అప్పగించే విధానాన్ని సరోగసి, దత్తత గర్భధారణ అని కూడా అంటారని తెలిపారు. సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 ప్రకారం వాణిజ్య పరమైన సరోగసీ నిషేధించినట్లు తెలిపారు. కేవలం పరోపకార సరోగసి మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. సరోగసీ ద్వారా బిడ్డలు పొందాలనుకునే దంపతులు తప్పనిసరిగా భారతీయులైన ఉండాలని, విదేశీయులు, సింగిల్ పురుషులు ఈ సరోగసీకి అర్హులు కాదన్నారు. సరోగేట్ మదర్ 21–35 ఏళ్లు మధ్య వయస్సుతో పాటు, కనీసం ఒక బిడ్డను కలిగి ఉండాలని తెలిపారు. తన జీవితంలో రెండు సార్లు మాత్రమే సరోగేట్ తల్లిగా ఇవ్వవచ్చని పేర్కొన్నారు. వాణిజ్య లాభం కోసం చేస్తే జైలుశిక్ష, జరిమానా విధించడం జరుగుతుందని, అద్దె గర్భం పొందేందుకు ముందు సరోగేట్ మదర్ నుంచి రాత పూర్వక అంగీకారం తీసుకోవాలని సూచించారు. ఈ పక్రియలో లైంగిక ఎంపిక నిషేధమని, అద్దె గర్భం ఇచ్చు తల్లి పిల్లలు ఆరోగ్య పరిరక్షణకు నియమ నిబంధనలు ఉన్నట్లు తెలిపారు. -
ఎన్టీటీపీఎస్ ప్లాంట్‌లో బూడిద లారీ బోల్తా
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ ప్లాంట్‌లో బూడిద రవాణా చేసే ట్యాంకర్ లారీ శనివారం రాత్రి బోల్తా పడింది. జగ్గయ్యపేట సమీపంలోని సిమెంట్ ఫ్యాకర్టీలకు బూడిద తరలించే నేపథ్యంలో మద్యం మత్తులో లారీతో ప్లాంటులోకి డ్రైవర్ ప్రవేశించడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్లాంటులో 20కేఎం వేగానికి మించి వాహనం నడిపే అవకాశం లేకపోయినా ప్రమాదం జరగడానికి మద్యం మత్తే కారణంగా తేల్చారు. లారీలు పార్కింగ్ చేసే సమీపంలో మద్యం బెల్ట్ షాపులు అందుబాటులో ఉన్నాయి. దీంతో డ్రైవర్లు మద్యానికి బానిసలై వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు. ఉద్యోగులను క్షుణంగా పరిశీలించే సెక్యూరిటీ సిబ్బంది డ్రైవర్లను ఎందుకు తనిఖీ చేయడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. -
బుడమేరు పాపం.. బాబు ప్రభుత్వానిదే
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): బుడమేరు వరద వస్తోందని తెలిసినా.. ప్రజలను అప్రమత్తం చేసి కాపాడటంలో కూటమి ప్రభుత్వం అవలంబించిన నిర్లక్ష్య ధోరణి వల్లే విజయవాడ మునిగిందని.. లక్షల మంది ప్రజలు రోడ్డున పడ్డారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. ఈ పాపం ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వానిదేనని ఆరోపించారు. బుడమేరు వరద బీభత్సం జరిగి ఏడాది గడిచిన నేపథ్యంలో పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి మల్లాది విష్ణు ఆధ్వర్యంలో బుడమేరు ముంపు బాధితులకు మద్దతుగా– ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా సింగ్ నగర్ ఆంధ్రప్రభకాలనీలో ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని అవినాష్ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది బుడమేరు వరదల వల్ల పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని.. వేల ఇళ్లు నీట మునిగి.. లక్షల మంది సర్వం కోల్పోయి రోడ్డునపడే దుస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. వరద గురించి ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉన్నా.. కింద ఉన్న గ్రామాలు, విజయవాడ నగర ప్రజలకు సమాచారం అందించి వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. వరదల్లో నష్టపోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం చివరికి దాతలు అందించిన రూ.600 కోట్లకు పైగా విరాళాలను కూడా కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, వాటర్ ప్యాకెట్లు పేరుతో పక్కదోవ పట్టించిందని ఆరోపించారు. దొంగ సర్వేలతో బాధితులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం చేతులు దులుపుకొందని విమర్శించారు.కృష్ణా రిటైనింగ్ వాల్ మాదిరిగా..కృష్ణానదికి నేడు ఇంత పెద్ద స్థాయిలో వరదనీరు వస్తున్నా కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్ కట్ట పరిసర ప్రాంత ప్రజలంతా నిశ్చింతగా ఉంటున్నారంటే దానికి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో నిర్మించిన రిటైనింగ్ వాలేనని అవినాష్ స్పష్టం చేశారు. అలాంటి వాల్ బుడమేరుకు కూడా నిర్మించి, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.నేటికీ ప్రజల గుండెల్లో భయం..కూటమి ప్రభుత్వం అసమర్థత, ముందు చూపులేని కారణంగా ఏ కొద్దిపాటి వర్షం పడినా నేటికీ బుడమేరు వరద బాధితులు భయపడుతూనే ఉన్నారని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి బుడమేరు ఆధునికీకరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని.. మిషన్ బుడమేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.సమీక్షల పేరుతో కాలయాపన..బుడమేరు వరదలు జరిగి ఏడాది కాలం గడిచినా కూటమి ప్రభుత్వం నేటికి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. కేవలం సమీక్షల పేరుతో సీఎం చంద్రబాబు కాలయాపన చేశారే తప్ప వాస్తవంగా బుడమేరు పరిరక్షణకు ఈ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్లు బీహెచ్ఎస్వీ జానారెడ్డి, ఎండీ షాహీనా సుల్తానా, శర్వాణీమూర్తి, కుక్కల అనిత, వైఎస్సార్సీపీ స్టూడెంట్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, అన్ని డివిజన్ల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. -
ఇష్టారాజ్యం!
జగ్గయ్యపేట: మట్టి, ఇసుక, గ్రావెల్ ఇలా కాదేదీ దోపిడీకి అనర్హం అన్న చందంగా తయారైంది కూటమి ప్రభుత్వంలో పరిస్థితి. అక్రమార్కులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో వీరి దోపిడీ అధికంగా ఉంది. జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో ఇనుము తయారీలో ముడి పదార్థంగా వినియోగించే కాకిరాయి(స్పాంజ్ ఐరన్) విరివిగా లభిస్తోంది. దీనిపై కన్నేసిన అక్రమార్కులు దానిని యథేచ్ఛగా పక్క రాష్ట్రానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారుతోంది. అటవీ ప్రాంత గ్రామాలలో.. జగ్గయ్యపేట మండలంలోని షేర్‌మహ్మద్‌పేట, రామచంద్రునిపేట, గండ్రాయి, తక్కెళ్లపాడు గ్రామాల్లోని అటవీ ప్రాంతాలలో పంట భూములు అధికంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో కాకిరాయి అధికంగా లభ్యమవుతోంది. దీంతో కొందరు అక్రమార్కులు ఐరన్ స్పాంజ్ కర్మాగారాలకు తరలిస్తున్నారు. 2006–09 వరకు ఈ ప్రాంతాలలో కాకిరాయి కలాపాలు అప్పటి ప్రభుత్వ అనుమతితో విరివిగా సాగాయి. అంతే కాకుండా వత్సవాయి, జగ్గయ్యపేట మండలాల్లోని ఐరన్ వోర్ కర్మాగారాలకు కూడా కాకిరాయి రవాణా సాగింది. అయితే 2009లో కొన్ని రాజకీయ కారణాలతో ప్రభుత్వం అనుమతులు నిలిపివేయటంతో పాటు కొన్ని కర్మాగారాలు నష్టాలలో ఉండటంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. 16 ఏళ్ల తరువాత తవ్వకాలు.. కాకిరాయి రవాణా పూర్తిగా నిలిపివేసి 16 ఏళ్లు గడిచిన తరువాత కూటమి ప్రభుత్వంలో అక్రమ రవాణా మళ్లీ ఊపందుకుంది. ఆయా గ్రామాల్లోని పొలాలు పూర్తిగా ఎర్ర నేలలు కావటంతో వర్షాధారమైనవి. వర్షాలు సకాలంలో కురిస్తేనే రైతులకు పంట దిగుబడి వస్తుంది. లేకుంటే నష్టాలు చూడాల్సిందే. దీనిని ఆసరా చేసుకుంటున్న అక్రమార్కులు ఆ రైతులకు డబ్బిచ్చి పొలాలను తీసుకుంటున్నారు. కూలీలతో రాయి ఏరివేత.. కాకిరాయిని పొలాల్లో అక్రమార్కులు ప్రత్యేకంగా కూలీలతో ఏరిస్తారు. ప్రస్తుతం వర్షాకాలం కావటంతో పొలాలలో రాయి పైకి తేలుతుంది. ఉదయం సమయంలో రాయిని కూలీలతో ఏరించి పొలాల్లో కుప్పలుగా పోస్తారు. రాత్రి వేళల్లో రాళ్ల కుప్పను ట్రాక్టర్ల ద్వారా సమీపంలోని తెలంగాణ రాష్ట్రం నేలకొండపల్లి మండలంలోని గట్టు కాచవరం, అప్పలనర్సాపురం మీదుగా సూర్యాపేట, హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అంతే కాకుండా సమీపంలోని ఐరన్ ఇండస్ట్రీకి కూడా తరలిస్తున్నట్లు సమాచారం. పట్టించుకోని అధికారులు.. గుట్టుచప్పుడు కాకుండా ఖనిజ సంపదను ఎటు వంటి అనుమతులు లేకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోవటం లేదు. మైనింగ్, అటవీ శాఖాధికారులు కూడా కనీసం కన్నెత్తి చూడకపోవటంతో అక్రమార్కులు యథేచ్ఛగా రవాణా సాగిస్తున్నారు. విలువైన ఖనిజ సంపదను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.చర్యలు తీసుకుంటాం.. అనుమతులు లేకుండా ఖనిజ సంపదను అక్రమ రవాణా సాగిస్తే చర్యలు తీసుకుంటాం. కాకిరాయి తరలింపుపై విచారణ జరుపుతాం. నిజమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వీరాస్వామి, మైనింగ్ ఏడీ, విజయవాడ తక్కెళ్లపాడు, రామచంద్రునిపేట, గండ్రాయి గ్రామాల్లోని గాడుదల గుట్ట పంట పొలాలను లీజుకు తీసుకునేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. ముఖ్యంగా కాకిరాయి చిన్నా, పెద్ద సైజులో ఉంటుంది. పొలంలో రెండు నుంచి మూడు, నాలుగు అడుగుల వరకు తవ్వకాలు చేస్తే కాకిరాయి బయటపడుతుంది. దీంతో అక్రమార్కులు సైజును బట్టి ధర నిర్ణయించి ఎకరం పొలం లీజుకు రూ. లక్షకు తీసుకునేలా రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు. -
అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ స్కేటర్ల సత్తా
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడకు చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి కుమారి పి.చైత్ర దీపిక అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించింది. ఆస్ట్రేలియాలో ఈ ఆగస్టు 28వ తేదీ నుంచి ఆదివారం వరకు జరిగిన వరల్డ్ స్కేట్ పసిఫిక్ కప్–2025 (వరల్డ్ స్కేట్ ఓషేనియా) పోటీల్లో పెయిర్ స్కేటింగ్ విభాగంలో బంగారు పతకం, ఇన్లైన్ విభాగంలో బంగారు పతకం, కపుల్ డ్యాన్స్ విభాగంలో బంగారు పతకం సాధించింది. విజయవాడ నగరానికి చెందిన వి.హృతిక్ ఇన్లైన్ విభాగంలో బంగారు పతకం, పెయిర్ స్కేటింగ్ విభాగంలో బంగారు పతకం, కపుల్ డాన్స్ విభాగంలో బంగారు పతకం, సోలో డాన్స్ విభాగంలో సిల్వర్ పతకం సాధించారు. ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ దీపక్ ఎల్లాప్రగడ, టీమ్ ఇండియా రోలర్ స్కేటింగ్ కోచ్ పి.సత్యనారాయణ వారిని అభినందించారు. -
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. గుంటూరు జిల్లా కొత్తూరుకు చెందిన మండవ శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి దంపతులు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,00,001 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన డి. కనకదుర్గ కుటుంబం.. కావ్య, సుధీర్‌కుమార్ పేరిట నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళంగా ఇచ్చారు. విజయవాడ విద్యాధరపురానికి చెందిన పి.సుబ్బలక్ష్మి పేరిట కుమారుడు, కోడలు శివశంకర్, విజయదుర్గ నిత్యాన్నదానానికి రూ. 1,00,111 విరాళాన్ని అందజేశారు. ఉచిత ప్రసాద వితరణకు .. హైదరాబాద్‌కు చెందిన కేవీ లక్ష్మీ నరసింహశాస్త్రి, పద్మావతి దంపతులు కుమారుడు సునీల్చంద్ర, ఫణిశ్రీల పేరిట ఉచిత ప్రసాద వితరణకు రూ. 1,00,001 విరాళాన్ని అందజేశారు. గుంటూరుకు చెందిన తేగెల రవీంద్రబాబు, డాక్టర్ నాగేశ్వరమ్మలు తమ కుమార్తె మమత శ్రీరంగ పేరిట రూ. 1,00,001 విరాళంగా ఇచ్చారు. అనంతరం దాతలకు అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ జరి గింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజలు చేశారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా, పలువురు ఉభయదాతలు, భక్తులు సేవలో పాల్గొన్నారు.ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష దసరా ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన పనులపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో కీలకమైన క్యూలు, ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటుతో పాటు ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రసాదాల పోటు, అన్నదాన భవనం పనుల పురోగతిపై చర్చించారు. శుక్రవారం జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశానికి అవసరమైన సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. -
సిప్ అబాకస్ విజేతలకు అభినందన
భవానీపురం(విజయవాడపశ్చిమ): సిప్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సిప్ అబాకస్ పోటీలో గెలిచిన విద్యార్థులను ఆదివారం భవానీపురంలోని ఇన్స్టిట్యూట్లో అభినందించారు. ఈ సందర్భంగా సెంటర్ హెడ్ మధుసూదనరావు మాట్లాడుతూ ఇటీవల మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన సిప్ అబాకస్ పోటీలో 5–11 నిముషాల వ్యవధిలో 80 నుంచి 160 వరకు క్యాలిక్యులేషన్స్ను సాల్వ్ చేశారని తెలిపారు. ఈ పోటీలో భవానీపురం, వన్‌టౌన్ బ్రాంచిల నుంచి 180 మంది విద్యార్థులు పాల్గొనగా 157 మంది వివిధ కేటగిరీల్లో విజయం సాధించారని చెప్పారు. ఈ విద్యార్థులు నవంబర్ 16న చైన్నెలో నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఏపీలో మూడోసారి అత్యధిక విజేతలతో తమ బ్రాంచి మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. 18 ఏళ్లల్లో దాదాపు 5వేల మంది విద్యార్థులను మెరుగైన ప్రతిభావంతులుగా తీర్చిదిద్దామని తెలిపారు. -
ఉద్యోగులకు అండగా ఉంటాం
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఏపీ ఎన్జీఓ సంఘం అండగా ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ అన్నారు. కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ విజయవాడలోని సంఘ కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భవనారి వెంకటేష్‌బాబు ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి 15 డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అఖిల భారత రాష్ట్ర ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న విద్యాసాగర్‌ను సంఘం నేతలు ఘనంగా సత్కరించారు. సమస్యల పరిష్కారానికి కృషి.. తొలుత విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆర్థికాంశాలతో ముడిపడి ఉన్న అంశాల పరిష్కారానికి తమ రాష్ట్ర కార్యవర్గం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భవనారి వెంకటేష్‌బాబు, కొప్పొలు సుధాకరరావు, కోశాధికారి జి.ఎన్.వి.రత్నకుమార్ మాట్లాడుతూ అసోసియేషన్ కాల పరిమితి(2022–2025) అక్టోబర్ నెలతో ముగియనున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అవసరమైన మేరకు సంఘ బైలాస్ నందు మార్పులు చేర్పులు చేయాలని ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానించామన్నారు. ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సి.పి.జగదీష్, ఆల్ ఇండియా ఉమెన్ వింగ్ సభ్యురాలు రాజ్యలక్ష్మి ప్రసంగించారు. విజయవాడ 1,2,3 డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ -
ఆర్భాటమే.. ఆచరణ సున్నా
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సింహాచలం దేవస్థానంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఈ ఏడాది దసరాకు క్యూల ఏర్పాటులో ఐరన్ ఫ్రేమ్‌లను వినియోగిస్తున్నామని దుర్గగుడి అధికారులు ఆర్భాటంగా ప్రకటించినా.. ఆచరణలో కానరావడం లేదు. గత నెల 17న దుర్గగుడికి చెందిన సీవీ రెడ్డి చారిటీస్ కాటేజీ వద్ద ఐరన్ ఫ్రేమ్‌లతో ఏర్పాటు చేసిన క్యూలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. దీనికి అవసరమైన ఐరన్ ఫ్రేమ్‌లను సింహాచలం దేవస్థానం నుంచి దిగుమతి చేసుకున్నామని ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ఎంతో ఘనంగా చెప్పుకున్నారు. కార్యాచరణలో దిగే సరికి.. దసరా ఉత్సవాల ఏర్పాట్లను దుర్గగుడి అధికారులు గురువారం కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడి, ఘాట్ రోడ్డులో మొదటి మలుపు వద్ద కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. దేవస్థానం ఏర్పాటు చేస్తానని చెప్పిన ఐరన్ ఫ్రేమ్‌లు కనీసం దుర్గగుడి పరిసరాలకు కూడా చేరలేదు. దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు ముందుగానే టెండర్లు పిలవడంతో కాంట్రాక్టర్ ఐరన్ ఫ్రేమ్‌లను బిగించడానికి ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో క్యూ పనులు రెండు రోజులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ఉత్సవాలు సమీపిస్తుండటంతో చేసేది లేక పాత క్యూలనే ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్‌రోడ్డులో ఇప్పటికే బారికేడ్లతో క్యూ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇక ఐరన్ ఫ్రేమ్‌ల క్యూలు ప్రకటనలకే పరిమితమైందని ఇంజినీరింగ్ సిబ్బంది బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఐరన్ ఫ్రేమ్‌లతో క్యూలు ఏర్పాటు చేస్తున్నామని ఇంజినీరింగ్ విభాగం ముఖ్య అధికారులు పనుల వ్యయాన్ని భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పాత విధానంతోనే క్యూలు ఏర్పాటు చేయడంతో అంచనాలను తగ్గిస్తారా లేక యధావిథిగానే బిల్లులు చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఎవరి జేబులో వేస్తారో వేచి చూడాల్సి ఉంది. దేవదాయ శాఖ ఆదేశాలు బేఖాతర్...! ఈ ఏడాది సింహాచలం దేవస్థానంలో చోటు చేసుకున్న రెండు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దేవదాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. చందనోత్సవం రాత్రి కురిసిన భారీ వర్షంతో గోడ కూలిపోవడం, సింహాచలం గిరి ప్రదక్షిణలో ఏర్పాటు చేసిన షెడ్డు కూలిపోయిన ఘటనలతో భక్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు, ఆకస్మిక అల్పపీడనాలు వస్తుండటంతో ఉత్సవాల ఏరా్పాట్లకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా క్యూల ఏర్పాటుపై అలసత్వం చూపొద్దని హెచ్చరించడమే కాకుండా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది. కీలకమైన క్యూల ఏర్పాటులో దేవస్థానం దేవదాయ శాఖ ఆదేశాలను తుంగలోకి తొక్కి పెట్టింది. బారికేడ్లతో ఏర్పాటు చేసే వాటర్ ఫ్రూప్ టెంట్ల విషయంలోనూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. -
బస్‌స్టాండ్‌లో ప్రసాదాల కౌంటర్‌కు కరెంట్ సరఫరా కట్..!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్‌లో సిటీ బస్ టెర్మినల్ వద్ద దుర్గగుడి ఏర్పాటు చేసిన ప్రసాదాల కౌంటర్‌కు విద్యుత్‌ను ఆర్టీసీ అధికారులు కట్ చేశారు. బస్టాండ్ ఆవరణలో ప్రసాదాల కౌంటర్‌కు ఆర్టీసీ నుంచి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. దీనికి దేవస్థానం ప్రతి నెలా విద్యుత్ బిల్లు చెల్లిస్తోంది. అయితే కొన్ని నెలలుగా దేవస్థానం ప్రసాదాల కౌంటర్ విద్యుత్ బిల్లును చెల్లించకపోవడంతో అది కాస్త రూ. 18 వేలకు చేరింది. బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఆర్టీసీ అధికారులు కౌంటర్లోని సిబ్బందికి తెలియజేస్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని కౌంటర్లోని సిబ్బంది దేవస్థాన అధికారులకు చెప్పినా ఎటువంటి స్పందన లేకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఆర్టీసీ అధికారులు విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేశారు. దీంతో ప్రసాదాల కౌంటర్లో కంప్యూటర్, ఇంటర్నెట్, విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు పని చేయడం లేదు. ప్రసాదాలు కొనుగోలు చేసే భక్తులకు తొలుత కంప్యూటర్ టోకెన్ ఇవ్వాల్సి ఉంది. అయితే విద్యుత్ లేకపోవడంతో టోకెన్లు లేకుండానే ప్రసాదాల విక్రయాలు జరుగుతున్నాయి. మరో వైపు చీకట్లోనే బ్యాంక్ సిబ్బంది పని చేస్తూ భక్తులకు, ప్రయాణికులకు ప్రసాదాలను విక్రయిస్తున్నారు. దుర్గగుడి అధికారుల తీరు సరికాదని పలువురు భక్తులు, యాత్రికులు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్ బిల్లు బకాయి కోసం ఆర్టీసీ చర్య -
ఆరోగ్య గమ్యానికి సైకిల్ సవారీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆరోగ్యం, ఆహ్లాదం.. ఆపై పర్యావరణ పరిరక్షణకూ సైక్లింగ్ చేయూతనిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. చిన్నారులు, యువత సైకిల్ సవారీని అలవాటుగా చేసుకోవాలన్నారు. సైకిల్ సవారీ ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడంతో పాటు కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో పెడల్ ఫర్ ఫిట్నెస్ అండ్ యూనిటీ ఇతివృత్తంతో నిర్వహించిన సైకిల్ రైడ్‌లో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం నుంచి ప్రారంభమైన ఈ రైడ్ బెంజిసర్కిల్, రామవరప్పాడు, బీఆర్టీఎస్ రోడ్డు, గాంధీనగర్, మునిసిపల్ ఆఫీస్, ప్రకాశం బ్యారేజ్, కంట్రోల్ రూమ్, స్టేడియం వరకు మొత్తం 21 కి.మీ. మేర సాగింది. దాదాపు 80 మంది సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొని ఐక్యతా మార్గంలో క్రీడాస్ఫూర్తిని చాటిచెప్పారు. అనంతరం లండన్ – ఎడిన్బర్గ్ – లండన్ (ఎల్‌ఈఎల్) సైక్లింగ్ ఈవెంట్ – 2025లో పాల్గొన్న నిషికాంత్ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అమరావతి రన్నర్స్ ప్రెసిడెంట్ ఆర్.రమేష్ రవి, సభ్యులు బసవేశ్వరరావు, జీవీ సత్యనారాయణ, నిషికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
ఏకదంతుడి లడ్డూ రూ.లక్ష
గుడివాడ టౌన్: పెద ఎరికపాడులోని శ్రీ కోదండ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మహోత్సవాల పందిరిలో స్వామివారి లడ్డూ ప్రసాదం వేలం ఆదివారం జరిగింది. పలువురు భక్తులు వేలంలో పాల్గొనగా అదే ప్రాంతానికి చెందిన పోతుల శ్రీకాంత్ స్వామివారి లడ్డూను లక్ష వెయ్యి రూపాయలకు పాడుకొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బైక్‌పై నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటన కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా విశ్వనాథపురం బ్యాంక్ కాలనీకి చెందిన బసు పృథ్వీరాజ్(22) విజయవాడ యనమలకుదురు కరకట్ట ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడు. పోరంకి లోని ఓ కళ్లజోళ్ల షాపులో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భార్యతో ఫోన్లో మాట్లాడాడు. ఆతర్వాత తన బుల్లెట్‌పై భవానీపురం ఆశ్రమం రోడ్డుకు వచ్చి అక్కడ జరిగిన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. తిరిగి తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో రూంకు వెళ్తుండగా కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై లోటస్ అపార్ట్మెంట్ సమీపంలోకి వచ్చే సరికే బుల్లెట్ స్కిడ్ అయి అదుపు తప్పి డివైడర్‌కు ఢీ కొట్టింది. బండిపై నుంచి పృధ్వీరాజ్ ఎగిరిఫ్లైఓవర్ అవతలి వైపు పడిపోయాడు. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనసై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం: వీటీపీఎస్ ఆఫీసర్స్ కన్స్యూమర్స్ కో–ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ సంస్థ పర్యవేక్షణలో నిర్వహించే పెట్రోల్ బంక్‌లో నగదు గోల్మాల్ జరిగిన విషయంలో ముగ్గురు వ్యక్తులకు ప్రధాన పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. బంక్‌లో పనిచేసి అదృశ్యమైన కాంట్రాక్ట్ కార్మికుడు గోపాలకృష్ణను ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ విచారణలో ముగ్గురు పేర్లు తెలిసినట్లు సమాచారం. వీరిలో ఇద్దరు సొసైటీలో ప్రధాన వ్యక్తులు కాగా, మరొకరు స్థానికంగా పనిచేసే ఓ ప్రముఖ టీవీ చానల్ రిపోర్టర్ (సాక్షి కాదు) అని తెలిసింది. అయితే ముగ్గురితో పాటు సంబంధం లేని వ్యక్తులను కూడా ఇందులోకి లాగాలని కొందరు కూటమి నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. -
బాల్య వివాహాల నియంత్రణకు సహకరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): బాల్యవివాహాలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగ ణంలోని న్యాయసేవాసదన్‌లో శనివారం బాల్యవివా హాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ మాట్లాడుతూ.. బాల్యవివాహాలు జరగకుండా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. ఎక్కడైన బాల్యవివాహాలు జరిగినట్లు తెలిస్తే వెంటనే సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇస్తే నియంత్రించేందుకు అవకాశం ఉంటుందన్నారు. చిన్న వయసులో గర్భధారణ వల్ల కలిగే నష్టాలు ఎన్నో ఉంటాయన్నారు. రక్తహీనత, పిల్లలు సరిగ్గా పుట్టకపోవటం తదితర పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. ఇందుకోసం బాల్యవివాహాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. బాలలకు సంబంధించిన హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి.రామ కృష్ణయ్య, పదో తరగతి జిల్లా న్యాయమూర్తి బి.బాబు నాయక్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.పోతురాజు, డీఎస్పీ చప్పిడి రాజా, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీ -
లాటరీలో 62 బార్లు కేటాయింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ నూతన బార్ పాలసీ 2025–28లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో 62 బార్లకు శనివారం లాటరీ నిర్వహించారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ అబ్కారీ అధికారి వి.శ్రీనివాసరావుతో కలిసి దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ తీశారు. జిల్లా ప్రొహిబిషన్ అబ్కారీ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నూతన పాలసీలో భాగంగా మూడేళ్ల కాలపరిమితికి జిల్లాలో సాధారణ కేటగిరీలో 130 బార్లు, గీత కులాలకు 10 బార్లు చొప్పున కేటాయించామన్నారు. నిర్దేశించిన గడువు తేదీలోగా ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 130 బార్లకు గాను 75 బార్లకు మాత్రమే 262 దరఖాస్తులు వచ్చాయన్నారు. 55 బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చిన 62 బార్లను లాటరీ ద్వారా దరఖాస్తుదారులకు కేటాయించామని తెలిపారు. ఓపెన్ కేటగిరీలో ఒక బార్‌కు రెండు, మరో 12 బార్లకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయన్నారు. నాలుగు కంటె తక్కువ దరఖాస్తులు వచ్చిన బార్లకు మరలా లాటరీ ద్వారా కేటాయించడానికి ఇదే నోటిఫికేషన్ గడువు పెంచుతామన్నారు. ఒక్క దరఖాస్తు కూడా దాఖలవని 55 బార్లకు ఎకై ్సజ్ కమిషనర్ ఆదేశాల ప్రకారం మరోసారి నోటిఫికేషన్ జారీ చేస్తారన్నారు. గీత కులాల కేటగిరీలో మొత్తం నోటిఫై చేసిన 10 బార్లకు 104 దరఖాస్తులు అందాయన్నారు. అత్యధికంగా గెజిట్ నంబర్లు 6,7లకు 13 చొప్పున, అత్యల్పంగా గెజిట్ నంబరు 10 బార్ (కొండపల్లి)కి ఆరు దరఖాస్తులు వచ్చాయని వివరించారు. గీత కులాల వారికి కూడా గెజిట్ సీరియల్ నంబరు ప్రకారం కలెక్టర్ లక్ష్మీశ పారదర్శ కంగా లాటరీ తీశారు. ఈ పది బార్లకు లాటరీ ద్వారానే మరో ఇద్దరు వ్యక్తులను రిజర్వుడ్ –1, రిజర్వుడ్ –2గా నిర్ణయించినట్లు తెలిపారు. లాటరీలో బార్లు దక్కించుకున్న వారందరూ నిర్ణయించిన వార్షిక లైసెన్సు ఫీజులో ఆరో వంతు సొమ్ము ప్రభుత్వానికి చలానాగా చెల్లించాల్సి ఉంటుందని, నూతన బార్ పాలసీ సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. -
పోలీస్‌స్టేషన్ వద్ద టీడీపీ నాయకుల బాహాబాహీ
చిల్లకల్లు(జగ్గయ్యపేట): స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు బాహాబాహీకి దిగిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వత్సవాయి మండలం మక్కపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రామ సర్పంచ్ మల్లెల శివపై జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన అదే పార్టీ యూత్ నాయకుడు ఎనికె గోపీ సోషల్ మీడియాలో కొంత కాలంగా అనుచిత పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల అధిష్టానం దృష్టికి ఈ ఘటన వెళ్లడంతో రాజీ చేశారు. ఈ క్రమంలో రాత్రి సమయంలో శివ భార్య సబిత జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లు మీదుగా మక్కపేటకు కారులో వెళ్తుండగా మెయిన్ రోడ్డు పక్కన పోలీస్ స్టేషన్ వద్ద గోపీ ఉండటాన్ని చూశారు. తన భర్తపై అనుచిత పోస్ట్‌లు ఎందుకు పెడుతున్నావని ఆమె గోపీని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారు అక్కడికి రావడంతో స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు గంటల పాటు ఆ ప్రాంతం అంతా బూతుపురాణాలతో దద్దరిల్లింది. అధికార పార్టీ నాయకులు కావడంతో పోలీసులు కూడా నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. చివరుకు పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించారు. -
ఆటో డ్రైవర్ల నిరసన ప్రదర్శన
పెడన: తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా ఆటో యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు పెడన మండల శాఖ ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు పెడన బస్టాండు సెంటరు నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు శనివారం ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఇన్చార్జి తహసీల్దారు కె.అనిల్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సీ్త్ర శక్తి పథకం అమలు వల్ల కిరా యిలు కరువయ్యాయని, జీవితం దుర్భరంగా మారిందని వాపోయారు. ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం రూ.25 వేలు ఇవ్వాలని, జీఓ 21ని రద్దు చేయాలని, ఇన్సూరెన్సులు, పెట్రోలు, డీజిల్ సబ్సిడీపై ఇవ్వాలని, బ్యాంకుల్లో వడ్డీ లేని సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు పి.నరసింహారావు, ఆటో యూనియన్ నాయకులు షేక్ బాజీ, పులి రమేష్, వి.దేవ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
నందిగామరూరల్: పట్టణ శివారులోని అంబారుపేట వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. సేకరించిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామానికి చెందిన మండూరి చిట్టిబాబు తన భార్య నాగమల్లేశ్వరి(30)తో కలిసి శనివారం మండలంలోని మాగల్లు గ్రామంలోని బంధువుల ఇంటిలో జరిగే శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో అంబారుపేట గ్రామ సమీపంలోని వై జంక్షన్ వద్దకు వచ్చే సరికి వెనుకగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై నుంచి మల్లేశ్వరి కింద పడగా, ఆమె పైనుంచి లారీ వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతి చెందగా భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అభిమన్యు తెలిపారు. మృతురాలికి కుమార్తె ఉన్నారు. నాగమల్లేశ్వరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
క్రీడల్లో ప్రతిభ చూపుతున్న జిల్లా పాఠశాలలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): క్రీడా రంగంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు చక్కని ప్రతిభను ప్రదర్శిస్తున్నాయని జిల్లా పాఠశాల విద్యాశాఖ జోన్–2 రీజనల్ జాయింట్ డైరెక్టర్ (కాకినాడ) జి.నాగమణి అన్నారు. క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని డీఈవో కార్యాలయంలో ప్రతిభ చూపిన పాఠశాలల క్రీడా విభాగ ఉపాధ్యాయులను, విద్యార్థులను శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నున్న జిల్లా పరిషత్ పాఠశాల రాష్ట్రంలోనే అత్యధికంగా 1347 పాయింట్లను సాధించి క్రీడల్లో తొలి స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాకు చెందిన విద్యార్థులు పలు క్రీడాంశాల్లో అద్భు తమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారని అభినందించారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి నున్న జెడ్పీ పాఠశాల ప్రథమస్థానం, పటమట కేబీసీ జిల్లా పరిషత్ పాఠశాల ద్వితీయ, దుర్గాపురం ఎస్టీవీఆర్ఎంసీ హైస్కూల్ తృతీయ, నిడమానూరు జెడ్పీ హైస్కూల్ నాలుగో స్థానం, కొత్తపేట హిందూ హైస్కూల్ ఐదో స్థానంలో ఉన్నట్లు వివరించారు. క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను, వారిని తీర్చిదిద్దిన హెచ్ఎంలను, పీఈటీలను సత్కరించారు. ఏపీలో తొలి స్థానంలో నిలిచిన నున్న జెడ్పీ పాఠశాల -
ఆధునిక వైద్య విధానాలను అందిపుచ్చుకోవాలి
●సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు ●పల్మనాలజీ విభాగం రాష్ట్ర స్థాయి సీఎంఈ నిర్వహణ లబ్బీపేట(విజయవాడతూర్పు): శ్యాసకోశ వ్యాధులకు సంబంధించి అందుబాటులోకి వస్తున్న ఆధునిక చికిత్సా విధానాలను పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు అన్నారు. విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో పల్మనరీ మెడిసిన్ పీజీ విద్యార్థుల కోసం రెండు రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ సదస్సు శనివారం ప్రారంభమైంది. లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ గ్రేట్ ఆర్ట్ ఆఫ్ సైన్స్ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సును డాక్టర్ ఏడుకొండలరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీలు పరీక్షల ప్రిపరేషన్, రోగులతో ప్రవర్తన, నైతిక విలువలు, నీతి, కష్టపడే తత్వం, నిజాయతీ వంటి అంశాలను వివరించారు. అనంతరం లాంగ్ కేస్, షార్ట్కేస్ ప్రజెంటేషన్, ఓఎస్‌సీఈ, వైవా ప్రిపరేషన్ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ బాబూరావుతో పాటు కొందరు ఫ్యాకల్టీ సభ్యులు ఈ సదస్సులో పలు విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో ఈ ఏడాది అక్టోబరులో యూనివర్సిటీ తుది పరీక్షలు రాయనున్న 100 మంది పల్మనరీ మెడిసిన్ పోసు్ట్రగాడ్యుయేషన్ విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సును పల్మనరీ మెడిసిన్ విబాగాధిపతి డాక్టర్ సుధీన, ఇతర అధ్యాపకులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. -
భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. ఆయన శనివారం ఉత్సవాల సందర్భంగా చేయనున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపైన ఏర్పాటు చేయనున్న క్యూలైన్లు, ఘాట్‌రోడ్డు తదితర ప్రాంతాలను నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వినాయక టెంపుల్ వద్ద నుంచి ఏర్పాటు చేసే క్యూలైన్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. క్యూలైన్లలో ఏఏ ప్రదేశాల్లో బారికేడింగ్ చేయాలి, హోల్డింగ్ చేయాలి, హోల్డింగ్ ప్రదేశాల్లో భక్తులు లోనికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఏర్పాట్లు వంటి అంశాలపై సూచనలు చేశారు. దర్శనం అనంతరం భక్తులు వెళ్లే మార్గాలను పరిశీలించి, ఎక్కడా ఇబ్బందులు లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పశ్చిమజోన్ ఇన్చార్జి డీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, వన్‌టౌన్ సీఐ గురుప్రకాష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దసరా ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ రాజశేఖరబాబు -
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో జిల్లాను అగ్రగామిగా నిలపాలి
డీఐఈపీసీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జరిగింది. తొలుత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) నిర్వహించే బీఆర్ఏపీ–2024 సర్వేపై పారిశ్రామిక వర్గాలకు అవగాహన కల్పించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకింగ్స్ ఇచ్చే విధానాన్ని, పారామీటర్లను క్షుణ్ణంగా వివరించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ర్యాంకింగ్‌ను మెరుగుపరిచేందుకు వీలుగా ప్రతి శాఖ తమ శాఖ ద్వారా సేవలు పొందిన వారికి సింగిల్ విండో వ్యవస్థతో పాటు వివిధ ఆన్లైన్ సేవలు వంటి వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించాలన్నారు. వివిధ అనుమతులకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 29 వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 2,958 దరఖాస్తులు రాగా 2,921 దరఖాస్తులు పరిష్కారమయ్యాయని చెప్పారు. మిగిలిన వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ పారిశ్రామిక అభివృద్ధి విధానాల కింద పది క్లెయిమ్‌లకు రూ.1.52 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలకు కమిటీ ఆమోదం తెలిపింది. 2025–26కు సంబంధించి పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ పథకాల అమల్లో పురోగతిని కమిటీలో చర్చించి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు, యూనిట్ల ప్రారంభానికి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్)కు సంబంధించి మండల ప్రధాన కేంద్రాల్లో షెడ్యూల్ ప్రకారం ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్‌షాప్‌లను నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి ఆర్.వెంకటరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.బాబ్జి, ఎల్డీఎం కె.ప్రియాంక, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, పారిశ్రామిక అసోసియేషన్ల ప్రతినిధులు, సర్వీస్ యూజర్లు పాల్గొన్నారు. -
న్యూఢిల్లీలో అమరావతి ప్రాపర్టీ షో బ్రోచర్ ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతిష్టాత్మకంగా న్యూఢిల్లీలో ప్రారంభమైన 17వ నారెడ్కో జాతీయ సదస్సులో శనివారం అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 బ్రోచర్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. అమరావతిని భవిష్యత్‌లో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల ముఖ్య కేంద్రంగా ప్రదర్శించడానికి ఈ ఫెస్టివల్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. నారెడ్కో ప్రతినిధులు మాట్లాడుతూ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025లో నివాస, వాణిజ్య ప్రాజెక్టులతో పాటు ప్రభుత్వ దూరదృష్టి, పెట్టుబడి సౌహార్ధ విధానాలు, సమగ్ర టౌన్షిప్ ప్రణాళికలు ప్రదర్శిస్తారని తెలిపారు. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా పెట్టుబడిదారులు, అభివృద్ధిదారులు, ఎన్ఆర్ఐలు, విధాన నిర్ణేతలు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష, ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ జి.సూర్య ప్రవీణ్, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, నారెడ్కో జాతీయ అధ్యక్షుడు జి.హరిబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.చక్రధర్, సెంట్రల్ జోన్ అధ్యక్షుడు సందీప్ మండవ, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ పరుచూరి తదితరులు హాజరయ్యారు. -
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఉచిత ప్రసాద వితరణకు రూ.5 లక్షలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలువురు భక్తులు శనివారం విరాళాలను సమర్పించారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన సాయి సౌమ్య కామరాజు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి సాయి సౌమ్య కామరాజు, యశ్వంత్‌రావు దంపతులు తమ కుమారుడు ఇషాన్ కృష్ణ పేరిట వేద పరిరక్షణ ట్రస్ట్‌కు రూ.లక్ష, గోసంరక్షణకు రూ.50 వేల విరాళాన్ని అందజేశారు. ఉచిత ప్రసాద వితరణకు రూ.5 లక్షలు హైదరాబాద్‌కు చెందిన మేఘమాల ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, అనుపమ దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. దేవస్థానంలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ పథకానికి రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు. నిత్యాన్నదానానికి రూ.లక్ష విజయవాడ కొత్తూరు తాడేపల్లికి చెందిన డి.శివనాగరాజు, దుర్గారాణి దంపతులు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1,00,116ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
వ్యర్థాల పాపం ఇంటి దొంగలదే!
సెప్టిక్ ట్యాంకులే అస్త్రాలుగా.. జి.కొండూరు: మండల పరిధిలో వ్యర్థాల పాపం ఇంటి దొంగలదే. పోలీసుల నిఘాతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. కెమికల్, మడ్డి ఆయిల్, టైర్ ఆయిల్ కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను కాల్వలు, చెరువులు, రహదారుల వెంట పారబోస్తూ కాలుష్యాన్ని సృష్టిస్తున్నారు. వినూత్న పద్ధతిలో వ్యర్థాలను బయటకు తరలించి చేతులు దులుపుకొంటున్న కంపెనీలు, వ్యర్థాలు తమవి కావని చెప్పిన బుకాయింపు మాటలు అవాస్తవమని తేలిపోయింది. ‘సాక్షి’ వరస కథనాలతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో జి.కొండూరు పరిధిలోని గడ్డమణుగు గ్రామ శివారులో కొత్తూరు రోడ్డులో వ్యర్థాలను పారబోస్తూ సెప్టిక్ ట్యాంకు రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు చిక్కడంతో చేసేది లేక కంపెనీల నిర్వాహకులు ముఖం చాటేశారు. నిత్యం వివాదమే కొండపల్లి ఐడీఏలోని కెమికల్ పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు నిత్యం వివాదంగానే మారుతున్నాయి. ఇక్కడ నాలుగు వందల వరకు పరిశ్రమలు ఉండగా వీటిలో ఫార్మా, కెమికల్ కంపెనీలు 12, ప్లాస్టిక్ కంపెనీలు మూడు, మడ్డి ఆయిల్ కంపెనీలు నాలుగు, టైర్ ఆయిల్ కంపెనీలు మూడు వరకు ఉన్నాయి. వీటి నుంచి రోజుకు వేల లీటర్ల కెమికల్ వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. వీటిని పక్కనే ఉన్న తొమ్మండ్రం వాగులోకి విడుదల చేయడంతో ఈ నీరు వ్యవసాయ భూముల మీదగా ప్రవహిస్తుంది. ఈ కెమికల్ వ్యర్థాల ప్రభావంతో కవులూరు గ్రామానికి చెందిన 600 ఎకరాలు చవుడుబారి పండక రైతులు నష్టపోతున్నారు. వ్యర్థాల కారణంగా కట్టుబడిపాలెం గ్రామ ప్రజలు పక్షవాతం, ఎలర్జీలు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో కెమికల్ కంపెనీలకు వ్యతిరేకంగా రెండు గ్రామాల ప్రజలు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. రీసైక్లింగ్ యూనిట్ కూడా వివాదమే ఈ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు రసాయనిక పరిశ్రమల సొసైటీ ఆధ్వర్యాన కొండపల్లి సమీపంలోనే రీసైక్లింగ్ యూనిట్‌ను రూ.8కోట్లతో దశాబ్ద కాలం క్రితం నిర్మించారు. ఈ కంపెనీ నిర్మాణం కూడా వివాదంగానే మారింది. జనావాసాలకు సమీపంలో వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ నిర్మించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ యూనిట్ పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో పాటు అప్పట్లో ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ యూనిట్‌కు తరలించడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో పక్కనే ఉన్న తొమ్మండ్రం వాగులోకి విడుదల చేస్తూ ఆ యూనిట్‌ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు సెప్టిక్ ట్యాంకులతో తరలించే ప్రక్రియ మొదలు పెట్టారు. ఏడాదికిపైగా జరుగుతున్న ఈ దురాగతాన్ని జి.కొండూరు పోలీసులు పసిగట్టడంతో కంపెనీల నిర్వాహకుల తీరు కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. కొండపల్లి ఐడీఏలోని పలు కంపెనీలు ప్రాసెసింగ్ అనంతరం విడుదలయ్యే కెమికల్ వ్యర్థాలను తరలించడానికి సెప్టిక్ ట్యాంకులను అస్త్రాలుగా ఎంచుకున్నారు. ఏడాది కాలంగా కొండపల్లి ఐడీఏలోని పలు కంపెనీల నుంచి లక్షల లీటర్ల కెమికల్ వ్యర్థాలను సెప్టిక్ ట్యాంకుల్లో తరలించి జి.కొండూరు మండల పరిధిలోని పినపాక, ఆత్కూరు, హెచ్.ముత్యాలంపాడు, కందులపాడు, వెలగలేరు, చెవుటూరు, జి.కొండూరు, గడ్డమణుగు గ్రామాల పరిధిలో చెరువులు, కాల్వల్లో పారబోస్తున్నారు. ఈ దారుణంపై ‘సాక్షి’ కథనాలను ప్రచురించే సమయంలో ఐడీఏలోని కంపెనీల నిర్వాహకులు కొంతమందిని వివరణ కోరగా పారబోస్తున్న వ్యర్థాలకు తమకు ఎటువంటి సంబంధంలేదని బుకాయించారు. ఇప్పుడు కెమికల్ వ్యర్థాలను పారబోస్తూ సెప్టిక్ ట్యాంకు పోలీసులకు పట్టుబడటంతో తమ దందా బయటపడిందని ముఖం చాటేస్తున్నారు. సెప్టిక్ ట్యాంకులో వ్యర్థాలను రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం కెమికల్ వ్యర్థాలను కాల్వలు, చెరువులు, రహదారుల వెంబడి పారబోస్తూ పర్యావరణ కాలుష్యానికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలను పారబోస్తూ సెప్టిక్ ట్యాంకు పట్టుబడింది. పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు అధికారులు నమూనాలను తీసుకెళ్లారు. ఐడీఏలోని కంపెనీల నిర్వాహకులతో మాట్లాడి హెచ్చరించాం. నమూనాల ఫలితాలు రాగానే బాధ్యులపై కేసులు నమోదు చేస్తాం. –సతీష్‌కుమార్, ఎస్ఐ, జి.కొండూరు -
పనులకు ఫుల్ స్టాప్
సాక్షి, ప్రత్యేకప్రతినిధి: విజయవాడ నగరంలో మూడు రోడ్డు పనులకు ఏపీ సీఆర్డీఏ ఫుల్స్టా్ప్ పెట్టింది. రూ.75 కోట్లతో టెండర్లను ఆహ్వానించిన సర్కారు వాటిని అర్ధాంతరంగా రద్దుచేసింది. టెండర్లను రద్దు చేయడానికి కారణాలేంటో కూడా వెల్లడించలేదని టెండరుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోడ్డు పనులు పూర్తయితే తమ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గుతుందని ఆశించిన విజయవాడ ప్రజలకు, ఆ మార్గాల్లో వాహనచోదకులకు నిరాశే మిగిలింది.గత నెలలో టెండర్లువిజయవాడ, గుంటూరు నగరాలతో పాటు రాజధాని అమరావతిలో పది పనులను చేపట్టడానికి గత నెలలో ఏపీ సీఆర్డీఏ రూ.793.21 కోట్లతో టెండర్లు ఆహ్వానించిన సంగతి తెలి సిందే. ఇందులో ఏడు నిర్మాణ, నిర్వహణ పనులు ఉండగా తక్కిన మూడు టెండర్ల్లు సేవలకు సంబంధించినవి. వీటిలో రూ.683.33 కోట్లతో రాజధానిలో వివిధ పనులు కాగా రూ.109.88 కోట్లతో విజయవాడ, గుంటూరులో నాలుగు రోడ్ల నిర్మాణాలు ఉన్నాయి. నిర్మాణ, నిర్వహణ పనుల టెండరు డాక్యుమెంట్లను జూలై 11 నుంచి ఆగస్టు 8వ తేదీ లోగా డౌన్లోడ్ చేసుకోవాలని, నిర్దేశిత బిడ్లకు ఆగస్టు ఒకటి నుంచి 13వ తేదీలోగా టెండర్లు దాఖలు చేయవచ్చని నోటీసులో పేర్కొనడం విదితమే.● విజయవాడ నగరంలోని బల్లెంవారివీధి జంక్షన్ నుంచి నిడమానూరు మెయిన్ రోడ్డు జంక్షన్ వరకు (హెచ్‌టీ లైన్ రోడ్) బీటీ హాట్ మిక్స్‌తో రోడ్డు విస్తరణ, సెంట్రల్ డివైడర్ తదితర పనులకు 26,51,89,656 రూపాయలతో, మహానాడు రోడ్డు.. బల్లెంవారి వీధి నుంచి పోరంకి, నిడమానూరు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ఇతర పనులకు 25,52,45,567 రూపాయలతో, బందరు రోడ్డు నుంచి హెచ్‌టీ లైన్ జంక్షన్ వరకు బల్లెంవారివీధి రోడ్డు విస్తరణ, సెంట్రల్ డివైడర్, లైటింగ్ పనుల నిమిత్తం 22,96,21,066 రూపాయలతో టెండర్లను జూలైలో ఆహ్వానించిన సంగతి తెలిసిందే. టెండర్లో పేర్కొన్న విధంగా ఈ మూడు పనులకు సంబంధించిన టెక్నికల్ బిడ్లను ఈనెల 11వ తేదీ తెరవాల్సి ఉంది. సీఆర్డీఏ ఇంజినీరింగ్ విభాగం ఏ కారణం చెప్పకుండానే బిడ్ తెరవలేదు. 19వ తేదీ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేస్తున్నట్లు ఆ సమయంలో పేర్కొన్న అధికారులు ఆ పని కూడా చేయకపోగా 29వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా టెండరు ఐడీ 832663ని క్యాన్సిల్డ్/రిజెక్టెడ్ అని శుక్రవారం ఏపీ సీఆర్డీఏ చీఫ్ ఇంజినీర్ తెలియజేశారు.మూడు సార్లు వాయిదాలెందుకు? ఇప్పుడు రద్దేల?విజయవాడ నగరంలో మూడు రోడ్డు పనులకు సంబంధించిన టెక్నికల్ బిడ్‌ను ఓపెన్ చేయకపోగా మూడు పర్యాయాలు వాయిదా వేసి చివరకు ఎందుకు రద్దు చేశారనేది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా టెండరు ఆహ్వానదారు పరిపాలనా కారణాల పేరిట ఎప్పుడైనా రద్దు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, దాదాపు నెలకు పైగా టెండరు వ్యవహారాలు నడిపి, టెక్నికల్ బిడ్ తెరవడానికి మూడుసార్లు వాయిదాలు వేసి చివర్లో రద్దు చేయడం ఏంటనేదే కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థల ప్రశ్న.కనీసం సహేతుక కారణమైనా ఉండాలి కదా అంటున్నారు. అన్ని పనులను కలిపి పెద్దమొత్తంతో టెండర్ ఆహ్వానించి రాజధాని అమరావతిలో మాదిరి బడా కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టడానికి తాజా టెండర్లను రద్దు చేసి ఉండవచ్చనే అనుమానాలను కాంట్రాక్టర్లు వ్యక్తం చేస్తుండటం పరిశీలనాంశం. అందువల్లే వాయిదాలు వేసి చివరకు టెండర్లనే రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బిడ్ తెరవలేదుగుంటూరు జేకేసీ కాలేజీ మార్గంలోని స్వర్ణభారతి నగర్ వద్ద నుంచి పెద్దపలకలూరు వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో ఫేజ్ కింద నిర్మాణానికి రూ.34,87,28,545 టెండరు పిలిచిన సంగతి తెలిసిందే. ఆగస్టు ఏడో తేదీ టెక్నికల్ బిడ్ తెరవగా ఆరు టెండర్లు దాఖలైనట్లు అధికారులు గుర్తించారు. టెండరు నిబంధనల ప్రకారం 8వ తేదీ ఫైనాన్షియల్ బిడ్‌ను తెరవాలి. కానీ ఇప్పటివరకు ఆ పనిచేయలేదు. రాజధాని అమరావతిలో వివిధ పనులకు రూ.683.33 కోట్లతో పిలిచిన టెండర్ల అంశం ఇంకా తేల్లేదు.నిత్యం తీవ్ర ఇబ్బందులేట్రాఫిక్తో విజయవాడ నగర ప్రజానీకం నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రతిపాదిత మూడు రోడ్ల విస్తరణ పనులు జరిగినట్లయితే విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలతో పాటు గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని పలు కాలనీలకు, గ్రామాలకు ప్రత్యామ్నాయ మార్గంగా, అదనపు సౌకర్యంగా ఉండేది. బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత హాస్పటల్ జంక్షన్, రామవరప్పాడు రింగ్, నిడమానూరు వరకు ట్రాఫిక్ చెప్ప నలవికాదు. చైన్నె– కోల్‌కతా జాతీయ రహదారి కూడా అయినందున ఈ మార్గంలో భారీవాహనాలు ఎక్కువే. గన్నవరం విమానాశ్రయానికి సమయానికి వెళ్లడానికి ప్రయాణికులు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. టెండర్లలో ప్రతిపాదించిన మూడు మార్గాలు విస్తరణకు నోచుకుంటే మహానాడు మార్గం నుంచి బల్లెంవారివీధి గుండా నిడమానూరు మీదుగా అటు గన్నవరం రోడ్డు, ఇటు కానూరు, పోరంకిల మీదుగా బందరు రోడ్డు, మచిలీపట్నం జాతీయరహదారికి చేరుకోవడానికి అనువైన ప్రత్యామ్నాయాలుగా ఉండేవి. అదేవిధంగా వంద అడుగుల రోడ్డు (కామినేని హాస్పటల్ రోడ్డు)కు చేరుకోవడానికి వీలయ్యేది. అన్నింటికీ మించి రెండు ఆటోనగర్ల నుంచి ఊరి వెలుపలికి వెళ్లడానికి, నగరంలోకి రావడానికి భారీ వాహనదారులకు ఉపయోగపడేది. తాజాగా రద్దయిన టెండర్ల అంశాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకుని రోడ్ల విస్తరణ పనులు జరిగేలా దృష్టి సారిస్తే ప్రజోపయోగంగా ఉంటుంది. -
తెలుగు భాష ఔన్నత్యం చాటాలి
కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తెలుగు భాష ఔన్నత్యం చాటి చెప్పడంలో తొలి భాషా విజ్ఞాని గిడుగు రామ్మూర్తి పంతులు అందించిన సేవలు చిరస్మరణీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కొనియాడారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ .. రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదనాన్ని భావితరాలకు చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశంలో కమ్మనైన తెలుగుకు మించిన భాష మరొకటి లేదన్నారు. గిడుగు రామ్మూర్తి జన్మదినమైన ఆగస్టు 29న రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తోందన్నారు. తెలుగు వ్యవహారిక భాషకు పితామహుడిగా గిడుగు రామ్మూర్తిని పరిగణిస్తారన్నారు. రామ్మూర్తి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలుస్తారన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశాతో కలిపి దాదాపు 15 కోట్ల మంది ప్రజలు తెలుగు మాట్లాడుతూ భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు బాల్యం నుంచే తెలుగు భాషలో మాట్లాడటం, రాయడం, చదవడం నేర్పించి తెలుగు భాషను భావితరాలకు అందించడంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని లక్ష్మీశ పిలుపునిచ్చారు. గిడుగు రామ్మూర్తికి నివాళులర్పించిన వారిలో డీఎం అండ్ హెచ్‌వో ఎం.సుహాసిని, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగం, డీఆర్డీఎ పీడీ ఏఎన్వీ నాంచారరావు, కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు. -
ఎయిడ్స్ రహిత సమాజానికి పాటుపడదాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): హెచ్ఐవీ/ఎయిడ్స్ రహిత సమాజం నెలకొల్పేందుకు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఎయిడ్స్ పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించి వ్యాధిని నివారించాలన్నారు. వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేసేలా సంస్థలు కృషి చేయాలన్నారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం వైద్య ఆర్యోగ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఎయిడ్స్ వ్యాధి నివారణపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ, మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేటలలో హెచ్ఐవీ/ఎయిడ్స్ పరీక్షల కేంద్రాలతో పాటు ఐసీటీఆర్ మొబైల్ వాహనం ద్వారా ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన రక్తాన్ని, 17 బ్లడ్ బ్యాంకుల ద్వారా అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, పాత ప్రభుత్వ ఆస్పత్రులలో ఏఆర్టీ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు సేవలందించేందుకు 9 స్వచ్ఛంద సంస్థలు సేవలు అందిస్తున్నాయన్నారు. 2024–25 సంవత్సరంలో 1,300 హెచ్ఐవీ పాజిటివ్ కేసులను గుర్తించామనిని, వీరిలో 1,291 మందికి వైద్య సహాయం అందించడంతో పాటు 1,924 మందికి పెన్షన్లు, పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు.ప్రత్యేక క్యాంపెయిన్ ద్వారా.. ‘మీకు తెలుసా’ క్యాంపెయిన్ ద్వారా ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి, నివారణ మార్గాలు, పరీక్షలు చేయించుకోవడం, వైద్య సేవలు పొందడం, కండోమ్ వాడకం, వ్యాధి నివారణపై చర్చాగోష్టులు నిర్వహించడం, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా చర్యలు తీసుకోవడం, టోల్ ఫ్రీ నంబర్ 1097 ద్వారా సహకారం పొందడం, వైరల్లోడ్ తగ్గించడం వంటి అంశాలను మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక ప్రచార పద్ధతుల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలు, బుక్లెట్లను కలెక్టర్ విడుదల చేశారు. సమావేశంలో డీఎం అండ్‌హెచ్‌ఓ ఎం. సుహాసిని, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ అధికారి డాక్టర్ బి.బాను నాయక్, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగం, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
కృష్ణా వర్సిటీలో క్రీడా వసతులకు చర్యలు
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయంలో క్రీడా వసతుల కల్పనకు ఖేలో ఇండియా పథకం కింద నలభై రెండు కోట్లతో ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపామని ఉప కులపతి ఆచార్య కె.రాంజీ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుక్రవారం మేజర్ ధ్యాన్‌చంద్, గిడుగు రామ్మూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యాన అఖిల భారత విశ్వవిద్యాలయాల స్థాయిలో మహిళల నెట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు భాషా వికాసానికి గిడుగు రామ్మూర్తి చేసిన కృషిని ఆయన వివరించారు. మాతృ భాషను నిర్లక్ష్యం చేయకుండా ఆంగ్లభాషపై పట్టు సాధించాలన్నారు. వికసిత భారత్ 2047–యువ కనెక్టింగ్ నోడల్ అధికారి ఎల్.సుశీల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 18 సార్లు హాకీ రాష్ట్ర జట్టు సభ్యురాలిగా జాతీయ స్థాయిలో పాల్గొన్న జ్యోతిని ఘనంగా సత్కరించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ కుమారి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి నవీన లావణ్య లత, ఎన్ ఎస్ ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి, ఆచార్య మారుతి, ఫిజికల్ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రెండు కిలోమీటర్లు వాక్‌థాన్ చేశారు. నూతన బార్లకు దరఖాస్తు గడువు ముగింపు నేడు 30 షాపులకు జేసీ సమక్షంలో డ్రా చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బార్ల నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగిసింది. జిల్లాలో 39 జనరల్ బార్లు, నాలుగు గీత కార్మికులకు కేటాయించిన బార్లు ఉన్నాయి. జనరల్ బార్లకు సంబంధించి 112 దరఖాస్తులు రాగా, గీత కులాలకు కేటాయించిన నాలుగు షాపులకు 39 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.గంగాధరరావు తెలిపారు. వీటిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక షాపునకు ఒకే దరఖాస్తుదారుడు, నాలుగు దరఖాస్తులను.. 30 షాపులకు మాత్రమే చేశారు. మిగిలిన తొమ్మిది షాపులకు నాలుగు దరఖాస్తులు చొప్పున దాఖలు కాలేదు. ప్రస్తుతం జనరల్ బార్లకు సంబం ధించి 26 షాపులు, గీత కులాలకు చెందిన నాలుగు షాపులకు శనివారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ హాలులో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ పర్యవేక్షణలో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందని గంగాధరరావు తెలిపారు. దరఖాస్తుదారులు ఉదయం 8 గంటలకే వారికి ఇచ్చిన ఎంట్రీ పాస్ ద్వారా షాపుల వారీగా లాటరీలో పాల్గొనవచ్చని ఆయన సూచించారు. ‘పసుమర్తి’కి గిడుగు రామ్మూర్తి పంతులు అవార్డు కూచిపూడి(మొవ్వ): కూచిపూడి నాట్యాచార్యులు, నాట్య ప్రయోక్త డాక్టర్ పసుమర్తి శేషుబాబు (కూచిపూడి–హైదరాబాద్)ను తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు అవార్డు వరించింది. కూచిపూడి నాట్య కళాపీఠం పూర్వ ప్రిన్సిపాల్ పసుమర్తి వేణుగోపాలకృష్ణశర్మ పెద్ద కుమారుడు శేషుబాబుకు ఈ అవార్డు వచ్చినట్లు సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళా పీఠం ఉప ప్రధానాచార్యుడు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ శుక్రవారం స్థానిక విలేకరులకు తెలిపారు. అవార్డుతో పాటు రూ.25 వేల నగదు శాలువా మెమొంటో అందజేస్తారని వివరించారు. ఏపీ యువజన అభ్యుదయం, పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమాన్ని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షణలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆయనతో పాటు వివిధ కళల్లో నిష్ణాతులైన 14 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి సత్కరించినట్లు వివరించారు. బ్యారేజీకి వరద తగ్గుముఖం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణా నదిలో వరద తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజీకి 3,08,838 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీనిలో 2,96, 900 క్యూసెక్కుల వరద దిగువకు వదిలివేస్తున్నారు. మిగిలిన 11,938 క్యూసెక్కులను పంట కాలువలకు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీకి 3,98,397 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రావడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. -
వైభవంగా జైనుల శోభాయాత్ర
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): నగరంలోని జైనులు నిర్వహించిన శోభాయాత్ర శుక్రవారం నేత్రపర్వంగా జరిగింది. మహావీర్ భగవానుని స్మరించుకుంటూ జైనులు శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీ సంభవనాథ్ జైన్ శ్వేతాంబర్ మూర్తి పూజక్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ యాత్రను నిర్వహించారు. పర్యూషన్ ముగింపుతో పాటుగా అష్టసిద్ధిదాయక్ సిద్ధితప్ (36 రోజుల ఉపవాసదీక్షలు) ముగింపును పురస్కరించుకొని పలు కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా నిర్వహించిన శోభాయాత్రలో గుర్రపు బగ్గీని పూలతో అలంకరించి అందులో మహావీరుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఊరేగించారు. అంతేకాకుండా పర్యూషన్ పర్వదినాన్ని పురస్కరించుకొని అధిక రోజులు ఉపవాసదీక్షలు పాటించిన కుటుంబాలను గుర్రపుబగ్గీలలో ఊరేగించారు. జైనులు సంకీర్తనలతో నత్యాలు చేస్తూ సందడి చేశారు. వన్‌టౌన్‌లోని జైనులు తమ ఇళ్ల ఎదుటకు వచ్చిన మహావీరునికి వారి సంప్రదాయ పద్ధతిలో నేలపై పీఠను ఉంచి, బియ్యంతో మహావీరుని మంత్రాన్ని రాస్తూ ఎదురు చల్లుతూ స్వాగతం పలికారు. ఉపవాస దీక్షలు సంస్కరిస్తాయి.. ఉపవాస దీక్షలు మానవులను సంస్కరిస్తాయని ప్రముఖ జైనగురువులు పన్యాస్ ప్రవర్ సమర్పణ ప్రభ్ విజయాజి, సాధ్వి రాజనమ్రతా శ్రిజీ అన్నారు. శోభాయాత్ర మార్వాడీ గుడి వీధిలోని జైన ఆలయం నుంచి బయలుదేరి శివాలయంవీధి, మెయిన్‌బజార్, హిందూ హైస్కూల్, సుబ్బరామయ్యవీధి, వట్టూరి వారి వీధి తదితర ప్రాంతాల మీదుగా పల్లెవీధిలోని అజిత్నాథ్ ప్రవచన్ వాటికా ప్రాంగణానికి చేరుకుంది. పలువురు జైనగురువులు పాల్గొన్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బోడోతరియా, ఉపాధ్యక్షుడు అశోక్ జైన్, జయంతిలాల్ జైన్, కార్యదర్శి పన్నాలాల్ జైన్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
108 అంబులెన్స్ ఢీకొని వ్యక్తి మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్సే ఓ వ్యక్తి మృతికి కారణమైంది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో పీఎన్బీఎస్ పరిసరాల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాణిగారితోట, సంగుల పేరయ్య వీధిలో జల్ది వెంకటేశ్వరరావు(36), భార్య రత్నకుమారి, ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నాడు. బస్టాండ్ వద్ద ఒక కార్ ట్రావెల్స్‌లో గుమాస్తాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ క్రమంలో అతను నైట్ డ్యూటీలో ఉండగా.. గురువారం రాత్రి టీ తాగేందుకు కార్ ట్రావెల్స్ కార్యాలయం నుంచి బాలాజీ హోటల్ వద్దకు వెళ్తున్నాడు. ఈ సమయంలో ప్రకాశం బ్యారేజీ వైపు నుంచి వారధి వైపునకు అతివేగంగా వెళ్తున్న 108 అంబులెన్స్ అదుపుతప్పి రోడ్డు పక్కన వెళ్తున్న అతనిని బలంగా ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయపడడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెంటనే చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనిని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జి.కొండూరు: ఎగువ ప్రాంతాలైన ఏ.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో గురువారం రాత్రి నుంచి వర్షం లేకపోవడంతో బుడమేరులో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం సాయంత్రానికి 3.2అడుగుల మేర నీటి నిల్వ ఉండగా 2,600క్యూసెక్కుల నీటి ప్రవాహం డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణా నదిలోకి వెళ్తోంది. హెచ్. ముత్యాలంపాడు వద్ద చప్టా మీదుగా బుడమేరు వరద ప్రవాహం కొనసాగుతున్నందున పక్కనే ఉన్న శిథిల వంతెన మీదుగా ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. భారీ వాహనాలను ఈ వంతెన మీదుగా పోలీసులు అనుమతించడం లేదు. వరద ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతున్నందున ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూ, ప్రసాదాల తయారీ విభాగంలో కాంట్రాక్ట్ విధానంలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న బ్రాహ్మణులను పర్మినెంట్ చేయాలని ధార్మిక పరివార్–బ్రాహ్మణ సంక్షేమ వేదిక డిమాండ్ చేసింది. శుక్రవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ధార్మిక పరివార్ జాతీయ అధ్యక్షుడు వి.వి. రామారావు మాట్లాడుతూ 25 ఏళ్లుగా దేవుని కై ంకర్యాలలో ఎంతో కీలకమైన పోటులో లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీ కార్మికులు దుర్భర జీవితాలను గడుపుతున్నారన్నారు. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయకపోవడం వల్ల ప్రయోజనాలు కోల్సోవాల్సి వస్తోందన్నారు. టీటీడీలోని ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను యాజమాన్యం రెగ్యులరైజ్ చేసిందని, కానీ పోటులో పనిచేస్తున్న బ్రాహ్మణుల విషయంలో చొరవ చూపడం లేదన్నారు. తక్షణమే యాజమాన్యం స్పందించాలన్నారు. -
రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) శుక్రవారం కేసు నమోదు చేశారు. జీఆర్పీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ విజయవాడ స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్ పదిపై ఆగింది. ఈ క్రమంలో ఆ రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు తోటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ పార్థసారథి రైలు వద్దకు చేరుకుని ప్రయాణికుల నుంచి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని వయస్సు సుమారు 45 ఏళ్లు ఉంటుందని, ఒంటిపై పసుపు, నీలం రంగు గళ్ల ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నీలం, కుంకుమ రంగు గళ్ల లుంగీ ధరించి ఉన్నాడని, కుడి మోచేతి కింది భాగంలో ‘ఎన్టీఆర్’ అనే ఇంగ్లిష్ అక్షరాలు ఉన్నాయని, ఇతర ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్లో గాని లేదా 8897156153 నంబర్ ద్వారా సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. -
మందేసి.. చిందేసి..
కొండపల్లి ఖిల్లాపై కుర్రాళ్ల వీరంగంకొండపల్లి(ఇబ్రహీంపట్నం): శతాబ్దాల చారిత్రక నేపథ్యం కలిగిన కొండపల్లి ఖిల్లా ప్రాశస్త్యం మసకబారుతోంది. ఎందరో రాజులకు పరిపాలన కేంద్రంగా నిలిచిన ఖిల్లా.. నేడు మందు బాబులకు అడ్డాగా మారింది. కార్ రేస్‌లతో పాటు మందు, విందు, చిందులతో యువకులు ఖిల్లాపై చెలరేగిపోతున్నారు. వినాయక చవితి పర్వదినం రోజు కొందరు యువకులు ఖిల్లాపై వీరంగం సృష్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పర్యాటక శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఇటువంటి ఘటనల చోటుచేసుకోవడం దురదృష్టకరమని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడి మద్యం విక్రయాలే ఇటువంటి ఘటనలకు కారణమని చెబుతున్నారు. ఒక గ్రూప్‌గా వచ్చి.. వినాయక చవితి పండగ సెలవు రోజున సుమారు 50 మంది యువకులు కొండపల్లి ఖిల్లాపై టూర్ ప్రోగ్రాం నిర్ణయించుకుని ఘాట్ రోడ్డుకు చేరుకున్నారు. ఖిల్లాపైకి చేరుకునే క్రమంలో కొందరు కార్లపైకి ఎక్కి విన్యాసాలు చేశారు. మరికొందరు డోర్ల నుంచి బయటకు చూస్తూ హవాభావాలు ప్రదర్శించి ఘాట్ రోడ్డులో ప్రయాణించే ఇతరులను భయభ్రాంతులకు గురిచేశారు. కార్లతో పాటు బైక్‌లపై కూడా రేస్‌లను తలపించే విధంగా సైరన్ వేసి డ్రైవింగ్ విన్యాసాలు చేస్తూ కుటుంబ సభ్యులతో వచ్చిన వారిని భయకంపితులను చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇటువంటి ఘటనలతో ఖిల్లాకు పర్యాటకుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ శూన్యం.. కొండపల్లి ఖిల్లా రాష్ట్ర పర్యాటక శాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఖిల్లాపై ఒక సూపర్ వైజర్‌తో పాటు గైడ్, టికెట్లు వసూలు, పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. వీరు టికెట్లు వసూలు తప్ప పర్యాటకుల కదలికలపై దృష్టి పెట్టకపోవడం ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఖిల్లాపైకి వివిధ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాల నుంచి సందర్శకులు వస్తారు. వీరితో పాటు ట్రెక్కింగ్ చేసేందుకు పాఠశాలలు, కళాశాల నుంచి విద్యార్థులు వెళ్తుంటారు. ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, ఆర్డీఓ చైతన్య ఇతర అధికారులతో ట్రెక్కింగ్ చేశారు. మందుబాబుల హంగామాతో పర్యాటకులు, ట్రెక్కర్లు సైతం ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. మందుబాబులపై అధికారులు దృష్టిసారించి అసాంఘిక కార్యకలాపాలు అరికట్టాలని సందర్శకులు కోరుతున్నారు. రేవ్ పార్టీ రేంజ్లో.. కొండపైకి చేరిన యువకులు ఖిల్లాపై బార్ అండ్ రెస్టారెంట్ మాదిరి టేబుల్స్ ఏర్పాటు చేసి మద్యం తాగారు. మద్యం మత్తులో ఖిల్లాపై నానా హంగామా సృష్టించారు. రేవ్ పార్టీ కల్చర్‌ను గుర్తు చేస్తూ చిందులు వేశారు. మద్యం మత్తులో వారిలో వారు వాదులాడుకున్నారు. ఓ దశలో వారిలో వారు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో ఖిల్లాపై సరదాగా గడుపుదామని వచ్చిన సందర్శకులు వీరి హంగామా చూసి, హడావుడిగా కొండదిగి వెళ్లిపోయారు. -
ఐక్యతా మార్గంలో ‘బౌద్ధ ధర్మ యాత్ర’
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బుద్ధుని బోధనలు.. శాంతి, కరుణ, సోదరభావానికి ప్రతీకలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ గొప్ప సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, దక్షిణాసియా అంతటా సాంస్కృతిక, వారసత్వ పర్యాటకాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ట్రై సర్వీసెస్ లార్డ్ బుద్ధా సర్క్యూట్ మోటారు సైకిల్ యాత్ర ప్రారంభమైందన్నారు. ఈ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు కలెక్టర్ అన్నారు. శుక్రవారం విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం వద్ద కలెక్టర్ లక్ష్మీశ.. లార్డ్ బుద్ధా సర్క్యూట్ మోటారు సైకిల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. నేపాల్, భారత్, శ్రీలంకలోని ముఖ్యమైన బౌద్ధ ప్రదేశాలను కవర్ చేసే లక్ష్యంతో ఈ యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. దేశ త్రివిధ దళాల అధికారులు, యువ ప్రతినిధులు పాల్గొంటున్న ఈ యాత్ర శుక్రవారం విజయవాడకు చేరుకుంది. కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి స్వాగతం పలికి, అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కన్వీనర్ రాహుల్ లక్ష్మణ్ పాటిల్, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, సాంస్కృతిక శాఖ అధికారి సుమన్, ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
విశ్రాంత బ్యాంకు ఉద్యోగి డిజిటల్ అరెస్ట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): విశ్రాంత బ్యాంకు ఉద్యోగిపై సైబర్ నేరగాళ్లు గురిపెట్టారు. డిజిటల్ అరెస్టు పేరుతో 72 గంటల పాటు వివిధ రకాలుగా వేధింపులకు గురిచేశారు. వారి ఒత్తిళ్లకు భయపడిన ఆ రిటైర్డ్ ఉద్యోగి, తన పేరుపై ఉన్న వివిధ డిపాజిట్లలోని రూ.12 లక్షలను సైబర్ నేరగాళ్ల ఖాతాలకు బదిలీ చేసేందుకు సిద్ధమయ్యారు. డిపాజిట్లు క్యాన్సిల్ చేయడంపై అనుమానం వచ్చిన కేడీసీసీ బ్యాంకు మేనేజర్ ఎ. రమ్యకృష్ణ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సైబర్ క్రైమ్ సీఐ బి. గుణరామ్ వెంటనే రంగంలోకి దిగి సైబర్ నేరగాళ్ల ప్రయత్నాన్ని విఫలం చేశారు. పూర్తి వివరాలు ఇవి.. రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ చలసాని పూర్ణచంద్రరావు(74) మొగల్రాజపురం ప్రాంతంలో నివసిస్తుంటారు. ఆయనకు మూడు రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు పోలీసుల పేరుతో ఫోన్ చేసి ‘నీ అకౌంట్లో రూ.3కోట్లు పడ్డాయి.. నీ బ్యాంకు లావాదేవీలన్నీ మా వద్ద ఉన్నాయి, నీవు విదేశాలకు ఎవరెవరిని పంపుతున్నావో మాకంతా తెలుసు’ అంటూ బైదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా అకౌంట్ సీజ్ చేస్తామంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు. వారి వేధింపులు తీవ్రరూపం దాల్చడంతో భరించలేని వృద్ధుడు తన ఖాతాల్లో డిపాజిట్ల రూపంలో ఉన్న రూ.12 లక్షలు వారికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బ్యాంక్ సిబ్బందికి అనుమానం.. విశ్రాంతి ఉద్యోగి కేడీసీసీ బ్యాంకు బ్రాంచికి వెళ్లి తన డిపాజిట్లు రూ.12 లక్షలు రద్దు చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇచ్చిన అకౌంట్‌కు బదిలీ చేయాలని బ్యాంకు సిబ్బందిని కోరారు. బ్యాంకు ఉద్యోగులకు అనుమానం రావడంతో ఎందుకు బదిలీ చేస్తున్నారని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పాటు, భయాందోళనతో ఉండటాన్ని గుర్తించారు. దీంతో నగదు బదిలీ చేయకుండా విశ్రాంత ఉద్యోగికి నచ్చజెప్పేందుకు యత్నించగా వినలేదు. సైబర్ పోలీసులకు సమాచారం.. విశ్రాంత ఉద్యోగి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజర్ ఎ. రమ్యకృష్ణ సైబర్ పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన సీఐబి. గుణరామ్, కానిస్టేబుల్ జి. ఉదయభాను బ్యాంకు వద్దకు చేరుకుని ఖాతాదారుని వివరాలు తెలుసుకున్నారు. ఆ సమయంలోనే సైబర్ నేరగాళ్లు మళ్లీ ఫోన్ చేయడంతో సీఐ గుణరామ్ ఫోన్ తీసుకుని వారిని హెచ్చరించడంతో ఫోన్ కట్ చేశారు. అనంతరం పోలీసులకు విశ్రాంత ఉద్యోగి 72 గంటలుగా తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో వివరించారు. పోలీసులు బ్యాంకు సిబ్బంది ధైర్యం చెప్పడంతో ఆందోళన నుంచి బయటపడ్డారు. కాగా నగదు బదిలీపై అనుమానించి వెంటనే అప్రమత్తమైన బ్యాంకు మేనేజర్ రమ్య కృష్ణ, ఇతర సిబ్బందిని సైబర్ పోలీసులు అభినందించారు. -
కొత్తగా 129 పోలింగ్ కేంద్రాలు
డీఆర్వో లక్ష్మీనరసింహం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్నికల ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించడానికి జిల్లాలో కొత్తగా 129 పోలింగ్ కేంద్రాలను రూపొందించారని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనరసింహం అన్నారు. కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఈసీఐ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 (ఎస్ఐఆర్– 2026) ముందస్తు సన్నాహకాల్లో భాగంగా నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళిక మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ నిర్వహించామన్నారు. జిల్లాలో 1,200 ఓటర్లకు మించి ఉన్న పోలింగ్ కేంద్రాన్ని హేతుబద్ధీకరించి కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు, సమీప పోలింగ్ కేంద్రంలో విలీనం చేయాలని ఆదేశించారన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,792 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వీటిలో 295 సెంటర్లలో 1,200 మంది ఓటర్లు మించి ఉన్నారన్నారు. అదనంగా ఉన్న ఓటర్లను సమీప కేంద్రంలో విలీనం చేసి కొత్తగా మరో 129 పోలింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను రూపొందించామన్నారు. వీటితో ప్రస్తుతం ఏర్పాటు చేసిన 129తో కలిపి జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,921కి చేరిందన్నారు. జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందజేశామన్నారు. పోలింగ్ కేంద్రం వారీగా బూతు స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సమావేశంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ కాలనీలో గుర్తు తెలియని మృతదేహం
భవానీపురం(విజయవాడపశ్చిమ): నగర శివారులో ఉన్న జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాలనీలోని కొత్త బ్లాకుల వద్ద గల చెరువులో మృతదేహం ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సుమారు 35–40 సంవత్సరాల వయసు కలిగి వంటిపై లైట్ బ్లూ కలర్ చొక్కా, బ్లాక్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మణికట్టుకు కాశీదారం ఉన్న గుర్తు తెలియని ఆ వ్యక్తి చెప్పులు, కండువా చెరువు గట్టుపై వదిలేసి చెరువులో దూకి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదుపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వివరాలు ఎవరికై నా తెలిస్తే టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. -
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
మచిలీపట్నం అర్బన్: స్థానిక నోబుల్ కళాశాలలో డీఎస్సీ–2025 అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. దీని కోసం కళాశాలలో మొత్తం 21 రూంలను ఏర్పాటు చేశారు. అబ్జర్వర్ ప్రసన్న కుమార్, కృష్ణా జిల్లా డీఈఓ పీవీజే రామారావు, ఎన్టీఆర్ జిల్లా డీఈఓ యూవీ సుబ్బారావు పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగింది. మూడు రూంలకు ఒక డీవైఈఓ ఇన్చార్జ్గా వ్యవహరించారు. ప్రతి రూంలో ఒక ఎంఈఓ, హెచ్ఎం, డెప్యూటీ తహసీల్దార్, టెక్నికల్ అసిస్టెంట్, ఒక పీడీలను నియమించారు. మొత్తం 1,048 మందికి.. మొత్తం 1,048 మంది అర్హత పొందిన అభ్యర్థులను మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో పరిశీలనకు విద్యాశాఖ కాల్ లెటర్లు జారీ చేసింది. కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థులను ఒక్కో రూంలో 50 మంది చొప్పున సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యేలా విభజించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, డిసేబుల్డ్ వెల్ఫేర్ శాఖల అధికారులు, గురుకుల విద్యాలయాల ప్రతినిధులు బృందాలుగా పాల్గొని పరిశీలన చేస్తున్నారు. అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లతో పాటు అవసరమైన జత పత్రాలను సమర్పించి ధ్రువీకరణ కోసం హాజరయ్యారు. వర్షాల నేపథ్యంలో అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కృష్ణాడీఈఓ రామారావు తెలిపారు. డీఎస్సీలో నోటిఫై చేసిన పోస్టులు.. నోటిఫికేషన్‌కు ఉమ్మడికృష్ణా నుంచి మొత్తం 19,953 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 6,543 మంది పురుషులు, 13,410 మంది మహిళలు ఉన్నా రు. 1,208 పోస్టులు భర్తీకి విద్యాశాఖ నోటిఫై చేసింది. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 540, ఎస్జీటీ 545, పీఈటీలు 123, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరో ఐదు (ఎస్జీటీ 2, స్కూల్ అసిస్టెంట్లు 3) పోస్టులు ఉన్నాయి. నిరాశలో అభ్యర్థులు.. డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. అయితే మెరిట్ లిస్టులో ఉన్నప్పటికీ కాల్ లెటర్లు రాకపోవడంతో వారు సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందిస్తూ మెరిట్, రోస్టర్, ఖాళీల ఆధారంగా మాత్రమే కాల్ లెటర్లు పంపించామని స్పష్టం చేశారు. రెండు, మూడు పోస్టులు సాధించిన అభ్యర్థులకు, ఒక్క పోస్టు మాత్ర మే, అదీ అభ్యర్థి దరఖాస్తులో చూపిన ప్రాధాన్యతాక్రమం ప్రకారమే అవకాశం ఉండటంతో చాలామందికి కాల్ లెటర్లు అందక నిరాశ చెంది వెనుదిరిగారు. -
అప్రమత్తంగా ఉండాలి
జి.కొండూరు: ఎగువన వర్షాలు పడుతున్న నేపథ్యంలో బుడమేరుకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. జి.కొండూరు మండల పరిధి హెచ్.ముత్యాలంపాడు వద్ద చప్టాపై ప్రవహిస్తున్న బుడమేరు వరద ఉద్ధృతిని కలెక్టర్ గురువారం పరిశీలించారు. అనంతరం వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద వరద ప్రవాహాన్ని అధికారులతో కలిసి పరిశీలించి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు.నిరంతర పర్యవేక్షణ..వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. బుడమేరులో వరద ప్రవాహం డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలోకి వెళ్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందవలసి అవసరం లేదని చెప్పారు. ఒకవేళ వరద ఉద్ధృతి పెరిగి రెగ్యులేటర్ గేట్లు ఎత్తాల్సి వస్తే ముందుగానే సమాచారం అందించి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని వివరించారు. తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రామకృష్ణనాయక్, బుడమేరు ఏఈ వెంకటేశ్ పాల్గొన్నారు.కంట్రోల్ రూం ఏర్పాటుగాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానదితో పాటు బుడమేరు, మునేరులో ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు ఆందో ళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ (సీసీసీ) నుంచి జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణా వరద నీటికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరీవాహక గ్రామాల ప్రజలకు తెలియజేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 95 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. కొండ ప్రాంతాల్లో వర్షాలు పడే సమయంలో కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉన్నందున పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు.ఏ సహాయం కావాలన్నా..91549 70454 నంబరుతో కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఇందులో సమన్వయ శాఖల అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సమాచారం కోసమైనా, సహాయానికైనా కమాండ్ కంట్రోల్ కేంద్రానికి ఫోన్ చేయొచ్చని సూచించారు. -
ఇద్దరు యువకుల ప్రాణాలు కాపాడిన పోలీసులు
వరదలో కొట్టుకుపోయిన బైక్ పెనుగంచిప్రోలు: మునేరు వరదలో చిక్కుకున్న యువకులను స్థానికుల సహకారంతో పోలీసులు కాపాడిన ఘటన మండల కేంద్రం పెనుగంచిప్రోలులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన రేలా సుధాకర్, నందిగామ మండలం చెర్వుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన మార్కాపురపు సురేష్ తిరుపతమ్మవారి దర్శనానికి పెనుగంచిప్రోలు వచ్చారు. అనంతరం మునేరు అవతల నుంచి కాజ్‌వేపై పెనుగంచిప్రోలు వైపు వస్తుండగా ప్రమాదవశాత్తూ బైక్‌తో సహా మునేరు వరద నీటిలో పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే కాజ్‌వేకు పక్కన ఉన్న పైపును పట్టుకున్న వారిని రోప్ సాయంతో బయటకు తీశారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నా యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే వారి బైక్ మాత్రం వరద నీటిలో కొట్టుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో యువకులు మద్యం తాగి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వరద ఎక్కువగా ఉన్న కారణంగా జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ అర్జున్ సూచించారు. -
గణనాథుడి విగ్రహాన్ని దర్శించుకున్న సీఎం
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ విద్యాధరపురంలోని లేబర్‌కాలనీ గ్రౌండ్ లో డూండీ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మట్టి మహా గణపతి విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, సమితి నిర్వాహకులు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా చవితి వేడుకలుగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలసి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా.. అన్ని విఘ్నాలు తొలగి జిల్లా, రాష్ట్రం, దేశం సమగ్ర అభివృద్ధి చెందేలా ఆ ఆది దేవుని ఆశీస్సులు ఉండాలని పేర్కొన్నారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఏవో ఎ.శ్రీనివాస్ రెడ్డి, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.నిత్యాన్నదానానికి విరాళంభవానీపురం(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ప్రతి రోజూ జరిగే నిత్యాన్నదాన పథకానికి కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం దోసపాడు గ్రామానికి చెందిన చదలవాడ కోటేశ్వరరావు దంపతులు రూ.1,01,116 విరాళం అందజేశారు. గురువారం ఇంద్రకీలాద్రిపైకి విచ్చేసిన వారు ఆలయ అధికారులను కలిసి విరాళాన్ని అందించారు. అనంతరం దాత కుటుంబానికి అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితులతో వేదాశీర్వచనం తర్వాత అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.క్వాంటం వ్యాలీతో ఉపాధి అవకాశాలుకోనేరుసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీతో పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాంజీ పేర్కొన్నారు. గురువారం వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్ హ్యాకథాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. క్వాంటం వ్యాలీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ కుమారి మాట్లాడుతూ ఇంటర్ క్వాంటం వ్యాలీ హ్యాకథాన్‌లో పదహారు టీమ్‌లు పాల్గొనడం శుభపరిణామం అన్నారు. కార్యక్రమానికి డాక్టర్ సల్మా సమన్వయకర్తగా వ్యవరించగా.. కంప్యూటర్ సైన్స్ డీన్ ఆచార్య వైకే సుందర కృష్ణ పాల్గొన్నారు.సాగర్‌ను సందర్శించిన 23 దేశాల ప్రతినిధులువిజయపురిసౌత్: అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్‌ను బుధవారం 23 దేశాలకు చెందిన 27 మంది ప్రతినిధులు సందర్శించారు. నేపాల్, శ్రీలంక, రష్యా, వియత్నాం, జింబాబ్వే, నైజీరియా, తదితర 23 దేశాల ప్రతినిధులు ఈ నెల 15వ తేదీనుంచి హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ‘నూతన ఆవిష్కరణలు–అభివృద్ధి’ అనే అంశంపై శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 30వ తేదీతో శిక్షణ ముగియనుంది. దీనిలో భాగంగా టీం కో–ఆర్డినేటర్ డాక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌ను సందర్శించారు. -
దంచింది.. ముంచింది!
ఎడతెరిపి లేని వానతో జిల్లా అతలాకుతలం సాక్షి ప్రతినిధి, విజయవాడ: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాను వణికిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరద భారీగా వస్తోంది. దీనికితోడు పాలేరు నుంచి 5,660 క్యూసెక్కులు, కీసర నుంచి 27,902 క్యూసెక్కులు, బుడమేరు నుంచి 3,500 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చి చేరుతోంది. దీంతో మధ్యాహ్నం 2గంటల సమయంలో ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన 69 గేట్లు ఎత్తి 4,16,622 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు మధ్యాహ్నం 3గంటల నుంచి కొంత మేర వరద తగ్గడంతో, శుక్రవారం ఉదయానికి వరద తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నేడు కూడా అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా ఎగువ, దిగువ పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజీ నుంచి 551 టీఎంసీల నీటిని విడుదల చేశారు. జూలై 20వ తేదీ నుంచి ప్రకాశం బ్యారేజి నుంచి వరద నీటిని నిరంతరాయంగా సముద్రంలోకి విడుదల చేస్తూనే ఉన్నారు. విజయవాడను వదలని వాన.. బుధవారం వినాయక చవితి పండుగ రోజు ఉదయం బెజవాడలో భారీ వర్షం కురిసింది. నగరంలో వీధులన్నీ జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగి ప్రవహించాయి. ప్రధాన రహదారులన్నీ మోకాళ్లలోతు పైన నీటితో వాగులను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వినాయక మండపాల వద్దకు నీరు చేరింది. గురువారం తేలికపాటి వర్షాలు కురిశాయి. ఎగువన కురిసిన వర్షాలకు బుడమేరుకు 3,500 క్యూసెక్కుల నీరు వస్తోంది. అయితే డైవర్షన్ చానల్ ద్వారా ఆ నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. కొంత మేర వరద పెరిగినా ఇబ్బంది ఏమి ఉందడని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. డైవర్షన్ కాలువ ద్వారా 10,500 క్యూసెక్కుల నీటిని మళ్లించే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో గడచిన 48 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం నుంచి గురువా రం ఉదయం 8.30 గంటల మధ్య 80.43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం ఉదయం 8.30 గంటలకు.. జగ్గయ్యపేటలో 32.4, చందర్లపాడులో 24.4, పెనుగంచిప్రోలులో 23.4, తిరువూరులో 22.6, మైలవరంలో 18.4, గంపలగూడెంలో 18.2, కంచికచర్లలో 17.6, విజయవాడ ఈస్ట్‌లో 17.2, నార్త్‌లో 17.0, సెంట్రల్, వెస్ట్‌లో 16.4 చొప్పున, నందిగామ, జి కొండూరు మండలాల్లో 15.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గురువారం ఉదయం 8.30 వరకు.. జి. కొండూరులో 152.8, చందర్లపాడులో 123.0, కంచికచర్లలో 98.8, తిరువూరులో 98.4, వీరులపాడులో 96.2, ఏ కొండూరులో 88.4, ఇబ్రహీంపట్నంలో 88.4, గంపలగూడెంలో 87.6, విస్సన్నపేటలో 84.4, రెడ్డిగూడెంలో 78.4, మైలవరంలో 69.2, వత్సవాయిలో 67.8, పెనుగంచిప్రోలులో 67.4, నందిగామలో 64.4, జగ్గయ్యపేటలో 62.4, విజయవాడ రూరల్‌లో 56.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
రైల్లో బంగారు ఆభరణాల దొంగ అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగును చోరీ చేసిన నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) డీఎస్పీ రత్నరాజు విజయవాడ రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీ స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన తొరియవాలా కుజమా ఈ నెల 16న భగత్ కి కోటి నుంచి చైన్నెకి ఏ1 కోచ్‌లో ప్రయాణం చేస్తోంది. రైలు విజయవాడ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు చూసుకోగా తన సీటు వద్ద ఉన్న బంగారు ఆభరణాలు కలిగిన లగేజీ బ్యాగు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఎక్కడా లభ్యం కాలేదు. దీంతో రైలు విజయవాడ సమీపిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తన బ్యాగును చోరీ చేసినట్లు ఆమె రైలు మదాద్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన విజయవాడ జీఆర్పీ సిబ్బంది ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాల ద్వారా చోరీకి పాల్పడింది గుంటూరుకు చెందిన పాతనేరస్తుడు అబ్దుల్ రహ్మాన్‌గా గుర్తించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఏసీ కోచ్‌లనే టార్గెట్‌గా చేసుకుని ప్రయాణికుడిలా రైలులో ప్రయాణం చేస్తూ అదను చూసి లగేజీ బ్యాగులను చోరీ చేస్తుంటాడని డీఎస్పీ తెలిపారు. ఇప్పటికే విజయవాడ జీఆర్పీ పోలీసులు నాలుగు కేసుల్లో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అయినా తన నేర ప్రవృత్తిని మార్చుకోకుండా అదే తరహా నేరాలకు పాల్పడుతున్నాడన్నారు. నిందితుని నుంచి రూ.8 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు ఇతర చోరీ కేసుల్లో రూ.2లక్షల విలువైన రెండు ల్యాప్‌టాప్‌లు, ఐ ఫోన్లు రికవరీ చేశారు. సమావేశంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సీఐలు జె.వి రమణ, ఫతే ఆలీబేగ్, సిబ్బంది పాల్గొన్నారు. రూ.10 లక్షల చోరీ సొత్తు స్వాధీనం -
ఢిల్లీ సదస్సులో పాల్గొన్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్
గన్నవరంరూరల్: బోధన, అభ్యాస ప్రక్రియలో సృజనాత్మక ఆచరణలపై జాతీయ స్థాయి వర్క్‌షాప్‌కు గన్నవరం మండలం వీరపనేనిగూడెం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వై.యశోదలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరయ్యారు. ఢిల్లీలో వారం రోజుల పాటు ఏపీ సమగ్ర శిక్షణ ఆధ్వర్యాన జరుగుతున్న జాతీయ విద్య ప్రణాళిక, పరిపాలన సంస్థ నిర్వహిస్తున్న ఈ సదస్సులో పాల్గొనే అరుదైన గౌరవం ఆమెకు దక్కింది. విద్యార్థుల సామర్థ్య వికాసం కోసం సూచనలు, సలహాలు సదస్సులో అందించాల్సి ఉంది. స్వదేశీ జ్ఞానాన్ని అమలు చేయటం, సృజన పెంచటం వంటి అంశాలపై యశోదలక్ష్మి ప్రసంగాలకు ప్రశంసలు లభించాయి.