అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): శ్రీతిరుపతమ్మ అమ్మవారి చిన్నతిరునాళ్ల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు – కుంకుమ బండ్లు తీసుకొచ్చే కార్యక్రమం శనివారం రాత్రి కనుల పండువగా జరిగింది. అమ్మవారి వంశీ కుడు కొల్లా శ్రీనివాసరావు ఇంటి వద్ద ఆలయ వేద పండితులు, అర్చకుల ప్రత్యేక పూజలు అనంతరం రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులు, పూలతో అలంకరించిన బండిపై పసుపు – కుంకుమ ఉంచి ఘనంగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో అమ్మవారి పుట్టినింటికి చేరుకొని ఆనంద పరవశులయ్యారు. గ్రామంలో రోడ్ల వెంట భక్తులు బారులు తీరి బండ్లను వీక్షించటంతో పాటు వార్లు పోసి పూజలు నిర్వహించారు. కోలాట నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఈఓ బి. మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్‌బాబు, ఈఈ కె.వి.రాజు, డీసీపీ బి.లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ తిలక్, తహసీల్దార్ ఎ శాంతిలక్ష్మి, ఏఈ రాజు, ఉత్సవ కమిటీసభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి బండి వద్ద ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం అమ్మవారిని దర్శించుకున్నారు.


