పూజల్లో పాల్గొన్న విజయేంద్ర సరస్వతి స్వామిజీ దుర్గమ్మను దర్శించుకున్న పలువురు ప్రముఖులు నేడు అమ్మవారి ఆలయ శిఖరానికి కుంభాభిషేకం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థా నంలో కుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన శనివారం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ ఆలయానికి విచ్చేసి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌కు సుమారు గంట పాటు స్వామిజీ పూజాధి కార్యక్రమాలు జరిపించారు. అనంతరం రావిచెట్టు వద్ద ఇంద్ర కీలాద్రి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు. యాగశాలకు చేరుకున్న స్వామిజీ కుంభాభిషేక క్రతువును పర్యవేక్షించారు. మల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామిజీ విశేష అభిషేకాలు నిర్వహించారు. మల్లేశ్వరాలయం వద్ద విజయేంద్ర సరస్వతి స్వామిజీ శ్రీమద్భగద్గీత పుస్తకాన్ని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఇతర అధికారులు పాల్గొన్నారు. తొలుత శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ఆయన శిష్యులు దుర్గాఘాట్ సమీపంలో కృష్ణానదిలో పుణ్య స్నానం ఆచరించారు.
యాగశాలలో పూజలు
కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా శని వారం ఉదయం ఆలయ అర్చకులు, వేద పండితులు పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో అష్టోత్తర కలశ స్థ్థాపన, పీఠ పూజలు నిర్వహించారు. సాయంత్రం మూలమంత్ర హవనం, ప్రదోష కాల పీఠ పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. యాగశాలలో నిర్వహించిన పూజా కార్యక్రమాలను విజయేంద్ర సరస్వతి స్వామిజీ పర్యవేక్షించగా, రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. కుంభాభిషేకం వేళ దుర్గమ్మను ఎంపీ కేశినేని చిన్న, మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు దర్శించుకున్నారు.
నేడు కుంభాభిషేకం
ఆదివారం ఉదయం 9.34 గంటలకు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ చేతుల మీదగా అమ్మవారి ఆలయ శిఖరానికి కుంభాభిషేకం జరుగుతుంది. పూర్ణాహుతి అనంతరం యాగశాల నుంచి విజయేంద్ర సరస్వతి స్వామిజీతో పాటు ఆలయ అర్చకులు, వేద పండితులు నదీ జలాలను తీసుకుని ఆలయ శిఖరంపైకి వేడుకను జరిపిస్తారు.


