ప్రజల సంతృప్తే గీటురాయి | - | Sakshi
Sakshi News home page

ప్రజల సంతృప్తే గీటురాయి

Mar 8 2026 7:17 AM | Updated on Mar 8 2026 7:17 AM

గాంధీగనర్‌(విజయవాడసెంట్రల్‌): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా అందే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజల సంతృప్తి స్థాయే అధికారుల పనితీరుకు గీటురాయని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్‌ లక్ష్మీశ ఆధ్వర్యంలో తహసీల్దార్లు, డెప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, రీసర్వే డెప్యూటీ తహసీల్దార్లు తదితరులలో శనివారం సమావేశం జరిగింది. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్‌ లక్ష్మీశ మండలాల వారీగా రెవెన్యూ సేవల పంపిణీ, సమస్యల పరిష్కారంలో పురోగతి తదితరాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ ప్రజలతో నేరుగా ముడిపడి ఉన్న ముఖ్యమైన శాఖ అని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం ఉంచి తమ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కార్యాలయా లను ఆశ్రయిస్తారని, అందువల్ల ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు. పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా అందే ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు. అసైన్‌మెంట్స్‌, 22(ఏ) నుంచి తొలగింపు, రీసర్వే గ్రీవెన్సులు వంటివాటిపై వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. కేవలం సమస్యను ముగించడం కోసం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూములకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో పారదర్శకత పాటించాలని, సర్వేలు సమయానికి పూర్తిచేసి ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించా లని తెలిపారు. ఆర్డీఓల స్థాయిలో డిజిటల్‌ అసిస్టెంట్ల సేవలపై నిరంతర పర్యవేక్షణ ముఖ్యమని పేర్కొన్నారు. సేవలు అందించడంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సహజ వనరుల పరిరక్షణపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్‌ స్పష్టంచేశారు. చెరువులు, కాలువలు, వాగులు, కుంటలు వంటి జల వనరులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని ఆదేశించారు. జల వనరులు ప్రజలకు అత్యంత విలువైన సంపద అని, భవిష్యత్‌ తరాలకు వాటిని పరిరక్షించడం మన బాధ్యత అని, భూగర్భ జలాల పరిరక్షణకు సమష్టి కృషి అవసరమని కలెక్టర్‌ లక్ష్మీశ అన్నారు. ఈ సమావేశంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ కె.పోసిబాబు తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ అధికారుల సదస్సులో

కలెక్టర్‌ లక్ష్మీశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement