విజయవాడలో రెండో రోజూ కొనసాగిన ఏసీబీ సోదాలు
తవ్విన కొద్దీ అవకతవకలు
రికార్డులు, భవన అనుమతులపై ఆరా
ఆంధ్రప్రభ కాలనీలో ఏసీబీ అధికారుల క్షేత్ర స్థాయిలో పరిశీలన
ప్రాథమికంగా అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ
సెంట్రల్, వన్‌టౌన్‌లో ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్‌లో జరుగుతున్న అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఏసీబీ సోదాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారుల సోదాలు రెండో రోజైన బుధవారం కూడా కొనసాగాయి. భవన నిర్మాణ అనుమతుల్లో టౌన్ ప్లానింగ్ విభాగం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీకి సైతం ఆరు నెలలుగా భారీగా ఫిర్యాదులు అందాయి. నేపథ్యంలో ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లో దాడులు చేపట్టిన ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు కీలక పత్రాలను పరిశీలించారు.
కళ్లముందే అక్రమ కట్టడాలు
బుధవారం కూడా ఏసీబీ అధికారుల దాడులు కొనసాగాయి. పలు బృందాలుగా విడిపోయిన అధికారులు నగరంలో పలు ప్రాంతాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో భవనాలను తనిఖీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) కింద దరఖాస్తులు చాలా తక్కువ సంఖ్యలో రావడం అనుమానాలకు దారితీసింది. కళ్లముందే అక్రమ కట్టడాలు కనిపిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రధానంగా అజిత్‌సింగ్ నగర్‌లోని ఆంధ్రప్రభ కాలనీ, అయోధ్యనగర్‌లో ఏసీబీ అధికారులు మూడు అక్రమ కట్టడాలను గుర్తించారు. బుధవారం సాయంత్రానికి రెండు భవనాలను క్షుణంగా తనిఖీ చేశారు. మూడో కట్టడాన్ని పరిశీలిస్తున్నారు. ఇందులో ప్రధానంగా భవన నిర్మాణాల్లో డీవియేషన్లు, సెట్‌బ్యాక్స్, తీసుకున్న అనుమ తులు, ప్లానింగ్ ప్రకారం భవన నిర్మాణం చేపట్టారా లేదా వంటి అంశాలను తనిఖీచేశారు. అక్రమ నిర్మాణాలపై లావాదేవీలు జరిగాయనే అనుమానం వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారుల వద్ద డాక్యుమెంట్లను సేకరించారు. నగరంలోని మూడు సర్కిళ్లలో దాదాపు ఏడు భవనాలకు సంబంధించి తమ పరిశీలనలో డీవియేషన్లు ఉన్నట్లు గుర్తించారు. క్షేత్ర స్థాయిలో ప్రాథమికంగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ప్రధానంగా సర్కిల్ –2 పరిధిలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని సమాచారం. సర్కిల్–1 పరిధిలో ఉన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వన్‌టౌన్‌లో టౌన్ ప్లానింగ్ విభాగంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అక్కడ ఒక భవనాన్ని ఏసీబీ అధికారులు పరిశీలించారు. ముఖ్యంగా ప్లాన్‌లో చూపించిన వాటికన్నా, అదనంగా అంతస్తుల నిర్మాణంతో పాటు పెద్ద ఎత్తున డీవియేషన్లు ఉన్నట్లు గుర్తించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారుల అవినీతికి సంబంఽధించి వచ్చిన ఆరోపణలపైనా ఆరా తీస్తున్నారు. సర్కిల్–3 ప్రాంతంలో మూడు భవనాలను పరిశీలించారు.
విజయవాడ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో తవ్విన కొద్దీ అవకతవకలు బయటపడుతున్నాయి. ప్లాన్‌లో చూపించిన వాటి కంటే అనధికారికంగా అదనపు అంతస్తుల నిర్మాణం యథేచ్ఛగా జరిగింది. కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను మంజూరు చేశారు. ఇలాంటివి పెద్ద ఎత్తున విజయవాడ సెంట్రల్, వన్‌టౌన్ ప్రాంతంలో జరిగాయి. ఈ విషయంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖాళీ స్థలానికి చెల్లించాల్సిన రుసుం తగ్గించి, కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టినట్లు గుర్తించారు. కొన్ని భవనాల యజమానుల నుంచి గ్రీన్ ట్యాక్స్ వసూలు చేయలేదు. లేబర్ సెస్ విషయంలో కూడా అక్రమాలు జరిగినట్లు తెలిసింది. ఈ క్షేత్ర స్థాయి తనిఖీలు, రికార్డులను పరిశీలించి, జరిగిన అవకతవలకపై ఏసీబీ అధికారులు సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నారు.


