కొత్త పింఛన్‌.. ఇంకెప్పుడు? | - | Sakshi
Sakshi News home page

కొత్త పింఛన్‌.. ఇంకెప్పుడు?

Mar 12 2026 7:47 AM | Updated on Mar 12 2026 7:47 AM

వీఎంసీ చివరి కౌన్సిల్‌లో వైఎస్సార్‌ సీపీ ప్రశ్న

అధికారులు సమాధానం చెబుతుండగా అడ్డుపడిన టీడీపీ

సభలో ఇరుపక్షాల వాగ్వాదం

పటమట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడలో ఒక్క కొత్త పెన్షన్‌ కూడా మంజూరు చేయలేదని వైఎస్సార్‌ సీపీ సభ్యులు మండిపడ్డారు. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం వీఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రశ్నోత్తరాల్లో వచ్చిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పే ప్రయత్నం చేయగా.. కూటమి సభ్యులు అడ్డుపడ్డారు. చివరి కౌన్సిల్లో టీడీపీ తీరు మార్చుకో కుండా అదే ధోరణిలో సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. దీన్ని వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లు దీటుగా ఎదుర్కొన్నారు.

అరుపులు, కేకలు..

2019 నుంచి 2024 వరకు, 2024 మే నుంచి ఇప్పటి వరకు నగరంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు కొత్తగా మంజూరు చేసిన పెన్షన్‌ వివరాలను సభ్యులు అడిగారు. అధికారులు సమాధానం ఇస్తుండగా టీడీపీ సభ్యులు లేచి అరుపులు, కేకలతో గందరగోళం సృష్టించారు. వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లు కూడా లేచి గత ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్లు, ఈ ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ల జాబితాను వివరించారు. ఈ ప్రభుత్వ ఒక్క కొత్త పెన్షన్‌ కూడా ఇవ్వలేదని విమర్శించారు. దీంతో సభలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. మేయర్‌ భాగ్యలక్ష్మి కల్పించుకొని అధికారులతో సమాధానాలు చెప్పించే ప్రయత్నం చేసినా టీడీపీ సభ్యులు సభను సాగనివ్వలేదు. దీంతో మేయర్‌ ప్రశ్నోత్తరాల్లో తర్వాత అంశాన్ని చర్చించాల్సిందిగా ఆదేశించారు.

సభను పక్కదారి పట్టిస్తున్నారు..

వేసవి ప్రారంభమైందని, వైఎస్సార్‌ సీపీ పాల కపక్షం ఏర్పడి ఐదేళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా నగరంలో తాగునీటి కష్టాలను నిరోధించేందుకు సర్కిళ్ల వారీగా ఎన్ని రిజర్వాయర్లు మంజూరయ్యాయి.. వీటిలో ఎన్ని పూర్తయ్యాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వారీగా వివరాలు తెలపాలని సభ్యులు ప్రశ్నించగా.. అధికారులు ఇచ్చిన సమాధానాలతో సభ్యులు సంతృప్తి చెందలేదు. పాలకపక్షం కౌన్సిల్‌ సాక్షిగా చేసిన తీర్మానాలను కూడా అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని, ఇంజినీరింగ్‌ విభాగం కేవలం అధికారులు పనులు చేయటంలో ఆలస్యం చేస్తున్నారని, 7 తాగునీటి రిజర్వాయర్లకు శంకుస్థాపనలు చేయగా కేవలం రెండు మాత్రమే నిర్మించటంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.

సర్కిల్‌–2లోని లోటస్‌ల్యాండ్‌మార్క్‌లో వీఎంసీ పలు అభివృద్ధి పనులు చేపట్టిందని, రోడ్లు, డ్రెయినేజీలు, పార్కులకు రూ.18 కోట్లు వెచ్చించినా అవి స్థానికులకు అందుబాటులోకి రాకుండా లోటస్‌ యాజమాన్యం అడ్డుకుందని, చివరికి శానిటరీ సిబ్బంది వెళ్లేదారి లేకుండా గేట్లకు తాళాలు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని సభ్యులు ప్రస్తావించారు. అది గేటెడ్‌ కమ్యూనిటీ అయితే 50శాతం భాగస్వామ్యం లోటస్‌ యాజమాన్యంతో చెల్లింపులు చేసిన తర్వాతే శానిటేషన్‌ చేయాలని, అక్కడి పార్కుల్లో వీఎంసీ బోర్డులు ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు సూచించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లు, రీడింగ్‌ రూంల నిర్వహణను వీఎంసీతో పాటు స్థానికులను కూడా భాగస్వాములు చేయాలని, ఎస్సీ, ఎస్సీ, బీసీ, తదితర కమ్యూనిటీల ఆధ్వర్యంలోనే వాటి నిర్వహణ జరగాలని వచ్చిన ప్రతిపాదను సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారు.

122 అంశాలకు ఆమోదం..

వీఎంసీ చివరి సమావేశపు అజెండాలో మొత్తం 144 అంశాలు ప్రతిపాదించగా అందులో 122 అంశాలు ఆమోదించారు. ఆఫీస్‌ రిమార్కులకు 14 అంశాలు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాలుగు అంశాలను, వీఎంసీ చర్యలు తీసుకోవాలని మరో రెండు అంశాలు సిఫార్సు చేశారు. మరో అంశాన్ని ధ్రువీకరించగా, ఇంకో అంశాన్ని రికార్డు చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్‌ పుణ్యశీల

(ఇన్‌సెట్‌) కౌన్సిల్‌ నిర్వహిస్తున్న మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement