దుర్గమ్మకు రూ.3.35 కోట్ల హుండీ ఆదాయం | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు రూ.3.35 కోట్ల హుండీ ఆదాయం

Mar 12 2026 7:47 AM | Updated on Mar 12 2026 7:47 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.35 కోట్ల కానుకలు సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను మహా మండపం ఆరో అంతస్తులో బుధవారం లెక్కించారు. 18 రోజులకు రూ.3,35, 86,637 నగదు, 302 గ్రాముల బంగారం, 3.010 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈఓ శీనానాయక్‌ తెలిపారు. 1,337 యూఎస్‌ఏ డాలర్లు, 55 ఇంగ్లాండ్‌ డాలర్లు, 132 సింగపూర్‌ డాలర్లు, 335 యూఏఈ దిర్హమ్స్‌, 55 ఆస్ట్రేలియా డాలర్లు, 60 కువైట్‌ దినార్లు, 220 ఖతర్‌ రియాల్స్‌, 20 హాంగ్‌కాంగ్‌ డాలర్లు, 200 మాల్దీవ్స్‌ రూపీ, 240 కెనడా డాలర్లు లభించనట్లు వివరించారు. కానుకల లెక్కింపులో సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొనగా, వన్‌టౌన్‌ పోలీసులు, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది పర్యవేక్షించారు.

దుర్గమ్మకు

రూ.4.50 లక్షల విరాళాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తులు బుధవారం రూ.4.50 లక్షల విరాళాలు సమర్పించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌కు చెందిన కోటిరావు, అంజుకుమారి అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఈఓ శీనానాయక్‌ను కలిసి అంజుకుమారి, తనీషిరావు పేరిట నిత్య ఉచిత ప్రసాద వితరణకు రూ.2.25 లక్షలు, గో సంరక్షణ పథకానికి రూ.2.25 లక్షల చొప్పున విరాళాలు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

గన్నవరం రూరల్‌: మండలం సూరంపల్లిలో పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ మూడో విడత విడుదల చేసే కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని రైతులకు పీఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం. నవీన్‌, ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు, ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం ఏర్పాట్లపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఎంత మంది రైతులు వస్తారు, వారికి ఏ విధంగా సదుపాయాలు కల్పించాలి, వాహనాలను ఎక్కడ పార్కింగ్‌ చేయాలి తదితర అంశాలపై చర్చించారు.

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

చిలకలపూడి(మచిలీపట్నం): అంకితభావంతో విధులు నిర్వర్తించి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక సూచించారు. జెడ్పీ సమావేశపు హాలులో బుధవారం సాయంత్రం పలువురికి ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తమ హయాంలో ఇప్పటికి 150 మంది వరకు కారుణ్య నియామకపత్రాలు అందజేశామని పేర్కొన్నారు. 100 మందికి పైగా ఉద్యోగోన్నతులు పొందారని వివరించారు. ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యు లను జాగ్రత్తగా చూసుకుని అందరి మన్ననలు పొందాలని సూచించారు. రికార్డు అసిస్టెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, లైబ్రెరీ అసిస్టెంట్లు ఏడుగురికి జూనియర్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. జూనియర్‌ అసిస్టెంట్లుగా 19 మందికి, టైపిస్టులుగా 19 మందికి, ఆఫీస్‌ సబార్డినేట్లుగా ముగ్గురికి కారుణ్య నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డెప్యూటీ సీఈఓ ఆర్‌.సి.ఆనంద్‌కుమార్‌, ఏఓ ఎం. తేజస్వీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement