జి.కొండూరు: మైలవరం తారకరామానగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణలో లోపాలు ఉన్నట్లు గుర్తించామని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోవడం లేదంటూ విద్యార్థులు మంగళవారం తమ ప్లేట్లలో భోజనాన్ని బకెట్‌లో పడవేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మీడియాలో కథనాలు రావడంతో డీఈఓ చంద్రకళ, తహసీల్దార్ అబ్దుల్‌దరియా, ఏంఈఓ ఎల్.బాలు, బండి రాజుతో కలిసి పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడిన అనంతరం డీఈఓ మీడియాతో మాట్లాడారు. డీఈఓ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం వివాదంపై ఇటీవల స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ తనిఖీలు జరిపినప్పుడు కొన్ని లోపాలను గుర్తించినట్లు చెప్పారు. అయితే ఈ వివాదం కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ తన దృష్టికి రాలేదని డీఈఓ అన్నారు. బుధవారం జరిపిన విచారణలో వంట ఏజెన్సీ నిర్వాహకురాలు, పాఠశాల హెచ్‌ఎం మధ్య విభేదాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇరువైపులా లోపాలు ఉండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ క్రమంలో వంట ఏజెన్సీని రద్దు చేసేందుకు తీర్మానించినట్లు చెప్పారు. అదేవిధంగా పాఠశాల హెచ్‌ఎం మీద కూడా శాఖా పరమైన చర్యలు తీసుకోవడానికి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు.
పేద మహిళ ఉపాధిపై కొడతారా?
వంట ఏజెన్సీ నిర్వాహకురాలిగా ఎటువంటి ఆరోపణలు లేకుండా 21 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళను కాదని వేరే వాళ్లకి ఎలా అప్పగిస్తారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చాట్ల సుధాకర్ డీఈఓని ప్రశ్నించారు. ప్రస్తుత హెచ్‌ఎం వచ్చాకనే ఈ వివాదమంతా ప్రారంభమైందన్నారు. ఇంత రాద్ధాంతానికి కారణమైన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి పేద మహిళ ఉపాధి మీద ఎలా దెబ్బకొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.


