5న చలో విజయవాడ
అంగన్‌వాడీల హెచ్చరిక నాలుగో రోజుకు చేరిన రిలే దీక్షలు
మచిలీపట్నంఅర్బన్: అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే మార్చి ఐదో తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రమాదేవి హెచ్చరించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరాయి. ఐసీఈయూ ఎల్‌ఐసీ డివిజన్ ప్రధాన కార్యదర్శి జి. కిశోర్ కుమార్ దీక్షలకు సంఘీభావం తెలిపారు. రమాదేవి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అంగన్‌వాడీల వేతనాల పెంపునకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, లేకుంటే నిరవధిక సమ్మెకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ నెల 23, 24 తేదీలలో ప్రాజెక్టు స్థాయిలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించామని, 25 నుంచి 27 వరకు జిల్లా కేంద్రంలో దీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్ట్ లీడర్లు నాంచారమ్మ, లక్ష్మి, శివకుమారి, నాగమణి, గంగాభవానీ, రాజారత్నం, సత్యవతి, విజయలక్ష్మి, దుర్గ, రాజకుమారి దీక్షలో కూర్చున్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


