సుబ్బారాయుడి సన్నిధిలో చీఫ్ పోస్ట్‌మాస్టర్
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ హెడ్ బీపీ శ్రీదేవి గురువారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆమె నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు సీహెచ్ వెంకటేశ్వరావు, విరూప్ శర్మ, మణిదీప్‌శర్మ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు.
మచిలీపట్నంఅర్బన్: ‘నీట్’ను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం మధ్యాహ్నం న్యూఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాజేష్ లఖన్, రాష్ట్ర ప్రభుత్వ కళాశాల విద్యా కమిషనర్ భరత్ గుప్తాతో కలిసి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. క్యాంపు కార్యాలయం నుంచి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ జిల్లాలోని రెండు పరీక్ష కేంద్రాలైన కేంద్రీయ విద్యాలయం, కృష్ణ విశ్వవిద్యాలయలలో నీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్, నీట్ పరీక్షల సమన్వయకర్త మహ్మద్ ఆసిఫ్ హుస్సేన్, పరీక్షా కేంద్ర పర్యవేక్షకులు సత్యనారాయణ పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: గర్భిణులు, బాలింతలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిల్కారి కాల్ సేవలు ఎంతో ప్రయోజనకరమని కృష్ణా జిల్లా కిల్కారి ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజు తెలిపారు. గురువారం బందరుకోట, శారదానగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కిల్కారి సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి, బిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఈ కాల్స్ ద్వారా అందజేస్తారని వివరించారు. గర్భధారణ నాల్గో నెల నుంచి శిశువు ఒక సంవత్సరం పూర్తయ్యే వరకు నెలకు ఒకసారి గర్భిణులు, బాలింతల మొబైల్ ఫోన్లకు ఈ కాల్స్ వస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈ నంబర్ (911600403660)ను గర్భిణులు, బాలింతలు తమ మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకుంటే కాల్ వచ్చినప్పుడు పూర్తి సమాచారాన్ని వినగలరన్నారు. అవసరమైతే 14423 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి తిరిగి సమాచారాన్ని వినవచ్చని సూచించారు. డాక్టర్ పరమేశ్వరి, డాక్టర్ తాజుద్దీన్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.
అవనిగడ్డ: ఘంటసాల పరిశోధన కేంద్రం రూపొందించిన జీబీజీ 164 మినుము పంట అవనిగడ్డలో సాగు చేయగా.. దానిని శాస్త్రవేత్తల బృందం గురువారం పరిశీలించింది. సమన్వయకర్త డాక్టర్ డి. సుధారాణి మాట్లాడుతూ జీబీజీ 164 రకం కాలపరిమితి 80 నుంచి 85 రోజుల పంటని, ఎల్‌బీజీ 752 రకంతో పోలిస్తే గింజ మెరుగ్గా ఉంటుందని చెప్పారు. కృష్ణాజిల్లా ప్రాంతానికి ఈ రకం అనుకూలంగా ఉంటుందన్నారు. రైతులు జీబీజీ 164 రకాన్ని సాగుచేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. వెంకట లక్ష్మి, డాక్టర్ కె. రేవతి ఏడీఏ జయప్రద, ఏవో శుభ హారిక, వీఏ వి. తేజశ్రీ పాల్గొన్నారు.
సుబ్బారాయుడి సన్నిధిలో చీఫ్ పోస్ట్‌మాస్టర్


