ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఈ నెల ఆరో తేదీ నుంచి జరిగే కుంభాభిషేకానికి దసరా ఉత్సవాల తరహాలో ఏర్పాట్లు చేస్తున్నామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. కుంభాభిషేక మహోత్సవ ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్‌లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ బుధవారం పరిశీలించారు. తొలుత ఆలయానికి చేరుకున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవ దాయ శాఖ అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ బంగారు శిఖరం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. కుంభాభి షేకం గురించి ఆలయ ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. అనంతరం రాజగోపురం ఎదుట మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న కుంభాభిషేకానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్సవాలలో తొలి రెండు రోజులు సుమారు 1.40 లక్షల మంది, మూడో రోజు లక్ష మంది భక్తులు విచ్చేస్తారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. అనంతరం కుంభాభిషేక ఏర్పాట్లపై ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్, సీపీ పరిశీలన
కుంభాభిషేక ఏర్పాట్లను బుధవారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, విజయవాడ ముని సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, డీసీపీ గుణ్ణం రామకృష్ణ పరిశీలించారు. తొలుత వినాయకుడి గుడి నుంచి ఏర్పాట్లను పరిశీలిస్తూ ఆలయానికి చేరుకున్న అధికారులు ఆలయ ఇంజినీరింగ్ విభాగానికి పలు సూచనలు ఇచ్చారు. క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, యాగశాల ప్రాంతాలను పరిశీలించారు. వినాయకుడి గుడి నుంచి సింగిల్ క్యూ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం మహా మండపం దిగువన గోశాల వద్ద ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక క్యూలైన్లను పరిశీలించారు.


