దాడులు చేయించేందుకా దశాబ్దాల అనుభవం? | - | Sakshi
Sakshi News home page

దాడులు చేయించేందుకా దశాబ్దాల అనుభవం?

Mar 4 2026 8:20 AM | Updated on Mar 4 2026 8:20 AM

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం: సీఎం చంద్రబాబు దశాబ్దాల అనుభవం ప్రతిపక్ష నేతలు, ప్రజలపై దాడులను ప్రోత్సహించేందుకేనా అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబ సభ్యులను ఆయన మంగళవారం పరామర్శించారు. జోగి రమేష్‌ ఇంటిపై జరిగిన దాడి వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే బాధేస్తోందన్నారు. ప్రభుత్వమే నేర వ్యవస్థను సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. జోగి రమేష్‌ ఇంటి పై ఘటన వీడియోలను చూస్తే ప్రభుత్వం, పోలీసులు కనుసన్నల్లో ఆ దుశ్చర్య జరిగి తీరు అర్థమవుతోందన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైనా ఇటువంటి దాడే జరిగిందన్నారు. దాడుల్లో మహిళలు కూడా పాల్గొని కొత్త చరిత్రకు నాంది పలికారని పేర్కొ న్నారు. జోగి రమేష్‌ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టడం చూస్తుంటే పోలీస్‌ వ్యవస్థ ఎటుపోతుందనే అను మానం కలుగుతోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టి, అవసరమైన సాక్ష్యాన్ని సృష్టంచే సంస్కృతి తీసుకొచ్చారని విమర్శించారు. ఈ సంస్కృతి భవిష్యత్‌లో కొనసాగితే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో వింటే టీడీపీ ప్రభుత్వ తీరు తెలిసిపోతుందన్నారు. బడ్జెట్‌ మొత్తం అసత్యాలేనని ఎద్దేవాచేశారు. ఎన్నికల ముందు ‘నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 అన్నారు కదా, రూ.15 వేలు, రూ.18 వేలు, రూ.20 వేలు ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ అన్నారని, ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని గుర్తుచేశారు. టీటీడీ లడ్డూపై మండలిలో చర్చ జరగకుండా అడ్డుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వమేనని విమర్శించారు. లడ్డూ విషయంలో వాళ్లే స్క్రిప్ట్‌ రాశారు, వాళ్లే దర్శకత్వం, వాళ్లే ప్రొడక్షన్‌, వాళ్లే హీరో, వాళ్లే విలన్‌, వాళ్లే జోకర్‌ అన్నీ వాళ్లే కదా అని రాజేంద్రనాథ్‌రెడ్డి ఎద్దేవాచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement