నెమలి వేణుగోపాలుడి దేవస్థానంలో ప్రొటోకాల్ రగడ టీడీపీ దళిత ఎమ్మెల్యే కొలికపూడికి ఘోర అవమానం పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఎంపీ కేశినేని చిన్ని యత్నం ఎంపీ చేతుల్లో నుంచి ఆ పట్టువస్త్రాలను లాక్కున్న ఎమ్మెల్యే ఎంపీ కేశినేని చిన్నిపై మండిపడుతున్న దళిత నాయకులు
ఎంపీతో వచ్చినవారంతా మద్యం మత్తులోనే..
గంపలగూడెం/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఘోర అవమానం జరిగింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువూరు నియోజకవర్గంలోని నెమలి వేణుగోపాల స్వామి కల్యాణం సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించకుండా అధికార పార్టీకే చెందిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆయన వర్గీయులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే తన ఆత్మగౌరవాన్ని వదులుకోనంటూ ఎంపీ చేతుల్లో నుంచి ఎమ్మెల్యే కొలికపూడి పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని స్వామివారికి సమర్పించారు. ఎమ్మెల్యే చేతుల్లో నుంచి పట్టువస్త్రాలను తిరిగి లాక్కునేందుకు ఎంపీ వర్గీయులు ప్రయత్నించడం విమర్శలకు దారితీసింది.
ఏమి జరిగిందంటే..
గంపలగూడెం మండలంలోని నెమలి గ్రామంలో వేంచేసిన శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం జరి గింది. కల్యాణం సందర్భంలో స్థానిక శాసనసభ్యుడు స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించటం ఆనవాయితీ. ఈ సంప్రదాయం ఏటా కొనసాగుతోంది. గత ఏడాది ఎంపీ శివనాథ్ అతిథిగా హాజరవగా, పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే సమర్పించారు. సోమవారం రాత్రి కూడా ఎంపీ శివనాథ్ కల్యాణోత్సవానికి హాజరయ్యారు. అయితే పట్టువస్త్రాలను ఆలయ అధికారులు ఎంపీకి ఇచ్చి, తనకు ముత్యాల తలంబ్రాలు ఇవ్వడంపై ఎమ్మెల్యే అభ్యంతరం తెలిపారు. తానే పట్టు వస్త్రాలు సమర్పించాలని పట్టుబట్టారు. దీంతో ఆలయ అధికా రులు మరో జత వస్త్రాలను సిద్ధం చేసే తరుణంలో ఎంపీ తలపై ఉన్న పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే లాక్కుని తన తలపై పెట్టుకున్నారు. ఎంపీ అనుచరులు ఎమ్మెల్యే కొలికపూడిని అడ్డుకునేందుకు యత్నించారు. ఎమ్మెల్యే తలపై ఉన్న పట్టువస్త్రాలను టీడీపీ గంపలగూడెం మండల అధ్యక్షుడు మానికొండ రామకృష్ణ లాక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కొందరు నాయకులు ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు. మానికొండ రామ కృష్ణ ఎంపీ సమక్షంలోనే ఎమ్మెల్యేను దుర్భాషలాడుతూ ఘర్షణ వాతావరణం సృష్టించారు. తన నియోజకవర్గంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో తననే అవమానించారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం జరుగుతుండగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించగా, ఎమ్మెల్యే కొలికపూడికి ఆయన గన్‌మన్ రక్షణగా నిలిచారు.
దళితులకు తరచూ అవమానాలు
దళిత ఎమ్మెల్యే కాబట్టే కొలికపూడిని ఎంపీ శివనాథ్ తరచుగా అవమానిస్తున్నారంటూ పలువురు దళిత నేతలు విమర్శించారు. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా కేవలం తిరువూరులోనే ఈ తరహా వివాదాలకు ఎంపీ ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు మండి పడుతున్నారు. జగ్గయ్యపేట, మైలవరం, ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రొటోకాల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోని ఎంపీ కేవలం తిరువూరులో తరచూ వివాదం చేయటం ఏమి టని ప్రశ్నిస్తున్నారు. దళితులపై చిన్నచూపు కారణంగానే అణిచివేతకు పాల్పడుతున్నారని కొలికపూడి అనుచరులు ఎంపీ తీరుపై మండిపడుతున్నారు.
సంచలనం సృష్టించిన కొలికపూడి వాట్సాప్ స్టేటస్
కల్యాణోత్సవంలో గొడవపై కొలికపూడి పెట్టిన వాట్సాప్ స్టేటస్ సంచలనం సృష్టించింది. టీడీపీలో ఒక దళిత ఎమ్మెల్యే పరిస్థితి ఇది అనే కాప్షన్‌తో ‘మీరెన్ని అబద్ధాలు చెప్పినా, తప్పుడు ప్రచారం చేసినా, మద్యం మత్తులో మీరు చేసిన అఘాయిత్యం వీడియోలో స్పష్టంగా ఉంది’ అంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారు. నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత పవిత్రంగా భావించే పట్టు వస్త్రాల సమర్పణను టీడీపీ రాజకీయాలకు వేదికగా వాడుకోవడం, తమ గ్రూపు తగాదాలతో భక్తులను గందరగోళానికి గురిచేయడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
వేణుగోపాలుడి కల్యాణోత్సవంలో వివాదం చేసే ఉద్దేశంతోనే ఎంపీ శివనాథ్ తన అనుచరులతో వచ్చారని కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. ఎంపీతో వచ్చిన వారంతా మద్యం మత్తులోనే ఉన్నారని, అందువల్లే దేవుడి సన్నిధి అని చూడకుండా గందరగోళం చేశారని దుయ్యబట్టారు. ఎంపీ శివనాథ్ సాగి స్తున్న పేకాట, ఇసుక, మద్యం దందాలపై తాను ప్రశ్నించటం వల్లే ఆయన తనపై ఈ విధమైన అవమానాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్వామికి పట్టువస్త్రాలు సమర్పించటం ఎమ్మెల్యేగా తనకున్న హక్కు అని, దానిని ఎలా తీసుకుంటారని కొలికపూడి ప్రశ్నించారు. గత ఏడాదీ తానే స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించానని, అప్పుడు ఎంపీ అతిథిగా వచ్చి వెళ్లా రని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా తన హక్కును లాక్కుంటే ఒప్పుకోబోనని, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదని ఎంపీ చిన్నిపై కొలికపూడి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


