మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై యువకుల దాడి | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై యువకుల దాడి

Mar 4 2026 8:20 AM | Updated on Mar 4 2026 8:20 AM

మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై యువకుల దాడి చెరువులో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి పోరంకిలో వివాహిత ఆత్మహత్య బోదెలోకి దూసుకుపోయిన కారు

కోడూరు: మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ చాణిక్య మంగళవారం తెలిపిన కథనం మేరకు.. మండలంలోని విశ్వనాథపల్లి గ్రామంలోని అద్దంకి నాంచారమ్మ జాతరలో పోలీసు కానిస్టేబుల్‌ పి.వేణుస్వామి విధులు నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా సోమవారం రాత్రి పిట్టల్లంక గ్రామానికి యువత డీజే ఏర్పాటు చేశారు. అయితే విశ్వనాథపల్లి గ్రామంలోకి వచ్చిన తరువాత డీజేకు సంబంధించిన సౌండ్‌ను తగ్గించాలని కానిస్టేబుల్‌ వేణుస్వామి నిర్వాహకులకు సూచించారు. మద్యం మత్తులో ఉన్న పిట్టల్లంక గ్రామానికి చెందిన యువకులు కోట మహేష్‌, కోట నరేష్‌ ‘మా డీజే సౌండ్‌ తగ్గించమంటావా’ అంటూ కానిస్టేబుల్‌ మెడ పట్టుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌ వేణుస్వామిని తోటి పోలీసులు హుటాహుటినా అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇద్దరి యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ చెప్పారు.

గుడివాడరూరల్‌: ప్రమాదవశాత్తూ గుర్తు తెలియని వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన మండలంలోని మోటూరు గ్రామంలో మంగళవారం జరిగింది. సుమారు 40 సంవత్సరాల వయస్సు గల మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి మోటూరు గ్రామంలోని పంచా యతీ చెరువులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ సమాచారం అందుకున్న గుడివాడ తాలూకా ఎస్‌ఐ ఎన్‌.చంటిబాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు తాలూకా పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పెనమలూరు: మండలంలోని పోరంకిలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ కథనం మేరకు.. పోరంకికి చెందిన జాస్తి శ్రీదేవి (48), దుర్గాప్రసాద్‌ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమార్తెలు. దుర్గాప్రసాద్‌ నాలుగేళ్ల క్రితం మృతి చెందటంతో శ్రీదేవి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బెంగళూరులో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లిన శ్రీదేవి ఈ నెల ఒకటో తేదీన బయలుదేరి పోరంకికి వచ్చింది. సోమవారం ఇంట్లో బెడ్‌రూమ్‌లో శ్రీదేవి సీలింగ్‌ ప్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. అదే ఇంట్లో ఉంటున్న అత్త జాస్తి ఝాన్సీ ఉరికి వేలాడుతున్న శ్రీదేవిని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మృతురాలి కుమార్తె మేఘనసాయి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

చల్లపలి: హైవేపై వెళ్తున్న కారు టైరు పైలడంతో ఒక్కసారిగా పక్కనున్న పంట బోదెల్లోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటు వంటి గాయాలు కాలేదు. మంగళవారం సాయంత్రం మచిలీపట్నం నుంచి మోపిదేవి వైపు వస్తున్న కారు చల్లపల్లి మండలం లక్ష్మీపురం దాటగానే ప్రమాదానికి గురైంది. చీకటి పడే వరకు బోదెలోకి వెళ్లిన కారును బయటకు లాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement