పెనుగంచిప్రోలు: భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల ఉత్సవాలు బుధవారం నుంచి ఎనిమిదో తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. తిరునాళ్ల ఉత్సవాలకు కృష్ణా, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, నల్గొండ జిల్లాల నుంచే కాక ఉభయగోదావరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్‌బాబు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బుధవారం ఉదయం 6.19 గంటలకు అఖండ జ్యోతి స్థాపనతో ఉత్సవాలు మొదలవుతాయి. ఐదో తేదీ రాత్రి 7.02 గంటలకు ఉత్సవమూర్తుల రథోత్సవం, ఆరో తేదీ రాత్రి 10.02 గంటలకు 90 అడుగుల దివ్య ప్రభోత్సవం, ఏడో తేదీ రాత్రి 7.32 గంటలకు తిరునాళ్లల్లో ప్రధాన ఘట్టమైన శ్రీతిరుపతమ్మ అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు– కుంకుమల బండ్లు పెనుగంచిప్రోలు ఆలయానికి చేరుకుంటాయి. మార్చి ఎనిమిదో తేదీ ఉదయం 5.30 గంటలకు భక్తుల బోనాల సమర్పణతో ఉత్సవాలు ముగుస్తాయి. వేసవి తీవ్రత దృష్ట్యా చిన్నతిరునాళ్లలో తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి, ఇన్‌చార్జీ ఈఈ భాస్కర్ తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఆలయం చుట్టూ నాలుగు ఆర్‌ఓ ప్లాంట్లు నిత్యం భక్తులకు శుద్ధజలాన్ని అందిస్తాయన్నారు. వాటర్ ప్యాకెట్ల పంపిణీతోపాటు, ఆలయం చుట్టూ చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పుణ్య స్నానాల కోసం మునేరులో 300 షవర్లు ఏర్పాటు చేశామని, తాత్కాలికంగా మరుగుదొడ్లను సిద్ధం చేశామని వివరించారు.


