కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో రోజురోజుకు చెలరేగుతున్న డ్రగ్స్, గంజాయి మాఫియాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం, ప్రజానీకం కృషి చేయాలని, యువత భవిష్యత్తును కాపాడాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గవర్నర్‌పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ‘గంజాయి వద్దు – ఆరోగ్యం ముద్దు’ నినాదంతో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా, పీఎన్‌ఎం, జనవిజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న అధ్యక్షతన ప్రజా సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.లక్ష్మణరావు, ఐద్వా జాతీయ నాయకులు డి.రమాదేవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకర స్థాయికి చేరిందన్నారు. వాటి ప్రభావంతో యువతలో నేర ప్రవృత్తి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ ఇలా ఎక్కడ పడితే అక్కడే విచ్చలవిడిగా చాక్లెట్, బిస్కెట్, టాబ్లెట్ల రూపంలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈగల్ నివేదిక ప్రకారం ఒక్క సంవత్సరంలోనే 836 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్, ఎంబీవిజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీకృష్ణ, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. డ్రగ్స్ మాఫియాను నిర్మూలించేందుకు నిష్పక్షపాతంగా కఠిన చట్టాలు అమలు చేయాలని, విద్యాసంస్థల వద్ద ప్రత్యేక నిఘా, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీఎన్‌ఎం రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్‌కుమార్, సామాజిక న్యాయ సంక్షేమ సంఘం చైర్మన్ బాలకోటయ్య, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, ప్రజా సంఘాల నాయకులు గోళ్ల నారాయణరావు, డాక్టర్ ఎం.సూర్యనారాయణ, శ్రీనివాస్, లంక గోవిందరాజు, ఆండ్ర మల్యాద్రి, విజయ్ ప్రకాష్, ఎ.సూర్యారావు పాల్గొన్నారు.
ప్రజాసంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం పిలుపు


