వసంత నవరాత్రోత్సవాలకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

వసంత నవరాత్రోత్సవాలకు సన్నాహాలు

Mar 11 2026 8:56 AM | Updated on Mar 11 2026 8:56 AM

●ఇంద్రకీలాద్రిపై 9 రోజుల పాటు విశేష పుష్పార్చన ●19న ఉగాది, 27న శ్రీరామ నవమి వేడుకలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 19వ తేదీ ఉగాది వేడుకలు, వసంత నవ రాత్రోత్సవాలు, 27వ తేదీ శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 19వ తేదీ గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అమ్మ వారికి స్నపనాభిషేకం, అనంతరం అలంకరణ, అర్చన పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. 9.15 గంటలకు వసంత నవ రాత్రోత్సవాలకు కలశ స్ధాపన, ప్రత్యేక పుష్పార్చనలు ప్రారంభమవుతాయి. సాయంత్రం నాలుగు గంటలకు మండప పూజ, అగ్నిప్రతిష్టాపన జరుగుతుంది.

వెండి రథోత్సవం..

ఉగాదిని పురస్కరించుకుని 19వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథోత్సవం జరుగుతుంది. ఆది దంపతులు వెండి రథంపై నగర పుర వీధుల్లో విహరిస్తారు. అమ్మవారికి 9 రోజుల పాటు వివిధ పుష్పాలతో విశేష అర్చన జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పూజా మండపంలో ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఈ అర్చన ప్రారంభమవుతుంది. అర్చనలో పాల్గొనే ఉభయదాతలు రూ. 2500 టికెట్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పూజలో పాల్గొనే వారికి శేషవస్త్రం, రవిక, అమ్మవారి శ్రీచక్ర పీఠం, పెద్ద లడ్డూతో పాటు ఇద్దరికి అంతరాలయ దర్శనం కల్పిస్తారు.

పూర్ణాహుతితో పరిసమాప్తం..

26న ఇంద్రకీలాద్రి క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, నాగవల్లీ దళార్చన (తమలపాకులు)తో అర్చన జరుగుతుంది. 27వ తేదీ శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఘాట్‌ రోడ్డులోని ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. 28వ తేదీ ఉదయంం 9 గంటలకు దేవస్థాన యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమంలో వసంత నవ రాత్రోత్సవాలు పరి సమాప్తమవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement