కావూరి అంత్యక్రియల్లో పేర్ని నాని మచిలీపట్నంటౌన్: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) గురువారం నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని కావూరి నివాసంలో ఆయన భౌతికకాయాన్ని పేర్ని నాని సందర్శించి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కావూరి అంతిమ యాత్రలో పేర్ని నాని పాల్గొని పాడెను మోశారు. అలాగే మచిలీపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్‌దాదా, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు లంకె వెంకటేశ్వరరావు కూడా కావూరి పాడెను మోశారు. కావూరి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో కృష్ణాజిల్లా వ్యవసాయ అభివృద్ధి మండలి మాజీ చైర్మన్ జన్ను రాఘవరావు, వైఎస్సార్ సీపీ నగర నాయకుడు బూరగ రామారావు తదితరులు ఉన్నారు.
బాబా మందిర అభివృద్ధికి రూ.లక్ష విరాళం మధురానగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రా షిర్డీగా విరాజిల్లుతున్న ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయిబాబా మందిర అభివృద్ధికి గురువారం భవిష్య ప్రాజెక్టు ప్రతినిధులు రూ.లక్ష విరాళాన్ని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మందిర గౌరవాధ్యక్షుడు గౌతంరెడ్డి మాట్లాడుతూ.. బాబా మందిరాన్ని భక్తులు, దాతల సహకారంతో ఆంఽధ్రాషిర్డీగా తీర్చిదిద్దామన్నారు. ఇక్కడ షిర్డీలో మాదిరిగా అన్ని రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాత భవిష్య ప్రాజెక్టు ప్రతినిధులు మాట్లాడుతూ.. మందిరంలో జరుగుతున్న అభివృద్ధి, సేవా కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయన్నారు. మందిర అభివృద్దిలో తాము కూడా భాగస్వామి కావాలనే సదుద్దేశంతో రూ.లక్ష విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి బాబావారి చిత్రపటం, శేషవస్త్రంతో దాతలను సత్కరించారు. మందిర కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
పోక్సో కేసులో
నిందితుడి అరెస్ట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన పోక్సో కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గొల్లపూడికి చెందిన కన్నెగంటి సాంబశివరావు మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు సాంబశివరావును పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.