బ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి
ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో బ్రాహ్మణులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం తగిన ప్రాధాన్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య, అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య నాయకులు ద్రోణంరాజు రవికుమార్, సత్యవాడ దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు.
విజయవాడ గాంధీనగర్‌లోని హోటల్ ఐలావురంలో వారు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో బ్రాహ్మణుల రాజకీయ పరిస్థితిపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 36 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఉండేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య సున్నాకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నలుగురు ప్రాతినిధ్యం వహించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బ్రాహ్మణులకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఒక స్థానాన్ని తమ సామాజిక వర్గానికి కేటాయించాలన్నారు. సముచిత పదవులు ఇచ్చి రాష్ట్రంలో ఒకరికి క్యాబినెట్ హోదా కల్పించాలన్నారు. ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ చట్టం తరహాలోనే బ్రాహ్మణుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ 2026–2029 కాలానికి దేశవ్యాప్తంగా నూతన కమిటీని ప్రకటించిందని ప్రతినిధులు తెలిపారు. ఈ కమిటీలో చీఫ్ అడ్వైజర్ (ప్రధాన సలహాదారు)గా పెద్దిబట్ల లక్ష్మీనారాయణ, సెక్రటరీ జనరల్ అడ్మిన్‌గా ద్రోణంరాజు రవికుమార్‌కు ప్రాతినిధ్యం దక్కిందన్నారు. తొలుత దేవదాయ శాఖలో అనేక సంస్కరణల కోసం కృషి చేసి, ఇటీవల మరణించిన సౌందరరాజన్‌కు సమాఖ్య నివాళులర్పించింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.


