మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
మహిళా ఉత్సవ్ ప్రారంభ సభలో అతిథులు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్వయం ఉపాధి కోర్సులు నేర్చుకున్న మహిళలు పరిశ్రమలు స్థాపించి మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఎన్టీఆర్ డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ.ఎన్.వి.నాంచారరావు సూచించారు. మధుచౌక్‌లోని మొగల్ ఎగ్జిబిషన్ హాలులో జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం మహిళా ఉత్సవ్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ఈ ఉత్సవ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాంచారరావు మాట్లాడుతూ.. యువతకు స్వయం ఉపాధి కోర్సులు నేర్పించి వారు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి జనశిక్షణ సంస్థాన్ కృషి చేస్తోందన్నారు. జనశిక్షణ సంస్థాన్ అందిస్తున్న అవకాశాలను మహిళలు, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వృత్తి విద్యా కోర్సులు నేర్చుకున్న వారు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని పరిశ్రమల స్థాపన దిశగా అడుగులు వేయాలన్నారు. జనశిక్షణ సంస్థాన్ వైస్‌చైర్ పర్సన్ జి.వాణి మాట్లాడుతూ.. మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఈ మహిళా ఉత్సవ్ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. జన శిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఎ.పూర్ణిమ మాట్లాడుతూ.. ఈ నెల ఎనిమిదో తేదీ వరకు రోజూ మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ఉత్సవ్ జరుగుతుందన్నారు. మొత్తం 40 స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. జనశిక్షణ సంస్థాన్ సిబ్బందితో పాటుగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ప్రదర్శనను తిలకించారు.


