యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఆత్కూరు(గన్నవరం): యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మాజీ ఉప రాష్ట్ర పతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో వివిధ నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థుల కోసం శనివారం ప్రత్యేక యువ చైతన్య వేదిక నిర్వహించారు. ముఖ్య అతి థిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. యువత ఇష్టమైన పనిని కష్టపడి చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్‌లో నైపుణ్యాభివృద్ధి కోర్సులో శిక్షణ పొందడానికి వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకో వా లని సూచించారు. తద్వారా జీవి తంలో సొంత కాళ్లపై నిలబడడానికి ప్రయత్నించాలని పేర్కొన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి జయ ప్రకాష్‌నారాయణ్ మాట్లాడుతూ.. ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగమే అనే ఆలోచన నుంచి యువత బయటకు రావాలని సూచించారు. ప్రైవేట్ రంగంలో ఉన్న మెరుగైన ఉద్యోగ అవకాశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. ఏదైనా రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకో వడం ద్వారా ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో జీవించొచ్చని పేర్కొన్నారు. సమాజ హితం కోరి ఎంతో ఔన్నత్యంతో స్వర్ణభారత్ ట్రస్ట్‌లో యువతకు ఉపయోగపడే నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. పలువురు ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.


