ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో కుంభాభిషేక మహోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజు గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామివార్ల ఉత్సవ మూర్తులతో అర్చకులు, వేద పండితులు, ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ అధికారులు, సిబ్బంది మోడల్ గెస్ట్ హౌస్ సమీపంలోని వీఐపీ స్నానఘాట్‌కు చేరుకున్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్నానఘాట్ నుంచి పవిత్ర జలాలను కలశాలతో తీసుకుని కనకదుర్గ నగర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి అర్చకులు కుటుంబ సమేతంగా కలశాలతో ఆలయ ప్రాంగణంలోని కళావేదిక వద్దకు చేరుకుని పూజలు చేశారు.
అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పలువురు కళాకారులు కోలాట నృత్యాలు, భక్తి గీతాల ఆలాపన, కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక, భక్తి గీతాలను వీక్షించి తరించారు.
ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం 11 వేల మంది భక్తులకు అమ్మవారి అన్న ప్రసాద వితరణ జరిగింది. క్యూలోని చిన్నారుల కోసం వంద లీటర్ల పాలు, భక్తుల కోసం పది వేల మజ్జిగ ప్యాకెట్లు, చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సాయంత్రం కూడా అన్న ప్రసాద వితరణ జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పవిత్ర జలాలతో యాగశాల ప్రవేశం
ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సోయగం
ఆలయానికి అలంకరణ
కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయం, పరిసరాలను పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని అడుగడుగునా మామిడి తోరణాలు, అరటి చెట్లతో అలంకరించారు. అంతరాలయంలో అమ్మవారి మూలవిరాట్‌కు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. అంతరాలయ దర్శనం రద్దు, టికెట్ల విక్రయాలను నిలిపివేయడంతో భక్తులు అన్ని క్యూల్లో అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఘాట్‌రోడ్డుతో పాటు ఆలయ పరిసరాల్లో 11కు పైగా ప్రత్యేక వైద్య శిబిరాలు, భక్తులకు మంచినీటి పంపిణీ, మజ్జిగను అందజేశారు. లోబ్రిడ్జి నుంచి అమ్మవారి ఆలయానికి చేరుకునే వరకు ప్రతి వంద మీటర్లకు తాగునీటి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మోడల్ గెస్ట్ హౌస్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
11వేల మందికి అన్న ప్రసాద వితరణ
దుర్గగుడిపై కుంభాభిషేక
మహోత్సవాలు ప్రారంభం
తొలి రోజున పవిత్ర జలాలకు పూజలు
ఉత్సవాల నేపథ్యంలో ఆలయానికి
విశేష అలంకరణ