కిలేశపురం(ఇబ్రహీంపట్నం): మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కిలేశపురంలో పి.ఉమ అనే మహిళ పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకం చేయూతతో ఇప్పటికే ఒక ఎద్దు గానుగ యూనిట్‌ను ప్రారంభించగా మరో యూనిట్‌ను కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ ఆర్థికంగా స్వావలంబన సాధిస్తే కుటుంబం బలపడుతుందన్నారు. స్వయం ఉపాధి మహిళలకు కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదని, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని ఇచ్చే మార్గమని పేర్కొన్నారు. మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి శిక్షణ, రుణ సదుపాయం, మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. అనంతరం నీతి ఆయోగ్ అధికారి రాధికా ములేతో కలిసి జూపూడిలో పర్యటించారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యాన అమలవుతున్న ఆకాంక్షిత బ్లాక్, సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా రాధికా ములే జిల్లాలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు ఆకాంక్షిత మండలాల్లో వివిధ ప్రగతి సూచికల్లో పురోగతిని పరిశీలించారు. డీఆర్‌డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శకుంతల, తదితరులు పాల్గొన్నారు.


