కమనీయం..
● 90 అడుగుల ప్రభ ● విద్యుత్ దీపాల వెలుగులు
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లలో మూడవ రోజు శుక్రవారం రాత్రి 90 అడుగుల దివ్య ప్రభోత్సవం కమనీయంగా జరిగింది. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తెన ప్రభగా గుర్తింపు పొందిన ఈదివ్య ప్రభోత్సవం 1928 నుంచి జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ముందుగా అమ్మవారికి రజకులు, శాలివాహనులు కుంభం పోసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈవో బి.మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు చుంచు రమేష్‌బాబు ఆధ్వర్యంలో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో అలంకరించిన ఇనుప ప్రభపై ఉత్సవ విగ్రహాలను ఉంచారు. దేవస్థానం వారు గ్రామానికి చెందిన రైతుల ఎడ్లను కట్టి రథాన్ని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ప్రభ ముందు డప్పు, కొమ్ము వాయిద్యాలు, నృత్యాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎస్‌ఐ అర్జున్ పోలీసు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, ఏఈ రాజు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నేడు అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమ బండ్లు కార్యక్రమం
శ్రీతిరుపతమ్మవారి చిన్న తిరునాళ్లలో ప్రధాన ఘట్టం అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు గ్రామం నుంచి పసుపు–కుంకుమ బండ్లు వచ్చే కార్యక్రమం శనివారం రాత్రి 7.32 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఈఓ మహేశ్వరరెడ్డి తెలిపారు.


