వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణా యూనివర్సిటీ విశ్వవిద్యాలయ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌గా కేబీఎన్ కళాశాల విజయం సాధించింది. విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల మహిళ హ్యాండ్‌బాల్ పోటీలు కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి జరుగుతున్న పోటీలు శుక్రవారం ముగిశాయి. కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్, టోర్నమెంట్ చైర్మన్ డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ తమ కళాశాల హ్యాండ్‌బాల్ పోటీల్లో 12సార్లు వరుస చాంపియన్షిప్‌లను కై వసం చేసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. కేబీఎన్ కళాశాల మొదటగా లీగ్ పోటీలో విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (నున్న)పై 14 –2 గోల్స్ ఆధిక్యతంతో విజయం సాధించారు. రెండో లీగ్‌లో స్టెల్లా కాలేజ్ (విజయవాడ)పై 18–00 గోల్స్ ఆధిక్యతతో కేబీఎన్ విజయం సాధించింది. ఫైనల్లో సిద్ధార్థ మహిళ కళాశాల జట్టుపై 14–00 ఆధిక్యంతో యూనివర్సిటీ చాంపియన్షిప్ ట్రోఫీని కై వసం చేసుంది. ద్వితీయ స్థానం విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (నున్న) సాధించగా, తృతీయ స్థానాన్ని సిద్ధార్థ మహిళ కళాశాల జట్టు సాధించింది.
బహుమతి ప్రదానం
ముఖ్య అతిథి ఇగ్నో రీజనల్ డైరెక్టర్ డాక్టర్ సుమలత విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఏపీ ఉత్తమ క్రీడాకారిణిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న కేబీఎన్ కళాశాల విద్యార్థిని బోయి సత్యకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వీరిని తయారుచేసిన క్రీడా విభాగాధిపతి డి.హేమచంద్రరావును ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీనివాస్, యూనివర్సిటీ సెలక్షన్ కమిటీ మెంబర్స్, అధ్యాపక సిబ్బంది తదితరులు విజేతలను అభినందించారు.


