మద్యంపై పెల్లుబికిన మహిళాగ్రహం | - | Sakshi
Sakshi News home page

మద్యంపై పెల్లుబికిన మహిళాగ్రహం

Mar 8 2026 7:39 AM | Updated on Mar 8 2026 7:39 AM

●బార్‌లో టెంట్‌ను కూల్చివేసిన మహిళలు ●ఇళ్ల మధ్య బార్‌ను పెట్టవద్దని మహిళల అల్టిమేటం

పాయకాపురం(విజయవాడరూరల్‌): పేదల బతుకులను బండపాలు చేసేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నిందంటూ మహిళలు కదం తొక్కి ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో టెంట్‌ను కూల్చివేసిన ఘటన శనివారం రాజీవ్‌నగర్‌ ఎదురు అంబాపురం గ్రామ సరిహద్దులో చోటుచేసుకుంది. విజయవాడ నగర శివారు రాజీవ్‌నగర్‌ వడ్డెర కాలనీలో కాయకష్టం చేసుకుని బతుకుతున్న కుటుంబాలకు సమీపంలో వెన్నెల బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించడానికి సిద్ధమై మద్యం అమ్మేందుకు టెంట్‌ వేసి కుర్చీలను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రికి రాత్రి బార్‌ను నెలకొల్పేందుకు అధికార పార్టీకి చెందిన నాయకుల మద్దతుతో మద్యం అమ్మకాలకు కౌంటర్‌ను, బాటిల్స్‌ను సిద్ధం చేశారు. ఈ విషయం గమనిస్తున్న స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని ఆగ్రహంతో బార్‌ అండ్‌ రెస్టారెంట్లో వేసిన టెంట్‌లను కూల్చివేశారు. కుర్చీలను గాల్లోకి విసిరారు. తమకు తాగటానికి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం మద్యాన్ని మాత్రం ఇళ్ల ముంగిటకు తీసుకొచ్చి అమ్ముతోందని మహిళలు రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. తమ బతుకులను నాశనం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆడపిల్లలు కాలేజీలకు, స్కూల్స్‌కు వెళ్లే మార్గం మధ్యలో బార్‌ను ఏర్పాటు చేయడం ఏమిటని, ఈ ప్రభుత్వం మంట కలిసిపోవాలంటూ శాపనార్ధాలు పెట్టారు. పగలంతా మట్టి పని చేసి ఇంట్లో ఆదమర్చి నిద్రపోయే తమకు మద్యం మత్తులో ఉండేవారి నుంచి రక్షణ ఉంటుందా అని ప్రశ్నించారు. వృద్ధులకు, భర్త చనిపోయిన వారికి కొత్త పింఛన్లు ఇవ్వలేని ఈ ప్రభుత్వం తమ జీవితాలను బుగ్గిపాలు చేసేందుకు ఇళ్ల మధ్యన బార్‌ను ఏర్పాటు చేస్తోందని దుయ్యబట్టారు. సమాచారం తెలుసుకున్న టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ సీఐ కొండలరావు, నున్న పోలీసు స్టేషన్‌ సీఐ కృష్ణమోహన్‌ తమ సిబ్బందితో వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితులు చక్కబడిన పిమ్మట వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement