12న దండి యాత్ర 2.0 | - | Sakshi
Sakshi News home page

12న దండి యాత్ర 2.0

Mar 8 2026 7:39 AM | Updated on Mar 8 2026 7:39 AM

●100 నియోజకవర్గాల్లో 10 లక్షల మంది భాగస్వామ్యం ● వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌ కలాం

●100 నియోజకవర్గాల్లో 10 లక్షల మంది భాగస్వామ్యం ● వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌ కలాం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): బాపూజీ దండి సత్యాగ్రహం స్ఫూర్తితో ‘వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం‘ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న మాదక ద్రవ్య రహిత రాష్ట్రం కోసం దండియాత్ర 2.0 నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌ కలాం చెప్పారు. శనివారం సంస్థ కార్యాలయంలో దండియాత్ర 2.0 వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1930 మార్చి 12వ తేదీన మహాత్మా గాంధీ దండి సత్యాగ్రహం ప్రారంభించి 240 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. మాదక ద్రవ్య రహిత రాష్ట్రం కోసం తమ సంస్థ దండియాత్ర 2.0 నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 10 లక్షల మంది యువత పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఇందులో భాగంగా విజయవాడ నగరంతో సహా రాష్ట్రంలోని వంద నియోజకవర్గాలలో 100 అడుగుల జాతీయ పతాకాన్ని యువతీయువకులు ప్రదర్శిస్తారన్నారు. దండి సత్యాగ్రహంలో మహాత్మా గాంధీతో కలిసి నడిచిన 78 మంది స్వాతంత్య్ర సమరయోధులను పోలిన నాయకుల ఆహార్యాలతో నగరంలో సీఎం చంద్రబాబుతో కలిసి నడుస్తారని తెలిపారు. పాదయాత్ర అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, యువత తిరోగమనానికి కారణమైన మాదకద్రవ్యాలను రాష్ట్రంలో నిర్మూలించడమే లక్ష్యంగా తలపెట్టిన ఈ కార్యక్రమానికి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం ఇచ్చారన్నారు. సమావేశంలో కార్యక్రమ జాతీయ సమన్వయకర్త వి.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కన్వీనర్‌ రవిరాజు, రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్‌ వి.శ్రీలలిత, తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌ రంజిత్‌, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి జహీర్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement